పాపం మచ్చల డాక్టర్ రోషంతో, ఆవేదనతో, గిరగిర తిరిగే కన్నీళ్ళను నిగ్రహించుకుంటూ పిడికిళ్ళు బిగించి "ఎవరు? ఎవరన్నారామాట?"
"ఆ మధ్య ఎవరో అన్నారు" అని ఐరావతమ్మ అక్కడినుంచి మరోచోటికి కదిలింది.
మచ్చల డాక్టర్ ముఖం చూస్తే చాలా జాలి కలిగింది జ్యోత్స్నకి.
"ఏకాంబరంగారూ: మీ మందు నాకు తెచ్చిపెట్టండి - తగ్గుతుందేమో, చూస్తాను" అంది.
మచ్చల డాక్టర్ వెంటనే లేచి శ్రీరామచంద్రుడి కోసం వారధి లంఘించే హనుమంతుణ్ణి మించిపోయిన భక్తి శ్రద్ధలతో గాలిలో ఎగురుతున్నట్లుగా తన వాటాలోకి వెళ్ళి మందు తెచ్చాడు.
ఆ మందు తన హేండ్ బేగ్ లో వేసుకుంది జ్యోత్స్న....
"తీసుకోండి:" అన్నాడు మచ్చల డాక్టర్ ప్రాధేయపడుతున్నట్లుగా.
"ఇప్పుడు కాదు - రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటాను."
అదే మహా భాగ్యమన్నట్లు మరి బలవంతం చేయకుండా ఊరుకున్నాడు మచ్చల డాక్టర్. అందరూ తనను మచ్చల డాక్టర్ అని పిలుస్తున్నా, నోరారా తనను "ఏకాంబరంగారూ:" అని పిలిచే జ్యోత్స్న అతని కంటికి దేవతలాగే కనిపిస్తుంది.
వెంకట్రావు అందరినీ గమనిస్తున్నాడు. అందరితోనూ మాట్లాడుతున్నాడు కానీ, అతని చూపులు జ్యోత్స్నను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
అది గమనించిన జ్యోత్స్న కొద్దిగా కలవరపడింది.
ఉన్నట్లుండి జ్యోత్స్నతో "మిమ్మల్నెక్కడో చూశాను నేను" అన్నాడు.
జ్యోత్స్న ముఖం లిప్తకాలం పాలిపోయినా, అంతలో తేరుకుంది....
అందమైన తన కనురెప్పలెత్తి మెరుపుల్లాంటి చూపులతో వెంకట్రావుని చూసి "అదేం విచిత్రమో, నన్ను చూసిన చాలామంది అదే మాట అంటారు" అంది.
ఎప్పుడైతే వెంకట్రావు జ్యోత్స్నతో "మిమ్మల్నెక్కడో చూశాను:" అన్నాడో, అప్పుడే అక్కడున్న అందరూ కుతూహలంతో జ్యోత్స్నని చూడసాగారు.
అందరి చూపులూ తనమీద ఉన్నాయని తెలిసినా జ్యోత్స్న తొణకలేదు. నిబ్బరంగా చిరునవ్వు నవ్వుతూ కూర్చుంది.
"అలా కాదు - ఎప్పుడు చూశానో, ఎక్కడ చూశానో గుర్తులేదు. కాని చూశాను - మిమ్మల్ని చూసిన క్షణం నుంచీ అదే అనుమానంగా ఉంది కాని, ఇప్పుడు నిశ్చయంగా అనిపిస్తోంది - మీదే ఊరు?"
"కైకలూరు."
"కైకలూరా? అక్కడికి నేనెప్పుడూ వెళ్ళలేదు."
"నేనూ వెళ్ళలేదు. అసలా ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. ఎప్పుడో, ఎవరి నోటనో ఆ పేరు విన్నాను - అంతే:" మనసులో అనుకుంది జ్యోత్స్న.
"మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?"
"మా నాన్నగారు లాయరు:"
హుఁ - లాయరు: ఆయనది ఏం ఉద్యోగమో తనకు తెలియదు. నాకు తెలిసినంతవరకూ తండ్రి అంటే భయంకర రాక్షసుడు - ఒక పీడకల ఎప్పుడు తండ్రిని తలుచుకోవాలన్నా ఆ మూర్తి చేతిలో బ్రాంది చేతితోనో, లేక తల్లి జుట్టు పట్టుకుని చావబాదుతోనో తప్ప గుర్తుకురాడు. అంచేత తండ్రిని తలచుకోవాలంటేనే భయంగా ఉంటుంది.
అప్పుడు తనకు అయిదారేళ్ళుంటాయి. వచ్చీ రాని జ్ఞానం ఏదో ఒక చిన్న పడిపోతున్న పెంకుటింట్లో ఉన్నట్లు గుర్తు - ఎక్కువగా తల్లీ తనూ మాత్రమే ఉండేవారు.
ఉండి ఉండి ఒకరోజున తల్లి సంతోషంగా కనిపించేది.... తనను దగ్గిరకు తీసుకుని "మీ నాన్నగారు వస్తున్నారు" అని చెప్పేది. తనకదేమిటో అర్థమయ్యేది కాదు. కాని, తల్లి సంతోషంగా ఉండేది కనుక తనకూ సంతోషంగానే ఉండేది. అలాంటప్పుడు ఎప్పుడూ పూలు పెట్టుకోని తల్లి పూలు పెట్టుకునేది. మంచి చీర కట్టుకునేది.
కానీ, ఆ సంతోషం ఎక్కువకాలం నిలిచేది కాదు. ఆ తండ్రి అనబడే వ్యక్తి తనను సరిగా పలకరించేవాడు కాదు - ఎర్రబడిన కళ్ళతో మైకంలో ఉండే ఆ వ్యక్తి దగ్గిరకి వెళ్ళాలన్నా తనకు భయంగా ఉండేది.
ఆ తరువాత ఏం జరిగేదో, ఏమో: హృదయ విదారకంగా తల్లి ఏడుపు వినిపించేది. ఆ తండ్రి తల్లి జుట్టు పట్టుకుని వంగదీసి చావ బాదుతుండేవాడు. భయంతో బిక్క చచ్చిపోయి దూరాన నిలబడి బావురుమనేది తను.
తండ్రి అలా చావబాది తరువాత ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. ఆ తరువాత తల్లీ తనూ ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది.
ఒకసారి తల్లి తనను దగ్గిరకు తీసుకుని మరీ గుండెలు పగిలేలా ఏడవసాగింది. తనే తల్లి కళ్ళు తుడిచి ఓదారుస్తూ "ఎందుకేడుస్తున్నావ్?" అని అడిగింది.
"మీ నాన్న ఎవరో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంక రాడు...." అంది.
తను సంతోషంతో చప్పట్లు కొడుతూ "భలే: భలే: నాన్న ఇంక రాడు" అంది సంబరంగా.
తల్లి తన ముఖంలోకి తెల్లబోతూ చూసి తనను దగ్గిరకు తీసుకుని "పిచ్చి పిల్లా:" అని మరింత ఏడ్చింది.