పర్ణశాల
-యండమూరి వీరేంద్రనాథ్.
ఉత్తుంగ తరంగాల్ని సృష్టిస్తూ - మహార్ణవం మీద నుంచి వస్తున్న ప్రళయకాల ఝంఝా మారుతమే క్షణకాలం విస్తుబోయి వెనక్కి చూసేట్టు విన్ను మిన్ను ఫెటేలున విరిగిన చప్పుడు. జగచ్ఛక్షువు వసుమతితో రామించడానికి పడమటి కొండల్లోకి జారి, కాసింత కన్ను మూయగానే - చలి వెలుగు మీద మొయిలు తెరకప్పి తిమిరంతో ఆడుతున్న సరసానికి బెదిరి ఆపిన ఆకాశం.... నీరు తాలుపు సాయంతో తలంటు పోసుకున్న భూదేవి -విభావరి మేలిముసుగు.... తపోభంగం అయిన బుషిలాంటి ప్రకృతి ... గుర్తు తెలియని చిత్రకారుని కుంచెలోంచి జారిన వంకర గీత - అమరత్వం పొందిన పాపం.... పర్వతాల్ని కరిగించడానికి పంతంపట్టిన గాలి.... సృష్టి స్వగతం చెప్పుకుంటున్నట్టు ఘోష.....
....చైతన్య చిన్నగా వణికేడు.
బలంగా వీస్తున్న గాలికి కొబ్బరిచెట్ల ఆకులు అటూ ఇటూ ఊగుతూ శబ్దం చేస్తున్నాయి. కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఆగి ఆగి వీస్తున్న గాలితో సన్నటి జల్లు అలలు అలలుగా పడుతోంది.
ఏదో జరిగి మెలకువ వచ్చింది.
ఏదో కల!
భూమి కదిలిపోతున్నట్టూ.... ఆకాశం కృంగిపోతున్నట్టూ ..... అసృష్టమైన పీడకల!
అతడికి చిన్నప్పటి నుంచి వర్షాన్ని చూస్తే ఎలర్జీ.
బయట మెరిసి గదంతా వెలుగుతో క్షణంపాటు నిండిపోయింది. అంత చలిలోనూ నుదుటిమీద చెమటపట్టింది.
వెనీషియన్ బ్లయిండ్స్ వెనుకవున్న చెట్ల నీడలు గాజు అద్దాల మీద వికృతంగా నాట్యం చేస్తున్నాయి. కారిడార్ చివరనుంచి ధారగా క్రిందపడుతోన్న నీటి శబ్దం వినిపిస్తోంది. అక్వేరియంలో చేపపిల్లలు బైట భీభత్సం తెలియకుండా నిద్రపోతున్నాయి. బయట మెరుపులు గదిలో ఆయిల్ పెయింట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. తడిసిన నైట్ క్వీన్ వాసన గాలితోపాటు మత్తుగా వస్తూంది. పై వరకూ పాకిన మల్లెతీగ కిటికీలోంచి తొంగిచూస్తూంది.
నుదుటిమీద పట్టిన చెమటని తుడుచుకుంటూ చైతన్య పక్కకి చూసేడు.
కాంతిమతి నిద్రలోనే బాబుని దగ్గరకు తీసుకొంది.
దూరంగా ఎక్కడో ఉరిమింది.
చైతన్యకి జ్యోతిష్యం మీద, శకునాల మీద నమ్మకంలేదు. కాని మనసు ఏవో సంకేతాల్ని ఆగకుండా మెదడుకు అందిస్తుంది.
....... ఏం జరుగుతుంది?
పిడుగుపడి తన కుటుంబంతో సహా నాశనం అయిపోతాడా? చావు అపశకునం కాదే!
రెండు గంటల క్రితం జరిగిన బిజినెస్ ఎగ్రిమెంటులో నష్టం వస్తుందా? ఎంతొచ్చినా యభాయ్ వేలకన్నా ఎక్కువరాదు. అదో పెద్ద నష్టం కాదు.
మరి .... ?
తన కలని పునశ్చరణ చేసుకోవడాకి ప్రయత్నించాడు. ఓ బికారి - బట్టలు పీలికలై - గెడ్డం పెరిగి పిచ్చివాడిలా వున్నవాడు - చేతులు చాచి - ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అంతలోనే ఏదో కాంతిపుంజం, కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ప్రచండమైన వేగంతో వచ్చి అతడి చేతుల మధ్య..... అతడిలో ఐక్యం అయిపోయింది.
తల విదిలించి, పక్కమీద నుంచి లేచి, తలుపు చప్పుడవకుండా బయటకొచ్చాడు. ఒక్కసారి చల్లని గాలి చుట్టుముట్టింది. మనసుని ఆవరించుకొని వున్న అసంతృప్తి అంతా పోయినట్లు అనిపించింది.
విశాలమైన కారిడార్ భావుకుడి మనసులో స్థబ్దతలా వుంది. మళ్ళీ మెరిసింది. రోడ్డుకి అటువైపున కొంచెం విసిరేసినట్లూ దూరంగా ఓ తాటాకు పాక పర్ణశాలలా వుంది. 'అంత చలిలో అందులో వారెలా పడుకుంటారో' అనుకున్నాడు. లోపలికొచ్చాడు చలిగాలిని "కండిషన్" చేసి చల్లగాలిని లోపలి పంపిస్తూంది ఎయిర్ కండిషనర్.
మెట్లు దిగి క్రిందికి వచ్చాడు. తమ్ముడు రవి నిద్రపోతున్నాడు. చెల్లి కౌసల్య గదిలో లైటు వెలుగుతోంది.
లైటుముందు కూర్చొని చదువుకుంటూ, అలాగే ముందుకు వాలి టేబిల్ మీద తలపెట్టి నిద్రపోతోంది. ఆమె పొడవాటి జడ నేలమీద జీరాడుతోంది. సరిగా పడుకోమని చెబ్దామనుకుని మళ్ళీ లేపితే- 'తెల్లవార్లూ చదువుకుంటూ కూర్చుంటుందేమో' నని ఉద్దేశ్యం మార్చుకున్నాడు - నిజానికి రావిక్కూడా మరుసటి రోజు నుంచే పరీక్షలు. అయినా కౌశల్యం పట్టుదల అతనిలో లేదు. అది అంత విచారించతగ్గ విషయం కాదు. ఏమీ చదవకపోయినా అతను సెకండు క్లాసులో పాసవుతూనే వచ్చాడు.
చైతన్య మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. నిద్రపట్టే సూచన్ల కనబడలేదు.
కిటికీ దగ్గర నిలబడ్డాడు. వర్షంలో తడిసిన లైట్ల వెలుతుర్లో కడిగిన అద్దంలా మెరుస్తూ వుంది. అంతా నిర్మానుష్యంగా వుంది.
అకస్మాత్తుగా అతడి కర్ణపుటాలకి దూరంగా దెబ్బలాడుకొంటున్న ధ్వని లీలగా వినిపించింది. క్షణంపాటు తాను వింటున్నది నిజమేనా అని నిశ్చయం చేసుకోవడానికి ఆగాడు. అది భ్రమ కాదని అనిపించగానే కారిడార్ లోకి వచ్చాడు.
బయటి గేటు దగ్గర సన్నగా పడే తుంపర్లో..... గేటు దగ్గర గూర్ఖాతో ఎవరో ఘర్షణ పడుతున్నారు. ఆకారం కనబడుతోంది గానీ పోలిక సృష్టంగా తెలియటం లేదు. అంత వర్షం కురుస్తున్న రాత్రి, దాదాపు మూడు గంటలవేళ..... తన ఇంటిముందు నిలబడి గూర్ఖాతో దెబ్బలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో అర్థంకాక చప్పున క్రిందికి దిగాడు.
ఆ అర్థరాత్రి తన ఇంటిలో ప్రవేశించబోతున్న ఆ ఆగంతకుడు తన జీవిత గతినే మార్చబోతున్నాడని తెలియని చైతన్య వడివడిగా గేటు దగ్గరకు నడిచాడు.
* * *
"పోనీ నన్ను వెళ్ళనివ్వకు- నువ్వు వెళ్ళి చెప్పు....." హీనమైన కంఠంతో ప్రాధేయపడుతున్నాడు అతను.
"నా ఉద్యోగం వుండాలా? పోవాలా పో, పో, అర్థరాత్రి గొడవ చెయ్యకు రేపొద్దున్న రా పో" గూర్ఖావాడి మాటల్లో విసుగు కనబడ్తోంది. చైతన్యగేటు దగ్గరికి వెళ్ళాడు. లైటు మసక వెలుతుర్లో ఆ వ్యక్తి ఆకారం అస్పష్టంగా తెలుస్తోంది. పంచెవంటికి అతుక్కుపోయి వుంది. చొక్కా అక్కడక్కడా పీలికలై వేలాడుతోంది. నీరు తలమీద నుంచి చుక్కలు చుక్కలుగా క్రిందికి జారుతోంది.
అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్టు వున్నాడు. చలికి వణుకుతూ ముందుకు తూలిపోకుండా వుండటానికి ప్రయత్నిస్తున్నాడు.
గూర్ఖా అతడి మెడమీద చెయ్యివేసి గెంటటానికి సిద్ధపడుతూ "మర్యాదగా వెళ్ళిపోతావా....గెంటాలా?" అన్నాడు.
"శంకర్ లాల్...."
యజమాని కంఠం విని, గూర్ఖా బిర్రబిగుసుకుపోయేడు. "సాబ్.... యితను....." అంటూ ఏదో చెప్పబోయేలోపులో ఆ వ్యక్తి గాలిలా దగ్గరకు వచ్చేడు.
"కృష్ణా .... నేన్రా. శంకరం మాస్టార్ని."
తూలి పడబోతున్న అతన్ని పట్టుకోబోయి షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు చైతన్య. అంత చలిలోనూ అతడి ఒళ్ళు పెనంలా కాలిపోతోంది.
"బాబూ..... ఒరేయ్ నాయనా...." ఆపై మాటలు పెగల్లేదు.
అతడి శరీరం ఎన్నో రోజుల్నుంచీ తిండిలేనట్టు శుష్కించిపోయి వుంది. చెంపలమీద మాంసం కరిగి చర్మం వ్రేలాడుతోంది. కళ్ళు జీవం కోల్పోయి గాజు గోళాల్లా మెరుస్తున్నాయి. ఎండి చిట్లిన పెదవుల మీద వర్షపు నీటి తడి మెరుస్తోంది. బాగా నెరసి, తెల్లబడిన జుట్టు నుదుటి మీదకు అసహ్యంగా జారి వుంది.
"కృష్ణా! నన్ను గుర్తుపట్టేవుట్రా...." ఆశా నిరాశల మధ్య కొట్టుకొంటోంది ఆ స్వరం.
"మాస్టారూ!"
"కృష్ణా!"
ఆయన్ని పొదివి పట్టుకొని, ఇంటివైపు నడిపిస్తూ "మిమ్మల్ని గుర్తుపట్టకపోతే నన్ను నేను మర్చిపోయినట్టు మాస్టారూ."
"చాలు బాబూ చాలు. ఇక నిశ్చింతగా....."గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆపై మాటలు రాలేదు.
అలాగే పట్టుకొని హాల్లోకి వచ్చాడు. ఈ అలికిడికి కౌసల్య నిద్రలేచినట్టుంది గది తలుపులు తీసుకొని బయట కొచ్చింది.
తమవేపే కళ్ళప్పగించి చూస్తున్న చెల్లెలితో "ఆ తలుపు వెయ్యి చలిగాలి వీస్తోంది" అన్నాడు. కలలోంచి తేరుకున్నట్టు ఆమె చప్పున అటు వెళ్ళింది.
అప్పటివరకూ ప్రాణాన్ని బిగపెట్టి ప్రకృతి భీభత్సాన్ని ఎదుర్కొన్న శరీరం ఇక శక్తి లేనట్టుగా సోఫాలో నిస్త్రాణగా పడిపోయింది.
"కౌసల్యా..... కొంచెం హార్లిక్స్....."
ఈ లోపులో కాంతిమతి క్రిందికి వచ్చింది. రవి గదిలో లైటు వెలిగింది. క్షణంలో వాతావరణం మారిపోయింది. అవుట్ హౌస్ లోంచి నౌఖర్లు పరిగెత్తుకొచ్చారు. అంతా హడావుడి-ఇదేమీ పట్టనట్టు శంకరం మాస్టారి శరీరం అచేతనావస్థలోనే వుంది.
కౌసల్య హార్లిక్స్ తీసుకొచ్చింది.
తలని ఒళ్ళోకి తీసుకొని నెమ్మదిగా పట్టించసాగాడు చైతన్య. అందరూ నిలబడి దూరంనించి చూడసాగారు. ఆ వచ్చినదెవరో ఎవరికీ తెలీదు. కానీ వచ్చిన వ్యక్తిపట్ల చైతన్య చూపిస్తున్న జాగ్రత్తలు చూస్తూంటే అతనికి కావాల్సిన వాడని తెలిసిపోతోంది.
అతడు లేచి ఫోన్ దగ్గరకు నడిచాడు. "హల్లో....."
"హల్లో...."
"డాక్టర్ నాయుడూ...."
"స్పీకింగ్" అవతలి కంఠంలో విసుగూ, చిరాకూ ధ్వనించాయి. "ఎవరూ?"
"చైతన్య - కృష్ణచైతన్య."
డాక్టర్ నిద్రమత్తు చప్పున దిగిపోయింది. "హల్లో చైతన్యా-"
"ఒకసారి మా ఇంటికి రాగాలరా?"
"ష్యూర్ - ష్యూర్...." ఆగి.... "ఎవరికన్నా సీరియస్సా?......." అడిగేడు.
"చెబుతాను. ప్లీజ్ కమ్ సూన్."
"వెంటనే వస్తున్నా....."