అమ్మకు.... తనను కన్నతల్లి ఎవరో తెలిసే వుండాలి.
అడిగితే చెబుతుందా? తను ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా మనసుకు శాంతి లభిస్తుందా? ఒక్కక్షణం ప్రశాంతంగా నిల్చోగలడా? ఆ రహస్యం తనను ఒకచోట నిలవనిస్తుందా?
తను ఎవరి పోలికో! తల్లి పోలికా? అందరూ తనను "దొరబాబు"లా వున్నాడు అంటారు.
దొరబాబు.... తను దొరబాబులా వుంటాడా? అంటే?
తలలో నాళాలు చిట్లటానికి సిద్ధంగా వున్నాయి. రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాడు.
తను ఏమైనా సరే తన తల్లి ఎవరో తెలుసుకోవాలి. తనను ఎందుకు పరిత్యజించిందో తెలుసుకోవాలి. ఆ మోసం చేసిన తన తండ్రి ఎవరో తెలుసుకోవాలి.
తన తల్లిని నిజంగా తను చూడగలిగితే? తను వెతుక్కుంటూ వెళ్ళి "అమ్మా" అని పిలిస్తే!
"ఎవరు నువ్వు?" అంటుంది.
"నేనమ్మా! నీ బిడ్డను! నువ్వు చీకట్లో కని చీకటికి అప్పగించిన బిడ్డను." అంటే తెల్లబోయి చూస్తుంది.
ఎదురుగా ఐదడుగుల ఏడున్నర అంగుళాల పొడవుగల యువకుడు నిల్చుని నేను నీ బిడ్డను అని చెప్తే వెంటనే అర్థం చేసుకోలేదు. అర్థం అయ్యాక భయపడిపోతుంది. పదిమందికి తెలిస్తే పరువుపోతుందని "ఎవరు నువ్వు. ముందు బయటికివెళ్ళు" అంటుంది. ఆ తర్వాత తిరిగి వచ్చాక భోరున ఏడుస్తుంది.
కాదు.... కాదు - తన్ను రెండుచేతులతో పొదివి పట్టుకుని ఆనంద పారవశ్యంతో "బాబూ" అంటుంది. ఆ తర్వాత ఏడుస్తుంది.
ఆ తర్వాత - ఆ తర్వాత -
ఒకవేళ తనను అక్కడే తన దగ్గిర వుండి పొమ్మంటే.
అసలు ఆమె ఎక్కడ వుందో? ఎలాంటి పరిస్థితిలో వుందో? బ్రతికి వుందో లేదో,
హే భగవాన్! ఏమిటీ నరకం! ఈ దేశంలో నాలాంటి వాళ్ళు ఎందరున్నారో! నాలాంటి బిడ్డలు ఎందుకు వుండాలి. స్త్రీకి ఒకనీతీ, పురుషుడికి మరొక నీతినీ బోధించే సమాజంలో నాలాంటి బిడ్డలు వుండక తప్పదా?
కుంతీదేవి - ఎన్నో వేల సంవత్సరాల క్రితం - బహు భర్తృత్వం కూడా ఆమోదించే కాలంలోనే అవివాహితగా బిడ్డను కన్నందుకు - ఏమి చేసింది. భారతం అంతా చదివాక మనసులో మిగిలిపోయేది కర్ణుడే! ఎందుచేత?
తన తల్లి కూడా కుంతీదేవిలాగే చేసింది. ఈనాటి సమాజంలో. ఈ అణుయుగంలో కూడా ఎందరో కుంతీదేవిలా తమ బిడ్డల్ని చీకట్లోకి విసిరేస్తున్నారు. ఎందుకు? చంద్రమండలానికి ప్రయాణిస్తున్న మానవుడు కూడా స్త్రీ గురించి కొన్ని శతాబ్దాలక్రితం ఆలోచించినట్టే ఆలోచిస్తున్నాడా?
మనం ప్రగతి పథంలో పయనిస్తున్నామా? ఈ ప్రగతి ఎందులో? మేధస్సు పెరిగినా మనసులకు పట్టిన బూజు. అలాగే వుండిపోయింది. దాన్ని వదిలించాలంటే ఏం చెయ్యాలి.
మాతృత్వం సహించడం స్త్రీ సహజ ధర్మం. అటువంటి మాతృత్వాన్ని కళంకంగా ఎందుకు భావించాలి. స్త్రీని మాతృదేవత అన్నాం? అది మానవుడు దేవతను ముందుగా రూపకల్పన చేసింది స్త్రీ మూర్తిగానేనట.
శరత్ బుర్రంతా ఆలోచనలతో చెదల పుట్టలా వుంది. ఆలోచనల మధ్య తెల్లవారుతుండగా నిద్రలోకి జారిపోయాడు.
3
"బాబూ! లేరా! చాలా పొద్దెక్కింది."
సుశీలమ్మ శరత్ పడుకొని వున్న మంచం మీద తలవైపు కూర్చుని తట్టిలేపింది.
శరత్ బరువుగా కనురెప్పల్ని ఎత్తి చూశాడు. ఓ క్షణం కప్పు కేసి చూసి, సుశీలమ్మ వైపు తల తిప్పాడు.
"ఏరా అంత బద్ధకంగా వున్నావ్? ఒంట్లో బాగాలేదా?" సుశీలమ్మ కంఠంలో ఎంత అణుచుకున్నా వణుకు కన్పించింది.
శరత్ సుశీలమ్మ ముఖంలోకి లోతుగా చూశాడు.
ఆమె కళ్ళు వాచి వున్నాయి.
ఆ కళ్ళలో ఏదో రహస్యాన్ని వెలికి లాగాలన్నట్టు వున్నాయి శరత్ చూపులు.
సుశీలమ్మ కళ్ళల్లో ఏదో భయం తాలూకు నీలినీడలు మాత్రం కన్పించాయి.
"లేరా లేచి ముఖం కడుక్కో కాఫీ పట్టుకొస్తాను. ఎనిమిదిన్నర అయింది. ఇంత ఆలస్యంగా ఎప్పుడూ లేవవు. ఒంట్లో ఎలా వుందిరా!" అంటూ సుశీలమ్మ శరత్ నుదురు మీద చెయ్యి వేసింది.
"అయ్యో! వేడిగా వుంది. జ్వరం వచ్చిందేమో చూసుకో?" అంటూ లేచి వెళ్ళి ధర్మామీటరు పట్టుకొని వచ్చింది.
"అబ్బే జ్వరం ఏమీలేదు. బాగానే వున్నాను. కొంచెం బద్ధకంగా వుంది అంతే!" ధర్మామీటరు అందుకోకుండా లేచి కూర్చున్నాడు.
శరత్ ప్రవర్తనలో ఏదో మార్పు వున్నట్టు అనిపించి పరిశీలనగా చూసింది సుశీలమ్మ.
శరత్ లేచి బాత్ రూంలోకి వెళ్ళి పళ్ళు తోముకుని వచ్చేసరికి తల్లి కాఫీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని కూర్చుని వుంది.
టేబుల్ ముందు కూర్చుని మౌనంగా కాఫీ తాగుతున్న శరత్ ను భయం భయంగా చూస్తూ కూర్చుని వుంది సుశీలమ్మ.
"ఏరా! అలా వున్నావేం?"
శరత్ చివ్వున తలఎత్తి రామనాథం ముఖంలోకి చూశాడు. అతని ముఖం కూడా వడిలిపోయివుంది. అతని కంఠంలో ఆర్ద్రత వుంది. ఆ పలకరింపులో ఆప్యాయత వుంది.