ఇంకా ఏవేవో ప్రశ్నలు అడిగింది ఆ అమ్మాయి.
అతను ఓపిగ్గా జవాబులు చెప్పాడు.
ప్రశ్నలు అడుగుతూనే ఓరకంటితో పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తోంది ఆ అమ్మాయి.
తర్వాత చటుక్కున అంది.
"నేను కావాలని మీతో మాటలు కలిపినట్టుగా అనిపిస్తోందా?"
ఆమె వైపు సూటిగా చూశాడు అతను. అతనికా అనుమానం అప్పటికే కలిగింది. "అవును!" అన్నాడు.
"ఆ మాట నిజమే! నేను చాలా ప్రమాదంలో వున్నాను. మీరు నన్ను సేవ్ చెయ్యగలరనుకునే మీ దగ్గరికి వచ్చాను" అంది ఆ అమ్మాయి.
మృదువుగా అన్నాడు అతను-
"మీకేం భయం లేదు! ఏం జరిగిందో చెప్పండి!"
మళ్ళీ ఇంకోసారి క్రీగంట పరిసరాలన్నిటినీ జాగ్రత్తగా గమనించింది ఆ అమ్మాయి. తర్వాత అంది.
"మనకి కాస్త వెనగ్గా ఒక నల్ల కారు వుంది. ఇప్పుడే చూడకండి. తర్వాత చూడండి! అందులో వున్నారు నలుగురు కుర్రాళ్ళు. వాళ్ళు చాలాసేపటినుంచి నన్ను ఫాలో చేస్తున్నారు. వీలయితే నన్ను కార్లోకి లాగేసి కిడ్నాప్ చెయ్యాలని వాళ్ళ ప్లాన్ అనుకుంటాను."
"మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారా? ఎందుకు?"
"ఆడపిల్లని! అది చాలదా?"
"అవును!" అన్నట్లు సాలోచనగా తల పంకించాడు అతను. తర్వాత యధాలాపంగా తల తిప్పి చూశాడు.
ఆ అమ్మాయి చెప్పినట్లే నిజంగానే అక్కడొక కారు నిలబడి వుంది.
అందులో కనబడుతున్నారు నలుగురు కుర్రాళ్ళు.
కారు వైపూ, వాళ్ళవైపూ ఒకసారి అంచనా వేస్తున్నట్లు చూసి, తర్వాత ఆ అమ్మాయితో అన్నాడు అతను.
"ఈ సినిమాలు చూసి పాడయిపోతున్నారు జనం! చిత్రమైన సైకలాజికల్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేశారా? సినిమా చూస్తున్నంత సేపూ తమని తాము హీరోతో ఐడెంటిఫై చేసుకుంటారు చాలామంది. కానీ సినిమాహాల్లో నుంచి బయటికి రాగానే అందులోని విలన్ పోయిన పోకడలు పోవాలని తాపత్రయ పడతారు" అని చులకనగా నవ్వాడు.
అతని చమత్కారాలని ఎంజాయ్ చేసే మానసిక స్థితిలో లేదు ఆ అమ్మాయి. ఆమె పెద్ద పెద్ద కళ్ళలో భయం కనబడిపోతోంది.
అది గమనించి అన్నాడు అతను.
"ఆల్ రైట్! మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి! నన్నడిగితే బస్సులో వెళ్ళడం బెటరనుకుంటాను. నేను ఆ ఆవారా గాళ్ళకి మేనర్స్ లో ఏబీసీడీలు నేర్పి వస్తాను. సీయూ! సో లాంగ్!"
ఆ అమ్మాయి కదిలి వెళ్ళబోతూ ఆగి, అంది-
"మీ పేరు...?"
"నన్ను సాహస్ అని పిలుస్తారు."
"సాహస్! వెరీ అన్ యూజువల్ నేమ్!"
"యస్ అఫ్ కోర్స్! మీరు...?"
"నా పేరు ప్రగతి!"
"ప్రగతి! చాలా బావుంది పేరు!"
అప్రయత్నంగానే చూపులు పక్కకి తిప్పుకుంది ప్రగతి. "వెల్ థాంక్యూ మిస్టర్ సాహస్!"
"యూ ఆర్ వెల్ కమ్!"
అతను మాట పూర్తి చెయ్యనే లేదు. ఈ లోగానే ఆ నలుగురు కుర్రాళ్ళూ వున్న కారు స్టార్ట్ అయి, క్షణాల్లో వేగం అందుకుంది.
తక్షణం, అక్కడే పార్క్ చేసి వున్న తన మోటార్ సైకిల్ మీదికి జంప్ చేసి స్టార్ట్ చేశాడు సాహస్.
అదే క్షణంలో అక్కడొక బస్సు వచ్చి ఆగింది.
అందులో ఎక్కేసింది ప్రగతి.
సాహస్ మోటార్ సైకిల్ స్పీడు పెంచి, నల్లకారుని ఛేజ్ చెయ్యడం మొదలెట్టాడు.
తెల్లవారుఝాము కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా లేదు. అందుకని, వెళ్తున్న కొద్ది వాహనాలూ యధేచ్చగా టాప్ స్పీడులో వెళ్తున్నాయి. యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేది అర్ధరాత్రీ, తెల్లవారుజాము మధ్యనే! లిమిట్ తప్పిన వేగంతో పోతుంటాయి వెహికల్స్ ఆ టైంలో!
కుర్ర గ్యాంగు ఎక్కిన కారు క్షణక్షణానికీ స్పీడు పెరుగుతూ రాకెట్లా దూసుకుపోతోంది.