ఈ సమస్యను కాలం పరిష్కరించిందా?
అదృష్టవశాత్తూ జరిగిందా?
మెడికల్ చరిత్రలోనే కాదు. మానవ చరిత్రలోనే జరిగిన యీ అద్భుతానికి కారణం ఏమిటి?
ఇక్కడ కాలం గెలిచిందా? అదృష్టం గెలిచిందా?
ఆలోచించడానికి ఇది చిన్న ప్రశ్న. కానీ మహావృక్షం వునికికి కారణమైన ఓ చిన్న విత్తనం లాంటి ప్రశ్న.
"Whenever we find leadership and great achievement at any level of life. In anh\y calling or occupation. We recognize that it is founded upon a positive mental attitude.
* * * *
ఆధునిక ప్రపంచంలో ఒక వ్యక్తి గుర్తింపుకు ప్రధాన కారణం. ఆ వ్యక్తి సాధించిన విజయం. ప్రపంచం దృష్టిలో విజయం అంటే ఏమిటి? ఒలింపిక్ గేమ్స్ లోనో, వింబుల్డన్ గేమ్స్ లోనో గోల్డ్ మెడల్ సాధించడమా? లక్షలతో వ్యాపారం చెయ్యడమా? కోట్లాది రూపాయల్ని తెలివితేటలతో సంపాదించడమా? ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతులు పొందడమా? ఉదాహరణకు రాజకీయ చరిత్రలో ఒక సాధారణ కార్యకర్థ స్థాయి నుంచి, ఎమ్మెల్యే, ఎంపి, ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదగడం ఒక వ్యక్తి సాధించిన సక్సెస్ కి నిదర్శనం. అలాగే రోడ్డుపక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి తన ఆత్మ విశ్వాసం ద్వారా కోట్లకు పడగలెత్తి, బిజినెస్ మాగ్నెట్ కావటం విజయానికి చిహ్నం.
అనర్గళంగా ఉపన్యసించగలిగిన ఒక బహుభాషావేత్త తన ప్రతిభ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి సాధిస్తాడు. లక్షలు గడిస్తాడు. మాటలు రాని మూగవాడు కూడా తన సర్వశక్తుల్నీ కూడదీసుకుని తన ప్రతిభను నిరూపించుకుంటాడు లక్షలు గడిస్తాడు.
ఎందరో, ఎందరో తమ తమ పరిధుల్ని, ప్రతిభను ఆధారం చేసుకుని సక్సెస్ కు గుర్తులుగా నిలుస్తారు. కృషి, పట్టుదల నిరంతర సాధన... ఆ వ్యక్తి దిగ్విజయానికి మూల స్తంభాలుగా నిలుస్తాయి.
అయితే సక్సెస్ అంటే ఏమిటి?
లక్షల సంపాదనే సక్సెస్ కు కొండ గుర్తా?
సక్సెస్ అంటే డబ్బేనా? సక్సెస్ ను కొలిచే సాధనం కేవలం డబ్బేనా? కాదు! కాదని చెప్తోంది మానవచరిత్ర.
మహాత్మాగాంధీ, బిర్లాలను తీసుకుంటే ఇద్దరూ వేర్వేరుదారుల్లో విజయాన్ని వరించిన వాళ్ళే. గాంధీ సాధించిన విజయం నాయకత్వానికి సంబంధించినది ఇక్కడ కొలబద్ద డబ్బు కాదు. వ్యక్తిత్వం బిర్లా విజయం మేధస్సుకు సంబంధించినది ఇక్కడ కొలబద్ద వ్యక్తిత్వం కాదు డబ్బు.
సక్సెస్ కు ఏది నిర్వచనం? కాలమా? అదృష్టమా?
శతాబ్దాల ప్రపంచ చరిత్రకు మూలబిందువు మనిషి. ఆ మనిషి నడకకు, జీవనయాత్రకు రెండు పాదాల్లాంటివి కాలం, అదృష్టం. ఎంతటి నియంత అయినా కాలాన్ని శాసించలేడు. అదృష్టాన్ని వరించలేడు. అనాదిగా కాలానికి, అదృష్టానికి మధ్య అనంత సమరం జరుగుతూనే వుంది.
రెండు నిరంతర, సమాంతర రేఖల్లాంటి కాలం, అదృష్టాల శిఖరాగ్ర మ్మీద ఒంటికాలితో నిల్చున్న వ్యక్తి మనిషి.
కాలం అదృష్టాన్ని శాసించగలదా?
అదృష్టం కాలాన్ని నియంత్రించగలదా?
కాలం, అదృష్టాల్లో మనిషికి ఏది ముఖ్యం?
ఉదాహరణకు అపార మేధస్సు కల ఒక వ్యక్తి ఇంధనం ధర రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితులకు భిన్నంగా అతితక్కువ ఇంధనంతో నడిచే కారుని కనిపెట్టాడు. కానీ అతనికి కాలం అనుకూలించలేదు. అదే సమయంలో ఇంధనం ధర బాగా తగ్గిపోయింది.
అలాగే ఇంకొక పరిశోధకుడు ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాడు. దానిని ఆ వారంలో పత్రికల ద్వారా, లోకానికి వెల్లడి చేద్దామనుకున్నాడు. కానీ అతనికి కూడా కాలం అనుకూలించలేదు. ఆ వారంలోనే న్యూస్ పేపర్లు సమ్మె కాలంగా పనిచేయలేదు.
అలాగే అదృష్టం...
ప్రఖ్యాత సైకాలజీ ప్రొఫెసర్ హేన్స్ హైసెంక్ డిగ్రీ చదవటానికి మామూలుగా కాలేజీకి వెళ్ళాడు. అతను కోరుకున్న సబ్జెక్టులో సీటు దొరకలేదు. ఆ కారణంగా ఒక సంవత్సరాన్ని వృధా చేయడం ఇష్టంలేక, ఖాళీగా వున్న సైకాలజీని సబ్జెక్టుగా తీసుకున్నాడు. సైకాలజీలో తనొక గొప్ప ప్రొఫెసర్ ని అవుతానని హైసెంక్ ఎప్పుడూ ఊహించలేదు. ఇది తన అదృష్టమే అంటాడతను.
అదృష్టానికి ఇంకో ఉదాహరణ!
ప్రఖ్యాత హిందీ నటుడు, కీర్తిశేషుడు రాజ్ కపూర్ క్లాప్ బోయ్ గా పనిచేసి, అగ్రశ్రేణి నటుడూ, నిర్మాతా అయ్యాడు. రాజ్ కపూర్ ద్వారా హిందీ చలనచిత్ర రంగానికి అద్భుతమైన ఉపకారం జరిగింది. దాదాపు నలభై ఏళ్ళక్రితం రాజ్ కపూర్ హైద్రాబాద్ వచ్చాడు. ఓ హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్ళాడు. అందులో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. ఒక వ్యక్తి జుత్తు కత్తిరిస్తుంటే, రెండో వ్యక్తి తబలా వాయిస్తున్నాడు.
రాజ్ కపూర్ వాళ్ళిద్దరినీ తన వెంట బొంబాయి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ ఎవరో తెలుసా?
ప్రముఖ సంగీత దర్శకులు శంకర్- జైకిషన్ లు!
సక్సెస్ క్రియేటివిటీ లాంటిది. నిర్వచనం చెప్పటం కష్టం సక్సెస్ వ్యక్తిగతం కావచ్చు, సామూహికం కావచ్చు. అలాగే సృజనాత్మకత వ్యక్తిగత కావచ్చు, సామూహికం కావచ్చు. కానీ వాటి ఫలితాలు ప్రయోగాలూ భిన్నంగా వుంటాయి.
ఒక వ్యక్తి సాధించిన విజయంలో అదృష్టం కూడా వుండొచ్చు... కానీ అదృష్టం విజయం కాదు! అదృష్టవంతులు విజేతలు కారు!
ఉదాహరణకు- అనూహ్యమైన పరిస్థితులలో ప్రధాని పదవిని చేపట్టిన పి.వి. నరసింహారావు విజేత కాదు, అదృష్టవంతుడు మాత్రమే! ప్రస్తుతము పదవి లేకపోయినా, అంచెలంచెలుగా తన ప్రతిభను నిరూపించుకుంటున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బెనజీర్ భుట్టో విజేత!
ఒక వందమంది స్త్రీ, పురుషుల్ని ఒకేచోట సమావేశపరచండి. వయసు, అనుభవం, విద్యాధిక్యత, ప్రతిభ, మేధస్సు అందరిలోనూ ఒకటే! అందరికీ అప్పగించిన పనొక్కటే! కానీ ఆ వందమందిలో ఇద్దరు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. విజేతలుగా నిలుస్తారు. ఫలితాలు సాధిస్తారు. విశ్లేషకులు చెప్పిన ప్రకారం, ఆ ఇద్దరే విజయం సాధించటానికి కారణం. "The all acted in the same way, the timing of their Action was Different."