యశోద వెనకే నడిచింది పార్వతి.
"సామానులేవి?"
"కాస్త టీ ఇవ్వు?"
టీ అందించి మళ్ళీ అంది "సామానులన్నీ ఏవి?"
"షాప్ లోనే వదిలేశాను. మళ్ళీ వస్తానన్నాను. మర్చిపోయి వచ్చేశాను!"
"ఏమిటీ?"
ఇవాళ నాకు ఏక్సిడెంట్ అయింది!"
"ఆ! దెబ్బలు తగిలాయా! హాస్పిటల్ కి వెళదామా!"
"కనపడటం లేదూ? పడిపోయింది నేను కాదు!"
"మరి పోలీసు కేసయిందా!"
"కాలేదు!"
"హమ్మయ్య!"
ఫక్కున నవ్వింది యశోద.
"లేకపోతే ఏమిటమ్మా! పోలీసు కేసు లేదనగానే నీ దిగులంతా తీరిపోయింది. పడింది ఎవరని గానీ దెబ్బలు తగిలాయా అనిగానీ అడిగావా? నువ్వూ! నీ కూతురు బాగుంటే చాలు నీకు!"
పార్వతికి కొంచెం కోపం వచ్చింది "పోవే నువ్వూ! నీ సైకాలజీ! ఇంటా బయటా ఒకటే బడి సైకాలజీ! ముందు ముందు నీకు పెళ్లయి పిల్లలు పుడితే అప్పుడు తెలిసొస్తుంది!"
పార్వతి నాలుక కరుచుకుంది... ఏందుకంటే ఈ ధోరణిలో ఎప్పుడు మాట్లాడినా యశోద చాలా చికాకుపడుతుంది.
యశోద కనుబొమ్మలు ముడిపడ్డాయి "అమ్మా! ఆడపిల్ల అనగానే పెళ్ళే జీవితపరమార్ధం అయినట్లు ఎందుకు మాట్లాడతారు? పెళ్ళీ పిల్లలేకాదు... ఇంకా జీవితం చాలా ఉంది!"
పార్వతమ్మ ముఖం ముడుచుకుంది.
"నువ్వోబిడ్డ తల్లివయ్యాక. అప్పుడొచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఇలాగే కొడతావు లెక్చర్లు!" సణుక్కుంటూ వంట పని ప్రారంభించింది. వెనకాలే వచ్చింది యశోద.
"అమ్మా! కత్తి పీట ఇలా ఇవ్వు... కూరలు తరిగేస్తాను."
"నీకెందుకే! చదువుకో."
"నేనింట్లో ఉంటే. నువ్వొక్కదానివి పని చేసుకుంటూ ఉంటే. చూస్తూ కూర్చున్నానా? ఇలా ఇవ్వు"
పార్వతి కత్తి పీట ఇవ్వలేదు. కూతురు దగ్గరగా వచ్చి తలమీద ముద్దు పెట్టుకుంది.
* * *
"హాయ్ యశూ!"
అరుణ గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూసింది యశోద. కోపంతో మండిపోయింది మనస్సు! జానీ కారులో కూర్చుని విష్ చేస్తోంది... కోపం అణుచుకుని ధైర్యంగా కారు సమీపించింది. నిప్పులు కురిపిస్తూ అరుణని చూసి... "ఏం కావాలి?" అంది.
మెత్తని పిడుగుల్లా ఉన్నాయి ఆ మాటలు. కళవెళ పడిపోయింది అరుణ.... జానీ మాత్రం నవ్వుతూ ఉన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని!
"ఏం.... ఏం.... ఏంలేదు ఊరికే పలకరిద్దామని!"
"నాతో మాట్లాడబోయేముందు సమయం సందర్భం చూసుకోమని నీకెన్నిసార్లు చెప్పాలి?"
అరుణ నిస్సహాయంగా జానీవైపు చూసింది. అతను కల్పించుకున్నాడు. పొగరుగా నవ్వుతూ అన్నాడు "సమయం సందర్భం చక్కగా సూటయ్యాయని నేనే చెప్పాను యశూ!"
"షటప్! ఇంకోసారి నన్ను 'యశూ!' అని పిలిస్తే పళ్ళురాలతాయి."
"నిజంగా! నాకు భయమేస్తోంది. పోనీ! 'బేబీ!' అనిపిలవనా? లవ్ మి బేబీ! బేబీ లవ్ మీ.... అని పాట ఉంది. నువ్వు వినే ఉంటావు!"
యశోద ఇంతకూ అంతకూ బెదిరే మనిషి కాదు.... ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా నిలబడగలదు.
బరితెగించినట్లున్న జానీ రౌడీ తనానికి మనసులో కొద్దిగా జంకింది. ఇలాంటి వాళ్లతో మాటకి మాట సమాధానం చెప్పే బదులు అసలు మాట్లాడకుండా ఊరుకోవడమే మంచిదని... మనసు చెప్తోంది.
కానీ పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఆ సమయంలో సమాధానం చెప్పకుండా ఊరుకుంటే. ఆ మౌనానికి మరో అర్థం వచ్చే ప్రమాదముంది.
"ఊహూ! ఆ పాట వినలేదు! నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నదీ.... 'ఆ పాట విన్నాను.'
సినిమాలో విలన్ లాగా నవ్వాడు జానీ "ఫరవాలేదు! సాహిత్యంలో వచ్చిన కొత్తమార్పుల కారణంగా. వల్లకాటిదిబ్బలే విహారస్థలాలవుతున్నాయి. బై ది బై! నువ్వెందుకొచ్చావిక్కడికి? నేను వస్తున్నట్లు ఎవరన్నా చెప్పారా?"
"చెప్పారు! ఇక్కడో అడివి మనిషి ఉన్నాడనీ వాడు నీ ఫ్రెండ్ అనీ చెప్పారు"
"ఎక్స్ లెంట్! అడివి మనుష్యుల్ని కూడా మాలిమి చేసుకోగలనని నీకు తెలిసిందన్న మాట!"
యశోదకి మనసులో ఉక్రోషం పెరిగిపోతోంది... ఇంటికెవరో చుట్టాలొచ్చారు. వాళ్ల పిల్లలు జూ చూస్తామన్నారు. పార్వతి అతిధి మర్యాదల్లో మునిగిపోయి యశోదకి చెప్పింది. పిల్లల్ని 'జూ' కి తీసుకెళ్లమని... అంచేత. పిల్లలతో ఆటోలో వచ్చింది "నెహ్రూ జూలాజికల్ పార్క్ కి!"
కొంతదూరంలో వివేక్ కనిపించాడు. ఇటే చూస్తున్నాడు.
ప్రాణం లేచొచ్చింది యశోదకి!
"మిస్టర్ వివేక్!" పిలిచింది.
ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చటుక్కున అక్కడికి వచ్చాడు.
"చూడండి! వీడెవడో నన్ను అల్లరి పెడుతున్నాడు. కాస్త బుద్ధి చెపుతారా?" అమాయకంగా చూస్తూ ముద్దరాలిలా అంది.
వివేక్ వెంటనే ఫ్రంట్ డోర్ ని ఒక తాపు తన్నాడు. అది ధడాలున తెరుచుకుని డ్రైవింగ్ సీట్ లో ఉన్న జానీ ముందుకి బోర్లా పడ్డాడు. వెంటనే అతడి మెడమీద కాళ్ళమీదా చేతులపైనా కత్తి దెబ్బల్లాంటివి వివేక్ అరచేతి దెబ్బలు పడ్డాయి.
రక్తం బయటకు రాకుండా చర్మమంతా నల్లగా కమిలిపోయిముద్దలా అయిపోయాడు జానీ! ఆ ముద్దనిసునాయాసంగా డ్రైవింగ్ సీట్ లోకి విసిరేశాడు. ఫ్రంట్ డోర్ సరిగ్గా పడలేదు. పాడయింది.
డ్రైవింగ్ సీట్లో కూచోలేని జానీ వెనక్కి వెళ్ళి అరుణ ఒళ్ళో పడ్డాడు. పాలిపోయిన మొహంతో కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తోంది అరుణ.