Read more!
Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 1

                                 


                       ఋగ్వేద సంహిత
                                                                          మొదటి భాగం
                              అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య

 



                                                                    తొలి కిరణం

                                            ఓం నమోవేద పురుషాయ

                                     హృదయం దక్షిణంచాక్షి మండలంచాధిరుహ్యయః |
                                చేష్టతే తమహం నౌమి ఋగ్యజుస్సామ విగ్రహం ||


    కేవలం భగవదనుగ్రహం వలన శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రచన పూర్తి చేయగలిగాను.

    భగవదనుగ్రహం లేక ఏకార్యమూ ప్రారంభమూకాదు - పూర్తికాదు. ఎందుచేతననగా సర్వకర్మలు కార్యాలు భగవదధీనములు.

    ఈ సమస్త భువనమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి.   

    పురుష ఏ వేదం సర్వంయ ద్భూతం యచ్చభవ్యం
    ఉతామృతత్వ స్యేశానోయదన్నే నాతి రోహతి.     ఋగ్వేదం 10-4-90-2


    వేదం హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం వాయువువలె సర్వవ్యాప్తం.

    వేదం అంతటిది. నేను ఇంతటివాణ్ణి! నేనేమిటి వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి?

    ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే మరేమిటి?

    ప్రతిప్రాణికీ అంతో ఇంతో శక్తి ఉంటుంది. అదీ భగవంతుడు ప్రసాదించిందే! ఆ శక్తివరకు పనులు చేసుకుంటే ఆ ప్రాణిశక్తి అనుకుంటే అనుకోవచ్చు. చెప్పుకున్నా చెప్పుకోవచ్చు.

    కాని శక్తినిమించిన పనిచేసిందంటే? చీమకొండను కదిలించిందంటే! ఉడుత సముద్రం పీల్చేసిందంటే? గరుడుడు సూర్యుణ్ణి మింగేశాడంటే?

    ఇవన్నీ కేవలం భగవదనుగ్రహంవల్ల జరిగాయని అనుకోక తప్పదు.

    అలాంటి పనే నేను వేదం అధ్యయనం చేయడం, అనువదించడం!

    అసలు సంకల్పమే ఆశ్చర్యకరం! వెయ్యేళ్లపైబడిన ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంతమంది మహామనీయులు లేరు! వారికి కలుగకపోవడం ఏమిటి? ఏ అర్హతలూలేని నాకు కలగడం ఏమిటి?

    సంకల్పం సహితం భగవంతుడే కలిగించాడు!

    నా బాల్యంలో మాతండ్రిగారు వేదంలోనిదని ఒక మంత్రం చదివేవారు :-

    "దంతాన్ ధావయేత్ప్రాతః పలాశవటపిప్పలైః"

    ఉదయమే పళ్లు తోముకోవాలి. మోదుగు, మఱ్ఱి దానితో అని అర్థం.

    మానవుని దంతధావనం నుంచి సమస్తం వేదం నేర్పిందని చెప్పడం వారి ఉద్దేశం.

    అన్ని వివరించిన వేదం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఆనాడు ఏర్పడింది. నాకు.

    వేదం అనేది మా ఇంట్లో కనిపించలేదు.

    అది రెండో ప్రపంచ యుద్ధకాలం. నేనింకా పిల్లవాన్ని. స్కూల్లో ఉన్నాను.

    అప్పుడు మేము ఖమ్మంలో ఉన్నాం. నలుగురు పెద్దలు కలిసినపుడు "మన వేదాలు ఎత్తుకెళ్లి హిట్లర్ బాంబులు వగైరా చేస్తున్నాడు, అనుకునేవారు. మరోమాటా అనుకునేవారు హిట్లర్ మనవాడు. ఆర్యుడు. అతడే గెలవాలి. మళ్ళీ మనకు వేదాలోస్తాయి" అని.

    అది నాకు వేదాలు మీద మరింత ఆసక్తి కలిగించింది.

    హిట్లర్ పతాకంలో స్వస్తిక్ ఉండేది. ఆర్యులకు తప్ప పాలించే హక్కు లేదనేది అతని వాదం "కృణ్వంతో విశ్వమార్యం" అనేది అతని నినాదం.

    కొద్దికాలం తరువాత యుద్ధం, ప్రపంచ పరిస్థితులూ అర్థం చేసుకున్నాక హిట్లర్ నినాదం ఎంత ప్రమాదకరం అయిందో అర్థం అయింది. హిట్లర్ ఓడితీరాలి అనుకున్నాను. ఫాసిజం ఓడింది.

    ఆ రోజుల్లోనే అంటే 1940 ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా ఖమ్మం హైస్కూల్లో సమ్మె చేయించాను! అప్పుడు నాకు పన్నెండేళ్లు! నిజాంకు వ్యతిరేకంగా సమ్మే!! అది అత్యంత ఆశ్చర్యకరం!!!

    నన్ను స్కూల్లోంచి తీసేశారు. నైజాంలో ఎక్కడా చేర్చుకోరాదని ఫర్మాను చేశారు. రాజద్రోహినని మా నాయనగారు ఇంటినుంచి గెంటేశారు.

    కుటుంబంలో కలతలు. కుటుంబం విచ్చిన్నం కావడం. మేము ఖమ్మం నుంచి గార్లజాగీరుకు మారడం, ఆంధ్ర మహాసభ పోరాట రాజకీయాలతో ప్రభావితులమై మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య, నేను నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం, నైజాం మీద పోలీసు చర్య జరగడం ఒకదానివెంట ఒకటి జరిగిపోయాయి.

    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పోరాట వెల్లువలో వేదాల సహితంగా భారతీయ సాహిత్య అధ్యయనానికి దూరం అయినాం.

    వచ్చిన స్వాతంత్ర్యం మాకు ఏవిధంగానూ ఉపకరించలేదు. నిన్నటిదాకా నైజాంను సేవించినవారే ఖద్దరు కట్టి ప్రభుత్వం వశపరచుకున్నారు!

    ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకున్న నేను స్వయంకృషితో రెండు డిగ్రీలూ, రెండు డిప్లొమాలు సాధించి ఉద్యోగంలోచేరి 1988వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాను.

    ఇంతటి సొంతరొద ఎందుకంటే నాకు పాఠశాల విద్యలేదు. గురువుల వద్ద చదవలేదు. ఆలాంటపుడు నా జ్ఞానం ఎంత? నేనెంత?

    నేను వేదం అనువదించడానికి పూనుకోవడం ఏమిటి? పూర్తి చేయుట ఏమిటి!! దీన్నేమందాం? ఇది కేవలం భగవదనుగ్రహం కాదా!

    ఉద్యోగం చేస్తూనే వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేశాను. వచన రూపంలో రచించాను. 1962లో శ్రీరామా బుక్ డిపోవారు ప్రచురించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, దీపాల పిచ్చయ్య శాస్త్రి. దివాకర్ల వెంకటావధాని వంటి మహా మనీషులు నేను రచించిన రామాయణాన్ని ప్రశంసించారు. అది మరిన్ని ముద్రణలు జరిగి ప్రస్తుతం అందుబాటులో ఉంది.

    1966లో వ్యాస భాగవతము, పోతన భాగవతాలననుసరించి వచన భాగవతం రచించాను. దానిని కూడా శ్రీరామా బుక్ డిపో శ్రీ పబ్బా శంకరయ్యగారు ప్రచురించారు.

    తరువాత కొన్ని నవలలు, కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు.

    1962లో ప్రారంభించిన భారత రచన అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలూ, కలహాలు, కల్లోలాలను అధిగమించి శ్రీముఖ జ్యేష్ఠ ఏకాదశి 31-5-1993న పూర్తి చేయగలిగాను. 2000 పేజీలపైన శ్రీ మహాభారతాన్ని శ్రీరామ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. భవనామ సంవత్సర ఉగాది 11-4-1994న కనువిందైన ఉత్సవంలో "శ్రీమహా భారతమును" స్వామి పరమార్థానంద ఆవిష్కరించి ఆశీర్వదించారు.

    భారత జాతికి అమృత ప్రాయములైన రామాయణ, భారత, భాగవతాలను రచించిన అతికొద్ది మందిలో నేనొకణ్ణి కావడం కేవలం భగవదనుగ్రహమే! ఇంతటి మహత్తమ కార్యము నావంటి సామాన్యునికి సాధ్యం కావడం అబ్బురం కాదా!

    మహర్షి పోతనామాత్యుడు అన్నట్లు

        పలికెడిది భాగవతమట
        పలికించు విభుండు రామభద్రుండుటనే
        బలికిన భవహరమగునట
        పలికెద వేరొండు గాథ బలుకగనేలా!


    వేదాలమీద చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తికి పట్టిన గ్రహణం జ్ఞానోదయంతో విడిపోయింది. విచిత్రం ఏమంటే నాకు ఎవరూ జ్ఞానబోధ చేయలేదు. నేను ఎవరినీ ఆశ్రయించలేదు ఇందుకు రెండు కారణాలు కావచ్చు.

    నామీద భగవంతునికి నిర్హేతుక జాయమాన కటాక్షం కలిగి ఉండాలి.

    నేను పూర్వజన్మలో యోగభ్రష్టుణ్ణి అయ్యుండాలి. 'శుచీనాం శ్రీమతాంగేహేయోగ భ్రష్టోపిజాయతే' అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ గీతలో.

    వేదాన్ని గురించి వేదంలోని వేరు వేరు విషయాలను గురించి ఆంగ్ల గ్రంథాలను 1960 నుంచి అధ్యయనం చేస్తున్నాను. కాని తృప్తిలేదు. మనసు నిండలేదు. 1994లో వేదం వచనంలో రచించాలనే ఆసక్తి ఏర్పడింది. భగవానుడే సంకల్పం కలిగించాడు.

                                           : గ్రంథ పంచయనం :

    వేదం అనువదించాలని నాకు సంకల్పం కలిగినపుడు నా దగ్గర వేదానికి సంబంధించినవి తప్ప వేదం లేదు. వేదం కదా, దొరక్కపోతుందా అనే ధీమాతో ఉపక్రమించాను.

    గ్రంథ సంపాదనమే ఒక యజ్ఞం అయింది. ఎంతో వెదికాను. గ్రంథాలయాలు అన్వేషించాను. విశ్వవిద్యాలయాలు గాలించాను. గ్రంథాలు కనిపించలేదనికాదు. అవి పూర్తిగా లేవు. ఉన్నవి ఉపకరించేవి కావు!

    ఇది ఆదిలోనే హంసపాదుకదా!
    నిరుత్సాహ పరుచును కదా!!
    వదులుకొనవచ్చును కదా!!!

    ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణ్ణి |
    నరోదసీ అద్రుహా వేద్యాభిర్ని పర్వతాని నమేత స్థివాంసః||    3 - 4 - 56 -1


    అన్వేషించగా, అన్వేషించగా వేదప్రతిష్ఠాన్ కొత్తఢిల్లీవారి ఋగ్వేద సంహిత ఆంగ్లానువాదం లభించింది. ఈ సంస్థ నాలుగు వేదాలను ఆంగ్లంలోకి అనువదించ సంకల్పించింది. మూలమంత్రము, రోమనులిపి అనగా ఆంగ్లము లిపిలో మంత్రము ఆ మంత్రపు ఆంగ్లానువాదం స్వామి సత్యప్రకాశ సరస్వతి, సత్యకామ విద్యాలంకార్ కలిసి చేశారు. ఇదొక మహత్తర కార్యం. కాని ఇప్పటికి అయిదు మండలాలవరకే ప్రచురించబడినాయి.

    ఇది ఒక మహత్తర ప్రయత్నం. బహుశా భారతీయ దృక్పథంతో వేదాన్ని ఆంగ్లములో చెప్పే తొలి ప్రయత్నం కావచ్చు!

    ఈ గ్రంథం చదివినపుడు నా ఆనందానికి అవధులు లేవు. అనువాదకులు ఎంతో శ్రమకోర్చి వివరణలు కూడా ఇచ్చారు.

    లభించినవి అయిదు మండలాలే అయినా తరువాత భగవంతుడున్నాడు అని అనువాదం ప్రారంభించాను. వందసూక్తాలపైన అనువదించాను. అప్పుడు నాకు అర్థం అయిందేమంటే ఈ అనువాదానికి ఆధారమైన వ్యాఖ్య విదితం కాలేదని, ఇది స్వతంత్రం అయిన అనువాదం అనిపించింది.    అనేక చోట్ల సాంప్రదాయానికి అనుగుణంగా కనిపించలేదు. పైగా దేవత పేర్లు విశేషణాలుగా వాడబడినాయి.

    ఇది చదువుకోవడానికి బాగుంటుంది. కాని అనువదించి అందించడానికి ఉపకరించదు అనిపించింది. ఎంత ఉత్సాహంగా ప్రారంభించానో అంతనీరుకారి నిలిపివేశాను. గత్యంతరం లేకపోయింది.

                                           : మళ్లీ అన్వేషణ :

    అప్పుడు వినయాశ్రమం వారి "ఆంధ్రవేదములు - ఋగ్వేదము" లభించింది. దీని ప్రచురణ ఒక పవిత్ర కథ.

    పురాణ వాచస్పతి బంకుపల్లె మల్లయ్య శాస్త్రిగారు మూలమంత్రమును, దండాన్వయమును ఆంధ్రమున కూర్చినారు. తొలి సంపుటిలో ద్వితీయాష్టకంలోని తృతీయాధ్యాయం వరకు మాత్రమే ఉంది. తరువాత సంపుటాలు ప్రచురించబడలేదని తెలిసింది.

    నేను వినయాశ్రమానికి వ్రాశాను. వారి దగ్గర నాకు లభించిన ప్రతికూడ లేదని జవాబు వచ్చింది.

                                                     : మళ్లీ అన్వేషణ :

    భువన వాణి ట్రస్టు లక్నో వారు వేదాలను హిందీలోనికి అనువదింప చేయడానికి ఒక బృంహత్ ప్రణాళిక రచించారు. మంత్రం, మంత్రానికి ప్రతిపదార్థం, హిందీ పద్యానువాదం, తాత్పర్యం ఇలా ఉండానికి నిర్ణయించారు. ఇదొక మహా ప్రయత్నం.

    ఈ ప్రయత్నంలోని భాగంగా ఋగ్వేద సంహితకు పద్యానువాదం ఆచార్య మున్షీరాం శర్మసోమ్ రచించగా శబ్దార్ధ తాత్పర్యాలు జనార్ధన్ గంగాధర్ రటాటే మరియు సుధాకర్ మాలవీయ సమకూర్చారు.

    ఇంతవరకు ఇందులో ప్రథమాష్టకం మాత్రమే ప్రచురించబడింది.

                                           : మళ్లీ అన్వేషణ :

    సంస్కృత ప్రచురణ కర్తల కేటలాగులు వెదికాను. అప్పుడు నాకు 'చౌఖంబా విద్యాభవన్' వారి ఋగ్వేద సంహిత గోచరం అయింది. అది నా అవసరానికి సుమారు తగినట్లుగా ఉంది.

    ఇది సంపూర్ణ ఋగ్వేద సంహిత, ఎనిమిది అష్టకాలూ పదిమండలాలూ ఉన్నాయి.

    మంత్రం స్వరయుక్తంగా ఉంది.

    పాద పాఠములున్నాయి.

    సాయణాచార్యుల భాష్యం ఉంది.

    పండిత రామగోవింద త్రిపాఠీ వచన హిందీ అనువాదం ఉంది.

    సాయణుని సంప్రదాయ వ్యాఖ్య కావాలనుకున్నాను. అది లభించింది.

    నాకు సంజీవని లభించినట్లయింది! అమృతం చేతికందినట్లయింది!! చందమామ దోసిట నిలిచినట్లయింది!!! పుస్తక ప్రియులకు తెలుసుకోవలసిన పుస్తకం లభించడం, వలచిన వనిత లభించడం లాంటిదని!

    ఇది లభించడమూ భగవదనుగ్రహమే! మరి ఇంత ఎందుకు ఏడిపిస్తాడయా అంటే వీడి ఆసక్తి వీడి సంకల్పం వీడి కృషి ఎంత బలమైనవో పరీక్షిస్తాడు!!

    బిడ్డ ఏడుపు వినగానే పని వదిలిరాదు తల్లి. బిడ్డ గట్టిగా ఏడవాలి. అప్పుడు పరిగెత్తుకొని వస్తుంది. ఎత్తుకుంటుంది. ముద్దాడుతుంది. పాలిస్తుంది.

    భగవంతునిది మాతృ స్వరూపం!

    తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు మూల సహిత పద్యానువాద ఋగ్వేదం ప్రచురించారు. అది గాలివలె ఉన్నది అని తెలిసింది. కంటికి కనిపించలేదు.

    అది ఉన్న అనేక మంది వద్దకు నేనూ - మిత్రులూ వెళ్లాం. వారు సత్యవాదులు! లేదనలేదు!! ఇవ్వనూలేదు!!!

    సాక్షాత్తు దేవస్థానం ప్రచురణ విభాగం వారిని అర్థించాను. వారు పరబ్రహ్మ స్వరూపులు! ఆకార రహితులు! అగుపించలేదు!!!

    అయ్యా! ఇది సాంతం స్వయంకృషియే! ఇందు సహకరించని మేఘాడంబరులు ఎక్కువ. చిరుజల్లు కురిపించినవారు బహుకొద్ది.

    ఇది ప్రకృతి నియమం - మనం కావాలనుకున్నది దూరం కావడం!

                                                : రచన :

    ఋగ్వేద వచన రచన నాతోనే చేయించదలచినట్లున్నాడు పరాత్పరుడు. అందువలననే నిరాశ చెందిన నాకు అవసరమైన గ్రంథం లభించింది. నేను అనుకున్న సాయణ భాష్యం లభించింది. భగవదారాధనచేసి భవసంవత్సర పుష్యపూర్ణిమ 16-1-1995 మళ్లీ తొలిసూక్తం నుంచి ఆంధ్రానువాదం ప్రారంభించాను.

    వేదం పవిత్రం అయింది. అయితే అన్యమత గ్రంథాలవలె పేరుకు ముందు వెనుక "పవిత్ర" పదంలేదు. మంత్రానికి మాన్యత ఉంది. అయినా ఇది మాన్యత గలది అని వాచ్యంగా చెప్పడం జరుగలేదు.

    అగ్ని జ్వాలను, సూర్యచంద్రాదులను పరిచయం చేయపనిలేదు. పేరు తెలియకున్నా ప్రభావం చూపకమానరు?

    అనువాదం అసలు రచన కన్న కష్టం. ఈ విషయం రెండు భాషల్లో రచనలు చేసేవారికి తెలుసు. స్వీయరచనలో స్వేచ్చ ఉంది. భావాలు, భాష తనది. అది తాను కన్న బిడ్డ. అది ఎలా ఉన్నా బాధ్యత తనదే!

    అనువాదం అలాకాదు. భావాలు మరొకరివి. భాష అనువాదకుడు కూర్చాలి. పరిధి సంకుచితం అవుతుంది. రచయిత గీసింది లక్ష్మణరేఖ. అనువాదకుడు అదిదాటలేడు. అది మరొకరు కన్నబిడ్డ. ముద్దూముచ్చట అనువాడకుడు తీర్చాలి! అతనిని కొడితే అనువాదకుడు ఏడవాలి!!

    నాకు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృత భాషల నుంచి అనువదించిన పూర్వానుభవం ఉంది. పరభాషకు ఆంధ్రభాషారూపం కల్పించడంలో విజయవంతుడనైనానని చాలామంది అన్నారు.

    నేను ఇప్పుడు అనువదిస్తున్నది మానవ మాత్రులు రచించిన రచనను కాదు. అపౌరుషేయములైన పవిత్ర మంత్రాలను.

    సంస్కృతం ఒకే భాషా అయినా దానికి విభిన్న రూపాలున్నాయి. వైద్య సంస్కృతం, జ్యోతిష సంస్కృతం, కావ్య సంస్కృతం ఇలా అనేక ముఖాలు గలది సంస్కృతం. మిగత సంస్కృతాలు తెలిసిన వారికి వేద సంస్కృతం అంత సులభంగా అర్థంకాదు. దానికి ప్రత్యేక పరిశ్రమ, కృషి అవసరం.

    అన్ని భాషల్లోను ఒక్కొక్క పదానికి ఒకటికి మించిన అర్థాలుంటాయి. అర్థం అంటే తెలియపరచడం. అర్థం అంటే కారణం. అర్థం అంటే ధనం. అర్థం అంటే ప్రయోజనం. ఇది మనకు తెలిసిన సాధారణ పదం. 

    అనాది కాలాన ఏర్పడిన ఋగ్వేద మంత్రాల పదాల అర్థాలు అనేకాలు ఉంటాయి. ఏ పదానికైనా సమయ సందర్భాలనుబట్టే అర్థం ఉంటుంది.

    ఈ సమయ సందర్భపు అర్థం చెప్పేవాడు భాష్యకారుడు! మనముందే ఒక వస్తువు ఉంటుంది. అది మనకు అర్థంకాదు. తన కరదీపికతో ఆ వస్తువును, దాని ఉపయోగాన్ని మనకు తెలియపరచేవాడు వ్యాఖ్యాత. భాష్యకారుడు. అతని వెలుగు లేకుంటే పదాలన్నీ మనకు తిమిరగోళాలవుతాయి!

    ఇది అన్ని కాలాల సాహిత్యాలకూ వర్తిస్తుంది. మల్లినాధసూరి వ్యాఖ్యలేనిది కాళిదాసు అంత అందంగా అర్థం కాడు. ఈ సూత్రం ఆధునిక సాహిత్యానికీ వర్తిస్తుంది.

Next Page