Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 4


    ఆ రచనలు వేరు. అవి మానవ మాత్రులు - నాలాంటి వారే రచించారు. కాని ఇది వేదం. అపౌరుషేయం. ఋషిప్రోక్తం. మంత్రమయం మహిమాన్వితం. ప్రాచీనం పరమ పవిత్రం. ఇది భగీరథ ప్రయత్నం. నాకు దృఢ సంకల్పం ఉంది. ఆశయం ఉంది. ఆవేశం ఉంది. సాగాను.

    సంస్కృతం సనాతన, పురాతన భాష. సంస్కృతం సంపూర్ణ భాష. సంస్కృతం సంపన్న భాష. సంస్కృతం అనగానే ఒక చెదలు పట్టిన భాష అనే అభిప్రాయం ఆంగ్లేయులు కల్పించారు. పాలకులతో 'ఆధునికులం' అనిపించుకోవాలనే ఆత్రంలో మనవాళ్ళు దానికి బూజు పట్టిన భాష అని ప్రచారం చేశారు. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకంలో ప్రమాణం చేయడానికి సహితం సంస్కృత గ్రంథం పనికిరాదు! సంస్కృతం భారతభాష, దాన్ని హేళన చేస్తున్నాం. అది మనకు మనం హేళన చేసికోవడం అని గ్రహించలేకున్నాం.

    సంస్కృతం అనగానే వేదాంతం అని ప్రచారం జరిగింది. వేదాంతం అంటే వైరాగ్యం అనే అర్థం ప్రసరించింది. ఇందులో ఆవ గింజంత వాస్తవం లేదు. నాకు తెలిసినంత వరకు సంస్కృత సాహిత్యం జీవితాన్ని సున్నంపన్నం  చేసింది. నరునికి జీవించడం నేర్పింది. పలాయనం నేర్పలేదు. అత్యవసరం అయినప్పుడు తప్ప వైరాగ్యం బోధించలేదు. మనకు సైన్సు పేర ఆంగ్లేయులు కొన్ని మూఢ నమ్మకాలు కలిగించారు. వాటినుంచి బయటపడాలి. అప్పుడు సంస్కృతపు విశ్వరూపదర్శనం' అవుతుంది.

    సంస్కృతం భాష ఒకటే. దానికి విభిన్న రూపాలున్నాయి. నరులంతా ఒకటే వారివి విభిన్న రూపాలు. విభిన్న వృత్తులు. విభిన్న రుచులూ. అలాగే సంస్కృతం కావ్య సంస్కృతం కావ్య సంస్కృతం వ్యాకరణ, వైద్య, జ్యోతిష, వాస్తు సంస్కృతం కావ్యసంస్కృతం కాదు. నాకు సాహిత్య సంస్కృతం తెలుసు. వేదాన్ని అర్థం చేసుకోవడానికి అదిమాత్రం చాలదు. వేద సంస్కృతం అర్థం చేసుకోవడానికి ప్రత్యేక కృషి చేయాల్సి వచ్చింది.

    అన్ని భాషల్లోనూ ఒక్కొక్క పదానికి ఒకటికి మించిన అర్థాలుంటాయి. అర్థం అంటే తెలియపరచడం. అర్థం అంటే కారణం. అర్థం అంటే ధనం. అర్థం అంటే ప్రయోజనం.

    వేదమంత్రాలు అనాది కాలపువి. ఆ పదాలకు అనేక అర్థాలుంటాయి. ఏ  పదానికైనా సమయం సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. ఈ సమయ సందర్భపు అర్థం చెప్పేవాడే వ్యాఖ్యాత, భాష్యకారుడు. ఒక అమూల్య పదార్ధం మన ముందే ఉంటుంది. మనందాన్ని తెలుసు కోలేం. దాని విలువనూ, ప్రయోజనాన్ని తెలియజేస్తాడు వ్యాఖ్యాత, భాష్యకారుడు. అతని వెలుగు లేకుంటే పదాలన్నీ తిమిరగోళాలే! ఇది అన్ని కాలాల సాహిత్యాలకూ వర్తిస్తుంది. మల్లినాథుని వ్యాఖ్య  లేనిది కాళిదాసు సౌందర్యం ఆస్వాదించలేం. ఇది ఆధునిక సాహిత్యానికీ వర్తిస్తుంది.

    వేదం ఒక ఆకాశం. ఒక సముద్రం. వాటిలోని మంత్రాలను నేను భాష్యకారుని వ్యాఖ్యాన నేత్రం నుంచి దర్శించాలి. ఒక్క ఋగ్వేదంలోనే 10171 సూక్తాలు, 10580 మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 4, 32,000 అక్షరాలున్నాయి.

    నేను ప్రతి మంత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. ప్రతి మంత్రం తన సంపూర్ణ జ్యోతితో దర్శనం ఇవ్వాలి. నాకే అర్థం కానిది నేనేం చెప్పగలను? నాకు అర్థం అయిందాన్ని చదువరులకు అర్థం అయ్యే తెలుగులో అనువదించాలి. అది సొగసుగా ఉండాలి. అందపు అనుభూతి కలగాలి. ఇది యత్నం. ఫలితం భగవదధీనం!

    వేదాన్ని అర్థం చేసికావడానికీ, తెలుగువారికి అర్థం చేయించడానికీ, నేనొక తపస్సు చేసాను. కనీసపు నిద్రా లేదు. రోజుకు పది పన్నెండు గంటలు శ్రమించాను. వేరే ధ్యాస లేదు. వేద మంత్రాలే! ఇరవై నాలుగ్గంటలు అదే మననం. నిద్రలో సహితం మంత్రాల పలవరింపులే! కమల బెదిరిపోయింది వెర్రివాణ్ణి అవుతానని! అవును వెర్రియే! వెర్రివాడు కాంది. ఏదీ సాధించలేడు! నాకు ఫలాపేక్ష ఉండదు. 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అని బోధించాడు పరమాత్మ!

    వేదం ముందు పెట్టుకొని కూర్చుంటాను. భయం అవుతుంది. మహారణ్యం కనిపిస్తుంది. చెట్లు, చీకట్లు, బాట కనిపించదు. సింహాలు, పులులూ భయపెడ్తాయి. భయంకర సర్పాలు అడుగుపెట్టనివ్వవు. ఇహ రచన సాగదు అనిపిస్తుంది.

    అప్పుడు కళ్ళు మూసుకుంటాను. నామ మాత్రపు ధ్యానం. వెలుగు కిరణం ప్రత్యక్షం అవుతుంది. కళ్ళు తెరుస్తాను. మహారణ్యం ఉద్యానం అవుతుంది. రాచబాటలు పరచుకుంటాయి. పూలపొదలు, వృక్షచ్చాయలు, లతాగుల్మాదులు - కొలనులు, తామరలు- నెమళ్ళు, పావురాలు పక్షులు ఒక సుందర దృశ్యం ప్రత్యక్షం అవుతుంది.

    రచన అనాయాసంగా సాగుతుంది. ఏదో మహత్తర శక్తి నాతో వ్రాయిస్తున్నట్లు అనిపిస్తుంది! దిక్కులు చూస్తాను. ఆ దృశ్యం! ఏమీ ఉండదు! వెర్రివాణ్ణి శక్తికి రూపం ఏమిటి? దానికోసం నేను చూడటం ఏమిటి? అవును వెర్రివాణ్ణే! మైఁ పాగల్ హుఁ. I am mad. వ్రాస్తున్నంత సేపు ఏదో తెలియని చల్లని, మెల్లని వెలుగు నన్ను నడిపిస్తుంది. ఆ వెలుగు వేలుపట్టుకుని నేను నడుస్తాను. ఆ వెలుగు నా తల్లి - నన్ను నడిపిస్తుంది!

        "అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
        ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో
        నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
        యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
                    పోతన భాగవతం

    ఎన్నని చెప్పను? ఎన్నో చిత్ర, విచిత్ర, విశేష, విశిష్ట సంఘటనలు!
   
    ఒక్కొక్కసారి వాక్యం ప్రారంభిస్తాను. సాగదు/ ఆగుతుంది. అయోమయం. లిప్తలో కలం వెంట వెలుగుపాయ సాగుతుంది! అనువాదం పూర్తవుతుంది. అది నాకే ముద్దు వచ్చేట్లుంటుంది.

    శ్రీమదాంధ్ర మహాభాగవతంలో 'సిరికించెప్పడు' పోతన రచనకాదట. స్వయంగా శ్రీరామచంద్రమూర్తి దాన్ని పూరించాట్ట! అలాంటివి నాకు ప్రత్యక్ష అనుభవాలు. భగవంతుడు ప్రత్యక్షం అయినాడని అబద్ధం చెప్పను. కాని స్వామియే వ్రాయించిన అద్భుత, ఆశ్చర్యకర అనుభూతులు అనేకం. వాటికి భాష, అక్షరం అపర్యాప్తములు.

    పరమాత్మ అంతటి కృపా కటాక్షం కురిపించాడు. అందుకు అంత మహత్కార్యం. అంత కొలది వ్యవధిలో పూర్తయింది. కాకున్నా అనితర సాధ్యం! అసాధ్యం!

    1. నేను డెబ్భయి యేండ్ల వృద్ధుణ్ణి.
    2. మధుమేహ వ్యాధి గ్రస్తుణ్ణి.   
    3. మరీ అంత ఆరోగ్యవంతుణ్ణి కాను.
    4. నా దేహం దుర్బలం.

    అలాంటివాణ్ణి మూడేళ్ళలో నాలుగు వేదాలు అనువదించాను. ఎన్ని వేల పేజీలు అధ్యయనం చేశానో? అయిదువేల పేజీలు వ్రాశాను!

    1. ఈ మహత్కార్యంలో ఏ ఒక్కరూ నాకు సాయపడలేదు. సలహా ఇవ్వలేదు.
    2. కనీసం అడిగిన పుస్తకం అందించినవారు లేరు.
    3. ఒక్కడు ప్రోత్సహించలేదు - అడ్డంకులు కల్పించారు.
    4. ఒక్క అక్షరం మరొకడు వ్రాయలేదు.
    5. అంతటి గ్రంథం నేనే స్వయంగా వ్రాశాను.   
    6. నాకు వ్రాయసగాళ్ళు లేరు. వారిని పెట్టుకొనే ఆర్ధిక స్తోమత లేదు నాకు.

    ఇంత పని చేయించాడు మా నాయన - మా స్వామి!

    తొలిప్రతియే తప్ప శుద్ధ ప్రతి వ్రాయలేదు. వ్రాసింది వెనుదిరిగి చూడలేదు. వ్రాసిందాంట్లో హంసపాదులు లేవు. సవరణలు లేవు. వింతకదా! విచిత్రం కదా!! ఆశ్చర్యం కదా!!

    పిల్లలమర్రి పినవీరభద్రుడు "వాణినారాణి" అన్నాడు. నేను  అంతటి సాహసం చేయలేదు  కాని భక్త శిఖామణి పోతనామాత్యుని వలె
   
    పలికెడిది భాగవతమట
    పలికించు విభుండు రామభద్రుండట నే
    బలికిన భవహరమగునట
    పలికెద వేరొండుగాథ బలుకగనేలా?
    అని నమస్కరిస్తున్నాను.


    వేదం అనగా నేమి?

    'వేదం' ఏకవచనం. వేదం పవిత్ర విద్య అని అథర్వ వేదం, శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం చెపుతున్నాయి. అందువల్ల 'వేదం' 'పవిత్ర విద్య' అవుతున్నది.

    'వేదాః' వేదములు. ఇది బహువచనం.

    "చత్వారో ఇమే వేదాః ఋగ్వేదో, యజుర్వేదో, సామవేదో, బ్రహ్మవేద ఇతి" అని గోపథ పూర్వం. వేదాలు నాలుగు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, బ్రహ్మవేదములు. బ్రహ్మవేదానికి అథర్వణ వేదం అని పేరు.

    "ఏవమిమే సర్వే వేదా నిర్మితాః తే ససంకల్పాః సరహస్యాః, సోపనిషత్కాః, సేతిహాసాః సాన్వ్యఖ్యాః సపురాణాః సస్వరాః సంస్కారాః. సనిరుక్తాః సానుశాసనాః సామమార్జునాః, సవాకో వాక్యాః" అని గోపథ పూర్వం.

    వేదాలన్న - సంకల్పం, రహస్యం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వ్యాఖ్యానాలు, పురాణాలు, స్వరాలు, సంస్కారాలు, నిరుక్తాలు, అనుశాసనాలు, అనుమర్జునాలు, వాక్కు, వాక్యం - సహితంగా నిర్మించబడినాయి.

    "ప్రాజాపత్యోవేదాః" అన్నాడు. వేదాలు ప్రజాపతి సంబంధాలు.

    ప్రజాం సృష్ట్యా పాలయస్యేతి. తస్మాత్ప్రజాపతి రభవత్" అని గోపథ పూర్వం. ప్రజలను సృష్టించి పోషించుచున్నాడు. కావున ప్రజాపతి అయినాడు.

    ప్రజాపతి ఎవరు?

    1. ప్రజాపతిరగ్నిః 2. ప్రజాపతిర్వైమనః 3. ప్రజాపతిర్వై వాచస్పతిః 4. సంవత్సరోవై ప్రజాపతిః 5. యజ్ఞః ప్రజాపతిః 6. ప్రజాపతిర్వైసవితా 7. ప్రాణాహి ప్రజాపతిః 8. అన్నం వై ప్రజాపతిః 9. సతద్వైప్రజాపతిః 10. ప్రజాపతిర్వైభూతాః 11. ప్రజాపతిరబన్ధుః 12. ప్రజాపతిర్వైహిరణ్యగర్భః 13. ప్రజాపతిర్వైచంద్రమా 14. ప్రజాపతిర్వై  మహాన్దేవాః 15. ప్రజాపతిర్వై మనుః 16. ప్రజాపతిర్వై విశ్వ కర్మా 17. ప్రజాపతిర్వైసుపర్ణో గరుత్మాన్ 18. ప్రజాపతిర్వై మూర్ధా 19. ప్రజాపతిర్వా ఓదనః 20. ప్రజాపతిః సర్వః 22. ప్రజాపత్యోవా అశ్వః 23. ప్రజాపతిః సదస్యః 24. ప్రజాపతిః ఉద్గాతా 25. ప్రజాపతిరుద్గీతః 26. అథర్వావై ప్రజాపతిః 27. సత్యం హి ప్రజాపతిః 28. ఘృతంచ మధుచ ప్రజాపతి రాసీత్ 29. ఆత్మాహ్యయం ప్రజాపతిః 30. పురుషో హి ప్రజాపతిః 31. పితరః ప్రజాపతిః 32. ప్రజాపతిర్ధాతా 33. ప్రజాపతిర్వై జమదగ్నిః 34. ప్రజాపతిర్వై  ద్రోణకలశః 35. ఇమేలోకాః ప్రజాపతిః 36. ప్రజాపతిః సర్వే దేవతాః 37. ప్రజాపతిర్వా అమృతః 38. ప్రజాపతిర్హి స్వరాజ్యమ్ 39. అపరిమితో వా ప్రజాపతిః.

    ప్రజాపతి సృష్టిస్తున్నాడు. పోషిస్తున్నాడు. ప్రజాపతి ఏ ఒక్కడూ కాడు. పైన చెప్పిన 39 సృష్టి, స్థితులకు కారణం అవుతున్నాయి. ఇది నిత్య సత్యం. దీనికి తిరుగులేదు.

    సమస్తం ప్రజాపతి. సమస్తం సృష్టిస్థితి కారణం. అందుకే ప్రజాపతి అపరిమితుడు అగుచున్నాడు. ప్రకృతికి పరమాత్మకు పరిమితి లేదు. వారు అపరిమితులు.

    ప్రజాపతి సమస్తం. వేదం సమస్తం. అనంతం అపరిమితం.

    మానవునికి తెలియపరచింది వేదం. తెలియటమే జ్ఞానం. జ్ఞానం సాపేక్షం. ఒకసారి తెలిసిందాన్ని తిరిగి చెప్పడం జ్ఞానం కాదు. పునరుక్తి. పునరుక్తులు జీవితంలో తప్పవు. అంతమాత్రం చేత పునరుక్తి జ్ఞానం కాబోదు.

    ఒకనాడు నరునికి అన్నం తెలియదు. అన్నాన్ని వేదం తెలియపరిచింది. అప్పుడు అది జ్ఞానం అవుతుంది. అన్నం తెలిసిం తరువాత చెప్పడం జ్ఞానం కాదు.

    అలాగే వస్త్రం, కుటుంబం, బంధుత్వం. గ్రామం, రాజ్యం. వీటిని అన్నింటినీ వేదమే తెలిపింది. తెలియక ముందు అది జ్ఞానం అవుతుంది. వేదం అవుతుంది.

    సత్యం. సత్యస్వరూపుడగు పరమాత్మ మానవునికి ఏనాటికీ అందరు. కావున భగవంతుని  గురించిందంతా జ్ఞానం అవుతుంది. సత్యస్వరూపాన్ని దర్శించడానికి నిత్యం జరిగే అన్వేషణ జ్ఞానం అవుతుంది. పరమాత్మ అనంతం. కావున జ్ఞానం అనంతం. అంతంగల నరుడు అనంత బ్రహ్మను దర్శించజాలడు. అందుకే అన్వేషణ - అన్వేషణ - అన్వేషణ. అన్వేషణయే జ్ఞానం! అదే వేదం!!!

    మానవునికి లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వేదమే ప్రవచించింది.

    పరమాత్ముడు పరిపూర్ణంగా ఎవరికీ అవగతం కాడు, దర్శనం ఇవ్వడు. నిత్యాన్వేషణ వలన భగవానుడు అంశామాత్రం గోచరిస్తాడు. ఆవిధంగా అంశామాత్ర లబ్ధులు వారి వారి  దశలను బట్టి సాధువులు, యతులు, తపస్వులు, మహాత్ములు, అవతారాలు అవుతున్నారు. వీరే మునులు, ఋషులు, మహర్షులు అవుతున్నారు.

    అజ్ఞానులు వారినే పరమాత్మగా భావిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. అలాంటివారు అంశామాత్ర పరమాత్మను ఆరాధిస్తున్నారు!

    మహర్షులు మహాత్ములు నిస్వార్థలు. నిష్కల్మషులు. తేజోమూర్తులు. వారు వేదమంత్రాలను దర్శించారు. మానవ జీవితాన్ని సమున్నతం చేయడానికి కృషి చేశారు. వారు అనేక సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరచారు. వారుదివ్వెల వలె తమను కాల్చుకున్నారు. లోకాలకు నిత్యకాంతులను ప్రసాదించారు. వారు సూర్యచంద్రుల వంటివారు. పర్వతముల వంటివారు. నదుల వంటి వారు. వృక్షముల వంటి వారు!.

 Previous Page Next Page