"అలాగా! ఓకే నేను చెప్పిందాకా ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి."
"అలాగే!"
అనూష వరండాలోకి వెళ్ళి వాళ్ళతో అన్నది. "నిద్రపోతోంది. కొంచెం సేపు కూర్చోండి. కాఫీ తీసుకుంటారా?"
"కాఫీ వద్దు. ఏం వద్దు. ఇదేంది వృద్దాశ్రమమా?" అడిగాడు వామనమూర్తి అటూ ఇటూ తిరుగుతోన్న స్త్రీలను చూస్తూ.
"కాదండీ. వృద్దులకోసం మాత్రమే కాదు, ఎవరూ లేని వాళ్ళెవరయినా ఇక్కడ ఆశ్రమం పొందచ్చు. మగవాళ్ళకి మాత్రం ప్రవేశంలేదు. ఒక వాచ్ మాన్, ఒక పనిచేసే వృద్దుడు, ఈ ఆశ్రమానికి మొదటగా వచ్చిన ఒకామె కొడుకు వుంటారు అంతే."
సుశీల కాఫీ కప్పులున్న ట్రేతో వచ్చింది. అనూష వాళ్ళిద్దరికీ చెరో కప్పు అందించి, తనొకటి తీసుకుంది.
"అమ్మాయిని ఇంక లేవండి. మళ్ళీ చీకటి పడిపోతుంది" అన్నాడు వామనమూర్తి లోపలికి వెడుతోన్న సుశీలనుద్దేశించి.
సుశీల అనూషవైపు చూసింది.
అనూష "చూడు లేచిందేమో. వాళ్ళ మావయ్య వచ్చారని చెప్పు" అంది.
సుశీల లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకి వాళ్ళ ముందు నిలబడాలంటే నిప్పుల మీద నిల్చున్నట్టు అనిపించింది. వాళ్ళ చూపులు సూదుల్తో గుచ్చుతున్నట్టుగా అనిపించాయి.
శ్యామలతో చెప్పింది నీరజని పిలుస్తున్నారని.
శ్యామలా, సుశీలా కలిసి నీరజ గది దగ్గరకి వెళ్ళి తలుపు తోశారు. నీరజ మంచంమీద లేదు. "నీరజా!" పిలిచింది శ్యామల. "బాత్ రూమ్ కి వెళ్ళిందేమో" సుశీల గది వెనుకవైపు తలుపులు తీసి వుండడం చూసి అంది.
"ఇంత చీకట్లో ఒక్కతీ ఎందుకు వెళ్ళింది?" శ్యామల అంది.
ఇద్దరూ కాసేపు అక్కడే ఎదురుచూశారు. చీరతో కట్టిన ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు. రోజూ నలుగుపిండితో స్నానం చేయిస్తున్నందుకేమో నునుపు తేలుతున్నాడు. తలుపు తీయడంతో చల్లగాలి వీస్తోంది.
పది నిముషాలు గడిచినా నీరజ రాకపోవడంతో సుశీల వెనక తలుపుగుండా పెరట్లోకి నడిచింది.
అనూష "శ్యామలా!" అని పిలుస్తూ వచ్చింది. "ఏదీ నీరజ?" అడిగింది.
"మంచంమీద లేదు. బాత్ రూమ్ కి వెళ్ళిందేమో అని చూశాను. రాలేదు ఇంకా. సుశీల అటు వెళ్ళింది" అంది.
సుశీల ఆదుర్దాగా వస్తూ "నీరజ ఎక్కడా కనిపించలేదు" అంది.
శ్యామల కంగారుగా చూసింది. "కనిపించడం లేదా? ఎక్కడికెళ్ళి వుంటుంది? చూడు. వాచ్ మాన్ ని పిలుపు."
అనూష, శ్యామల మిగతా గదులన్నీ చూశారు. చదువుకుంటోన్న శారదా, నిద్రపోతున్న వాళ్ళు అందరూ కూడా ఈ గలాభాకి అక్కడికి వచ్చేశారు. అందరూ కలిసి ఖంగారుగా అన్ని గదులూ, బాత్ రూములు వెతికారు. నీరజ కనిపించలేదు. ఈ సంగతి బయట కూర్చున్న వామనమూర్తికి తెలిసింది.
దుడుకుగా లోపలికి దూసుకొచ్చారిద్దరూ "ఏంటమ్మా! ఏం చేశారు ఆ పిల్లని. ఏంటి నా దగ్గర నాటకాలు ఆడుతుండారా?" అంటూ రంకెలు వేయసాగాడు. అప్పటిదాకా అతను తెచ్చిపెట్టుకున్న పెద్దమనిషి తరహా, మర్యాద ఏమయ్యాయో రౌద్రంగా మారిపోయి తిట్టడం ప్రారంభించాడు. "ఏంటి ఇక్కడ మీరు చేసేది సమాజసేవా? పరాయి పిల్లల్ని తీసుకొచ్చియాపారమా?"
అనూష తీవ్రంగా అంది "మర్యాదగా మాట్లాడండి. ఆ అమ్మాయి నిజంగా మీ అమ్మాయే అయితే ఎక్కడికీపోదు. పారిపోయినా ఎంత దూరం పోతుంది?"
అతను మండిపడ్డాడు. "ఏంటి నీ ఉద్దేశ్యం? మా అమ్మాయి కాకపొతే ఇంతదూరం ఎందుకొస్తాను? నా టైమ్ ఎంత వేస్టుచేశావు ఇవాళ. చచ్చిపోబోతున్న పిల్లని కాపాడావని కృతజ్ఞతతోగాదా! కాపాడినట్టు కాపాడి దాన్ని దాచేస్తావా....ముందు నా పిల్లని తీసుకురా."
"చూడండి!మీరన్నది నిజం అయితే ఆ అమ్మాయి ఎక్కడికీ పోదు. కిలోమీటరు దూరం నడిస్తేగాని బస్సులు కూడా దొరకవు. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోతుంది? ఇదెం సిటీయా? చూడండి ఒక్కసారి ఎంత నిర్మానుష్యంగా వుందో! కొంచెం ఓపిక పట్టండి. మావాళ్ళు వెతకడానికి వెళ్ళారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు పారిపోయిందో నాకర్థం కావడం లేదు."
"దానికి ఒళ్ళు పొగరెక్కి పారిపోయింది. దొరకనీ కాళ్ళూ కిళ్ళూ ఇరగ్గొడతా."
అతని రౌద్ర రూపం చూసి శ్యామల అనూషని పక్కకి లాగింది.
అనూష అతడిని రెచ్చగొట్టడం వలన లాభం లేదనుకుంది .స్వరం మృదువుగా మార్చి అంది "మీకు కలిగించిన ఇబ్బందికి నన్ను క్షమించండి.మీ అడ్రసు ఇవ్వండి.రేపు ఉదయానికల్లా మీ అమ్మాయి ఎక్కడ వున్నా వెదికి తెచ్చి
మీకప్పగిస్తాను."
"ఈల్లేదు దానిని తీసుకుని కానీ ఈడనుండి కదిలేది లేదు ."
"ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడమే నేను చేసిన పొరపాటు.మీరిక్కడ వుండిపోయే అవకాశం లేదు. దయచేసి వెళ్లిపోండి.నామీద నమ్మకంతో వెళ్ళండి ప్లీజ్."
అనూష స్వరంలోని మృదుత్వానికి, ఆ ప్రాధేయపడుతున్న తీరుకి ఏమనుకున్నాడో "సరే!రేపు ఉదయం అరులోగా హొటల్ వైస్రాయికి అది రాక పోయిందో జాగ్రత్త " చుట్టూ చూస్తూ " ఈ ఆశ్రమాన్ని, ఈళ్ళందరినీ, నిన్నూ నామరూపాల్లేకుండా చేస్తా. ఈ వామనముర్తి అంటే ఏమనుకుంటుంన్నావో!రారా " పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.అందరూ బిక్కచచ్చి నిలబడిపోయారు.
అతని కారు వెళ్ళిపోయిన వెంటనే అనూష పోలీసు స్టేషన్ కి పోన్ తీశాడు.
"సి.ఐ.గారూ!నేను డాక్టరు అనూషని.ఇక్కడ మా ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర నుంచి నీరజ అనే ఒకమ్మాయి పారిపోయింది. ఆ....ఓ అరగంట అయి వుంటుంది.అదే వెతికిస్తున్నాను.ఎందుకైనా మంచిదని మీక్కూడా చెబుతున్నాను. నిజమే బస్సులు లేవు కానీ వెహికల్ ఏదన్నా వస్తే లిప్టు అడిగి వెళ్ళి వుండచ్చుకదా!ఆ ఓ.కే"ఫోన్ పెట్టేసి కుర్చీలో కూలబడి అంది."ఈ అమ్మాయి చాలా ప్రాబ్లమాటిక్ అయిందే.వామనమూర్తి వచ్చాడని చెప్పరా?"