Read more!
Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 1

                                 


                                     బ్రహ్మ ప్రళయం

                                                                    - మైనంపాటి భాస్కర్

 

                                          

పొగమంచూ, చిరుచీకటీ కలిసి కల్నేతలాగా అల్లుకుపోయి వున్నాయి టాంక్ బండ్ మీద. చలిగాలి వణికించేస్తోంది.
తెల్లగా తెల్లారకపోయినా, అప్పటికే చాలామంది వాకింగ్ కి తయారయి వచ్చి బ్రిస్క్ గా నడుస్తున్నారు. కొంతమంది నడకా, పరుగూ కాని విధంగా జాగింగ్ చేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది స్పోర్ట్స్ మెన్ వున్నారు. కానీ చాలామంది మామూలు మనుషులే. నడక అనేది సులభంగా అందుబాటులో వున్న ఎక్సర్ సైజు అని అందరికీ అర్థమవుతోంది ఈ మధ్య!
అప్పటికే టాంక్ బండ్ ఈ చివరనుంచి ఆ చివరిదాకా ఒకసారి పరిగెత్తి, వెనక్కి తిరిగి మళ్ళీ రెండోసారి సగం దూరం దాటి వచ్చేసాడు అతను. స్లిమ్ గా, ట్రిమ్ గానే వున్నా చాలా బలిష్టంగా కనబడుతున్నాడు కూడా! బ్లూ స్ట్రయిప్స్ వున్న తెల్లటి ట్రాక్ సూట్ వేసుకుని వున్నాడతను.
అతను పరుగు వేగం పెంచబోతూ వుండగా వినబడింది ఆ గొంతు.
"ఎక్స్యూజ్ మీ!"
వేగం తగ్గించి, తిరిగి చూశాడు.
ఒక అమ్మాయి నెమ్మదిగా పరుగెడుతోంది అతనికి కొద్దిగా వెనకాతల. పెదిమల మీద సంకోచంతో కూడిన చిరునవ్వు. బ్లూ జీన్సూ వైట్ కాటన్ స్పోర్ట్స్ షర్టూ వేసుకుని వుంది. కాళ్ళకి యాక్షన్ షూస్.
"నేను ఈ ఊరికి కొత్త! నీళ్ళలోనుంచి బయటికి తీసిన బుద్ధ విగ్రహం అదేనా?" అంది ఆ అమ్మాయి.
"అవును! ఆ రాయి వుందే! దాన్నే రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు. దాని మీద నిలబెట్టడానికి తీసుకెళ్తోంటే, అదిగో...అక్కడ పడిపోయింది విగ్రహం!"
ఆగి, రెయిలింగ్స్ ని పట్టుకుని నిలబడి ఆసక్తిగా చూసింది ఆ అమ్మాయి. రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ మీద విగ్రహం నీడలాగా అస్పష్టంగా కనబడుతోంది.
తదేకంగా చూస్తూ అంది ఆ అమ్మాయి.
"గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కవలసినంత పెద్ద విగ్రహంట కదా అది! ఎనభై రెండు అడుగుల పొడుగు! వంద టన్నుల బరువు! ఎక్కడో చెక్కి ఇంత దూరం ప్రయాసపడి తీసుకువచ్చి, ఆ నీళ్ళ మధ్య ఆ రాతి మీద నిలబెట్టడం అంటే మాటలా? నీళ్ళలో నుంచి దానిని బయటకు తియ్యడానికి రెండేళ్ళు పట్టిందట కదా!"
వింటున్న అతను చిన్నగా నవ్వాడు.
"ఈ బుద్ధవిగ్రహం చాలా పెద్దదీ, బరువైనదీ కూడా! నిజమే! దాన్ని ఆ రాతిమీదికి తీసుకెళ్ళి నిలబెట్టడం అంటే కష్టమైన పనే! కాదనను! దానికోసం టెండర్లు పిలిచారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయింది ప్రభుత్వం! ఎబిసి అనే కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. వాళ్ళు విగ్రహాన్ని సగందాకానే తీసుకెళ్ళి నీళ్ళలో పడేశారు. దానిని బయటకు తియ్యడం కోసం కొత్త కాంట్రాక్టులు! కొత్త ప్రయత్నాలు! అసలు విగ్రహాన్ని నీళ్ళలో నుంచి బయటికి తీసి నిలబెట్టడం అనేది జరిగే పనేనా అని అందరూ అనుకున్నారు కూడా! ఈ సందర్భంలో ఒక విషయం తలుచుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది!" అని ఆగాడు అతను.
'ఏమిటన్నట్లు' అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆ అమ్మాయి.
"ఈజిప్షియన్ చక్రవర్తులని ఫేరోలు అంటారు.
ఫేరోలు చనిపోయిన మృతదేహాలని భద్ర పరచడానికే పిరమిడ్స్ నిర్మించేవాళ్ళు. పాతకాలపు ఈజిప్షియన్ లకి పునర్జన్మ మీద నమ్మకం ఆస్తి. అందుకనే శవాలని అంత జాగ్రత్తగా వుంచేవాళ్ళు. అంటే, రాచ కుటుంబీకుల సమాధుల లాంటివే నన్నమాట పిరమిడ్లు. వీటిలో చాలామటుకు క్రీస్తుపూర్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టబడినవే! అంటే క్రీస్తు పుట్టే సమయానికే ఇవి అతి పురాతనమైనవన్నమాట! వాటిల్లోనే వుంది 'గ్రేట్ పిరమిడ్'. దాదాపు నలభై అంతస్తుల భవంతి అంత ఎత్తుగా వుంటుందన్నమాట అది! ఆ కట్టడంలో ఉపయోగించిన రాళ్ళ బరువే ఆరు లక్షల టన్నులు వుంటుంది. దానిని కట్టడానికి ఉపయోగించిన ఒక్కొక్క రాయీ చిన్న గది అంత సైజులో వుంటుంది. ఒక్కొక్క రాతిబండ బరువూ కొన్ని టన్నులు వుంటుంది.
ఆ కాలంలోనే అంతంత పెద్ద రాళ్ళను అతి లాఘవంగా చెక్కి, అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారు? నలభై అంతస్తుల ఎత్తున రాతికీ రాతికీ మధ్య అరంగుళం కూడా తేడా రాకుండా ఎలా పేర్చగలిగారూ? కొన్నివేల సంవత్సరాల క్రితం కట్టిన ఆ కట్టడంలో ఏ టెక్నాలజీ ఉపయోగించబడిందీ? తలుచుకుంటే ఆశ్చర్యంగా లేదూ?
అతను చెబుతుంటే ఆసక్తిగా వింటోంది ఆ అమ్మాయి.
స్వగతంలా అతను చెబుతూనే వున్నాడు.
"ఈ పాతకాలపు టెక్నాలజీకి ఇంకో ఉదాహరణ వుంది. మచ్చు-పిచ్చు అనే ఒక నగరాన్ని పదివేల అడుగుల ఎత్తున వున్న కొండ మీద నిర్మించారు. ఈ కొండ ఎలాంటిది? మామూలుగా మనుషులు ఎక్కడానికే దుస్సాధ్యంగా వుంటుంది. అలాంటి కొండ మీదికి ఆ బండరాళ్ళను ఎలా తీసుకెళ్ళగలిగారూ?
"అక్కడే దొరికే రాళ్ళతోనే ఆ నగరాన్ని కట్టి వుండవచ్చుగా?" అంది ఆ అమ్మాయి.
అతను అడ్డంగా తల ఊపాడు.
"అవి అక్కడ దొరికే రాళ్ళు కాదని తేలింది.
"మరి ?"
నవ్వాడు అతను.
"మనకి అంతుబట్టని వింతలు ఇలాంటివి ఎన్నో వున్నాయి ఈ లోకంలో! దాన్ని బట్టి చూస్తే, పాతకాలం వాళ్ళే మనకంటే నాగరికులేమో అనుకోవలసి వస్తుంది."

Next Page