ఆరడుగుల భారీ ఆకారం తెల్లటి కుర్తా పైజామా...బురద నీటిమీద పడుతున్న అతని అడుగుల శబ్దం వింతగా వుంది.
శ్రీరాములు నాయుడు ఆ స్టేషన్ లోకి ఎందుకు వెళుతున్నాడో, అతని వ్యూహం ఏంటో అర్ధంకాక...
జీపు వెనక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి, ఆ పక్కనున్న మిగతా ముగ్గురు...జీపులోంచి దిగిపోయి-
నాయుడిని అనుసరించారు.
జీపు హెడ్ లైట్ల వెలుగులో, రైల్వేస్టేషన్ ముందు భాగం... సినిమా సెట్టింగ్ లా మెరుస్తోంది.
* * * * *
"ట్రైన్ మధ్యలో ఆగుతుందా...నెల్లూరులోనే ఆగుతుందా..." ప్రక్కనే తన వేపు చూస్తున్న ఓ నడివయసు వ్యక్తిని అడిగాడు శ్రీకర్.
అసలే వర్షం...పట్టాలు బాగుంటే నెల్లూరులో ఆగుతుంది. లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది...అసలు ....వర్షంలో ప్రయాణాలు చెయ్యకూడదు." స్టేట్ మెంట్ ఇచ్చి-
"సాయంత్రం రేడియోలో వార్తలు విన్నారా మీరు..." అడిగాడా వ్యక్తి.
"ఏం?"
"ఆకాశం పొడి, పొడిగా ఉంటుందని, మనకసలు వర్షాలు పడవని చెప్పారు. చెప్పిన పావుగంతకే ఉరుముల్తో వర్షం ప్రారంభమైంది...." నవ్వాడా వ్యక్తి.
మరో సమయంలో అయితే శ్రీకర్ కూడా ఆ నవ్వుతో శృతి కలిపేవాడు. ప్రస్తుతం శ్రీకర్ ఆ మూడ్ లో లేడు.
నెల్లూరు స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడతను...
వాళ్ళు తనను వెంటాడుతుంటారా? ఆ ఆలోచన వస్తూనే తన ప్రక్కనే ఉన్న చిన్న బ్రీఫ్ కేసు వైపు చూసాడు.
ఆ బ్రీఫ్ కేసులో ఉన్న ఇన్ ఫర్ మేషన్ ఎంత విలువైందో, ఆ ఇన్ ఫర్ మేషన్ ని సంపాదించడానికి తనెంత ప్రాణాలకు తెగించాడో, ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే అతనికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఒకప్రక్క.
ఎక్సయిటింగ్ గా వుంది మరోప్రక్క.
సిక్త్ సెన్స్ చేస్తున్న మృత్యు హెచ్చరిక-కళ్ళద్దాలు తీసి, తుడుచుకుంటూ విండోలోంచి బయటకు చూసాడు.
చిక్కటి మృత్యువు లాంటి చీకటి...
* * * * *
తనవైపు వస్తున్న భారీ ఆకారంవైపు ఆశ్చర్యంగా చూసాడు స్టేషన్ మాస్టర్.
ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు శ్రీరాములు నాయుడు.
"నువ్వేనా స్టేషన్ మాస్టర్ వి?"
ఆ ఏకవచన ప్రయోగానికి కోపం వచ్చింది స్టేషన్ మాస్టర్ కి.
"నేనే...." అయిష్టంగా జవాబిచ్చాడాయన.
"చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇక్కడ ఆగుతుందా..."
"ఆగదు..." టక్కున జవాబిచ్చాడు అతను.
నాలుగువైపులా చూసాడు శ్రీరాములునాయుడు. త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి గోల్డెన్ లైటర్ తో వెలిగించుకుంటూ-
"ఇక్కడ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగాలంటే..." కరుగ్గా, పొగరుగా ఉందా గొంతు.
"గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి" కోపంగా అన్నాడు స్టేషన్ మాస్టర్.
"అయితే... నేను.... పర్మిషన్ ఇస్తున్నాను....చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు చెయ్యి."
పరుగు, పరుగున వచ్చి శ్రీరాములునాయుడు వెనక నుంచున్న నలుగురు వ్యక్తులవైపు చూసాడు స్టేషన్ మాస్టర్.
"ఎవర్నువవు" మరింత కోపంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.
"చెప్తే జడుసుకుని జ్వరం తెచ్చుకుమ్తావ్.... చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు౮....ఓన్ లీ టెన్ మినిట్స్... మా పని మేం చేసుకుని వెళ్ళిపోతాం నీకెంత కావాలో చెప్పు...."
స్థంభం దగ్గర కూర్చున్న అటెండర్ దగ్గరకు రాబోయి శ్రీరాములు నాయుడ్ని చూసి దడుసుకుని వెనకడుగు వేసాడు.
"ఎవరు మీరు? మీకేం కావాలి?" మళ్ళీ అయోమయంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.
దూరంగా రైలు కూసిన కూత విన్పించింది.
"క్విక్- టైమ్ లేదు.... ట్రైనొచ్చేస్తోంది. లోపల రెడ్ లైటు, ఫ్లాగూ ఉంటాయ్ అందుకోండి" కంగారుగా అరిచాడు శ్రీరాములు నాయుడు.
వెంటనే ఇద్దరు స్టేషన్ మాస్టర్ రూమ్ లోకి పరుగెత్తారు.
"ఒరేయ్ వాడిచేతిలో గ్రీన్ లైట్ ని లాక్కోండిరా" అటెండర్ వైపు చూస్తూ అరిచాడు శ్రీరాములు నాయుడు.
శ్రీరాములు నాయుడు ఎవరో, ఆ గ్రూపులో ఎలాంటి నరరూప రాక్షసులుంటారో అటెండర్ కు బాగా తెలుసు.
అందుకే వాళ్ళు తన దగ్గరకు రాకమునుపే చేతిలోని లాంతరును క్రిందకు వదిలేశాడు అటెండర్.
పరుగు, పరుగున లోనికెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రెడ్ లైట్ తోనూ, రెడ్ ఫ్లాగ్ తోనూ బయటికొచ్చారు.
"వెళ్ళండి.....ముందుకెళ్ళండి....ట్రైన్ స్లో కాగానే.... ముందు జనరల్ కంపార్ట్ మెంట్స్ వెతకండి" అరుస్తూ స్టేషన్ మాస్టర్ చేతిలోని గ్రీన్ ఫ్లాగ్ ని లాగడానికి ప్రయత్నించాడు శ్రీరాములు నాయుడు.
స్టేషన్ మాస్టర్ ఆ పచ్చ జండాని గట్టిగా పట్టుకున్నాడు.
"ఆ రెడ్ లైట్ వెలిగించినంత మాత్రాన, రెడ్ ఫ్లాగ్ ఊపినంత మాత్రాన నువ్వు ట్రైన్ ని ఆపలేవ్" తను ముందుకెళుతూ అన్నాడు స్టేషన్ మాస్టర్.
"సార్... వచ్చేయండి సార్ వెళ్ళొద్దు- వాళ్ళతో గొడవ పడొద్దు" స్టేషన్ మాస్టర్ వైపు వస్తూ అరిచాడు అటెండర్.
"వాడికున్న బుద్ది నీకు లేదు- ట్రైయిన్ ని ఆపు" స్టేషన్ మాస్టర్ భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగుతూ అరిచాడు శ్రేరాములు నాయుడు.
ఆ విసురుకి నేలమీద పడిపోయాడు స్టేషన్ మాస్టర్.
"ఇప్పుడే పోలీసులకి కంప్లయింట్ చేస్తాను" కిందపడిన స్టేషన్ మాస్టర్ లేచి, తన రూమ్ వైపు పరిగెడుతూ అన్నాడు.
శ్రీరాములు నాయుడు ఒక్క అంగలో ముందుకురికి ఎడంచేత్తో స్టేషన్ మాస్టర్ జుత్తుని పట్టుకున్నాడు.
"ట్రైన్ ని ఆపకపోతే ఛస్తావ్... దిసీజ్ మై లాస్ట్ వార్నింగ్ నేనెవరో తెలుసా- పిచ్చి, పిచ్చి వేషాలెయ్యకు... కమాన్."
అతని మాటలకు స్టేషన్ మాస్టర్ ఏ మాత్రం చలించలేదు.
దూరంగా, పట్టాలమీద పరుచుకొన్న ట్రైన్ కాంతిలో పెనువేగంతో దూసుకొస్తోంది చార్మినార్ ఎక్స్ ప్రెస్.
ప్లాట్ ఫారం మొదట్లో కెళ్ళి నిలబడిన శ్రీరాములునాయుడు అనుచరులు కేకలేస్తూ రెడ్ లైట్ ఊపుతున్నారు.
అదే వర్షం ఏ మాత్రం తగ్గకుండా!
అదే గాలి ఏ మాత్రం తగ్గకుండా!
"ఈ ట్రైన్ ఆగదు నువ్వేం చేసుకుంటావో చేసుకో" ట్రైన్ వస్తున్న స్పీడ్ ని అంచనా వేస్తూ చెప్పాడు స్టేషన్ మాస్టర్ కోపంగా.
"ఆగదూ... ఆగదా?"
ఒకే ఒక క్షణం తను తీసుకునే నిర్ణయం గురించి ఆలోచించాడు.
అంతే-
తన చేతుల్లోంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్న స్టేషన్ మాస్టర్ని అమాంతంగా-