Read more!
Next Page 
జన్మభూమి పేజి 1

                                 


                                    జన్మభూమి

                                                                             డి. కామేశ్వరి

 

                                         
  

 నెలరోజులక్రితం ఇండియా వెళ్ళివచ్చిందగ్గిరనుంచి డాక్టర్ కేశవరావు ఆలోచనలో పడ్డారు. ఆయన మనసులో ఒక ఆలోచన అణురూపంలో మొదలై ముప్పై రోజులలో నిర్దిష్టమైన ఆకృతి దాల్చింది. ఈ ఆలోచనకి ముందు ఆయన చాలా ఆలోచించారు. అన్నికోణాల నుంచి సంభవాసంభవాలను, మంచి చెడ్డలను అన్నిరకాలుగా బేరీజు వేసుకున్నారు. అది అంతతేలిగ్గా నిర్ణయాలు తీసుకునే విషయం కాదని అతనికి తెలుగు. గత ముప్పైఐదేళ్ళుగా అమెరికాలో డాక్టరుగా వుండి పేరుప్రఖ్యాతులు, మిలియన్లు సంపాదించుకుని అక్కడి సిటిజన్లుగా మారిన తను మళ్ళీ ఇండియా రావడం అంటే అంత తేలిక వ్యవహారం కాదు. అక్కడి సుఖాలకి, అక్కడి జీవన పద్ధతులకి అలవాటు పడి, భోగభాగ్యాల మధ్య తులతూగే తాము అవన్నీ వదిలి జన్మభూమికి తిరిగిరావడం అంత సుళువు కాదు.    
    జన్మభూమి! తియ్యని మాటే! ఆ మాట తలుచుకుంటేనే అదోరకం పులకింత లాంటిది కలుగుతుంది. పుట్టి పెరిగి పెద్దయిన వూరు, చదువుకున్న దేశం అన్నీ వదిలి పరాయిదేశం వెళ్ళి అక్కడి పరిస్థితులతో రాజీపడి, సుఖాలకి అలవాటుపడ్డ తాము మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత, ఇన్నేళ్ళ తరువాత మాతృదేశానికి తిరిగివెళ్ళాలన్న ఆలోచన ఓ పక్క సంతోషానిస్తున్నా...సంతోషం కంటే సందేహాలు, భయాలు ఎక్కువ కల్గుతున్నాయి. అక్కడి పరిస్థితులు కళ్ళారా చూసి వచ్చాక ఎంత జన్మభూమి మీద ప్రేమాభిమానాలు వున్నా అక్కడ ఇమడగలమా అన్న సందేహం, అనుకున్నది నెరవేర్చలేకపోతే రెంటికి చెడ్డ రేవడి అవుతుందేమోనన్న భయం. దూరాలోచన ఆయన ఓ నిర్ణయానికి రావడానికి నెలరోజులు పట్టేట్టు చేసింది. తన మనసులోని ఆలోచన నెల తరువాత భార్యముందు బయటపెట్టారు.
    రాజేశ్వరి విభ్రమంగా చూసింది. నమ్మలేనట్టు మళ్ళీ అడిగింది.
    "అవును రాజీ. ఈసారి ఇండియా నుంచి వచ్చిందగ్గిరనించి నాకు మనదేశం కోసం, నా మాతృభూమికోసం ఏదన్నా చెయ్యాలన్న కోరిక పెరిగి పెద్దదయింది. పుట్టి పెరిగిన నా దేశం కోసం నేనేదన్నా చేసి రుణం తీర్చుకోవాలనిపిస్తూంది. పుట్టి పెరిగిన నా వూరికోసం ఏదన్నా చెయ్యాలని ఎంతగానో అన్పిస్తుంది- ఏదో చెయ్యాలన్న ఆరాటం నన్ను నిలవనీయడం లేదు."
    "బాగానే ఉంది వరస. ఎందుకలా వున్నారని ఎన్నిసార్లు అడిగినా చెప్పారు కాదు. యిదా మీ ఆలోచన...ఇది జరిగే పనా!" చాలా తేలిగ్గా అనేసింది రాజేశ్వరి.
    "ఏం, ఎందుకు జరగదు! సంకల్పం వుంటే జరిగేది మానేది మనచేతుల్లో పని" పట్టుదలగా అన్నారు కేశవరావు.
    "మీకేమన్నా మతిగాని పోయిందా! ఇప్పుడు యిండియా తిరిగి వెళ్ళడం ఏమిటి -
    యిన్నేళ్ళ తరువాత యీ బుద్ధి ఎందుకు పుట్టినట్టు...అసలు ఈ ఆలోచనేమిటి, హఠాత్తుగా 'జన్మభూమి' మీద యీ ప్రేమ ఎందుకు పుట్టిందో, వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని హాస్యంగా అంది రాజేశ్వరి. భార్య తన మాటని, ఆలోచనని అంత తేలిగ్గా తీసిపారేయడము అతనికి కష్టం అన్పించింది. గత నెలరోజులుగా ఎంత మధనపడి, ఎంత తపనపడి, ఎన్నెన్ని ఆలోచనలు చేసి తనీ నిర్ణయానికి వచ్చాడో..."
    "ఏమిటండీ, కొంపదీసి నిజంగానే అంటున్నారేమిటి -' భర్త సీరియస్ అయిపోవడం చూసి అదుర్ధాగా అంది రాజేశ్వరి.
    "జన్మభూమి మీద నిజంగానే ప్రేమపుట్టి యీ నిర్ణయానికి వచ్చాను - ప్రేమ అను, అభిమానం అను, నా కర్తవ్యం అను, పుట్టిన దేశానికి పుట్టిన వూరికి ఏదో మంచిచేసి పుట్టినందుకు జన్మ సార్ధకత చేసుకోవాలనిపిస్తుంది రాజీ - జీవితంలో మూడు వంతులు గడిచిపోయాయి. ఈ మూడు వంతుల జీవితంలో నాకోసం, నా కుటుంబం కోసం కష్టపడ్డాను. నా పిల్లలని పైకి తీసుకురావడానికి రాత్రింబవళ్ళు డాక్టరుగా పనిచేసి కష్టపడి లక్షలు, కోట్లు కూడబెట్టాను. ఆ లక్షలు, కోట్లు సంపాదించడానికి మాతృభూమిని వదిలి ఇంత దూరం వచ్చాను. ఇన్నాళ్ళు నాకోసం, మీకోసం జీవితాన్ని ధారపోశాను. అరవైఏళ్ళు వచ్చాయి. పిల్లల పట్ల నా బాధ్యత నెరవేర్చాను- వాళ్ళు పైకి వచ్చారు- ఇంక మిగిలిన ఒక వంతు జీవితంలో పరులకోసం, అందులో నాదేశం కోసం ఏదన్నా మంచిచేసి జీవితానికి సార్ధకత చేకూర్చుకోవాలనిపించడం తప్పంటావా - మనకోసం మనం బతకడం అందరూ చేసేదే- పరులకోసం బతకడం ఎంతమంది చేయగలరు! ఆ కొద్దిమందిలో నేనూ ఒకడ్ని అవ్వాలని వుంది రాజీ. నా మాతృభూమి బీదదేశం - దేశాన్నంతటినీ బాగుచేయడం నా ఒక్కడి వల్లకాదు- కాని నేను పుట్టి పెరిగిన వూరు ఒక్కటయినా బాగుచెయ్యగల్గితే అంతకంటే సంతృప్తి ఏముంటుంది. ఈ సంపాదించిన ఈ డబ్బు దేశంలో ఒక్క వూరిని ప్రగతిపథం వైపు నడిపించినా నా మాతృభూమి రుణం తీరినట్లవుందనిపిస్తుంది రాజీ...' చాలా ఉత్తేజంగా మాట్లాడుతున్న కేశవరావుని విస్మయంగా చూసింది రాజేశ్వరి- ఇదేదీ ఆషామాషీగా అన్న మాటలు కావని ఆమెకి అర్థమైంది.
    "బాగానే వుంది మీ వెర్రి- మొన్న ఆంధ్రా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఈ జన్మభూమి పిచ్చి ఎక్కినట్లుంది. అతను రాజకీయ నాయకుడు. మీలాంటి ఎన్.ఆర్.ఐ.ల దగ్గిర డబ్బు పుష్కలంగా వుంటుంది అని తెలుసు - మీలాంటివారిచేత దేశంలో మదుపు పెట్టించి పరిశ్రమలు ఏర్పరుచుకోవాలని ఆయన ఆశించడం బాగానే ఉంది. జన్మభూమి కోసం మీరంతా ముందుకు రావాలని ఉపన్యాసాలిచ్చాడు ఆయన. మంచిదే, డబ్బుంది కనక మన దేశంలో పరిశ్రమలు పెట్టడానికి సాయం చెయ్యండి- అది మనకూ లాభసాటి అయితే ఎవరు వద్దంటారు. డబ్బు పెట్టండి. కాని ఆమాత్రం కోసం ఇండియా వెళ్ళిపోవడం ఎందుకు...
    పరిశ్రమలు పెట్టినా డబ్బుని పదింతలు పెంచుకోవాలని కాదు నా కోరిక రాజీ - నేను పుట్టి పెరిగిన నా వూరిని అభివృద్ధిపరుచుకోవాలన్న కోరిక - ముఖ్యమంత్రి అన్నారని కాదు కాని, నిజంగా అతని మాటలు వింటూంటే ఆరోజు ఎంత ఉద్విగ్నతకి లోనయ్యానో తెలుసా - అతను మా ఎన్.ఆర్.ఐ లను పరిశ్రమలు స్థాపించమనే కాదు- మీ స్వగ్రామాలని ఒక్కొక్కరు ఒక వూరు దత్తత చేసుకుని ఆ వూరిని, ప్రజలని చైతన్యవంతులని చేయమని అర్థించాడు. ప్రభుత్వం ఏం కావాల్సినా సహాయ సహకారాలు చేతనయినంత వరకు అందిస్తుందని అభయం ఇచ్చాడు.
    విదేశాలు వెళ్ళారు. చదువుకున్నారు. డబ్బు సంపాదించారు. మీ సంసార బాధ్యతలు పూర్తయిన వారు స్వదేశం వైపు దృష్టి మళ్ళించండి. కొడుకులు యింత వృద్ధిలోకి వచ్చి, యింత ధనవంతులయి వుండి కన్నతల్లిని బీదరికంలో రోగాలతో మగ్గనీయడం ఎంత క్షమించరాని నేరమో - మాతృభూమిని, జన్మభూమిని బాగుచేయడానికి అవకాశం వున్నవారు కూడా అలా నిర్లక్ష్యంగా వదిలేయడం క్షమార్హం కాదు - రండి - కదిలి రండి- మీ గ్రామం పిలుస్తూంది. మీ దేశం రమ్మంటూంది- జన్మభూమికి చేతనయిన సాయం, చేయూతనందివ్వండి' ఇదే మీ అందరికీ నా పిలుపు అని ముఖ్యమంత్రి ఎంత ఉద్రేకంగా పిలుపు ఇచ్చాడో తెలుసా - వింటున్న నాకు ఆ క్షణం నుంచే నాదేశం వెళ్ళి నా ఊరికి ఏదన్నా చెయ్యాలనిపించింది-' ఉద్విగ్నంగా అన్నాడు కేశవరావు.  
    "బాగుంది మీ వరస - రాజకీయనాయకుల మాటలు అలాగే వుంటాయి - వచ్చేవరకు రారా అంటారు. వచ్చాక మీ మొహం చూడరు. అన్నింటికి రెడ్ టేపిజమ్, లంచాలు - ఏ పని జరగదు...ఇదంతా హమ్ బగ్- జన్మభూమి మనలాంటి చదువుకున్నవాళ్ళని కులాల పేరుతో, రిజర్వేషన్ల పేరుతో పైకి వచ్చే అవకాశాలు లేకుండా చెయ్యబట్టే కదా మనలాంటి వాళ్ళం ఆ దేశంలో వుండలేక కాదు విదేశాలు వలస పోవడం - చదువుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అగ్ర కులాలు అణిచివేత ఎప్పుడైతే ఆరంభమయిందో అప్పుడే కదా కాస్త తెలివి, డబ్బు వున్న అందరూ విదేశాలకి పోవడం ఆరంభించారు. జన్మభూమి మనకేం యిచ్చిందిట - యిస్తే వదిలి ఎందుకు దేశం కాని దేశంలో పడి వుంటాం. చేతులారా ఈ ప్రభుత్వాలు తెలివితేటలతో చదువుకున్న అందరినీ విదేశాలు పోయేట్టు చేస్తూ...రిజర్వేషన్ల పేరిట ముప్పై మార్కుల వాళ్ళందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏభై ఏళ్ళయినా యింకా రిజర్వేషన్ లు అంటూ వెనకబడిన కులాలు అంటూ ఆకాశానికెత్తడం ఎంతవరకు సబబు!
    కులాల ప్రాతిపాదికన కాక ఆర్ధిక ప్రాతిపాదికన ఆర్ధిక సాయం చేస్తే ఎవరు వద్దంటారు. ఇలా చేసి బ్రెయిన్ డ్రైన్ అయిపోతోంది దేశం. అలాంటి కులతత్వ రాజకీయాలు వుండే ఆ దేశంలో మన జన్మభూమి అయినా ఎలా మనగలం. అన్నీ వదులుకుని వచ్చాం. ఏదో సంపాదించుకుని స్థిరపడ్డాం - ఏ బాధరబందీలు, ప్రాబ్లమ్స్ లేవు మనకు. ఇక్కడ కొన్ని సుఖాలకి అలవాటుపడ్డాం- యీ వాతావరణంలో యిమిడిపోయాం. తెల్లారి లేస్తే పాలు వస్తాయా, నీళ్ళు వస్తాయా, పనిమనిషి వస్తుందా, కరెంట్ ఉంటుందా లాంటి సమస్యలు మనకు తెలీవు. ఈ సుఖాలన్నీ వదులుకుని యీ వయసులో అక్కడికెళ్ళి కష్టపడటం ఏమిటి. ఎవరో ఉపన్యాసాలు యిచ్చారని లేనిపోని కష్టాలు నెత్తికెక్కించుకోవడం ఏమిటి. మీకసలు మతిపోయింది.

Next Page