Read more!
Next Page 
విష్ణు విలాసిని పేజి 1

                                 


                      విష్ణు విలాసిని

                                                             - డా|| ఎన్. అనంతలక్ష్మి

 

    
   అనంతకోటి బ్రహ్మాండ నాయకునికి ప్రదక్షిణలుచేస్తూ గ్రహాలూ, గోళాలు, తారకలు తమ తమ కక్ష్యలలో తిరుగుతున్నాయి. వాటి గమనంలోని లయ అనేక ఛందస్సులుగా వికసిస్తోంది. ఇన్ని తాళగతులలోను అంతర్లీనంగా ఉండి విశ్వవ్యాప్తమౌతున్నది ఒకే ఒక అక్షరం- ప్రణవం. మంద్రమంద్రంగా ఉన్న ఆ ఓంకారం క్రమంగా స్ఫుటమై పదాలను కూర్చుకుంది. శంఖనాదం నేపథ్యంగా ఆ పదాలు చక్కని కీర్తనగా విశ్వమోహనకరంగా వినిపిస్తున్నాయి. అరవిచ్చిన పద్మాలవంటి అర్థనిమీలిత నేత్రాలతో ఆదిశేషువుపై పవళించి ఆ గానానికి పరవశించి పోతున్నాడు నారాయణుడు. హృదయం ఆనందడోలలో ఊగినపుడల్లా, ఆయన గుండెలో ఒదిగిఉన్న లక్ష్మీదేవికూడా రసవాహినిలో తేలియాడుతోంది.  
నారాయణతే నమోనమో
భావ నారద సన్నుత నమోనమో
మురహర నగధర ముకుంద మాధవ
గరుడగమన పంకజనాభా!
గరుత్మంతుడి భుజాలు పొంగాయి సంతోషంతో.
కడకంట వారిని చూసీ చూడనట్లుగా గమనించాడు జగన్నాధుడు
పరమ పురుష భవభం జనతే నమో
నరమృగ శరీర నమోనమో   ... ... ... ... నమో నమో    ||నారాయణ||
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూపా
వేదోద్ధర తిరువేంకటనాయక
నాదప్రియతే నమోనమో...నమో         ||నారాయణతే||
నందకంవంక మెచ్చుకోలుగా చూశాడు నారాయణుడు. నిటారుగా నిలబడే నందకం వినయంగా తలవంచింది. లీలాపద్మం హేమంతపు మంచువానకి బడలిన పద్మంలాగా చిన్నబోయినట్లు తలవాల్చింది. నందకం నుండి చూపు పద్మంవైపు సారించాడు శేషశాయి. తన అవస్థను స్వామిగుర్తించినందుకు మరింతగా సిగ్గుతో చిమిడిపోయింది. సహజ వికాసం ప్రకటించటం కోసం ప్రయత్నం చేసింది. సర్వాంతర్యామికి తెలియని దేముంది?
"అభీష్టసిద్ధిరస్తు" అన్నాడు.
గరుత్మంతుడు, అనంతుడు, శంఖం, చక్రం, కౌమోదకం అర్థంకాక ఆశ్చర్యపోయాయి. తన్మయత్వంలో నుండి తేరుకున్న లక్ష్మీదేవి ఎవరి అభీష్టమా? అని కుతూహలంగా చూసింది.
"ధన్యోస్మి" - పద్మంతల వినయంతో మరింతగా వంగింది. అరవిచ్చిన రేకులనే చేతులుగా జోడించి అంజలించింది.
"వనజా! ఏమి కోరావు?" లక్ష్మి ఆప్యాయంగా అడిగింది, ఎంతైనా తన నివాసం కదా!
"అమ్మా! ఆ కీర్తన వింటుంటే నందకం ఎంత సుకృతం చేసుకుంది? ధన్యమైంది సుమా! అనుకున్నాను. అందరికీ అంత అదృష్టం ఉండద్దూ అని కూడా అనిపించింది. అంతే!"
"ఆ భాగ్యం నీకు కూడా కావాలనిపించింది కదూ!"
"కాబోలు!"
లక్ష్మి తలెత్తి పై చూపులు చూచింది. స్వామి ముఖంలోకి ప్రశ్నార్థకంగా.
"నందకాంశంలో జన్మించిన అన్నమయ్యవలెనే, పద్మాంశతో జన్మించి యోగినీ మణివై నీ రచనా పుష్పాలతో నన్ను అర్చించి, లోకానికి ఒక ఆదర్శాన్ని చూపి నీ కోరిక తీర్చుకుని కృతార్థత నొందుతావు" మేఘ గంభీర స్వరంతో మంద్రంగా నారాయణుడు పలికాడు.    
ఆనందం, విషాదం, ఆశ్చర్యం ముప్పిరిగొని అవాక్కయింది పద్మం.
"మీ సాన్నిధ్యాన్ని వీడి..." మాట బాధతో పూడుకు పోయింది.
"స్వయం కృతం. విచారించ పనిలేదు. మానవ లోకంలో కాలం ఎంతో వేగంగా గడిచిపోతుంది. అవకాశం సద్వినియోగం చేసుకో!"
"అమ్మా!..." లక్ష్మీదేవి వైపు తిరిగింది ఆర్తితో.
"సరోజా! ఎందుకంత దిగులు. సమయం ఇట్టే గడిచిపోతుంది. అయినా నువ్వెక్కడికి వెడుతున్నావు? కలియుగ వైకుంఠానికేగా! స్వామీ, నేనూ కూడా అక్కడ నీకు దర్శనమిస్తూనే ఉంటాం"- లక్ష్మీదేవి అనునయంగా పలికింది.
"నేను నీకు తోడుగా వెంటే ఉంటాను" విష్ణుమూర్తి అభయం ఇచ్చాడు.
పద్మం మనసు తేలికైంది.
"తనకటువంటి ఆలోచనరావటం, తన భూలోక నివాసానికి ఏర్పాట్లు అప్పటికప్పుడు జరిగిపోవటం, అంతా జగన్నాటక సూత్రధారి రచనా కౌశలానికి నిదర్శనమే కదా" అనుకుంది.
"ఆజ్ఞ శిరోధార్యం" అంది నమ్రతగా.
                                     * * *
"ఆపద మొక్కులవాడా! అనాథ రక్షకా! దీనశరణ్యా! గోవిందా! గోవింద!"
"అడుగడుగు మొక్కులవాడా! వడ్డికాసులవాడా! ఏడుకొండలవాడా! గోవిందా! గోవింద!"
"వేంకటాచల నాయకా! శేషాచలవాసా! పరమపురుషా! గోవిందా! గోవింద"
తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకోవటానికి కొండనెక్కే భక్తుల సంకీర్తనలతో కొండలన్నీ మారుమ్రోగుతున్నాయి. వాతావరణం అంతా భక్తి భావంతో ఉద్దీపితమై ఉంది. గాలివీస్తే గోవిందా అన్నట్టుంది. చెట్ల ఆకుల కదలికలోనూ, పక్షుల కూతల్లోనూ గోవిందనామమే.
అలిపిరి మెట్లమీద దీపారాధనచేసి, ఇంటినుంచి ముడుపుకట్టి తెచ్చిన కొబ్బరికాయల్లో ఒకటికొట్టి "గోవిందా!" అంటూ మెట్లు ఎక్కటం ప్రారంభించిన మంగమాంబ గడియసేపు కాకుండానే కూర్చుండిపోయింది "ఆపన్నశరణ్యా!" అంటూ. అప్పటికే పదిగజాలు ముందున్న కృష్ణయార్యుడు భార్య తన వెంట రావటంలేదని గమనించి వెనక్కివచ్చాడు. తనూ పక్కన కూర్చున్నాడు.
"మంగా! అప్పుడే అలసిపోయావా! వెళ్ళవలసింది చాలా ఉంది తెలుసా! ఎండెక్కితే అసలు నడవలేం. నెమ్మదిగా నా చెయ్యిపట్టుకునినడు! రా!" అన్నాడు కృష్ణయార్యుడు.
మంగమాంబ కన్నీళ్ళు తుడుచుకుంది.
"అది అలసటో, ఆనందమో తెలియటల్లేదు గుండెలన్నీ బరువెక్కినట్టూ ఉంది. తేలికై గాలిలో తేలుతున్నట్టూ ఉంది. మన కోరిక తీరుతుందనే ధైర్యం కలుగుతోంది."
తనకి అందించిన భర్తచెయ్యి రెండుచేతులతోనూ పట్టుకుని కళ్ళకద్దుకుంది. కళ్ళుమూసుకుని నిశ్చలంగా కొద్దిసేపు అలా ఉండి పోయింది. కదిలితే మంగమాంబ ఆనందానికి భంగం కలుగుతుందేమోనని నిశ్చలంగా ఉండిపోయాడు. మాటాడలేదు కృష్ణయార్యుడు. చెయ్యైనా వెనక్కితీసుకోలేదు. రెండోచేత్తో ఆప్యాయంగా తలనిమురాలన్న కోరికని కూడా నిగ్రహించుకున్నాడు.

Next Page