"సిస్టర్! ఈ అమ్మాయిని ఎలా మారుస్తారో, మామూలు పిల్లల్లాగ ఎలా తయారుచేస్తారో నాకు తెలీదు. అంతా మీమీద ఒదిలేస్తున్నాను. ఈనాటి నుంచి మీరే గురువూ, మీరే తల్లి కూడాను."
కర్చీఫ్ తో చెమటపట్టిన నుదుటినీ బుగ్గల్నీ అతి నాజూకుగా, పెదవులమీద లిప్ స్టిక్ చెరిగిపోకుండా జాగ్రత్తపడుతూ తుడుచుకుంది రాగిణి.
"అలాగే మేడమ్! డోంట్ వర్రీ. ఇల్లొదిలిపెట్టి వచ్చేస్తున్నామన్న బెంగతో మొదట్లో అందరు పిల్లలూ ఇట్లాగే వుంటారు. రాను రాను అలవాటు పడిపోయి ఆ దిగులు పోయాక మామూలుగా అయిపోతారు. మీరు వెళ్ళిరండి" అంది సిస్టర్ ఫెర్నాండిస్, నవ్వుతూ.
"థాంక్స్ మీరు హామీ ఇస్తున్నారు గనుక నాకే దిగులూ లేదిప్పుడు. తృప్తిగా వెళ్ళగలను." లేచి నుంచుంది రాగిణి.
"వెళ్ళి టాటా చెప్పమ్మా" శిల్పకేసి నవ్వుతూ చూసి అంది సిస్టర్ ఫెర్నాండిస్.
కళ్ళల్లో నీళ్ళు చిమ్ముతూ వుంటే, యాంత్రికంగా చెయ్యూపింది శిల్ప.
రాగిణి కళ్ళల్లోనూ నీటి తెరలే! శిల్పని గట్టిగా కౌగలించుకుని ముద్దెట్టుకుంది. గుండెలో ఏదో బరువుగా వున్నట్టనిపించింది. ఆ కౌగిలింతకి గుండెలోని బరువు కరిగి కన్నీళ్ళై ప్రవహించాయి. దుఃఖం ఎంత ఆపుకున్నా ఆగక, కట్టలు తెగిన ఏరులా ప్రవహించి, కళ్ళ కాటుకా, చెంపలమీది పౌడరూ అంతా తుడిచేసింది. తల్లి ఆలింగనంలో ఏదో తెలీని తన్మయత్వంతో తేలిపోతోంది శిల్ప. అంత గట్టిగా ఆమె కౌగలించుకుని ముద్దెట్టుకుంటే ఆ అమ్మాయి కెంతో ఇష్టం. ఆ చిన్నారి కళ్ళల్లో కాంతిరేఖలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. అలా రెండు నిమిషాలు గడిచిపోయాయి. శిల్పని కిందికి దింపి "వెళ్లొస్తాను సిస్టర్" అంటూ మరి వెనక్కి తిరిగి చూడకుండా, కళ్లు తుడుచుకుంటూ వెళ్ళి టాక్సీలో కూర్చుంది రాగిణి. బొమ్మలా నుంచుని, తల్లి వెళ్ళినవైపే చూస్తూ, టాక్సీ కనుమరుగయ్యేదాకా చెయ్యూపింది శిల్ప.
"పద లోపలికి పోదాం" శిల్ప చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది సిస్టర్ ఫెర్నాండిస్.
శిల్పని కుర్చీలో కూర్చోబెట్టి, బెల్ కొట్టింది. బంట్రోతు రహీం లోపలికొచ్చాడు డోరు తెరుచుకుని.
"ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రెండో తరగతి 'ఎ' సెక్షన్ లో సిస్టర్ లిల్లీ క్లాసులో కూర్చోపెట్టు. క్లాసయిపోయాక హాస్టల్ వార్డన్ కమలాదేవి దగ్గరికి తీసుకెళ్ళు" అంది.
"ఎస్ మేడమ్" అంటూ శిల్ప దగ్గరికెళ్ళాడు రహీం.
"శిల్పా వెళ్ళమ్మా. క్లాసుకెళ్ళి టీచరు చెప్పినవి నేర్చుకో" అంది శిల్పకేసి చూసి నవ్వుతూ సిస్టర్ ఫెర్నాండిస్.
శిల్ప నవ్వలేదు! తలూపలేదు! టక్కున లేచి నుంచుని రహీం వెనకాలే నడిచింది.
శిల్ప ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బొద్దుగా వున్న శరీరం, పచ్చని శరీరచ్ఛాయ, పెద్ద పెద్ద కళ్లూ, ఉంగరాల జుట్టూ, ఎత్తుగా పొడవుగా వున్న ముక్కూ, ముద్దొచ్చే శిల్ప ప్రతి వారినీ ఆకర్షిస్తుంది. ఎంత పనిలో వున్నా ప్రతి టీచరు ఒక్కసారైనా ఆ అమ్మాయి బుగ్గలు నొక్కనిదే వెళ్ళరు.
అయినా ఆ అమ్మాయి మొహంలో చిరునవ్వుకాని, నోరువిప్పి మాట్లాడ్డం కాని ఇంతవరకూ ఎవ్వరూ చూడలేదు. హాస్టల్లో వున్న ప్రతీ పిల్లా ఇప్పుడు, అంటే రెండు మూడు నెలలు దాటేసరికి ఇంటి బెంగపోయి, తోటిపిల్లలతో స్నేహాన్ని చేసుకుని ఆడుతూ పాడుతూ వున్నారు. కాని శిల్పలోమాత్రం ఏ మార్పూ లేదు. ఎవ్వరితోటీ మాట్లాడదు. ఏ ఆట పాట ఎందులోనూ చేరదు. టీచరు బలవంత పెడితే తప్ప క్లాసులో ఏదైనా ప్రశ్నలడిగితే కూడా సరిగ్గా చెప్పదు నోరువిప్పి. కానీ టెస్టు పెడితే రిటన్ టెస్టులో అన్నింటిలోనూ ఫస్టు మార్కులు ఆ అమ్మాయివే. టీచర్లందరికీ అదే ఆశ్చర్యం. అంత తెలివైన అమ్మాయి ఎందుకలా ఒంటరిగా వుంటుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సమయం చిక్కినప్పుడల్లా, శిల్ప దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది సిస్టర్ ఫెర్నాండిస్. ఆ అమ్మాయికి ఏ విషయంమీద ఆసక్తో తెలుసుకోవడానికి ప్రయత్నించేది. రకరకాల కథలు చెప్పేది. ఏవేవో జోక్స్ చెప్పేది నవ్వించడానికి. అన్నీ శ్రద్ధగా వినేది కాని శిల్ప ఒక్క మాట మాట్లాడేది కాదు. "ఏదైనా కావాలా" అంటే కావాలనో వద్దనో తల అడ్డంగా తిప్పేది తప్ప నోరువిప్పి సమాధానం చెప్పేదికాదు.
సిస్టర్ ఫెర్నాండిస్ కి యాభై ఏళ్ళు దాటాయి. టీచరుగా దాదాపు మూడు దశాబ్దాలు దగ్గరపడుతున్నాయి. మంచి టీచరుగా పేరుపొంది ఇప్పుడు హెడ్ మిస్ట్రిస్ గా వుంది. తన టీచరు జీవితంలో ఎందరో పిల్లల్ని, ఎన్నో రకాల వాళ్ళని చూసింది. మొండివాళ్లూ, భయస్థులూ, రకరకాలు! కానీ శిల్ప ఆ కోవకి చెందిన పిల్లకాదు. మొహంలో తెలివితేటలు కొట్టొచ్చినట్టు కనిపిస్తయ్! కానీ ఎందుకనో శిల్ప నలుగురితో కలిసి మెలసి ఉండలేకపోతోంది. సిస్టర్ ఫెర్నాండిస్ లో పట్టుదల రోజురోజుకీ ఎక్కువవుతోంది. పిల్లల మనస్తత్వానికి సంబంధించిన పుస్తకాలన్నీ తిరగేస్తోంది. ఆమె జీవితమే ఈ స్కూలుకీ ఈ పిల్లల భవిష్యత్తుకీ అంకితం చేసిన మహామనిషి సిస్టర్ ఫెర్నాండిస్. పచ్చటి శరీరచ్ఛాయ, కాటిక పెట్టుకున్నట్టున్న మెరిసే కళ్ళూ, పెదవుల నంటిపెట్టుకున్నట్టుగా ఉండే చిరునవ్వూ ఎంతో హుందాగా అనిపిస్తాయి! వయస్సుతో వొచ్చిన ముడతలు మొహానికి ఒక గంభీరతని కలిగిస్తున్నాయి. నల్లటి ఫ్రేముతో కట్టిన కళ్ళద్దాలు, తెల్లటి పొడవాటి గౌనుకి కొత్త అందాన్నిస్తున్నాయి. ఆమెని చూసిన ప్రతివారికీ, 'వయస్సులో వున్నప్పుడు ఈమె అందం ఇంకా ఎంత ఉండేదో' అనిపించక మానదు! మనిషి ఎంత అందగత్తో, మనసు అంతకన్నా మంచిదని నిరూపించింది సిస్టర్ ఫెర్నాండిస్.
భూమి ఉపరితలం నుంచి వేల అడుగుల ఎత్తుపైన, కొండమీదుగా ఏటవాలుగా వున్న రోడ్లపైనుంచి వెళ్ళే ఊటీ ప్రయాణం, ప్రతీవాళ్ళకీ కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. కొత్తగా పెళ్ళయిన జంటలు హనీమూన్ కి ఇక్కడికే వస్తారు. కొండలపైన కాఫీ తోటలు కొండల కిరువైపులా దట్టంగా ఎదిగిన 'యూకలిప్టస్ ఆయిల్' చెట్లూ, రకరకాల పూగుత్తులతో వున్న చెట్లూ, ఆమని పచ్చగా మెరిసిపోతూ వుంటుంది. దానికి తోడు వాతావరణం, వేసవి కాలంలో చల్లగానూ, చలికాలంలో మరీ చల్లగానూ వుండి, వేసవికాలం భరించలేని వాళ్ళందరికీ ఊటీ నిలయమైపోతుంది. చిన్న ఊరైనా, ఊరిమధ్యన వున్న తటాకంలో నౌకాయానం, ప్రకృతి మాత ఒడిలో ఉయ్యాల లూగుతున్నట్టనిపిస్తుంది. గుఱ్ఱపు సవారీలు అక్కడి ప్రత్యేకత. పసిపిల్లల దగ్గరనుంచి, ముసలివాళ్ళదాకా, వయోభేదం మరచి, ఆ గుఱ్రాలమీద స్వారీ చేస్తారు. ఆడా మగా అందరూ! ఆ నిశ్శబ్ద వాతావరణంలో గుఱ్ఱం డెక్కలు చప్పుడు చేసుకుంటూ పరుగెడుతుంటే, స్వర్గానికి మెట్లు కడుతున్నట్టు, ఆకాశాన్నందుకుంటున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఆదివారాలు ఆ స్థలం మరీ నిండుగా వుంటుంది పడవ ప్రయాణాలతోనూ, గుఱ్ఱపు సవారీలతోనూ.
పిల్లల్నందరినీ తీసుకుని, మిగతా ఉపాధ్యాయులతో సహా అందరూ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు, ఆ రోజు ఆదివారం, బడికి సెలవు అవడంవల్ల.
ఎక్కడికి వెళ్ళినా సిస్టర్ ఫెర్నాండిస్ ఒక కంటితో శిల్పని కనిపెడుతూనే వుంటుంది. 'శిల్పకి ఏడేళ్ళు దాటబోతున్నాయి. రెండో తరగతి పూర్తి కాబోతోంది. మరీ పసిపిల్లకాదు. ఈ ప్రవర్తన, సహజ స్వభావంకాదు. కారణం తెలుసుకోవాలి' ఇదే సిస్టర్ ఫెర్నాండిస్ లోని ఆలోచన. అందుకే ఆమె దృష్టంతా ఎప్పుడూ శిల్పమీదే!
అందరూ గుఱ్ఱపు స్వారీకి హుషారుగా వెళ్ళుతున్నారు. సిస్టర్ లిల్లీ శిల్పని వెళ్ళమంది. శిల్ప ఒద్దన్నట్టుగా తలూపింది. రెండు మూడు మార్లు చెప్పింది. ఫలితం లేకపోయింది. బలవంతం చెయ్యడం వాళ్ళపద్ధతికాదు గాబట్టి, ఊరుకుంది ఆమె.
దూరం నుంచి సిస్టర్ ఫెర్నాండిస్ ఇదంతా చూస్తూనే వుంది. శిల్ప ఆ చెరువుకేసి ఆసక్తిగా చూడ్డం గమనించింది ఆమె. శిల్పని ఆకర్షించిన ఆ దృశ్యం ఏమైవుంటుందా అని అటుకేసి చూసింది. ఒక పడవలో భార్యాభర్తలిరువురూ, వాళ్ళ రెండేళ్ళపాపని పడవలో కూర్చోబెట్టడానికి, నానా తంటాలు పడుతున్నారు. ఆ పాప వీళ్ళని చూసి భయపడుతోంది. ఆ తల్లి ఆ బిడ్డని గుండెలకి హత్తుకుని నీళ్ళు కనబడకుండా జాగ్రత్త పడుతోంది. తదేకంగా వాళ్ళని చూస్తున్న శిల్ప దగ్గరకొచ్చి, 'పడవలో వెళదామా నేనూ వస్తాను' అంది. శిల్ప తలూపింది సరేనన్నట్టు. వెంటనే సిస్టర్ ఫెర్నాండిస్ మరో పడవ తెప్పించి ముందున్న ఆ పడవ వెనకాలే వెళ్ళమని చెప్పింది పడవ వాడితో. పడవ నడుస్తున్న కొద్దీ సిస్టర్ ఫెర్నాండిస్ శిల్పనే చూస్తోంది. అవతలి పడవలో ఆ తల్లి ఆ పాపని హత్తుకుని ముద్దు పెట్టుకున్నప్పుడల్లా, శిల్ప మొహంలో సంతోషం, తృప్తి గమనించింది.