Next Page 
ఆక్రోశం పేజి 1

                                 


                                      ఆక్రోశం

                                                _ సూర్యదేవర రామ్ మోహనరావు

 


    "SUCCESS IS THE WARMTH THAT YOU GET IN THE FRVIT OF YOUR WORK OR IN THE FRVIT OF YOUR EFFORTS. IT FILLS YOU UP WITH A WARMTHAND YOU WINK AT YOUR SELF, YOU SMILE AT YOUR SELF. YOU DON'T NEED TO SHARE IT EITH ANY BODY, AND IT'S NOT 'HA, HA' IT'S JUST WARMTH"


                                                 *    *    *    *


    హైదరాబాద్, జూబ్లీహిల్స్...

 

    సాయంత్రం అయిదు ఆరుగంటల మధ్య-

 

    సూర్యుడు పడమటి కొండల్లో అస్తమించడానికి సిద్ధంగా వున్నాడు.

 

    అపోలో హాస్పిటల్...

 

    హాస్పిటల్లోని ఆపరేషన్ రూమ్ ముందున్న విశాలమైన వరండాలో నలభై ఏళ్ళ వ్యక్తి రామాంజనేయులు టెన్షన్ తో పచార్లు చేస్తున్నాడు. తనకు పుట్టబోయేది కొడుకా? కూతురా?

 

    కొన్ని క్షణాల్లో తెలిపే ఆ విషయం కోసం వుద్వేగంతో వూగిపోతున్నాడు.

 

    ఆపరేషన్ రూమ్ డోర్ తెరచుకుంది.

 

    రాజహంసల్లాంటి ఇద్దరు నర్సులు బయటికొచ్చారు. వాళ్ళని చూడగానే రామాంజనేయులు ఆత్రుతగా వాళ్ళవైపు అడుగు వేశాడు. కానీ అతన్ని ఆ నర్సులు పట్టించుకోలేదు. గబగబా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న ఆ నర్సులవైపు అయోమయంగా చూశాడతను.             

 

    పది నిమిషాలు గడిచాయి.

 

    ఆపరేషన్ రూమ్ లోంచి డాక్టర్ బయటికొచ్చాడు. డాక్టర్ బయటి అడుగుపెట్టిన మరుక్షణం రామాంజనేయులు చిరునవ్వు లేని ముఖంతో డాక్టరు ముఖంవైపు చూసి అడిగాడు.

 

    "మగా, ఆడా డాక్టర్? నేను లోనికి వెళ్ళొచ్చా" అని అడుగుతున్న రామాంజనేయులు ముఖంలోకి డాక్టర్ తేరిపార చూశాడు.

 

    "మీరు లోనికి వెళ్ళేముందు మీకో విషయం చెప్పాలి. ఆ విషయం మీకు యిబ్బంది కలిగించేదిగా వుండొచ్చు" డాక్టర్ మాటలకు రామాంజనేయులు గుండె భయంతో గుబగుబలాడింది.

 

    "వాట్ డాక్టర్... వాట్ హేపెండ్... ఏమైంది... చెప్పండి డాక్టర్... తడారిపోయిన గొంతుతో అడిగాడు రామాంజనేయులు.

 

    "ఐ మస్ట్ ప్రిపేర్ యూ ఫర్ ఎ షాక్... మీకో అబ్బాయి పుట్టాడు. గుడ్ కలర్... కానీ హి వజ్ బార్నే విత్ అవుట్ ఇయర్స్. చెవులు లేకుండా పుట్టాడు. చాలా విచిత్రమైన కేసు... చెవులు ఏర్పడటానికి అవసరమైన మౌలికమైన పరిణామాలు అతని మెదడులో ఏర్పడలేదు. ఫ్యూచర్లో కూడా ఏర్పడతాయన్న నమ్మకంలేదు. బ్రతుకంతా విలక్షణమైన ముఖ స్వరూపంతో, చెముడుతో వుండాల్సిందే తప్పదు."  

 

    డాక్టర్ మాట వినగానే ముందు బిత్తరపోయాడు రామాంజనేయులు.

 

    "అసలు... వినికిడి జ్ఞానం వుండదా డాక్టర్?" పేలవమైన ముఖంతో అడిగాడతను.

 

    "అంతేకదా! మెడికల్ హిస్టరీలో లక్షమందిలో ఒకరు ఇలా పుట్టడానికి అవకాశం వుంది. నాకు తెలిసి, ఇటీవలి కాలంలో ఇలాంటి కేసును చూడలేదు. ఇలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వుండాల్సింది తల్లిదండ్రులే... తనకున్న లోపంవల్ల మానసికంగా కుంగిపోకుండా మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది, పెంచి పెద్ద చేయాల్సింది మీరే" చెప్పాడు డాక్టర్.

 

    రామాంజనేయులు మరి మాట్లాడలేదు. నేరుగా ఆపరేషన్ రూమ్ లోకి నడిచాడు.

 

    ఉయ్యాల్లో అమాయకమైన పసికందు. చెవులు లేకుండా!

 

    ఆ పసికందు వైపే అలా చూస్తున్నాడు రామాంజనేయులు.

 

    ఇరవై సంవత్సరాలు గడిచాయి.

 

    తన లేబరేటరీలోంచి గాభరాగా బయటికొచ్చాడు డాక్టర్ సంజీవి.

 

    అతని చేతిలో ఎక్స్ రే రిపోర్టు వుంది.

 

    "మిరక్యులస్"... డాక్టర్ సంజీవి, సీతారామాంజనేయులు వైపు చూస్తూ అన్నాడు. పక్కనే రామాంజనేయులు కొడుకు, ఇరవై ఏళ్ళ జానకీపతి డాక్టర్ వైపు, తండ్రివైపు చూస్తున్నాడు.

 

    "ఐ హేవ్ ఎక్స్ రేడ్ దిస్ యంగ్ మేన్స్! హెడ్ ఫ్రమ్ ఎవ్వెరి పాజిబుల్ యాంగిల్ అండ్ ఐ సీ నో ఎవిడెన్స్ దట్ హి పొజెస్సెస్ ఎనీఫార్మ్ ఆఫ్ హియరింగ్ ఎక్విప్ మెంట్ మనిషి వినికిడికి అవసరమైన నిర్మాణం మెదడులో లేకపోయినా, అరవై అయిదు శాతం ఇతనికి వినికిడి సౌకర్యం ఏర్పడింది. ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు. కళ్ళు లేకుండా మనిషి చూడలేడు. అలాగే చెవులు లేకుండా మనిషి వినలేడు. కానీ... చెవులకు సంబంధించిన ఏ అంగమూ ఏర్పడకుండా, నాడుల నిర్మాణం జరగకుండా... వినికిడి శక్తి రావడం... వండర్ ఇన్ ద వరల్డ్... ఈ కేసుని నేనిప్పుడే అమెరికన్ డాక్టర్స్ కి రిఫర్ చేస్తాను. అవసరమైతే ఇతన్ని తీసుకొని నేనే అమెరికా వెళ్తాను" చాలా ఎక్సయిటింగ్ గా అన్నాడు సంజీవి.

 

    కొడుకు జానకీపతిని చూసి, తండ్రి రామాంజనేయులు చాలా ఆనందంగా నవ్వాడు. తండ్రి ఎందుకలా నవ్వాడో కొడుక్కి మాత్రమే తెలుసు.

 

    ఆ నవ్వులో కాలానికి ఎదురీది, దుస్సాధ్యమైన దానిని, సుసాధ్యం చేయగలిగానన్న ధీమా వుంది.

 

    చెవి నిర్మాణమే లేని దురదృష్టవంతుడు. తన కొడుకులో చెవిటితనం లోపాన్ని సగానికి పైగా తగ్గించగలిగానన్న ఆత్మవిశ్వాసం వుంది.

 

    మెడికల్ శాస్త్రానికి అందని ఒక విచిత్రంగా వున్న కొడుకు జానకీపతి మామూలు మనిషిలా ఏ యంత్ర సహాయమూ లేకుండా వినగలడానికి కారణం ఏమిటి?

Next Page