Read more!
 Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 3

అడగని జ్యోతిష్కులు లేరు. మొక్కని దైవం లేదు. ఆడని తీర్థం లేదు. చివరికి శ్రీవేంకటేశ్వరునికి మొక్కుకుని, ముడుపుకట్టి, ఆ ముడుపులు తీసుకుని తిరుపతి యాత్రచేశారు. దంపతుల కిరువురికీ తమ ఆశఫలిస్తుందనే విశ్వాసం కలిగింది. తృప్తిగా తిరుపతినంతా దర్శించుకుని, శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలుపుకుని, సెలవుతీసుకుని కొండదిగుతున్నారు.
మంగమాంబ మనసెంతో తృప్తిగా ఉంది. ఆనందంగా ఉంది. తన జన్మచరితార్థమయ్యిందనిపించింది. గాలిలో తేలిపోతున్నట్టుంది. మంగమాంబకి కనులు మూసినా, తెరిచినా చక్కని చిన్నారి తనఒడిలో ఉన్నట్టు ఊహ!
"ఏమా తొందర! కొంచెం నెమ్మదిగా నడు!" కృష్ణయార్యుడి హెచ్చరిక.
"మీరే గబాగబానడిచి నన్ను కలుసుకోండి" అంది కిలకిలా నవ్వుతూ పదేళ్ళ పిల్లలాగా.
"అదికాదు. ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నాం?"
గిరుక్కున వెనక్కి తిరిగింది.
"అదేం ప్రశ్న? ఎక్కడికి వెడతాం?? ఇంటికేగా!"
"పిచ్చిదానా! పద్మావతీ అమ్మవారిని చూడద్దూ!"
"చూడద్దు మరీ!" వంతపాడింది. ఈ సంభాషణతో నడక వేగంతగ్గి ఇద్దరూ కలుసుకున్నారు.
"చూశారా! అమ్మవారి పేరు పద్మావతి. పేరులో పద్మం ఉంది" మంగమాంబ ఏదో కొత్తవిషయాన్ని ఆవిష్కరించినట్టు సంబరంగా చెప్పింది.
"అలిమేలు మంగన్నా అంతే! తెలుసా! పూలల్లోకెల్లా గొప్పది పద్మం. కనక అమ్మవారూ పద్మమే."
"నిజమే సుమా! నేనెందుకు గుర్తించలేదు" అంది మంగమాంబ.
ఇద్దరూ ముచ్చటలాడుకుంటూ కొండదిగారు. వెనుదిరిగి చూసి మరొక్కమారు మ్రొక్కి. అలివేలుమంగాపురం వైపుసాగారు. పద్మావతిని దర్శించుకొని ఇంటికి తిరిగి వెళ్ళారు.

                                                            * * *
"ఏమిటి కృష్ణయ్యా! తిరుపతి వెళ్ళి వచ్చావుట!" సోమయాజి పలకరించాడు.
"అవును బాబాయ్!"
"దర్శనం అదీ బాగా జరిగిందా?"
"ఆఁ ఆఁ! అంతా స్వామి కటాక్షం"
"అవునూ! ఎందుకు వెళ్ళినట్టూ!"
"దర్శనానికి"
"ఎవరైనా కోరికలు తీరితే మొక్కులు తీర్చుకోటానికి కొండకి వెడతారు. నువ్వేమిటి ముందే వెళ్ళావు?"
"స్వామితో బేరాలు, వ్యాపారాలు ఏమిటి బాబాయ్"
"ఏమిటో నాయనా! మీరంతా ...భక్తులు వేదాంతులూ!" ...సోమయాజి విసవిసా వెళ్ళిపోయాడు.
కృష్ణయార్యుడికి నవ్వు వచ్చింది. బాధకూడా కలిగింది. తమ కోరికలు తీరితే కృతజ్ఞతతో మొక్కులు తీర్చవచ్చు. అది సంస్కారం. తప్పులేదు. కాని కోరికలు తీరకపోతే స్వామి దర్శనమే చేసుకోకూడదా? మనుషులదెంత వ్యాపార ధోరణి అయిపోయింది! భగవంతుడితో కూడా బేరాలు... ఒప్పందాలు...      
                                                             * * *
"నువ్వు నీళ్ళకొస్తున్నావు ఈ మధ్య! కోడలు నీళ్ళోసుకుందా?" అవధానిగారి భార్య కృష్ణయార్యుడి తల్లిని అడిగింది. నీలాటి రేవులు, సమాచార కేంద్రాలు.
"అవును వొదినా! పిచ్చిపిల్ల! ఏది తిన్నా ఇమడటం లేదు." కృష్ణయార్యుడి తల్లి సంతోషం పట్టరానిది.
"తిరుపతి వెళ్ళొచ్చారుగా! వెంకన్నే పుడతాడేమో!" సోమిదమ్మ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నది.
"అంతా స్వామి ఇష్టం. అట్లాగే అయితే అంతకన్నా కావాల్సిందేముంది?" కృష్ణయార్యుడి తల్లి ఆనందంగా అంది.
"ఏడుకొండలవాడు నీ ఇంట వెలుస్తున్నాడంటే, ఎంత పుణ్యం చేసుకున్నావో నువ్వు" తలమీద చెయ్యివేసి, ప్రేమగా నిమిరింది పండుముత్తైదువ నాంచారమ్మ కృష్ణయార్యుడి తల్లిని.
"నాదేముందత్తా! అదృష్టం అంతా నా కోడలిది. దాని మంచి బుద్ధికి, ఓర్పుకి మెచ్చి వెంకన్న ఇంత కాలానికి దయదలిచాడు."
"జాగ్రత్తగా చూసుకో అమ్మా! రాక రాక వచ్చిన కడుపు. అయినా నేను చెప్పాల్సినదేముంది. నీకే అన్నీ తెలుసు."
బిందె చంకనపెట్టుకుని ఇంటివైపు అడుగువేసింది. ఇన్నాల్టికి నీలాటి రేవు దగ్గర తన ఘనత చాటుకునే అవకాశం వచ్చినందుకు సంతోషం కలిగింది. తన వెనక మాట్లాడుకుంటున్న మాటలు వినపడుతూనే ఉన్నాయి.
"ఎంత అదృష్టవంతురాలో!"
"కోడలు ఎంత అదృష్టవంతురాలో! అత్తగారి మెప్పు పొందింది."
"ఆ అమ్మాయికి మాత్రం, అత్తగారంటే ఎంత గౌరవం?"
                                                            * * *
అసలే నిష్కల్మషమైన భక్తి ఉన్న మంగమాంబలో ఇప్పుడు భక్తి మరీ అతిశయించింది. భగవన్నామ స్మరణ తప్ప మరేదీ రుచించటం లేదు. అంతకు ముందు ఏదో ఎప్పుడన్నా కూనిరాగాలు తీసేది. ఇప్పుడు వీలున్నప్పుడల్లా సంప్రదాయ కీర్తనలు పాడుతూనే ఉంటోంది. ఎవరైనా కొత్తపాట పాడితే వెంటనే వెళ్ళి నేర్చుకుంటోంది. కృష్ణలీలలు పాటలన్నీ రోజుకొక్కమారైనా పాడుతుంది. కృష్ణకర్ణామృతం విషయం చెప్పనక్కరలేదు. కృష్ణలీలా తరంగాలు. అష్టపదులు, భాగవతం ముఖ్యంగా దశమస్కంధంలో పద్యాలు మేలుకున్నంతసేపు వీటిలో ఏదో ఒకటి నిరంతరంగా పాడుతూనే ఉంటోంది. మంగమాంబకి ఇన్ని తెలుసనికాని, ఇంత మధురంగా పాడగలదని కాని ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడూ భక్తి పారవశ్యంలో తన్మయమయిపోయి అయోమయంగా ప్రవర్తిస్తోంది. ముఖం మరింత తేటగా ప్రసన్నంగా, కాంతివంతంగా ఉంటోంది.
నీలాటి రేవులో చర్చనీయాంశం మంగమాంబే.
"మంగమ్మకడుపులో ఉంది వెంకన్న కదా! అందుకే అట్లా మెరిసిపోతోంది."
"కాదక్కా! ప్రహ్లాదుడి లాగా ప్రవర్తిస్తోందిట."
"అంటే?"
"ఎప్పుడూ భగవన్నామస్మరణలో వళ్ళు మరిచిపోవటం."
"ఈ సంగతి విన్నారా?"
"నువ్వు చెప్పందే?!"
"మొన్నొకరోజు అత్తగారు ముద్దుగా మంగమాంబని 'ఏదన్నా తినాలని ఉంటే చెప్పమ్మా! అని, ఇప్పుడేం పిండివంట చెయ్యమంటావ్?' అని అడిగిందట."

 Previous Page Next Page