కొద్ది సమయానికి కళ్ళుతెరిచి, భర్తచేతిని వదలకుండానే "పదండి వెడదాం!" అని భర్తచేతి ఆసరాతో లేచింది. ఇద్దరూ ఒకరిచేతుల్లో ఒకరు చేతులు వేసి ఉంచే మెట్లు ఎక్కటం మొదలుపెట్టారు. ఇద్దరి నడక వేగం, అడుగులు పడేతీరు ఒకేవిధంగా ఉన్నాయి- ఎన్నాళ్ళో అభ్యాసం చేసిన తర్వాత సైన్యం కవాతులు లాగా, సామూహిక నృత్యంలాగా హృదయ స్పందనలో సమశ్రుతి ఉంటే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అద్దంలో ప్రతిబింబాలవుతారు. ఇద్దరి గుండెలూ 'హరి' 'హరి' అనే కొట్టుకుంటున్నాయి. నరాలు 'మురారీ' అంటున్నాయి. నాలుకలు 'గోవిందా' అని ధ్వనిస్తున్నాయి. కన్నులముందు శంఖచక్రధారి రూపమే ఉంది.
వారు మెట్లని ఎక్కారా?... గాలిలో తేలి ఎగిరి వెళ్ళారా? అసలు వెళ్ళారా? కదిలారా...ఏమో!
ఎవరో తోసినట్లై పుష్కరిణిలో పడినప్పుడు స్పృహలో కొచ్చారు. తమ వస్త్రాలమూట మెట్టుమీద ఉంది. తామిద్దరూ పుష్కరిణిలో. చేతిలో చెయ్యివేసి కొంగులుముడి వేసుకుని చేతులు వదలక "పుండరీకాక్ష! పుండరీకాక్ష!!" అనుకుంటూ స్వామి పుష్కరిణి పుణ్యజలాలలో మునకలు వేశారు. ఒక వైష్ణవస్వామి వచ్చి సంకల్పం చెప్పి అఘమర్షణ స్నానం చేయించాడు.
పుష్కరిణి ఒడ్డునే ఉన్న వరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి సన్నిధికి చేరారు. మంగమాంబ ఈ లోకంలో లేదు. గాలిలో తేలిపోతోంది. కృష్ణయార్యుడి పరిస్థితి కూడా అట్లాగే ఉంది.
ద్వారం దాటుకుని, రెండవ ద్వారం కూడాదాటి, ధ్వజస్థంభం దగ్గర ఆగి, మూడుసార్లు గర్భగుడికి ప్రదక్షిణం చేసి బంగారుద్వారం సమీపించారు.
ఆ దివ్యమంగళ విగ్రహం చూస్తున్న వారందరికీ తాము వైకుంఠంలో ఉన్నామన్న అనుభూతి. రెండు చేతులూ సహస్రారానికి పైన చేర్చి "గోవిందా" అంటూ గర్భాలయంలో అడుగుపెట్టారు మంగమాంబ కృష్ణయార్యులు. ఆ కల్యాణ స్వరూపుని చూస్తూ పులకరించి, పరవశించి పోయారు. మూలవిరాట్టు ఎదుటికి రాగానే మంగమాంబ, ఎవరో ఆదేశించినట్టు రెండుచేతులతోనూ తన కొంగుపట్టింది అర్థిస్తున్నట్టుగా. తన చేతనున్న లీలాకమలాన్ని స్వామి తనకొంగులో వేసినట్టుగా అనిపించింది. ఆ ప్రసాదాన్ని అపురూపంగా కళ్ళకద్దుకుని, గుండెలకు హత్తుకుంది.
గర్భగుడిలో నుండి బయటికివచ్చి, అరుగుమీద కూర్చుని ప్రసాదం నోట్లో వేసుకుంటూ అడిగాడు కృష్ణయార్యుడు,
"స్వామిని ఏం కోరుకున్నావ్?" అని
"అయ్యో! నామతి మండా! మర్చిపోయాను. ఏమీ కోరుకోలేదు" నొచ్చుకుంది మంగమాంబ.
"మీరైనా కోరుకున్నారా?" తిరిగి తనే అడిగింది.
... ... ... ... ...
"పోనీ మళ్ళీ దర్శనం చేసుకుందాం! రండి!! అప్పుడు అడుగుతాను. ఈసారి మర్చిపోను. గుర్తించుకుంటాను"- తన ముఖంలోకే తదేకంగా చూస్తున్న భర్తతో అంది.
"... ... ... ... ..."
"అయినా, మనం ఏం కోరుకుని వచ్చామో స్వామికి తెలియదా"
"ఇంట్లో బయల్దేరినప్పుడే చెప్పాం. అలిపిరిలో మొదటిమెట్టు ఎక్కుతూ కొబ్బరికాయ కొట్టినప్పుడు చెప్పాం. ఆయనకి తెలుసులే" అన్నాడు కృష్ణయార్యుడు.
"అవునవును" ఒప్పుకుంది మంగమాంబ. అది తనమనసులో మాటేగా మరి!
"అదిసరే! ఆ కొంగులో! ఏదో భద్రంగా దాచిపెట్టావు. ఏమిటది?" అడిగాడు కృష్ణయార్యుడు. మంగమాంబ వళ్ళు జలదరించింది. ఒక్కక్షణం కళ్ళుమూసుకుని ఉద్వేగాన్ని అణుచుకుంది. ఆపై, నెమ్మదిగా, వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ చెప్పింది.
"ఏడు కొండలవాడు నన్నుకొంగు పట్టమని తనచేతిలోని పద్మాన్ని అందులో వేశాడు. మనం దర్శనానికి ఎదురుగా నిలబడినప్పుడు. అందుకే దానిని అపురూపంగా దాచిపెట్టాలని అలా జాగ్రత్తగా కొంగులో దాచి ఉంచాను. ఆ విషయం గర్భాలయంలోనుండి వెలుపలికి రాగానే మర్చిపోయాను. మీరడిగితేకాని గుర్తురాలేదు. ఇదుగో చూడండి!"
అంటూ మూటలాగా మడిచిపెట్టిన కొంగుముడి విప్పి చూపించింది. అందులో ఏముంది?... అంతా శూన్యం!
"అయ్యో! నేనెంత భ్రమ పడ్డాను. స్వామి సన్నిధిలోనే మాయకి లోబడ్డాను. ద్వారం దగ్గర ప్రసాదం కూడా తీసుకోలేదే, స్వామి స్వయంగా ఇచ్చిన ప్రసాదం ఎడమ చేత్తో పట్టుకోవాల్సి ఉంటుందని..."
"మంగా! ఎందుకు బాధపడతావ్! అంతా దేవేచ్చ ననుసరించి జరుగుతుంది. నువ్వు నిజంగా ధన్యురాలివి కనుకనే నీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చారు స్వామి. వారు నీ కిచ్చిన పద్మమే మనకు పుట్టబోయే బిడ్డ. ఎదురుగా నిలబడినప్పుడు అడగకపోయినా, స్వామికి తెలుసుకదా మన కోరిక."
"నన్ను ఓదార్చటానికి చెపుతున్నారు."
"పిచ్చిదానా! ఓదార్పు కాదు. నిన్ను చూసి అసూయ. భగవంతుడి ముందు నిలిచాక మనసంతా హృదయమంతా నిండాల్సింది భగవత్తత్త్వం, దాని పరమార్థమైన ఆనందం. అప్పుడు కూడ కోరికలుంటే, పాపం! దేవుడికి చోటుండదు గదా! యోగులు కూడా అందరూ ఆ స్థితికి ఎదగలేకపోయారు. నువ్వు అడగలేదు కనుకనే దైవం ఇచ్చాడు."
"అంతేనంటారా?" అయోమయంగా, అమాయకంగా అడిగింది మంగమాంబ.
"మన కోరిక తీరినట్టే!" గట్టిగా చెప్పాడు కృష్ణయార్యుడు.
కృష్ణయార్యుడు మంగమాంబలది అనుకూల దాంపత్యమే. కాని ఫలించలేదు. మంగమ్మ కడుపు పండలేదు. సంతానం లేకపోతే తమకి సద్గతులుండవు, వంశం అంతరిస్తుంది. అన్నిటినీ మించి బంధువులు ఇరుగుపొరుగువారి మాటలు పడటం కష్టం. అందుకని తమకులదైవం, కోరిన కోరికలు తీర్చే భక్తవత్సలుడు అయిన వేంకటేశ్వరుని సంతతి ప్రసాదించమని ప్రార్థించాలని వచ్చారు. తాము తెచ్చిన ముడుపులు చెల్లించి, సంతోషం, సంతృప్తి నిండిన మనసులతో గుహోన్ముఖులయ్యారు - పద్మం తమ ఇంట ఎప్పుడు అవతరిస్తుందా అని ఎదురుచూస్తూ...
* * *
నంద్యాల సమీపంలోని కానాల గ్రామం నుంచి వచ్చి తరిగొండలో స్థిరపడిన బ్రాహ్మణవంశానికి వారి గ్రామనామమైన కానాలయే ఇంటిపేరుగా స్థిరపడింది. నందవరీక శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. వశిష్ఠ గోత్రం. కృష్ణయార్యునికి సంతానం లేకపోతే వంశం అంతరించి పోతుందని తండ్రి ఆవేదన. మనుమలు, మనుమరాళ్ళని ఎత్తుకుని మురిసిపోవాలని తల్లి ఆశ. ఇంట పసిపిల్లలు నడయాడాలని కృష్ణయార్యునికీ కోరికే. తన కడుపుపండి ఒడినిండాలని మంగమాంబకీ చెప్పలేని ఆరాటం. "అమ్మా!" అని పిలిపించుకోవాలని ఏ స్త్రీకి ఉండదు?