Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 4


    ఆమెనసలు లెక్క చెయ్యలేదు వివేక్! యశోదని చూసి "బుద్ధొచ్చింది లెండి. ఇంక మీ జోలికి రాడు" అన్నాడు.
    "థేంక్స్! మా ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళ పిల్లలు జూ చూస్తామన్నారు. ఇంటికొచ్చిన వాళ్లని మర్యాద చెయ్యాలి కదా!. మరి అంచేత చచ్చినట్లు వాళ్లతో వచ్చాను.. నాకసలు ఇలా తిరగటం ఇష్టం ఉండదు. నా టి.వి.యస్. లేకుండా ఎక్కడికైనారావటం అసలు ఇష్టం ఉండదు. ఏమిటో దేశం! పట్టపగలు ఇలాంటి రౌడీ వెధవలు తిరుగుతున్నారు. సమయానికి మీరు రాబట్టి కానీ! లేకపోతే..."
    "మీరేవాడిని చావబాది ఉండేవారు!" తాపీగా వాక్యం పూర్తి చేశాడు వివేక్! తెల్లబోయి చూసి ఫక్కున నవ్వేసింది.    
    సాధారణంగా క్లుప్తంగా మాట్లాడే యశోద అతడి కంపెనీ మరి కాసేపు నిలుపుకోవాలని ఏదేదో మాట్లాడేసింది. ఆ విషయం అతడు అర్థం చేసుకున్నాడు... తలదించుకుని నవ్వుకుంది.
    "వస్తాను!" వెళ్ళబోయాడు.
    "ఉండండి!" అంది. కంగారుగా ఆగాడు.
    "దేనికి?" అడిగాడు.
    "మీరు తరుచుగా వస్తుంటారా. ఇక్కడికి?"
    "రాను! ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. అప్పుడే నచ్చలేదు. అడివి జంతువుల్ని అడివిలోనే చూడాలి!"
    "నాకూ అలాగే అనిపిస్తుంది. మరి ఇవాళ ఎందుకొచ్చారిక్కడికి? మీ ఇంటికీ ఎవరైనా చిన్నపిల్లలు, చుట్టాలొచ్చారా?"

    "రాలేదు. నేను మలక్ పేట్ లో పనుండి బయలుదేరాను". ఆగాడు.... కుతూహలంగా చూసింది. కొన్ని నిమిషాలు అతడేమీ మాట్లాడలేదు. చివరికి నేరస్థుడు కోర్టులో నిజం ఒప్పుకున్నట్లు అన్నాడు.
    "దార్లో. ఆటోలో మీరు కనిపించారు. ఆటో వెనకాతలే వచ్చేశాను."
    తెల్లబోయింది యశోద. నవలల్లో అనేక ప్రేమ సంభాషణలు చదివింది. సినిమాల్లో చూసింది. ఈ రకమైన ప్రేమ ప్రకటన ఎక్కడా చూడలేదు!
    "వెళ్తున్నాను!" కదలబోయాడు.
    "ఉండండి!"
    ఆగి ఏమిటన్నట్లు చూశాడు.
    "మాఇంటికొకసారి రండి. అడ్రస్....!"
    "నాకు తెలుసు!"
    "ఎలా తెలుసు?"
    "మీరు టీ.వి.యస్ మీద వెళ్తుంటే దూరంగా మోటార్ సైకిల్ మీద ఫాలో అయ్యాను చాలాసార్లు."
    "ఓగాడ్! ఎంతో అమాయకంగా కనిపించే మీరు....?"
    "అమాయకంగా కాదు. సాత్వికంగా! ఏదైనా అన్యాయం జరిగే వరకూ నిజంగా సాత్వికుడినే! ఉదాహరణకు మిమ్మల్ని దూరం నుంచి ఫాలో అయ్యానే గానీ ఏమీ అల్లరి చెయ్యలేదు కదా!"

    నవ్వింది. అతడిన్ని మాటలు మాట్లాడటం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా "మోనో సిలటల్స్" లో తప్ప మాట్లాడడు.
    "మాఇంటికి వస్తున్నారుగా!" అడిగింది.
    "ఏమిటి? అరేంజస్?"
    "ఏమీలేదు. ఊరికే! టీ తీసుకోవడానికి!"
    "నాకు ఆడపిల్లలతో కబుర్లు చెప్పటమూ వాళ్ల ఇళ్ళకి వెళ్ళి టీ తీసుకోవడమూ ఇష్టం ఉండదు" ప్రవరాఖ్యుడిలా అన్నాడు. తెల్లబోయింది.  

    "తప్పేముందీ?"
    "ఏమీలేదు. కానీ నాకెందుకో ఊపిరాడనట్లుగా ఉంటూంది. ఇలా మీతో నిజం చెప్పేస్తుంటే నాకు హాయిగా ఉంది. మీరు ఏమైనా అనుకోవచ్చు! ఐనా చెప్పాలని అనిపిస్తోంది."
    "థాంక్స్! ఎందుకలా అనిపిస్తోందో ఆలోచించి చెపుతారా!" అంది.
    "ఆలోచించాను. నేను.... నాకు.... మీ స్నేహంకావాలనుకుంటున్నాను" తడబడుతూ అన్నాడు. ముఖం బాగా ఎర్రబడింది.
    "మాఇంటికి రండి! స్థిమితంగా మాట్లాడుకుందాం!"
    "ఊహూ! మీరే మా ఇంటికి రండి!"
    "మా అమ్మగారు నాన్నగారు చాలామంచివారు. ఆధునిక భావాలున్న వాళ్ళు. ఏమీ అనుకోరు!"
    "మాది చాలా సాంప్రదాయ కుటుంబం. మా నాన్నగారు ఇప్పటికీ సాలగ్రామ మూర్తులకి నైవేద్యం పెట్టిగానీ ఫలహారం కూడా చెయ్యరు. మా అమ్మ ఇంకా పాత కాలపు మనిషి. నాకోసం మైల వంట. మా నాన్నగారికోసం మడి వంట ఇవన్నీ చేసుకుంటూ పగలు పన్నెండింటి వరకూ మడిబట్టతోనే ఉంటుంది. నన్ను కూడా ముట్టుకోనివ్వదు."

    భయంగా చూసింది యశోద.
    "భయపడుతున్నారా? అందుకే మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను. మా ఇంట్లో రెండు మూడు గంటలు గడిపాక ఆ తరువాత మాట్లాడుకుందాం."

    అతడి భావం అర్ధమయింది యశోదకి. గుండె ఝల్లుమంది. చాలా లోతైన మనిషి. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు.  
    "మీ ఇల్లెక్కడ?"
    "ఆనంద్ నగర్ లో! ప్లాట్ నెం - 83. దేవిశంకర్ గారి ఇల్లంటే ఎవరైనా చెపుతారు" అన్నాడు వివేక్.
    "దేవిశంకర్ గారంటే రైస్ మిల్ ఓనర్!"
    "ప్రతీపండుగకీ వర్కర్స్ అందరికీభోజనాలు పెడతారని చెప్పుకుంటారు!"  

    "అవును! ఆయన ఆస్థిపరుడని చెప్పుకుంటారు."
    "అవును!"
    యశోద మాట్లాడలేదు.
    "వెళ్ళమంటారా!" అని చిన్నబోయిన ముఖంతో అడిగాడు మీ ఇంటికి వొస్తాను. రేపు సాయంత్రం కాలేజీ వదిలాక!"     

 Previous Page Next Page