Next Page 
ఆరోరుద్రుడు పేజి 1

                                 

                      

                                        ఆరో రుద్రుడు
    
                                             ----సూర్యదేవర రామ్ మోహనరావు
      
  
    
                                       

 

    అనంత దిగంతాలు భ్రాంతిల్లుతున్న వేళ...
    
    మృత్యువు విలయమై తాండవిస్తున్న వేళ...
    
    జీవన మరణాలను ఏకం చేసే పెనుతుఫాన్ ప్రజ్వరిల్లుతున్న వేళ...
    
    పుడమిని పోటెత్తించే ప్రకృతి బీభత్సం నెలకొన్న వేళ...
    
    పెను లోహవిహంగాలు ఒక్కసారిగా ఆకాశం మీదకు దూసుకు వచ్చినట్లుగా భయంకరమైన ఈదురు గాలులు...
    
    కుండపోతగా కురుస్తున్న వర్షం... చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ...
    
    ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు....
    
    మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, వుండుండి మెరుస్తున్న మెరుపుల భీభత్సం!
    
    నాయుడు పేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-
    
    చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ యేళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని వున్నాడు.
    
    స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు.
    
    వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది.
    
    "ఒరేయ్... ఆ గొడుగు అందుకో"
    
    అటెండర్ లేచి గొడుగు తీసి, స్టేషన్ మాస్టర్ చేతి కందించాడు.
    
    "ఇవాళ చార్మినార్ ఎక్స్ ప్రెస్ వస్తుందంటారా బాబూ-ఇప్పటికే రెండు గంటలు లేటు..." తనలో తను అనుకున్నట్టుగా అడిగాడు అటెండర్.
    
    "ఎందుకు రాదు? వెళ్ళి ఆ జెండా తీసుకురా..." అని చెప్పి ముందుకు నడిచాడాయన.
    
    "ఎక్స్ ప్రెస్ బళ్ళు ఇక్కడ ఎలాగూ ఆగవు. అసలే తుఫాను....గాలి చూసారా ఎలాగుందో? ఫ్లాట్ ఫారం మీద కెళ్ళొద్దు బాబూ" సలహా ఇచ్చాడు అటెండర్.
    
    "స్టేషనులో బండి ఆగకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎలాగరా? అసలే వర్షం ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా వుండాలి" అనుకుంటూ ముందుకు నడిచాడాయన.
    
    అదే సమయంలో స్టేషన్ మాస్టర్ రూంలో ఫోన్ మోగింది. అటెండర్ పరుగు, పరుగున వెళ్ళి రిసీవరు అందుకుని, మెసేజ్ రిసీవ్ చేసుకుని ఫోన్ పెట్టేసి-
    
    "మాస్టర్ బాబూ! చార్మినార్ ఎక్స్ ప్రెస్ నాయుడుపేటలో బయల్దేరిందట."
    
    అరుస్తూ చెప్పాడు అటెండర్ ఫ్లాట్ ఫారం మీదకొస్తూ.
    
    రివ్వు, రివ్వుమని శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటి తుంపర స్టేషన్ మాస్టర్ ముఖానికి విసురుగా తగిలింది.
    
    మసక మసక వెలుతురులో కనిపిస్తున్న పట్టాలవైపు చూస్తూ నిలుచున్నాడు స్టేషన్ మాస్టర్.
    
                                       *    *    *    *    *
    
    నాయుడుపేట స్టేషన్ ని వదిలిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఒక్కసారి వేగం అందుకుంది.
    
    చీకట్లో కొండచిలువలా పట్టాలమీద పరిగెడుతోంది ట్రైన్.
    
    ఆ ట్రైన్ లో-
    
    జనరల్ కంపార్టుమెంట్ లో కిక్కిరిసిన జనం మధ్య వళ్ళంతా పూర్తిగా తడిసిపోయి నంచునున్నాడు ముప్పై ఏళ్ల శ్రీధర్.
    
    నాయుడు పేటలో సరిగ్గా సమయానికి ఈ ట్రైన్ తను అందుకో లేకపోతే...?
    
    అందుకోలేకపోతే... తను వాళ్ళకి దొరికిపోయి వుండేవాడు....తనని వాళ్ళు భయంకరంగా చంపేసి వుండేవాళ్ళు.
    
    చీకట్లో, వరదహోరులో, గాలిలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
    
    శత్రువుల నుంచి తప్పించుకుని రావడం...
    
    అది కలో, నిజమో నమ్మలేని పరిస్థితిలో వున్నాడు శ్రీకర్.
    
    అతని శరీరం వణుకుతోంది. అందుక్కారణం చలి, వర్షం కాదు భయం.
    
    అతని గుండె కొట్టుకుంటున్న వేగం అతనికి తెలుస్తూనే వుంది.
    
    తనని తాను భయాన్నుంచి, ఆందోళన నుంచి, ఉద్వేగం నుంచి కంట్రోల్ చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు శ్రీకర్.
    
    కుడిజేబులోంచి సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె తీసాడు.
    
    రెండూ బాగా తడిసిపోయాయి. సిగరెట్ ను నోట్లో పెట్టుకొని అగ్గిపుల్లతో వెలిగించడానికి ప్రయత్నించాడు.
    
    అతని చేతులెందుకో వణుకుతున్నాయి.
    
    చుట్టూ చూశాడు కొంతమంది నిద్రలో, కొంతమంది నిద్ర మత్తులో వున్నారు.
    
    పట్టాలమీద ట్రైన్ చేస్తున్న చప్పుడు...అంతటి హోరుగాలిలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది.
    
    ట్రైను నెల్లూరులో ఆగుతుంది. వెంటనే ట్రైన్లోంచి తను బయట పడతాడు.
    
    ఏ టాక్సీనో పట్టుకుంటాడు. హైదరాబాద్ వెళ్ళిపోతాడు. తను సంపాదించిన ఇన్ఫర్మేషన్ ని కమీషనర్ కి అందజేస్తాడు.
    
    వెలిగించిన సిగరెట్ ఊపిరి నరాల్లోకి వెచ్చగా పరుగెడుతోంది.
    
    శ్రీకర్ మెదడులో ఆలోచనలు కూడా అంతకంటే వేగంగా పరుగెడుతున్నాయి.
    
    ఎక్కడో ఉరుము ఉరిమింది. మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో పట్టాల దిగువనున్న చెరువు అద్దంలా మెరిసింది.
    
                                        *    *    *    *    *
    
    స్టేషను ముందు కీచుమంటూ సడన్ బ్రేకుతో ఆగింది జీపు.
    
    స్టీరింగ్ ముందు కూర్చున్న శ్రీరాములు నాయుడు జీపు హెడ్ లైట్ల వెలుగులో స్టేషనువైపు చూసాడు.

Next Page