Read more!
Next Page 
జీవితం చేజారనీయకు  పేజి 1

                                 


                                 జీవితం చేజారనీయకు

 

                                                             డి. కామేశ్వరి

 

                       


    "వాళ్ళ విద్య పుట్టింటికి వచ్చేసిందంటే!"  
    కాలేజి నుంచి వచ్చి నిర్మల కాఫీ తాగుతుండగా తల్లి చెప్పిన వార్త అది.
    'వచ్చిందా? వచ్చేసిందా?' ఒక్క అక్షరంతో ఆ మాటలో అర్థాలు మారిపోతాయి.
    'వచ్చింది' అంటే మళ్ళీ వెళ్తుంది! 'వచ్చేసింది' అంటే ఏదో జరిగి వచ్చేసిందా?
    అడక్కపోయినా తల్లి చెప్తుంది అని తెలుసు కనుక మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయింది నిర్మల.
    "పెళ్ళయిం దగ్గరనించి ఆ అమ్మాయికి మొగుడికి అసలు పడలేదట! ఆ అత్తవారు మహామూర్ఖులట! ఈ రోజుల్లోనూ కోడలంటే అత్తింట అణిగిమణిగి పడుండాలనుకునే రకాలుట. 'కనీసం అల్లుడయినా మంచివాడయితే చూసీ చూడనట్లు వూరుకునే వాళ్ళం. చూస్తూ చూస్తూ పిల్లని చంపుకుంటామా, కాపురం లేకపోతే పీడాపోయింది. మా పిల్లమాకు బరువా" అంది వాళ్ళమ్మ తల్లి చెప్పుకుపోతోంది.
    మొగుడు, కాపురం లేకపోతేపోయింది. మా పిల్లమాకు బరువా అనే స్థితికి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదిగారంటే స్త్రీ జాతి పురోగమనానికి నాంది పలుకుతుందనుకోవాలా? ఒకసారి పెళ్ళి చేసి పంపాక కష్టమో నష్టమో, చావో బతుకో అత్తింట్లో అని పెళ్ళవగానే ఆడపిల్లల్ని చచ్చిన దానితో జమకట్టి పట్టించుకోకుండా వదిలేసే తల్లిదండ్రులు, తమ పరువు ప్రతిష్టలని పక్కన పెట్టి ఆడపిల్లని ఆడుకోవటానికి పర్యవసానం ఎలా ఉన్నా ఎదుర్కోడానికి సిద్ధపడ్డారంటే నిజంగా సంతోషించదగిన విషయమే! కాని.......
    "ఏమిటో.... ఈ కాలం పెళ్ళిళ్ళు కాపురాలు! పెళ్ళయ్యేవరకూ కాలేదన్న చింత. అయ్యేక కాపురాలు ఎలా ఉంటాయో నన్నదిగులు. చూస్తూ వూరుకోలేరు గదా తల్లిదండ్రులు. ఇదివరకటి రోజులేనయమేమో - దాని అదృష్టం ఇంతేనని ఓ ఏడ్పు ఏడ్చి వూరుకునేవారు...." తల్లి చాదస్తంగా గొణుగుతూ లోపలికి వెళ్ళింది.
    నిర్మల వాలు కుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్చింది.
    విద్య తన స్టూడెంటు! కిందటేడు  బి.ఏ. అయి ఈ ఏడాదే ఎమ్మే ఎకనామిక్సులో చేరింది యూనివర్శిటీలో. తన సూడెంటే కాకుండా తమకు రెండిళ్ళ అవతల ఇల్లే అవడంతో 'మేడమ్' అంటూ చనువుగా ఇంటికి వస్తూ పోతూ కబుర్లు చెప్పేది. తన తల్లికి, వాళ్ళ అమ్మగారికి పరిచయాలు పెరిగి కుటుంబ స్నేహితులయ్యారు.   
    విద్య చలాకీ అయిన పిల్ల. ఈ కాలం పిల్లలకి ప్రతీక. ఆమె పెద్ద కళ్ళల్లో విజ్ఞానం.
    చురుకుదనంతో పాటు పంతం, పౌరుషం కనపడేవి. ఆ పెదవి వంపులో పట్టుదల కనిపించేది. విద్య పెద్ద అందగత్తె ఏం కాదు! కాని స్మార్ట్ గా, చలాకీగా గలగల మాట్లాడుతూ, నవ్వుతూ, నవిస్తూతన ఉనికి అందరూ గుర్తించేట్టు చేసుకునేది. గోధుమరంగుతో, ఐదు రెండు పొడుగుతో, సన్నగా, కత్తిరించిన జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని, కనుబొమలు ట్రిమ్ గా షేప్ చేసుకుని, క్రీములు, లిప్ స్టిక్ లతో అందాన్ని మెరుగులు దిద్దుకుని, సలార్ కమీజులు, రకరకాల చీరలు, జీన్ పేంట్స్ ఈ కాలం కాస్త కలవారి అమ్మాయిలెలా ఉంటారో అలా ఉండేది.
    ఇద్దరు మగపిల్లల తర్వాత ఆడపిల్లగా చిన్నప్పటి నుంచి ముద్దుగా పెరిగింది. తండ్రి ఇంజనీరు. ఆస్తిపాస్తులున్నవారు. అంతస్తు, హోదా ఉన్నావారు గనక ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగింది. 'ఇవాళ సినిమాకి వెళ్ళాలి డాడీ' అంటే, ఆయన పనులన్నీ మానుకుని వేళకి ఇంటికి రావలసిందే,'ఈ సెలవులకి ఊటీవెళ్దాం డాడీ' అంటే ఇంటిల్లిపాది ప్రయాణం అయ్యేవారు. ఎవరినన్నా డిన్నరుకి పిలవాలంటే కూతురికి చెప్పాలి! కూతురు చెప్పిన మెనూ ఉండాలి. ఫర్నీచర్ పాతబడిపోయింది మార్చాలి డాడీ అని కొనేవరకూ ప్రాణాలు తీసి కొనిపించేది. సరే.... చీరలు, చెప్పులు, బ్యాగులు, గాజులు అలామ్టి కోరికలకి అంతేలేదు. అవి తీర్చడం పెద్దకష్టం అని వాళ్ళెప్పుడూ అనుకోలేదు.
    తల్లిదండ్రులు కూతురిని ఎంత గారాబంగా చూడనీ, మరీ విచ్చలవిడిగా వదిలేయనందుకు మెచ్చుకోవాలి! బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళతో సినిమాలు, పార్టీలు అంటూ తిరగటం మాత్రం లేదు. ముందునించి కానెంట్, తర్వాత ఉమెన్స్ కాలేజీలో చదవడం వల్ల మగపిల్లలతో పరిచయానికి అంత ఆస్కారం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూతురిని ఒక్కతినే పంపకుండా అందరూ వెళ్ళేవారు. లేదంటే అన్నలనయినా వెంట పంపేవారు. విద్య మంచి మాటకారి. దానికి తోడు తెలివితేటలు వున్నయ్యేమో ఏ సబ్జెక్ట్ గురించన్నా బాగా చర్చించేది, వాదించేది. వాళ్ళీ వూరు వచ్చిన మూడేళ్ళలో స్టూడెంటు, లెక్చరరు బంధం నించి స్నేహితుల్లా మారారు తాము. కల్సి సినిమాలకి వెళ్ళడం, షాపింగులకి వెళ్ళడం, రకరకాల పుస్తకాలు చదివి వాదించుకోవడం మంచి కాలక్షేపంగా మారింది తన వంటరి జీవితంలో విద్య.    
    విద్య బి.ఏ. ఫైనల్లో ఉన్నప్పటి నుంచి విద్య అమ్మగారు పెళ్ళి సంబంధాలు చూడమని పోరడం మొదలు పెట్టింది. ఇంకా ఇరవై ఏళ్ళేగా, ఎమ్మే కూడా కానీ చూద్దాం తొందరెందుకు అనేవారాయన.   
    'ఆ.... ఇప్పుడు ఆరంభిస్తే ఆ వేళకి కుదురుతుంది. మంచి సంబంధం దొరకద్దూ' అని వేధించేది ఆవిడ.
    ఇరుగుపొరుగు, బంధువులు ఎవరే సంబంధం చెపితే అది చూసొచ్చేది ఆవిడ. ఉత్తరాలు రాయించేది. జాతకాలు, ఫోటోలు తెప్పించేది. అన్నింటికీ ఏదో వంకపెట్టేది.
    అబ్బాయి పొట్టని, రంగు తక్కువని, చదువు తక్కువని, ఆస్తి లేదని, ఇలా ఆవిడే మూడొంతులు నచ్చక తిరగ్గొట్టేది. ఆ మిగిలిన ఒకటీ రెండు ఫోటోలకు విద్య ఈ వంకా ఆ వంకా పెట్టి రిజెక్ట్ చేసి పారేసేది.   
    "జాగ్రత్త.... ఇలా ప్రతి సంబంధానికి ఏదో వంకలు పెడితే వీళ్ళకి ఎవరూ నచ్చరు అన్న పేరు వస్తే తరువాత కుమారిగానే మిగిలిపోగలవు" నవ్వుతూ అంది ఓసారి తను.
    "మరీ మంచిది అంటీ, హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, నచ్చింది కట్టుకుంటూ, ఇష్టమైనది తింటూ, కేర్ ఫ్రీ జీవితం గడిపేస్తాను మీలాగ" అంది విద్య నిర్లక్ష్యంగా.                            

Next Page