Previous Page Next Page 
మహావృక్షం పేజి 12

"లేదు. ఎవరం చెప్పలేదు."
"మనం మాట్లాడేటప్పుడు వినిపించే అవకాశం లేదుగా. పడుకుందన్నవుకగా!"
"ఏమో!"శ్యామల నీరసంగా అంది కింద చతికిలబడుతూ.
"ఈ టైమ్ లో పారిపోతే ఎక్కడికి వెళ్ళాలని? నాకేం తోచటం లేదు"  వాచీ చూసుకుంటూ అంది అనూష.
వాచ్ మాన్ వచ్చాడు "మేడమ్!ఆమె కనబడలేదు" అన్నాడు.
అనూష వీణ సెల్ కి పాన్ చేసింది.వెంటనే లైన్ దొరికింది.వీణా!నేను అనూషని.మళ్ళీ పిల్ల పారిపోయింది"అంది.
"అవునా!మైగాడ్ పోలిస్ రిపోర్టు ఇచ్చావా?"
"ఆ...."
"వామనమూర్తి సంగతేంటి?"
"చాలా బతిమాలితే రేపు ఉదయం ఆరులోగా హొటల్ వైస్రాయికి తీసుకొచ్చి అప్పగించామన్నాడు. లేకపోతె కడపనుంచి బాంబులు తెప్పిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఆశ్రమం పేల్చేస్తాట్ట."
వీణ నవ్వింది "ఆత్మీయత,సేవాదృక్పథం, మానత్వంతో కట్టిన ఆశ్రమాన్ని బాంబులు పెల్చేయలేవు. అని చెప్పకపోయావా?"
"అంత కూల్ గా మాట్లాడేంత ఓపిక లేకపోయింది"
"ఓ.కే !నేనిప్పుడే గోపాల్ కి పోన్ చేస్తాను. మళ్ళీ నీకు చేస్తాను."
అందరూ మౌనంగా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చుండిపోయారు. నయం పిల్లాడిని తీసికేళ్ళలేదు అనుకుంది సుశీల.
శ్యామల చబుక్కున ఏదో గుర్తొచ్చిన దానిలా అంది."గుళ్ళో ఎమన్నా దాక్కుందేమో!"
వాచ్ మాన్ వెంటనే అన్నాడు "లేదమ్మా. ఆడకూడ చూసిన."
శ్యామల నిరాశగా కూర్చుండిపోయింది.
అనూషకి ఏం చేయాలో తోచలేదు.అప్పటికే పదిగంటలు అవుతోంది. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్లినట్టు? ఈ వామనమూర్తి ఎవరు?నీరజకి. అతనికీ ఏంటి సంబందం?ఆమెకెందుకతనంటే భయం?మాటి మాటికీ ఎందుకు పారిపోతుంది?
"అనూషా! భోజనం చేయకుడదూ" శ్యామల అడిగింది
"వద్దు శ్యామలా!నాకేం తినాలని లేదు.ఇప్పుడు ఆమె దొరక్కపోతే మనకీ మణికీ కూడా సమస్యే. ఇతను ఎవరినీ వదిలి పెట్టడనిస్తోంది. నేను ఒక హొదాలో వున్నాను కాబట్టి తెచ్చిపెట్టుకున్న మర్యాదతో మాట్లాడాడు. ఇందాకటి నుంచి ఆ విషయం నేను గమనిస్తూనే వున్నాను. కాకపొతే ప్రభుత్వన్నించి, ఇతర సంస్థల నుంచీ మనకెంత సహకారం వుందో అతనికి తెలియాలని అన్ని విషయాలు చెప్పాను. మనిషి మాత్రం చాలా ప్రమాదకరమైనా వ్యక్తిలాగే వున్నాడు."
అయిలయ్య అన్నాడు "భయమేం లేదమ్మా మేమంతా లేమూ! మీమీద ఈగ వాలనిస్తామా?"
అనూషా నవ్వింది ."భయంకాదు అయిలయ్యా ! అనవసరంగా మీ అందరి ప్రశాంతతడుచేస్తాడేమో! అనిపిస్తోంది. ఈ అమ్మాయి కనిపిస్తే అతడిమీద యాక్షన్ తీసుకోవచ్చు. కనిపించకపోతే ప్రమాదం."
అలా మాట్లాడుకుండగానే రెండు గంటలు గడిచిపోయాయి.
శ్యామల, సుశీల, శారద, అయిలయ్య తప్ప మిగతావాళ్ళంతా నిద్రలోకి జారిపోయారు. వాచ్ మాన్ ఇంకా అక్కడక్కడా వెతుకుతూనే వున్నాడు రాజు సాయంతో.
"మృదుల ఏది? కనిపించలేదు"అడిగింది అనూషా.
"వాళ్ళ స్నేహితురాలింటికి వెళ్ళింది,రేపు వస్తానంది"చెప్పింది శారద.
అనూషా ఆశ్చర్యంగా అడిగింది. "స్నేహితురాలా ?చిత్రంగా వుంది. మనకి తెలీని స్నేహితురాలెవరు?"
"భ్యాంకులో  పరిచయం  అయిందట. బాగా క్లోజ్ గా వుంటుందని చెప్పింది."మృదుల ఆశ్రమానికి సంబందించిన భ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూస్తుంటుంది.
నీరజ ఎక్కడికి వెళ్లిందో అనే ఆలోచనతో తెలతెలవారుతుండగా అందరూ నిద్రలు పోయారు.

                                                             *    *    *    *
తూర్పు కొండలమీంచి ఓ సూర్యకిరణం భూమ్మీద సర్వేకి బయలుదేరింది.చలికి ముణగదీసుకుని పడుకున్న ప్రకృతి ఆ వెచ్చదనానికి కళ్ళు తెరిచి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది. ఆ కదలికకేమో గూళ్ళలోని పక్షులన్నీ తుళ్ళిపడి ఒక్కసారిగా లేచి, రెక్కలు టపటపలాడిస్తూ రివ్వున ఎగిరిపోయాయి.రెక్కలు విప్పుకున్న పూమోగ్గలు ప్రకృతి మీద స్ప్రేచేసినట్టు గా పరిమళాలను వేదజల్లాయి.
అలవాటు ప్రకారం ఐదింటికి లేవాల్సిన శ్యామల ఆలస్యంగా పడుకోవడంచేత అప్పుడే నిద్రలేచింది. ఎక్కడి వాళ్ళక్కడ నిద్రలు పోతున్నారు.  ఎవరికీ నిద్రాభంగం కలక్కుండా లేచి,  బైటికి నడిచింది.టూత్ పేస్టు, బ్రష్ తీసుకుని, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి పంపు తిప్పింది నీళ్ళు రాలేదు. నిన్న హడావుడిలో మోటారు వేయలేదెవరూ. శ్యామల మోటారు అన్ చేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి నడిచింది. బిల్డింగు వెనక వైపు సిమెంటు తొట్టి గోడకి పైనా వుంది మీటరు.... అది ఆవిడకి  అందదు. అప్పుడే రాజు లేచి వస్తున్నాడు.
"రాజూ!మోటారు వేయి నీళ్ళు లేవు" అంది.
రాజు అటుగా వచ్చి స్విచ్ బోర్డువైపు నడిచాడు. అప్పుడు వినిపించింది సన్నటి మూలుగు సిమేంటు తొట్టిలోంచి. రాజు వెనక్కి తిరిగి శ్యామలని పిలుస్తూ, "పెద్దమ్మా! ఈ తొట్టిలో ఏంటో చప్పుడోస్తోంది"అన్నాడు.
"పిల్లులు పడుకుంటన్నాయిరా"అంది శ్యామల.
"కాదు పెద్దమ్మా, ఎవరో మూలుగుతున్నారు."
శ్యామల అనుమానంగా పరిగెత్తుకొచ్చింది. ఇంకా చీకటి పూర్తిగా విడిపోలేదు. "బైట లైటు వేసిరా" అంది శ్యామల. రాజు పరిగెత్తుకెళ్ళి లైటు వేశాడు. ఇద్దరూ కలిసి సిమెంటు తోట్టిలోకి  తొంగిచూశారు.   చలికి   ముడుచుకుని  ఓ మూటలా పడుకునివుంది  నీరజ.

 

 Previous Page Next Page