Next Page 
అథర్వ వేద సంహిత పేజి 1

                                 

                  

                              శ్రీ మదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
                               
           --అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య.                 
            

        

                                  

 

 

                            యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
                             నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
                                  శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత
                                                              మొదటి కాండ
                                                   మొదటి అనువాకము
                             మొదటి సూక్తము - మేధా జననము- 1

   
    యే త్రిషప్తాః పరియన్తి విశ్వారూపాణి బిభ్రతః |
    వాచస్పతిర్భలా తేషాం తన్వో2అద్యదదాతు మే ||
   
1.    త్రిసప్తలు విశ్వరూపధారులై ఉన్నారు. సర్వత్ర పరివ్యాప్తులై ఉన్నారు. వాచస్పతీ! వారి సమస్త బలములను నా యందు ప్రవేశపెట్టుము.
   
వ్యాఖ్య :    సృష్టియందు త్రిసంఖ్యలని ఉన్నవి. 1. భూలోక, భువర్ణోక, సువర్ణోకములు. 2. వానికి అధిష్టాతలగు అగ్ని, ఆదిత్య, వాయువులు. 3, సత్వరజస్తమోగుణములు. 4. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు.
   
    సృష్టియందు సప్త సంఖ్యాకములు ఉన్నవి.
   
    1. సప్తర్షులు 2. సప్తగ్రహములు, 3. సప్తమరుత్తులు, 4. సప్తలోకములు 5. సప్త ఛందములు.
   
    అట్లే 7 x 3 = 21 సంఖ్యాకములు కూడ ఉన్నవి.
   
    1.7 గ్రహములు + 7 గురు ఋషులు  + 7 మరుద్గణములు  =21
   
    2.12 మాసములు +5 రుతువులు +3 లోకములు + ఆదిత్యుడు =21
   
  3. దేహమునకు ఆధార భూతములగు 5 భూతములు + 5 ప్రాణములు + 5 జ్ఞానేంద్రియములు + 5 కర్మేంద్రియములు  + 1 అంతః కరణము = 21
   
    సృష్టి సాంతము 3, 7, 21 మీద ఆధారపడి ఉన్నది. వాక్కులకు ప్రభువు వాచస్పతి. ఆ సృష్టియందలి సమస్త బలములను తనయందు ప్రవేశపెట్టుమని వాచస్పతిని ప్రార్దించుచున్నాడు.
   
2.    వాచస్పతీ! మంచి మనసుతో మరల మరల విచ్చేయుచుండుము.
   
    వాచస్పతీ! నాకు ఆనందము కలిగించుము. నేను విన్నది నాలోన నిలుచును గాక.
   
వ్యాఖ్య:-    మొదటి మంత్రమున వాచస్పతిని సమస్త బలములు ప్రసాదించుమని ప్రార్ధించినాడు. బలములు క్షయములు. అందువలన మరల మరల విచ్చేయ మనుచున్నాడు. అదియు మంచి మనసుతో రమ్మనుచున్నాడు.
   
    బుద్దిజనకుడు వాచస్పతి. అతనిని ప్రార్ధించి వసోష్పతిని ప్రార్ధించుచున్నాడు. వసుపతి ధనపతి అగును. అతని భౌతిక సంపదలు ప్రసాదించి పరమానందము కలిగించుమని ప్రార్దించుచున్నాడు.
   
    ఇహ వాచస్పతిని, వసోష్పతిని తనకు వారు కలిగించిన వానిని తనయందు స్థిరపరచుమని ప్రార్దించుచున్నాడు.
   
    వచ్చిన ప్రతిది పోవలసినదే. ఇది ప్రకృతి నియమము. అట్లుకాక తనయందు చేరిన బుద్ది బలమును సంపదను తనయందే నిలుపుమని ప్రార్ధన.
   
3.    వాచస్పతీ! ధనుస్సు రెండు కొనలను అల్లె త్రాడు కలిపినట్లు నాకు ఇహ పరములను కలిగించుము. మయ్యే వాస్తు మయి శ్రుతమ్. అట్లు నాకు కలిగినవి నా యందే నిలుచును గాక.
   
వ్యాఖ్య:-    జీవితమను వెదురుబద్దకు ఇహ, పరములను అల్లెత్రాడు కట్టినపుడే ధనుస్సు వలె అది ప్రయోజనకరమగును. దానికి బుద్ది తోడైనపుడు మాత్రమే జీవితము ధనుస్సు వలె విస్తరిల్లును.
   
    కావున జీవితమునకు ఇహ, పర సుఖములు వానిని విస్తరింపచేయు బుద్ది అవసరము. ఏది లోపించినను అది వెదురు బద్ద మాత్రమగును.
   
4.    మేము వాచస్పతిని మావద్దకు ఆహ్వానించుచున్నాము. వాచస్పతీ! ఫలప్రదానమునకు మమ్ము నీ వద్దకు పిలుచుకొనుము. నీ అనుగ్రహమున మేము శ్రుతులను చదువుదుము గాక. చదివినవి మరువకుందుము గాక.
   
వ్యాఖ్య:-    జ్ఞానము కలిగించుము. కలిగించిన జ్ఞానమును తరుగనీయము.
'శ్రుతి' వేదమగును. వేదముల జ్ఞానము కలిగించుమని అర్ధము. "అనన్తా వై వేదాః" వేదములు అనంతములు. అనంతమగు జ్ఞానము కలిగించుమని ప్రార్ధన.
   
                              రెండవ సూక్తము - విజయ సూక్తము - 2
   
1.    బాణపు తండ్రియు, మహావర్షహర్షము కలిగించు పర్జన్యుని ఎరుంగుదుము. ఈ బాణపు తల్లియు విశాలమగు పృథ్విని మేము ఎరుంగుదుము..
   
వ్యాఖ్య:-    యుద్దపు బలము వర్షము - భూమి మీద ఆధారపడిన విషయము మొదట గ్రహించవలసి ఉన్నది. ఆయుధమున వర్షబలము, భూమి బలము చేరవలసి ఉన్నది.
   
    ఆహారబలము లేని ఆయుధము విజయము కలిగించజాలదు. ఇది నిత్యసత్యము.
   
 2.  శత్రువు చేతి బాణమా! మమ్ము విడువుము. అవనతమగుము. మా శరీరములను శిలలవంటి గట్టి వానిని చేయుము.
   
    శత్రువులను స్తంభింపచేయు ఇంద్రా! మా శత్రువులను వారు తలపెట్టు అపకారములను తొలగించుము.
   
వ్యాఖ్య:-    ఘ్రుత, సత్తు హోమము చేసినాను. కావున నీ బాణము నా మీద పనిచేయదు. లొంగి పొమ్ము.   
   
    అది కుదరకున్న నా దేహమును శిలవలె బాణమునకు అభేద్యమగునట్లు చేయుము.
   
    ఆ రెండు కుదరనిచో శత్రువును స్తంభింపచేయు ఇంద్రుడు శత్రువును తొలగించవలెను.
   
    ఇవి శత్రువును జయించు ఉపాయములు.
   
3.    వృక్షరూపమే ధనుర్ధండము. దానిని పట్టుకొని ఉన్నది అల్లెత్రాడు. దానిలో సంధించిన శరము మిరుమిట్లు గొలుపుచు మా మీదకు వచ్చుచున్నది. ఇంద్రదేవా! వెలుగులు చిమ్ము ఆ శరమును మాకు తాకకుండ తప్పించుము.
       
                                                     మరొక అర్ధము.   
       
    శత్రురాజు వృక్షము వంటివాడు. నీడ కొరకు వృక్షచ్చాయను ఆశ్రయించిన గోవుల వలె శత్రుసేన అతనిని ఆశ్రయించి ఉన్నది. ఆ సేన చేతులందు బాణములు, కళ్ళతో లక్ష్యము చేసి మిరుమిట్లు గొలుపు శరములు నా మీదకు విడుచుచున్నవి. ఇంద్రదేవా! వెలుగులు చిమ్ము ఆ శరములను మాకు తాకకుండ తప్పించుము.
   
వ్యాఖ్య -    పై రెండు మంత్రములు ఫలించకున్న ఇంద్రునే 'నీవేతప్ప ఇతః పరంబెరుగ' అని శరణు వేడుచున్నాడు.
   
4.    భూమ్యాకాశముల మధ్య వెదురు గడ నిటారుగా నిలిచి ఉండును. మనిషిని కృంగ దీయు జ్వరము, అతిసారము, అతిమూత్రము ముంజా రజ్జు బంధనమునకు లొంగి మనిషిని నిటారుగా నిలుపును గాక.
   
వ్యాఖ్య -    మూత్రపురీషము నిలిచి పోయినంత మేహమును హరించు కరక్కాయ, కర్పూరము కట్టవలెను.
   
    2. ఎలుక తిరిగిన నేలమీద నిలపెట్టవలెను.
    3. పెరుగులో మధించిన జీర్ణ 'మందవృక్ష' పు ముక్కలను తినిపించవలెను :
    4. ఏనుగు, గుర్రపు స్వారి చేయించవలెను.
    5. బాణము సంధింప చేసి విడిపించవలెను.
    6. మూత్రనాళికలోనికి లోహశలాకను దూర్చవలెను. ఆధునిక వైద్యమున ఈ పద్దతి అమలులో ఉన్నది. ఇది ఒక విధపు శస్త్రచికిత్స.
   
                                         మూడవ సూక్తము - ఆరోగ్య సూక్తము -3
   
1.    విద్మా శరస్య పితరం పర్జన్యం శతవృష్ణ్యమ్ |
    తేనాతే తన్వే ౩ శం కరం పృథివ్యాం తే నిషేచనం బహిష్టే అస్తు బాలితి ||

   
    శరము యొక్క పితరుడు శతవృష్టి యగు పర్జన్యుడని మాకు తెలియును. మూత్రరోగీ! నీ బాధకు ఉపశమనము కలిగింతును. నీ రోగము నేల పాలు అగును గాక. నీ మూత్రము ధ్వని చేయుచు బయట పడును గాక.
   
2.    విద్మా శరస్య పితరం మిత్రం శతవృష్ణ్యమ్ |
    తేనా తే తన్వే ౩ శం కరం పృథివ్యాంతే
    నిషేచనం బహిష్టే అస్తు బాలితి||

   
    పైమంత్రపు "పర్జన్యుని" స్థానమున "మిత్రుని" తప్ప అర్ధము అదియే. వరుణం - చన్ద్రం సూర్యమ్ అని తదుపరి మూడు మంత్రములు అట్టివే.
   
3.    విద్మా  శరస్య పితరం వరుణం శతవృష్ణ్యమ్ |
    తేనా తే తన్వే ౩ శం కరం పృథివ్యాం తే
    నిషేచనం బహిష్టే అస్తు బాలితి||       

Next Page