Previous Page Next Page 
పర్ణశాల పేజి 2


    ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేడు. కౌసల్య తలగడ సరిగ్గా సర్దుతోంది. అతడెవరో తెలియకపోయినా, కేవలం తనకు కావాల్సిన వాడుగా భావించి, ఆమె చేస్తున్నా సపర్యని చూడగానే చైతన్య మనసు చెల్లెలిపట్ల ఆప్యాయతతో నిండిపోయింది.

    అయిదు నిముషాలలో డాక్టర్ కారు ఆ ఇంటిముందు ఆగింది. నాయుడు లోపలికి వచ్చి రోగిని పరీక్షిస్తున్నంతసేపూ చైతన్య ప్రక్కనే వున్నాడు.

    "ఎనీథింగ్ సీరియస్ డాక్టర్?"

    "ఉహు- నథింగ్ - నథింగ్ టు వర్రీ ఎబౌట్" ఇంజెక్షన్ చేస్తూ అన్నాడు.

    రవి రూమ్ లో పక్క  ఏర్పాటు చేయబడింది. నౌఖర్లిద్దర్నీ అక్కడే పడుకోమన్నాడు చైతన్య.

    "అబ్బే -ట్రబులేముంది, తప్పకుండా" అన్నాడు డాక్టర్. అతడికి ఆశ్చర్యంగా వుంది, దేనికీ చలించని, ఎక్కువగా మాట్లాడని చైతన్య ఇంత ఆతృత చూపించటం.

    కారు కదిలింది.

    చైతన్య లోపలికి వచ్చేసరికి రవి గదిలోకి మార్చబడ్డాడు. గది వెచ్చగా వుంది. రోగి ముఖంలో మునుపటి అలసటపోయి నిర్మలంగా వుంది. నౌఖర్లవైపు తిరిగి "జాగ్రత్తగా చూచుకోండి....." అన్నాడు.

    "నే నుంటానుగా అన్నయ్యా" అన్నాడు రవి. తలూపి బయటకొచ్చేడు.

    "అయ్యా....."

    చైతన్య వెనక్కి తిరిగేడు. నౌఖరు కవరొకటి అందిస్తూ "బట్టలు మారుస్తూ వుంటే దొరికిందయ్యా" అన్నాడు.

    చిన్న ప్లాస్టిక్ కవరు - రెండు వైపులా  సీలుచేసి వుంది. అది తీసుకొని పైకి నడిచేడు.

    కాంతిమతి బాబుని జోకొడుతూ వుంది. పక్కమీద పడుకొని, అలిసిపోయినట్లు నుదుటిమీద చెయ్యి వేసుకొని నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు.

    ఆమె బాబుని జోకొడుతూనే, "ఆయనెవరు?" అంది.

    "శంకరం మాస్టారు" అన్నాడు. "పదమూడేళ్ళ వయసులో అమ్మానాన్నల గారాబం, డబ్బు అన్నీ కలసి నన్ను పాడుచేస్తున్నప్పుడు ఆయన రక్షించారు. నా కెవరన్నా, ఎప్పుడన్నా సాయం చేశారూ అంటే అది ఆయనే...."

    అంతకన్నా ఎక్కువ మాట్లాడటం అతడికి అలవాటులేదు. కాంతిమతి పడుకొంది. చైతన్య కళ్ళు మూసుకున్నాడు.

    అస్పష్టమైన గతం - తాలూకు ఆలోచన్లతో అతడికి నిద్రపట్టింది. తెలతెలవారుతుండగా, టెలిఫోన్  మ్రోగటంతో అతడికి మెలకువ వచ్చింది.

    బొంబాయి నుంచి కాల్. అయిదు  నిముషాలు మాట్లాడి పెట్టేసేడు. మరి నిద్రపట్టలేదు. ఆరయింది. చీకటి తెరలు ఇంకా తొలగిపోలేదు. తూర్పు కొద్ది కొద్దిగా ఎర్రబారుతోంది. రాత్రి తాలూకు భీభత్సం పోయి వాతావరణం ప్రశాంతంగా వుంది. గాలికి రాలిన ఆకులు కాంపౌండు నిండా పడివున్నాయి.

    మెట్లుదిగి క్రిందికి వస్తూంటే మళ్ళీ ఫోను!

    "హల్లో...."

    "నేనూ.... డాక్టర్  నాయుడు...."

    "గుడ్ మార్నింగ్ డాక్టర్."

    "దట్స్ గుడ్. నేను ఎనిమిదింటికి వస్తాను. ఎనీథింగ్ సీరియస్" డాక్టర్ కంఠంలో ధ్వనించిన ఆతృతకి చైతన్యకి నవ్వొచ్చింది. డబ్బు  కర్తవ్యాన్ని  బాగా గుర్తుకు తెస్తుంది.

    "నో- నాటెటాల్."

    యజమాని కంఠం విని నౌఖరు పరుగెత్తుకు వచ్చాడు. అతణ్ణి అడిగి, మౌత్ పీస్ మీదనుంచి చెయ్యితీసి "మధ్యరాత్రి మెలకువ వచ్చిందట. మీరిచ్చిన క్యాప్సిల్ వేసేరట. టెంపరేచర్ కూడా లేదట. థాంక్యూ డాక్టర్...." అన్నాడు ఫోన్  పెట్టేశాడు.

    వెనక్కి తిరిగేసరికి కౌసల్య లోపల్నుంచి కప్పుతో కాఫీ తెస్తూ వుంది. తలంటుకోవటంవల్ల జుట్టు గాలికి ఎగురుతోంది. తెల్ల చీరెలో మంచు కడిగిన మల్లెలా స్వచ్చంగా వుంది. నుదుటి మీద దోసగింజంత బొట్టు.... పెద్ద పెద్ద కళ్ళకి  అందంగా  అమిరింది. అమాయకత్వం, ఆహ్లాదమూ ఆమె మొహంలో ప్రతిబింబిస్తూ వుంటాయి. ఎప్పుడూ .  ఆ  పవిత్రతకి ముగ్ధుడై "నాకొకటే ఆశ్చర్యం...." అన్నాడు.

    ఆమె నవ్వి "ఏమిటీ" అంది కాఫీ  అందిస్తూ.

    "నేను ఒక్కోసారి చాలా తొందరగా లేచాననుకుంటాను. అప్పటికే నువ్వు  తయారైపోయి వుంటావు..... ఇంతకీ ఎప్పుడు లేస్తావు నువ్వు?"

    కౌసల్య ఈ అభినందనకి కొద్దిగా సిగ్గుపడింది.

    ఖాళీకప్పు కౌసల్య చేతికిచ్చి రూమ్ లోకి వచ్చాడు. కౌసల్య అతణ్ణి అనుసరించింది.

    రవి పక్కమీద అస్తవ్యస్తంగా పడుకొని  నిద్రపోతున్నాడు. ఇద్దరు నౌఖర్లూ లేచి ఎప్పుడో వెళ్ళిపోయినట్లున్నారు. పక్కలు కూడా లేవు. శంకరం మాస్టారు ఇంకా నిద్రలేవలేదు.

    మంచం పక్క స్టూల్ మీద క్రితం రాత్రి డాక్టరిచ్చిన మాత్రలున్నాయి. సగంతాగి వదిలేసిన నీళ్ళగ్లాసుంది. కిటికీ అద్దాలలోంచి కొద్ది కొద్దిగా వెలుతురు  రావటం ప్రారంభమైంది. ఫాన్ గాలికి  దుప్పటి అంచు నెమ్మదిగా  కదులుతోంది.

    ఒళ్ళు వేడిగా వుందో లేదో చూడటం కోసం నుదుటిమీద చెయ్యివేసిన చైతన్య షాక్ తగిలినట్లు చేతిని వెనక్కి తీసుకున్నాడు.

    ఆయన శరీరం చల్లగా వుంది.

    ఐస్ కన్నా చల్లగా!


                                                   2


    "ఈరోజు మనకి తిండిలేదు" అంది కిరణ్మయి.

    శారద మాట్లాడలేదు.

    "రేపు కూడా ఉండదు. అంతేకాదు, ఇంకెప్పటికీ వుండదు."

    శారద భయంగా అక్కవైపు చూసింది. మరుసటి రోజు తిండి ఉండదన్న భయంతో కాదు- రోజు రోజుకీ పర్వెర్ట్ డ్ గా మారుతున్న ఆమె మానసిక స్థితిని తల్చుకొని.

    "మాట్లాడవేమే?"

    "ఏం మాట్లాడను?"

    శారద కీసారి నవ్వొచ్చింది. అది చూసిందంటే మళ్ళీ గొడవ అవుతుందని పెదవులు చాటునే దాచుకుంది.

    "నువ్వా కామాక్షమ్మ ఇంటికి ఇక వెళ్లకు."

    "ఏం" అన్నట్టు చూసింది శారద.

    "పొద్దున నేను వెళ్ళేను అవ్విడలేదు. సుపుత్రుడున్నాడు. కొంచెం బియ్యంవుంటే ఇమ్మని అడిగేను."

    అతన్ని అడిగేవా?"

    "ఏం అడక్కూడదా? కావాల్సింది బియ్యమైనప్పుడు అడగటాని కెవరైతేనేం?"

    శారదకి ఈ తర్కం నచ్చలేదు. అయినా ఆమె మాట్లాడలేదు. కిరణ్మయే అంది-

    "ఒంటరిగా వున్న ఆడది సాయం కోరితే ఎక్కడలేని  ధైర్యం వస్తుంది కాబోలు. వెకిలిగా నవ్వి, ;ఇలా బియ్యం అడిగి తెచ్చుకోవాల్సిన ఖర్మెందుకు? ఒకసారి ఊఁ అంటే ఆజ్ఞాపించే హక్కువస్తుందిగా-" అన్నాడు రోగ్. నేనేమన్నానో తెలుసా?"

    శారద అక్కవైపు చూస్తోంది.

    "ఇలా 'ఊ' అనిపించుకోవాల్సిన ఖర్మనీ కెందుకు? 'ఒకసారి మూడుముళ్ళూ వేస్తే నీకే ఆజ్ఞాపించే హక్కు వస్తుందిగా-' అన్నాను. అట్ల పెనం ఉంటుంది చూడు- అలా మాడిపోయిందిలే ముఖం ఊఁ అనాలాట ఊఁ."

    శారడకి ఏడుపొస్తోంది.

    "అసలిదంతా కాదు. ట్విస్టేక్కడుందో తెలుసా? ఎప్పుడొచ్చిందో తెలీదుగానీ, కామాక్షమ్మ వచ్చి అంతా  విన్నట్టుంది- కొడుకుని నాలుగు దులపాల్సిందిపోయి నన్ను నానామాటలంది. నాలాటివాళ్ళ మూలానే స్త్రీ గౌరవం పోతుందిట. పచ్చగా వున్న కుటుంబాలు ఇందుకే పాడవుతున్నాయట....." అని వర్షించటానికి సిద్ధంగా వున్న చెల్లెలి కళ్ళవైపు చూసింది.

    "నువ్వెందుకే ఏడుస్తావు! మనసులో అంత కుళ్ళున్నందుకు వాళ్లూ- వాళ్ళేడ్చి చావాలి, మనంకాదు. కడుపు ఖాళీగా వున్నా, దేవుడు కనీసం  ఈ వరమైనా ఇచ్చినందుకు సంతోషించాలి మనం."

    "నిన్ను చూస్తుంటే భయంగా వుందే అక్కా."

    "భయమా?" అంది కిరణ్మయి. "ఎర్రగా కాలిన ఇనుము మీద దెబ్బలు పడ్డట్టు మన బీదతనం మీద విధి దెబ్బకొడ్తోంది. రాటు తేలుతున్నందుకు ఆనందించు. ఇలా బండబారకపోతే ముందుముందు ఇంకా దెబ్బలు ఓర్చుకోవటం కష్టం."

    "ఇంకానా?"

    క్షణంపటు చెల్లెలన్నమాట అర్థం కాకపోవడంవల్ల కిరణ్మయి వాక్ర్పహం ఆగింది. ఆ తర్వాత ఆమె బిగ్గరగా నవ్వుతూ, "ఇంకానా ఏమిటే అసలేమయిందని ఇప్పటికి! రేపో మాపో ఇల్లుగలాయనవచ్చి మనని వెళ్ళగొడతాడు.... నడివీధిలో నిలబడ్డ మనని ఏ కరుణామయుడో ఓ బ్రోతల్ హౌస్ లో చేర్పిస్తాడు- కాలం పాములా కదుల్తుంది. వంటినిండా పోడలొస్తాయి- శరీరాన్ని రోగం రాహువులా తినేస్తుంది - మచ్చల నల్లబడతాయి. వళ్లు పచ్చబడుతుంది......మన భవిష్యత్తు టెక్నికలర్ లొ కనబడుతోందే శారద- ఇంటర్వెల్ ముందున్నాం మనం."

   
                                *    *    *


    కపాలం బద్ధలయ్యేవరకూ కాలుతున్న శవాన్నే చూస్తూ నిలబడ్డాడు చైతన్య. మనసంతా వేసిలేటింగ్ గా వుంది.

    ఏదో ఎగోనీ?

    తల్లి నీ కడుపులో చల్లగా విశ్రాంతి తీసుకున్న  జీవి, మళ్ళీ స్మశానం చితిమీద వెచ్చగా ప్రశాంతతని పొందింది.

    తలమీద నుంచి తీతువుపిట్ట అరుస్తూ వెళ్ళిపోయింది.

    అస్పష్టమైన భావాల సంఘర్షణ అచేతనావస్థలోనే ఇంటి కొచ్చేడు. స్నానం చేసేసరికి పదకొండయింది. స్మశాన వైరాగ్యం పోవటానికి ఎయిర్  కండిషన్డు రూమ్ లొ రెండుగంటలు చాలు. పూర్తిగా రిలాక్స్  అయ్యేసరికి మధ్యాహ్నం రెండయింది.

    కాంతి టీ తీసుకొచ్చి చెప్పింది. "మేనేజరుగారొచ్చారు" అని. చైతన్య ఆఫీసురూమ్ లోకి వచ్చేడు. "ఎంతకి దఫాలుగా పంపాలి. ఒకటి పదో తారీఖు, రెండోది రెండు నెలల తర్వాత."

    చైతన్య గాఢంగా విశ్వసించేడు.

    పదో తారీఖు!

    అంటే చాలా కష్టపడాలి. అన్ని వైపుల్నుంచి డబ్బు సమకూర్చుకోవాలి. కోస్తా ప్రాంతపు ఫిషింగ్ ట్రాలర్ వాళ్ళందర్నీ కూడగట్టుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పదో తారీఖు వరకూ ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీల్లేనంతగా కష్టపడాలి.

    కానీ కష్టపడటం అతనికి కష్టం కాదు. అతడి మనసంతా ఉద్వేగంతోనూ, ఆనందంతోనూ నిండిపోయింది.

    కాంట్రాక్ట్ లొ లాభం చాలా తక్కువే వుండొచ్చు కాని ప్రిస్టేజీకి సంబంధించిన కాంట్రాక్ట్ అది. ఇది  పూర్తవ్వగానే  దేశంలో వున్న చాలా కొద్దిమంది పెద్ద  సీ పుడ్ ఎగుమతిదార్ల జాబితాలో చేరిపోవచ్చు.

 Previous Page Next Page