Read more!
Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 1

                                 


                             రాబందులూ - రామచిలుకలు

                                                                     __ వాసిరెడ్డి సీతాదేవి

 

                                              


    తొలికోడి కూసింది. వేగుచుక్క వెలవెలపోయింది. మర్రిపాలెం వళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచింది. తొలి వెలుగురేకలతో చీకటి పెనుగులాడుతూంది, అంతిమ ఘడియల్లో ఓడిపోతున్న సిపాయిలా బలాన్నంతా కూడదీసుకొని.

 

    ధర్మయ్య లేచి బయటికి వచ్చాడు.

 

    సరస్వతమ్మ కళ్ళాపి చల్లుతూ భర్తను చూసి ఆగిపోయింది.

 

    "రాత్రంతా నిద్రలో మూలుగుతూనే వున్నారు. ఇంత చీకట్లో ఆ చన్నీళ్ళ స్నానం చెయ్యకపోతేనేం? వేన్నీళ్ళు పెడతాను. వళ్ళు నొప్పులు తగ్గుతయ్" అన్నది సరస్వతమ్మ భర్తతో.

 

    సగం నలుపూ, సగం తెలుపుగా వున్న గుబురు మీసాల నుంచి హాసరేఖలు దూసుకువచ్చాయి.

 

    "నాకేం? ఆరోగ్యం బాగానేవుంది_చెరువులో స్నానం చెయ్యకపోతే ఆరోజంతా నాకేదో పోగొట్టుకొన్నట్టు వుంటుంది" అంటూ ముందుకు నడిచాడు ధర్మయ్య.

 

    ఎదురింటి వాకిట్లో బంగారమ్మ ముగ్గుపెడుతోంది. తప్పుపోయిన చోట ముగ్గును కాలితో చెరుపుతూ ధర్మయ్యను చూసి, ముగ్గుబుట్టతో తుర్రున లోపలకు పరుగు తీసింది.

 

    ధర్మయ్య ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడిచాడు.

 

    ఈ ఆడవాళ్ళు ఎప్పటికి మారతారో? మగవాళ్ళు కన్పిస్తే చాలు గబుక్కున చాటుకు పోతారు, ముఖ్యంగా ఈ ఊళ్ళో తమ కులంవాళ్ళు. ఆ బంగారమ్మ వయస్సేమిటి? తన వయస్సేమిటి? తన బిడ్డలాంటిది. ధర్మయ్య రెండిళ్ళు దాటాడు.

 

    "ఏం తమ్ముడూ? చెరువుకు స్నానానికి వెడుతున్నావా?" రామసుబ్బమ్మ చేత్తో చీపురు పట్టుకొని వీధిగుమ్మం ఊడుస్తూ అడిగింది ధర్మయ్యను.

 

    "అవును సుబ్బమ్మా! ఏమిటి విశేషం ఇవ్వాళ నువ్వూడుస్తున్నావ్? కోడలు ఏమయింది?" _ ధర్మయ్య అడిగాడు.

 

    "దానికి రెండురోజుల నుంచి జ్వరం. మూసినా కన్నెరగదు."

 

    "అయ్యో అట్లాగా? మరి మందు ఎవరిస్తున్నారు?"

 

    "మన రామాచార్యులే!"

 

    "గవర్నమెంటు ఆసుపత్రి వుందిగా, ఆ డాక్టరుకు చూపించక పోయారు?"

 

    "ఆఁ ఇంగిలీసు మందులుకంటే రామాచార్యుల మందేమేలు. మాకు అదే అచ్చొచ్చింది. ఇంగిలీసు డాక్టరు మాట్లాడితే ఇండీషన్లు అంటాడు" అన్నది రామసుబ్బమ్మ.

 

    ధర్మయ్య ముందుకు కదిలాడు.

 

    అసలు విషయం ఇంగ్లీషు మందుమీద నమ్మకంలేకా, రామాచార్యుల మందుమీద నమ్మకం వుండీకాదు. డబ్బు! డబ్బు ఖర్చవుతుందనే భయం. చాలామంది డబ్బు మనకోసం, మన జీవిత అవసరాల కోసం అనే విషయాన్ని మరిచిపోతారు. తామే డబ్బుకోసం బ్రతుకుతున్నట్టు భావిస్తూ, జీవితంలో అందుబాటులో వున్న సుఖాలకు కూడా దూరం అవుతారు.

 

    ధర్మయ్య ఆలోచిస్తూ చెరువుగట్టు చేరాడు.

 

    పుణ్యంతో పోరాడలేక పాపం, నిజం ముందు నిలబడలేక అబద్ధం, తప్పుకున్నట్టు, వెలుగులో పోరాడటం సాధ్యం కాదని తెలుసుకున్న చీకటి, చిన్నగా ముఖం చాటుచేసుకుంది.

 

    రాగరంజితమైన పూర్వదిశ, తనవెంట నియమం తప్పక బయలుదేరే ప్రియుడు సూర్యుణ్ణి తల్చుకొని సిగ్గుపడిపోతున్న ఉషాదేవి చెక్కిలిలా వుంది.

 

    తొలివెలుగు కిరణాల నులివెచ్చని స్పర్శతో చెరువు వింత శోభతో మెరిసిపోతూంది. పైకి ఎగబాకుతున్న సూర్యబింబం, ముత్తైదువు నొసటి కుంకుమ బొట్టులాగా ఎర్రగా కణకణలాడుతూ మెరిసిపోతున్నది.

 

    బిందెలు తోముకుంటూ, నీళ్ళు పట్టుకుంటూ వున్న స్త్రీలు ధర్మయ్యను చూసి సగౌరవంగా తొలిగి నిల్చున్నారు. ధర్మయ్య అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ చెరువులోకి దిగాడు.

 

    స్నానం ముగించి ఒడ్డున వచ్చిన ధర్మయ్యకు నీళ్ళకావిడి భుజాన వేసుకొని ఎదురుగా వచ్చిన రాముడు, కావిడి దింపి వినయంగా నమస్కరించాడు.

 

    "ఏరా! రాముడూ! ఈ మధ్య కన్పించటంలే? యీ సంవత్సరం కౌలుపోగా వేరుశనగలో బాగానే మిగిలిందనుకుంటాను. జనపకట్ట కూడా అమ్మేశావా?"

 

    "ఇంకా అమ్మలేదు దొరా! బేరం కుదర్లేదు. మీ దయవల్ల వేరుశనగలో నాలుగు రాళ్ళు మిగిల్నయ్" అన్నాడు రాముడు.

 

    "నా దయ ఏమిటి? అంతా ఆ భగవంతుడి దయ. అది సరే, మీ చిన్నవాణ్ణికూడా చదువు మాన్పించి పరమయ్య గారింట్లో పాలేరుగా పెట్టావట నిజమేనా?"

 

    "అవును బాబూ! మాలాంటోళ్ళు చదువుకొని ఏంటి చెయ్యాలి దొరా!"

 

    "అదేం మాట? చదువుకు కూడా అంతస్తు కావాలా? నువ్వూ నీ పెద్దకొడుకూ కష్టపడుతూనే వున్నారుగా! వాణ్ణయినా చదివించకూడదూ? చాలా తెలివైన కుర్రాడు. పై కొస్తాడు."

 

    "ఏంటో లెండి. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు మాయి. అందరం చాకిరిచేస్తే గాని రెండు పూటలా ఇంత గంజి దొరకదు_" అన్నాడు రాముడు.

 

    "అదే మీతో వచ్చిన చిక్కు. ప్రభుత్వం అవకాశాలు కల్పించినా ఉపయోగించుకోరు. నీ కొడుకు నీలాగ బ్రతికితే చాలు అనుకుంటావు. వాడు నీకంటే బాగా బతికే మార్గం ఏమైనా వుందా అనే ఆలోచనే నీకు రాదు__" అన్నాడు ధర్మయ్య బాధపడుతూ.

 

    "ఏదోలే బాబూ! నా కొడుకులు తిండికీ, బట్టకీ ఇబ్బంది పడకుండా వుంటే అదేచాలు. మాలాంటోళ్ళు చదువుకొని ఏం చెయ్యాలి?"_అంటూ రాముడు కావిడి ఎత్తి భుజంమీద వేసుకొని "వస్తాను బాబూ!" అంటూ చెరువు వైపుకు నడిచాడు.

 

    ధర్మయ్య ఆలోచిస్తూ ముందుకు నడిచాడు.

 

    ధర్మయ్య ఆ వూళ్ళో అందరికీ తల్లో నాలుకలా వుండేమనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. ధర్మయ్య ఒకప్పుడు మోతుబరి రైతుల్లోనే లెఖ్ఖ. తండ్రి సుక్షేత్రం లాంటి ఇరవై ఎకరాల మాగాణీ, దొడ్లూ, దోవలూ ఇచ్చి మరీ కళ్ళు మూశాడు. ధర్మయ్య తన హయాంలో సంపాదించింది ఏమీలేదు. క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొన్నాడు. దేశసేవ అంటూ ఆస్తి అంతా కరిగించి వేశాడు. జైలుకు వెళ్ళాడు. చివరికి అతనికి మిగిలిందల్లా, ఒక డాబా ఇల్లూ, ఇరవై సెంట్లు పాటిదిబ్బా, ఎకరం తాళ్ళతోపూ, రెండెకరాల మాగాణి పొలం, ఊళ్ళో పరపతి మాత్రమే.

 

    "ఏం ధర్మయ్యా! స్నానం చేసి వస్తున్నట్టున్నావ్?" అన్నాడు అరక తోలుకుంటూ ఎదురువచ్చిన వెంకటప్పయ్య. వెంకటప్పయ్య ధర్మయ్య వయస్సువాడే. ఇద్దరూ చిన్నతనంలో కలిసి ఆడుకున్నవాళ్ళే. కాని ఇద్దరి మనస్తత్వాలలో, నలుపు, తెలుపులకు ఉన్నంత భేదం వుంది. వెంకటప్పయ్య తండ్రి వదిలిపోయిన మూడెకరాల మాగాణిని, ఇరవై అయిదు ఎకరాలకు పెంచాడు. గడ్డితిని సంపాదించాడు అంటారు ఊళ్ళో అందరు. ఇతరుల అభిప్రాయాల్ని అట్టే లెక్కచెయ్యని వెంకటప్పయ్య తన గురించిన పుకార్లు విని పైకి నవ్వేసేవాడు, మనసులో తిట్టుకొనేవాడు.

 

    "ఇంకా యీ వయస్సులో నువ్వు కష్టపడక పోతేనేం. చెట్టంత కొడుకులు ఇద్దరు వుండగా?" అన్నాడు ధర్మయ్య.

 

    "వాళ్ళమీద వదిలేసి ఊరుకుంటే అయినట్టే, అందులో యీ కాలం కుర్రాళ్ళు. అది సరేగాని పొలం బేరం పెట్టావంటగా? కూతిరికి పెళ్ళి కుదిరిందా?" అడిగాడు వెంకటప్పయ్య మాట మారుస్తూ.

 

    "పెళ్ళికి కాదు, అమ్మాయిని పట్నం పంపించి చదివించాలనుకుంటున్నాను."

 

    "ఎట్టెట్టా?"_ధర్మయ్య మాటకు నోరుతెరిచి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు వెంకటప్పయ్య.

 

    "పొలం అమ్మి కూతుర్ని చదివిస్తావా? నీకేమయినా మతిపోయిందా ధర్మయ్యా! ఆడపిల్లకు చదువెందుకు? ఏదో యీఊళ్ళో వున్నంత వరకూ చదివించావుగా? చాలదూ? యీ వున్నది కాస్తా చదువులు అంటూ ఊదేసి, ఆ తర్వాత పిల్ల పెళ్ళి ఎలా చేస్తావయ్యా?" ధర్మయ్య తెలివి తక్కువతనానికి జాలిపడుతున్నట్టున్నది వెంకటప్పయ్య ధోరణి.

 

    ధర్మయ్య నిండుగా నవ్వాడు. గుబురు మీసాలు కదిలాయి. కళ్ళు గర్వంతో మెరిశాయి.

 

    "పిల్లను చదివిస్తాను. ఆమె కాళ్ళమీద ఆమె నిలబడేలా తయారు చేస్తాను. నేను పెళ్ళి చెయ్యను. అమ్మాయే తనకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైనవాణ్ణి చేసుకుంటుంది. అంతేనయ్యా!"

 

    "ఆహాఁ చాలా బాగా చెప్పావయ్యా! మన ఊళ్ళో ఇంతమంది ఆడపిల్లలు చదివారు. ఏ ఆడపిల్ల పెళ్ళి కట్నం లేకుండా జరిగిందో చెప్పు. పైగా చదువుకున్న పిల్లలకు ఎక్కువ కట్నాలు గుమ్మరించాల్సి వచ్చింది. బి.ఏ. చదివిన అమ్మాయికి కనీసం ఎం.ఏ.చదివిన వాణ్ణయినా తేవాలిగా? ఎం.ఏ. చదివినవాడు అంటే మాటలా? లక్ష అయినా ఇవ్వంది రాడు. అంతవరకూ ఎందుకు? మన పరమయ్య కూతురి విషయమే తీసుకో. ఎం.బి.బి.యస్. ఐదో సంవత్సరం చదువుతోంది. అదేక్లాసు చదువుతున్న కుర్రాడికి లక్ష కట్నం ఇచ్చి మొన్ననేగా పెళ్ళి చేశాడు? ఆ రంగయ్యకూడా నీలాగే అనేవాడు. ఉన్నది కాస్తా అమ్మి చదివించాడు. ఏమయింది? తినటానికి లేని పరిస్థితిలో ఆ పిల్ల ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూ పాపం కుటుంబాన్ని పోషిస్తూంది. ముప్పై దాటినా పెళ్ళి కాలేదు_" అన్నాడు వెంకటప్పయ్య.

Next Page