Next Page 
మరీచిక పేజి 1

                                 


                              మరీచిక

                                                 - వాసిరెడ్డి సీతాదేవి

 


    శబరికి ఏదో చెయ్యాలని ఉంది.

 

    ఏదో అద్భుతం జరగాలని ఉంది.

 

    ఏదైనా సాహసం చెయ్యాలని ఉంది.

 

    ఈ మధ్య  ఎప్పుడూ ఏదో చెయ్యాలని అనిపిస్తూ ఉంటున్నది. కాని ఏం చెయ్యాలో తెలియడం లేదు.

 

    కనీసం ఏదైనా సమస్యను యెదుర్కోవాలని వున్నది.

 

    బాధపడాలని వుంది, ఆ బాధలోనే థ్రిల్ అనుభవించాలని ఉంది.

 

    ఏదో కొత్తదనం, రొటీన్ కు భిన్నమైనది జరగాలని ఆమె మనసునిత్యం ఆరాటపడుతూ ఉంటున్నది.

 

    శబరి సంపన్నుడైన రంగారావు ఏకైకపుత్రిక. ఊహ తెలిసినప్పటినుంచీ ఏది కోరినా నిముషాలమీద లభిస్తూనే ఉన్నది. ఆ ఇల్లు ఆమెకు బంగారు పంజరంలా అనిపిస్తూ ఉన్నది. తన చుట్టూ వున్న మనుషులు యంత్రాల్లా కన్పిస్తున్నారు. వారి మాటలూ, చేతలూ, మహాబోర్ కొట్టేస్తున్నాయి.

 

    ఆమెకు ఏం కావాలో తెలియడం లేదు! ఏది అక్కర్లేదో మాత్రమే తెలుస్తున్నది!

 

    శబరి అద్దంముందు కెళ్ళి నిల్చున్నది. గిరిజాల జుట్టు, ఒకప్పుడు తను ఎంతో ఇష్టంగా చూసుకొని మురిసిపోయే ఆ జుట్టు, చిరాకు కలిగిస్తూ వున్నది. ఎంతో మోజుపడి కుట్టించుకున్న జీన్స్ లో తనను చూసుకున్నది. బాగాలేదనిపించింది. వెంటనే దుస్తులు మార్చుకున్నది. ప్యాంటు షర్టూ వేసుకున్నది. మళ్ళీ అద్దంలో చూసుకున్నది. అది రొటీన్ గా విసుగ్గానే అనిపించింది.

 

    బీరువా తెరిచింది రకరకాల చీరెలు ఒక్కొక్కటే తీసి పడేసింది. ఏదీ కట్టుకోవాలనిపించలేదు. చీరలన్నీ అడ్డదిడ్డంగా మళ్ళీ బీరువాలో అరల్లో కుక్కింది.

 

    కిటికీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది.


    
    ఎదురుగా వున్న పూరి గుడిసెలకేసి చూసింది. ఆ గుడిసెల్లోకి వెళ్ళి కూర్చోవాలనిపించింది.

 

    ఎదురుగా రాములమ్మ కన్పించింది. ముతక నేతచీర మోకాళ్ళపైకి మడిచి గోచీ పెట్టుకొని కట్టుకున్నది రాములమ్మ. గాబుపైగా వంగి కుడితిని కుడిచేత్తో కులుపుతూ గేదెకు తాగిస్తూ వున్నది.

 

    రాములమ్మ చీర బలే వుంది! తను కూడా అలా కట్టుకుంటే? తన దగ్గిర అలాంటి చీర లేదుగా? అమ్మ అలాంటి చీర తనను కట్టుకోనిస్తుందా? అలాంటి చీర, ఆ రాములమ్మలాగే కట్టుకోని డిన్నర్ కి వెళ్తే? బలేగా వుంటుంది. కాని అందరూ తనకు పిచ్చెక్కింది అనుకుంటారు. కళ్ళు తేలవేసిచూస్తారు. వాళ్ళు అలా చూస్తుంటే బలే థ్రిల్ గా వుంటుందిలే! కాని... ఎలా కట్టుకోవడం? మమ్మీ ఒప్పుకోదు? డాడీ కూడా ఒప్పుకోడు.

 

    జీన్సూ, ప్యాంట్లూ, షర్ట్సూ, నైలెక్స్ చీరలూ, మాచింగ్ బ్లౌజులూ... నగలూ... సెట్సూ... ఛ! బోర్, యమ బోర్! ఎప్పుడూ ఇవే.

 

    రాములమ్మ చెయ్యి బయటికి తీసింది. మోచేతివరకూ కుడితితో తడిసి, చిట్టు అతుక్కుని వుంది.

 

    రాములమ్మ మొగుడు నరసిమ్మ నీటికావిడి భుజంమీద వేసుకొని వస్తున్నాడు. కావిడి తమాషాగా ఊగుతూ వుంది. కావిడితోపాటు అతనూ ఊగుతున్నాడు. కడవల్లోని నీరు చిందుతూ వుంది. నల్లటి అతని ఛాతీ చెమటతో తడిసి నీరెండలో నిగనిగలాడుతూ వుంది. మొలపంచ, నీరికావి పంచ మోకాళ్ళపైకి మడిచి కట్టుకున్నాడు.

 

    నరసిమ్మ భార్యముందు, కావిడి దించాడు. కడవ కావిడి చిక్కంలో నుంచి తీసి రాములమ్మ చేతిమీద నీళ్ళు వంపుతున్నాడు. రాములమ్మ చెయ్యి కడుక్కుంటూ ఎందుకో కిసుక్కున నవ్వింది. ఆ నల్లముఖంలో తెల్లటి పళ్ళు తమాషాగా మెరిశాయి.

 

    ఆ దృశ్యం శబరికి అద్భుతంగా తోచింది.

 

    మమ్మీ, డాడీ ఒక్కసారి కూడా అలా చెయ్యరేం! ఎప్పుడూ ఒకేలా మాట్లాడుకుంటారు. డాడీ మమ్మీ చెప్పినట్లే చేస్తాడు. మమ్మీ అంటే డాడీకి భయం! అందుకే ప్రతిదానికీ "అవునవును" అంటూ తాళం వేస్తాడు.

 

    రాములమ్మ మొగుడు అలాకాదు. ఒకోరోజు పెళ్ళాన్ని వంగదీసి కొడుతూ వుంటాడు. అది రకరకాల తిట్లు తిడుతూ ఏడుస్తుంది.

 

    ఒకోరోజు వాడు బూతులు తిడుతూ వుంటాడు. అయినా దానికి కోపం రాదు. పైగా పకపక నవ్వుతుంది.

 

    ఇంకోరోజు వాడు కూలి డబ్బులు ఇంటికి తీసుకురాడు. రాత్రంతా బాగా తాగి ఎక్కడో గడిపేస్తాడు. తెల్లవారి ఇంటికి వస్తాడు. రాములమ్మ తిట్లకు లంకించు కుంటుంది. నరసిమ్మ తలవంచుకొని గొడ్ల పని చేస్తూ వుంటాడు.

 

    శబరి వాళ్ళనుచూడటం సరదాగా వుంటుంది.

 

    అబ్బ! వాళ్ళదే జీవితం అంటే! ఎంత వెరైటీ! యెంత థ్రిల్!

 

    మరి తమ ఇంట్లో? అన్నీ రొటీన్ గా జరిగిపోవాల్సిందే! మమ్మీ అంటే డాడీకి భయం... కాదు.. భయపడుతున్నట్లు నటిస్తాడు, అడుగులకు మడుగులొత్తుతాడు. కాని మమ్మీ లేనప్పుడు వంటమనిషి సుబ్బమ్మతో సరసాలు ఆడతాడు. తను ఎన్నోసార్లు చూసింది. అంటే డాడీకి మమ్మీ అంటే ఇష్టం లేదన్నమాట! అంతా పైపై నటనే నన్నమాట! మమ్మీకంటే డాడీకి సుబ్బమ్మంటేనే ఎక్కువ ఇష్టం!

 

    మమ్మీ మాత్రం! అన్నీ కోతలే! అంతా ఆర్టిఫిషియల్! ఇంట్లో డాడీని హడల్ కొడుతూ వుంటుంది. పదిమంది మధ్య డాడీ అంటే తనకెంతో భయం అని చెబుతూ వుంటుంది. "బాబోయ్! మావారు చంపేస్తారు! ఆయనకు ఇష్టం వుండదు. నా చీరలు కూడా ఆయనే సెలెక్టు చెయ్యాలి. ఆయనకు ఇష్టమైన చీరలే కట్టుకోవాలి" ఎన్ని అబద్ధాలు చెబుతుందో! అలాంటప్పుడు తనకు నవ్వొస్తుంది. గట్టిగా నవ్వెయ్యాలనిపిస్తుంది. "అన్నీ అబద్ధాలే! మీరు నమ్మకండి!" అంటూ అరవాలనిపిస్తుంది. కానితను అలా చెయ్యదు, చెయ్యలేదు.

 

    "మమ్మీ ఒక్కతే అలా మాట్లాడుతుందనుకోను. ఆ మిసెస్ కైలాసం, మిసెస్ సిన్హా, మిసెస్ ప్రసాద్, అందరూ అలాగే చెబుతూ వుంటారు. అంటే వాళ్ళంతా మొగుళ్ళను ఇంటిలో హడలో గొడ్తారన్నమాట.

 

    మమ్మీ మొన్నరాత్రి క్లబ్బులో అబిడ్స్ లో కొన్న చీరకట్టుకొని "ఇది మా వారు బొంబాయి నుంచి తెచ్చారు!" అని అబద్ధం చెప్పింది.

 

    నాన్నబట్టలు కూడా మమ్మీ సెలెక్టు చెయ్యాల్సిందే!

 

    డిన్నర్స్ కు వెళ్ళినా, క్లబ్బుకి వెళ్ళినా, ఒకేరకమైన కబుర్లు, వారు మాట్లాడే ప్రతిమాటా అరిగిపోయిన రికార్డులోనివే అన్పిస్తాయి.

 

    బేరీ! బేరీ! అంటూ రుక్మిణి గదిలోకి వచ్చింది.

 

    ఎప్పుడూ అదేపిలుపు! కనీసం అప్పుడప్పుడు తిరగేసి పిలవొచ్చుగా?

 

    "ఏమిటే! ఇంకా అలాగే వున్నావేం? త్వరగా తయారవ్!" అన్నది రుక్మిణి, నిలువుటద్దం ముందు నిల్చుని తన ముస్తాబును అన్ని కోణాలనుంచీ పరీక్షించుకుంటూ.

 

    "నేను రెడీ మమ్మీ?"

 

    రుక్మిణి చివ్వున తల తిప్పి కూతుర్ని ఎగాదిగా చూసింది.

 

    "ఆ బట్టల్లో వస్తావా? ఇవ్వాళ మిసెస్ సక్సేనా వాళ్ళింటిలో డిన్నర్ కు వెళ్తున్నాం!"

 

    మిసెస్ సక్సేనా ఇంటిలో డిన్నరైనా, మిసెస్ కైలాసం ఇంటిలో డిన్నర్ అయినా, మనింటిలో డిన్నర్ అయినా ఆ వచ్చేవాళ్ళు వాళ్ళేగా? కనీసం ఒక కొత్తముఖం కూడా కన్పించదు."

 

    "నువ్వు వాగకుండా బట్టలు మార్చుకుంటున్నావా లేదా?" పైకి పోతున్న చీరను మడాలతో తొక్కుతూ అన్నది రుక్మిణి.

 

    "ఈ బట్టలకేం మమ్మీ! బాగానే వున్నయ్ గా?"

 

    "అయ్యో రాత! నీకు బొత్తిగా సర్దాలూ పాడూ ఏమీ లేవు. అందుకే అన్నారు పుణ్యంకొద్దీ పురుషుడూ..."

 

    "రాతకొద్దీ బిడ్డలు... అబ్బబ్బ! విసుక్కోవటానికి కూడా నీకు కొత్తమాటలు దొరకవా మమ్మీ?"

 

    "ఏమిటి బేరీ! మళ్ళీ మమ్మీతో పేచీకి దిగినట్టున్నావ్?" రంగారావు నెక్ టై సరిచేసుకుంటూ లోపలకు వచ్చాడు.

 

    "అసలు మీరే దాన్ని మరీ ముద్దుచేసి చెడగొడ్తున్నారు!"

 

    "స్టాపిట్ మమ్మీ! మళ్లీ ఆ అరిగిపోయిన రికార్డే పెట్టావ్!"

 

    "చాల్లే ఊరుకో! నీకు మరీ వాగుడు ఎక్కువయింది. పోయిన వారం తెచ్చాను చూడు ఆ చీర కట్టుకో..."

 

    "ఏ చీర? ప్రతివారం నువ్వుచీరలు తెస్తూనే వుంటావ్? అదేదో సరిగా చెప్పు!"

 

    "నా రాత..." తల బాదుకున్నది రుక్మిణి.

Next Page