"నే వెళ్ళొస్తాను సర్" అన్నాడు మేనేజర్.
చైతన్య ఆ మాటలతో ఈ లోకంలోకి వస్తూ "వెళ్ళు" అని, అంతలోనే జ్ఞాపకం వచ్చినట్టు "మన గుమాస్తాగారేమీ చెప్పలేదా?" అన్నాడు. "ఏ విషయం సర్?"
"నిన్న రాత్రి మనింటికి....."
"ఆ..... ఆ.... చెప్పేరు సర్" అన్నాడు మేనేజర్. "కనుక్కోవటం కొంచెం కష్టం కావచ్చు. పేపర్లో ప్రకటన వేయిద్దాం సర్."
"అలా అయితే కొంచెం ఆలస్యం కావచ్చు. చాలాకాలం క్రితం మావూరి స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. దాదాపు ఇరవై ఏళ్ళ క్రిందటి మాట. రికార్డులు తిరగేస్తే ఏమన్నా దొరుకుతుందేమో.....అక్కణ్ణుంచి వాకబు చేయటం ప్రారంభించు. పేపరులో ప్రకటన వేద్దామనుకో, కాని దానికోసం ఇది అక్కర్లేదు, రేపే నువ్వు బయలుదేరు."
తన యజమాని ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి అన్ని కోణాలలోంచి ఆలోచిస్తాడని మేనేజర్ కి తెలుసు. నిజానికి పేపరులో వేయించటం ఒక్కటే సరైన పద్ధతి. పదేళ్ళ క్రితం రిటైరయిన మనిషి ఇప్పుడెక్కడ సెటిల్ అయ్యాడో కనుక్కోవటం జరిగే పని కాదు. అయినా యిలా చెయ్యమన్నాడు అంటే ఏ ఒక్క ఛాన్సూ వదులుకోవడానికి ఇష్టపడటం లేదన్నమాట......
....అర్థరాత్రి ఇంటికొచ్చి అకస్మాత్ గా చచ్చిపోయిన ఓ అనామకుడి కోసం ఇంత ఖర్చెందుకో? ఎమ్.బి.ఏ. చదివిన అతడి మేథస్సు అర్థం చేసుకోలేకపోయింది. అయినా తలూపి "రేపు సాయంత్రమే వెళతాను సర్!" అన్నాడు.
"సాయంత్రం కాదు ప్రొద్దున్నే వెళ్లు. ఇంకేవయినా పనులు వున్నాయా?"
"రొయ్యల లోకల్ సప్లయ్ కి ప్లాస్టికి కవర్స్ గురించి ఎవరో వచ్చేరు."
మిగతా మాటలు వినలేదు చైతన్య. కవరనగానే, క్రితం రాత్రి నౌఖరు తన చేతికి మాస్టారి బట్టలలోంచి తీసి యిచ్చిన కవరు జ్ఞాపకం వచ్చింది. చటుక్కున లేచి తన గదిలోకి పరుగెత్తాడు.
* * *
గదంతా కోలాహలంగా వుంది. రాత్రి ఎనిమిదయింది.
నాలుగు ఖాళీ బాటిల్స్ నేలమీద దొర్లుతున్నాయి. బల్లమీద సగం మిగిలిన బాటిలుంది, ప్రక్కనే కొంచెం నీతి మంతుడి తాలూకు బీర్ సీసా వుంది.
అప్పటికే మూతపడుతోన్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి "ఏమిటి?" అన్నాడు సుబ్బయ్య.
"నీ గురించి కాదులే" అన్నాడు సురేష్. అతడు వెనుక నుంచి ఆడదాన్లా గానూ, ముందునుంచి మధ్యస్థుడుగానూ వున్నాడు. "పందెం కడితే ప్రసాదు అర్థరాత్రి స్మశానం వరకూ వెళ్ళి రాగలడట....."
సుబ్బయ్య బలవంతాన కళ్ళు తెరిచి "ఇంకొంచెం మందు కొడితే సముద్రంలొకి కూడా వెళ్ళి రావొచ్చు" అన్నాడు.
సుబ్బయ్య హోస్ట్ కాబట్టి అదో పెద్ద జోకులా అందరూ నవ్వారు. ప్రసాదు మాత్రం.... "సముద్రం అక్కరలేదు. ఏటి గట్టు వరకూ వెళ్ళు..... పది రూపాయలు పందెం" అన్నాడు వెక్కిరిస్తున్నట్టుగా.
సుబ్బయ్య ధైర్యం సంగతి అక్కడ అందరికీ తెలుసు. అయినా అతన్ని సపోర్టు చేస్తున్నట్లు "మరీ అంత మాటనకు గురూ...."అన్నారెవరో.
"అయినా ఇద్దరు ఆడపిల్లల దగ్గర మూడు నెలలనుంచి అద్దె వసూలు చేయలేనివాడు ధైర్యం గురించే మాట్లాడటం అనవసరం."
"వసూలు చెయ్యలేకపోవటానికి కారణం అదికాదులే."
"ఇంకొకటి వుంటుందని నేననుకోను....." అని "......మన సుబ్బయ్య దగ్గర....." నొక్కి పలికారెవరో. గది నవ్వులతో ప్రతి ధ్వనించింది.
చింతపండులా నల్లగా వున్న సుబ్బయ్య మొహం మరింత నల్లబడింది. ఆవేశంతో గాలి పీల్చటంవల్ల పొట్ట బెలూన్ లా వుబ్బింది.
"ఇదుగో యిప్పుడే వెళుతున్నాను" అని ఎవరికోసం ఆగకుండా గదిలోంచి విసురుగా బయటికొచ్చాడు.
గదిలోని మిత్రబృందం తక్షణం ఆశ్చర్యపోయిన, అంతలోనే ఉత్సాహం పుంజుకుంది. 'నా' అనేవాడు లేని ఇద్దరమ్మాయిల్ని నడివీధిలోకి గెంటటాన్ని ఆ రాత్రివేళ చూడటం కోసం అందరూ గదిలోంచి బిలబిలా బయటకొచ్చేరు.
వీధంతా నిర్మానుష్యంగా వుంది.
.....సుబ్బయ్య వచ్చి మెట్లమీద నిలబడి తలుపులు దబదబా బాదే సమయానికి శారద పడుకోవటానికి చాపలు పరుస్తోంది.
తలుపు చప్పుడు విని, ఆమె వచ్చి తలుపు తీసింది. ఎదురుగా సుబ్బయ్య. ఆమె వెనక్కి అడుగు వేసింది.
అతడు కళ్ళు ఎర్రగా వున్నాయి. రెప్పలు మూతలు పడ్తున్నాయి. ద్వారాన్ని అనుకొని నిలబడి "డబ్బు....." అన్నాడు.
శారదకేమీ అర్థంకాలేదు. "ఏం డబ్బు?" అంది.
ఆమె మాటల్ని అతనింకో విధంగా అర్థం చేసుకున్నాడు. దానికితోడు స్నేహితులు అంతక్రితం మాట్లాడిన మాటలు లోపల తొలుస్తున్నాయి. దాంతో అతను పూర్తిగా రెచ్చిపోయి "ఏం? అద్దె సంగతే మర్చిపోయి ఇంట్లో కులుకుదామనుకుంటున్నారా?" అన్నాడు గొంతు పెద్దదిచేసి.
ఆమెకు విషయం ఏమిటో లేలగా అర్థమయింది కాని, ఏం చెయ్యాలో తోచలేదు. ఆమెది సున్నితమైన మనస్తత్వం. ఇటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. తమ స్థితిని తలుచుకుంటే కళ్ళనీరు తిరిగింది.
"ఏం, మాట్లాడవేం?" గద్దించాడు.
ఆమె ఏదో చెబుదామనుకుంది కానీ గొంతులో ఏదో అడ్డుపడినట్లు మాటే బయటకు రాలేదు. ఏడుపు చెలియకట్ట దాటడానికి సిద్ధంగా వున్నది.
"అసలిద్దామన్న ఉద్దేశ్యం వుందా?" అన్న అతడి ప్రశ్నకు మాత్రం తల అస్పష్టంగా ఆడించింది. అతడు దాన్ని పట్టించుకోకుండా "లేకపోతే ఇంకోలా తీర్చుకుందామన్న ఉద్దేశ్యం ఏమయినా వుందా?" అన్నాడు.
ఆమె తన స్వభావ సిద్ధమయిన అమాయకత్వంతో...... "ఎలా?" అంది.
ఆ ప్రశ్నకి అతడి పెదవులమీద వంకరనవ్వు కదిలింది. అడుగుముందుకేసి "చెప్పనా" అన్నాడు వెకిలిగా ఆమెవేపు చూస్తూ. ఆమెకి అతడి వాలకం అర్థమయింది. వదనం మ్లానమయింది. రెండు అడుగులు వెనక్కి వేసింది.
"ఎవరికీ తెలియదు. ఊఁ" అన్నాడు.
"ఏమిటి ఎవరికీ తెలియనిది!" అన్న కంఠం పక్క గుమ్మం దగ్గర్నుంచి వినిపించింది. ఆ మాటలు అంటున్నది కిరణ్మయి. ఆమె లోపల పనిచేసుకొంటూ మాటలు వినిపించి బయటకొచ్చింది.
చీరకొంగు నడుములో దోపి ఆమె నిలుచున్న తీరుచూసి సుబ్బయ్య కొద్దిగా బెదిరేడు. అంతలోనే అతని మిత్రబృందం అక్కడికి చేరుకుంది. కిటికీలోంచి బయటివాళ్ళని చూడగానే అతడిలో మళ్ళీ ధైర్యం చోటు చేసుకుంది.
"ఇస్తే అద్దె యివ్వండి, లేకపోతే ఇల్లు ఖాళీచేసి పొండి" అన్నాడు మాటమారుస్తూ.
"అద్దె యివ్వం అని ఎవరన్నారు?"
"ఎవరూ అనలేదు. కానీ యివ్వరు. మూణ్ణెల్ల అద్దె యివ్వాలి. యిదేం సత్రం అనుకున్నారా?" అతడి బొంగురు గొంతు గదిలో ప్రతిధ్వనించింది.
"ఇంకో రెండ్రోజులలో....." అని ఏదో చెప్పబోతున్న ఆమెని మధ్యలోనే ఆపుచేస్తూ..... "కుదరదు" అన్నాడతను. "ఈ రాత్రికి ఈ విషయం తేలిపోవల్సిందే. అద్దె యివ్వటమో.... ఖాళీ చెయ్యటమో...."
కిరణ్మయి కొంచెం విసుగుతో..... "రాత్రికి రాత్రి ఖాళీ చెయ్యటం అంటే ఎలా?" అంది. నిజానికి అతడి వాలకం ఆమెకీ భయంగానే వుంది. కానీ స్వతహాగా ధైర్యం గలది కావడంవల్ల ఆ మాత్రమైనా మాట్లాడగలిగింది. శారద బిత్తరపోయి నిలబడి వుంది.
"అదేం నాకు తెలియదు. ఖాళీ చేస్తారా......గెంటమంటారా?" అన్నాడు.
బయట వున్న గుంపులోంచి ఎవరో "గెంటు గురూ" అన్నారు.
అక్కా చెల్లెళ్ళిద్దరూ చప్పున కిటికీలోంచి బయటకు చూసేరు. బయట దృశ్యం చూసేసరికి ప్రాణాలు జారిపోయాయి.
అరుగుమీద వాసానికి అనుకొని ఇద్దరు సిగరెట్లు కాలుస్తున్నారు ముగ్గురు లోపలికి తొంగి చూస్తున్నారు, ఇంకో ఇద్దరు అప్పుడే తలుపు దగ్గరికి చేరేరు. కిరణ్మయి మొహంలో మారుతున్న రంగుల్ని చూడగానే సుబ్బయ్యకి ధైర్యం వచ్చింది.
"మీరు మాటల్తో చెబితే వినరు....." అంటూ వడివడిగా ముందుకెళ్ళి చాప, బట్టలు మూటగా చుట్టి బయటకు విసిరాడు. బయట దాన్నెవరో బంతిలా పట్టుకున్నారు. కడుపులో ద్రవం మెదడులో ఆలోచనని చంపుతోంది.
అతడి చర్యకి ఇద్దరూ స్థాణువులయ్యేరు. ఇంత విపరీతాన్ని వాళ్ళు ఊహించలేదు. అసలు ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొనాలో కూడా వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ నిస్సహయతని చూస్తున్న కొద్దీ అతడిలో పైశాచిక ప్రవృతి మరింత ఉధృతమౌతోంది.
కిరణ్మయి తేరుకుని "ఆగు, ఏమిటది?" అంది.
"పోండి, పోయి బయట ఎక్కడయినా పడుకోండి. ఇల్లు మాత్రం ఖాళీ చేయాల్సిందే" అన్నాడు కూర్చీని విసురుగా తోస్తూ. అది పెద్ద చప్పుడుతో క్రిందపడింది.
"ఏమిటీ దౌర్జన్యం? ఇంత రాత్రప్పుడు ఎక్కడికి పోవాలి?" కిరణ్మయి అంటుంటే గొంతులో ఏడుపుజీర కదిలింది.
"మా ఇంటికి రాకూడదూ?" బయట్నించి ఎవరో అన్నారు. గొల్లున నవ్వులు వినిపించినయ్.
అప్పటివరకూ ఎలాగో బిగపట్టి ఆపుకున్న శారద వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఆ నిస్సహాయురాలైన ఇద్దరాడపిల్లల దయనీయమైన పరిస్థితిని గమనించే వాళ్ళు అక్కడ లేకపోయారు. వీధిలో ఇంటి గుమ్మాలదగ్గర నిలబడి కొంతమంది ఆడవాళ్ళు చోద్యం చూస్తున్నారు.
అప్పుడే అక్కడికి చేరుకున్న ఒకరిద్దరు, "ఏమిటి సంగతి?" అని అడిగారు.
"ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు" ఎవరో జవాబిచ్చారు.
ఇంతలో సుబ్బయ్య చిన్న ట్రంకు పెట్టె తీసుకొచ్చి అరుగుమీద పడేశాడు. కొక్కెం ఊడిపోయిన ఆ పెట్టె మూతని కాలితో పైకెత్తాడు సురేష్. ఒక జులపాల జుట్టువాడు వంగి లోపల బట్టల్ని కెలికి, ఒక "బ్రా" ని పాముని పట్టుకున్నట్టు పట్టుకుని బయటికి తీశాడు. ఎవరో బిగ్గరగా విజిల్ వేశారు. వచ్చి వాళ్ళలో చేరిన ఇద్దరు పెద్దమనుషులు కూడా నవ్వారు.
శారద, కిరణ్మయి చెయ్యి పట్టుకుని "అక్కా పోదామేఁ" అంది బెక్కుతూ. కిరణ్మయి తాలూకాఫీసులో గుమాస్తాగా చేరి రిటైరయ్యాడు. పరిస్థితి చూసిన ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.
"అర్థరాత్రి ఆడపిల్లలు ఎక్కడికి వెళతారు నాయనా?" అన్నాడు.
"ఎవడో వచ్చాడోయ్ ధర్మాత్ముడు" అన్నాడెవరో.
"తాతగారి పాతఖాతా ఏమో!"
ఘొల్లుమన్నారు అందరూ. నిస్సహాయంగా జరిగేది చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేననుకున్నాడు. ప్రేక్షకులలో ఒకడవటం ఇష్టంలేక లోపలికి వెళ్ళిపోయాడు.
ఈ లోపులో సుబ్బయ్య గదంతా కలియజూసేడు. ఇంకేమీ సామాను దొరకలేదు విసిరెయ్యటానికి. అతని దృష్టి గోడమీద నున్న వృద్ధ దంపతుల ఫోటో మీద పడింది. నిజానికి ఆ ఇంట్లో సామానులేమీ ఎక్కువ లేవు.