Read more!
 Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 2

4.    విద్మా శరస్య పితరం చన్ద్రం శత వృష్ణ్యమ్ |
    తేనా తే తన్వే ౩ శం కరం పృథివ్యాం తే
    నిషేచనం బహిష్టే అస్తు బాలితి||
   
5.    విద్మా శరస్య పితరం సూర్యం శత వృష్ణ్యమ్ |
    తేనా తే తన్వే ౩ శం కరం పృథివ్యాం తే
    నిషేచనం బహిష్టే అస్తు బాలితి||

   
వ్యాఖ్య:    మూత్రరోగిని మబ్బులో, వానలో, వెన్నెలలో, ఎండలో ఉంచి చేయు చికిత్స వలె ఉన్నది.
   
6.    మూత్రరోగీ! నీ ఆంత్రములందు, పార్శ్వములందు మూత్రకోశమున మూత్రము నిలిచి ఉన్నది.
   
    "ఏవాతే మూత్రం ముచ్యతాం బహిర్భాలితి సర్వమ్" || ఆ మూత్రమంతయు చప్పుడు చేయుచు బయట పడును గాక.
   
7.    నిలువ నీటికి కాలువ ఏర్పరచినట్లు మూత్ర నాళాన్ని భేదిస్తున్నాను.
    "ఏవాతే మూత్రం ముచ్యతాం బహిర్భాలితి సర్వమ్."
   
8.    సముద్రమునకు చేరునది విశాలమైనట్లు నీ మూత్రాశయ ద్వారమును తెరచినాను.
    "ఏవాతే మూత్రం ముచ్యతాం బహిర్భాలితి సర్వమ్."
   
9.    ధనుస్సు యొక్క అల్లెత్రాటిని వదిలిన బాణము శర వేగమున లక్ష్యము చేరినట్లు
    "ఏవాతే మూత్రం ముచ్యతాం బహిర్భాలితి సర్వమ్."
   
వ్యాఖ్య:- నాకు మూత్రము బిగపట్టుట తెలియును. దానికి శస్త్రచికిత్స చేయించుకున్నాను. తదుపరి వచ్చిన మూత్రప్రవాహము, బాధా విముక్తి తెలియును. దానిని ఎంతో అందముగా వివరించినాడు. ప్రతి మూత్రరోగి, చికిత్సకుడు ఇట్లే ప్రార్దింతురు.
   
                                నాలుగవది జలసూక్తము -4
   
1.    జలములు మాతృమూర్తులు - భగినులు. అవి హోమ ద్రవ్య యుక్తములై ప్రవాహించుచున్నవి. అవి తేనె, పాలతో కలియుచున్నవి.
   
2.    వృష్టి రూపమున ద్యులోకము నుండి వచ్చునదియు, జగత్కల్యాణ కారకమగు జలము సూర్య మండలమున ఉన్నది. సూర్యుడు సహితము జలములతో కూడి ఉన్నాడు. ఆ సమస్త జలములు మా అధ్వరమును సంప్రీతము చేయును గాక.
   
3.    మా గోవులు నీరు త్రాగు స్థలమునకు దేవీరూపమగు జలమును ఆహ్వానించుచున్నాను. జలదేవి హవిస్సు ఆజ్యాదులను అందించును గాక.
   
4.    జలమున అమృతము ఉన్నది. జలమున ఓషధులున్నవి. జనులారా! ఆ నీరు త్రాగండి. ఆరోగ్యవంతులు కండి. అమృతమూర్తులు కండి. అశ్వములారా! ఆ జలప్రభావమున మీరు బలవంతులు, వేగవంతులు కండి. గోవులారా! ఆ నీరు త్రాగి మీరు బలవంతులు, క్షీరవతులు కండి.
   
                                        ఐదవ సూక్తము -5
   
1.    జలములారా! మీరు సుఖములు కలిగించువారు. మాకు అన్నము కలిగించు సమర్ధులు అగుదురు గాక. మమ్ము మహాజ్ఞాన యోగ్యులను చేయండి.
   
2.    జలములారా! ఈ లోకమున మీ యొక్క రసములు పరమ సుఖ స్వరూపలు అగుచున్నవి. తల్లులు పిల్లలకు చన్నిచ్చినట్లు - మాకు మీ రసములు అందించండి.
   
3.    జలమా! ఏ పాపము నాశనమగుటకు నీవు మాకు ప్రేరణ కలిగించుచున్నావో, ఆ పాప క్షయమునకు గాను నిన్ను తలచుచున్నాను. మాకు ఉత్పాదక శక్తి కలిగించుము.
   
4.    జలము ధనములకు ప్రభువు. నరుల కోరికలు తీర్చునది. అట్టి జలమును ఔషధము అర్ధించుచున్నాము.
   
                                      ఆరవ సూక్తము - 6
   
1.    జలదేవి మా అభియజనమునకు శుభము కలిగించును గాక. మాకు పాన యోగ్యము అగును గాక. మా వ్యాధులను ఉపశమింప చేయుటకు మా ముందు ప్రవాహించును గాక.
   
2.    నాతో సోమము అన్నది:- "నీటిలో సంస్థ భేషజములు ఉన్నవని, లోకములకు శుభములు కలిగించు అగ్ని సహితము జలములందున్నాడని."
   
3.    జలమా! వ్యాధి నివారకములకు ఔషధములను నా దేహమందు ప్రవేశపెట్టుము. నన్ను చిరకాలము సూర్యుని దర్శించు వానిని చేయుము.
   
4.    మరుభూమిలోని జలము మాకు సుఖప్రదమగును గాక. జలప్రదేశమందలి జలము సుఖప్రదమగును గాక. కూప జలము సుఖప్రదమగును గాక. నదులు, చెరువుల నుంచి కుండలో ఇంట ఉంచిన జలము సుఖప్రదమగును గాక. వర్షజలము సహితము మాకు సుఖము కలిగించును గాక.
   
                                         రెండవ అనువాకము
                            మొదటి సూక్తము - అపనోదన సూక్తము -7

   
1.    అగ్నిదేవా! నమస్కరించినంత రాక్షస వధ చేయువాడవు కదా! నిన్ను మేము స్తుతించుచున్నాము. రమ్ము రాక్షస వధ గావింపుము.
   
2.    అగ్నిదేవా! నీవు పరమేష్టివి. జాత వేదివి. సమస్త జనులను నీ వశమున ఉంచుకున్నవాడవు. విచ్చేయుము. మా హవిని సేవింపుము. బలశాలివి ఆగుము. రాక్షసులను ఏడిపించుము.
   
3.    సర్వభక్షక అగ్నీ! ఎందుకు ఆలస్యము? రాక్షసులను అంతమొందించుము. తదుపరి ఇంద్ర సహితుడవై మా ఘ్రుతాది హవిస్సులు అందు కొనుటకు విచ్చేయుము.
   
4.    అగ్నిదేవా! దేవతలందరికన్న ముందే రాక్షసులను దండించ నారంభించుము. తదుపరి ప్రశస్త బాహు బలశాలి ఇంద్రుడు వారిని తరిమి వేయును గాక. అప్పుడు యాతనలు పెట్టువారు పేర్లు చెప్పుకొని పారి పోవుదురు గాక.
   
5.    అగ్నీ! నీ శౌర్య పరాక్రమములను చూచుచున్నాము. నీవు సమస్తము తెలిసిన జాతవేదివి. నరుల చేష్టలను ఎరుగు నృచక్షువవు. మమ్ము మరల బాధించ వలదని యాతుధానులను ఆజ్ఞాపించుము. నీ ఆజ్ఞచొప్పున రాక్షసులు ఏడ్చుచు తమ పేర్లు చెప్పుకొని ఇచటికి వచ్చి ధ్వంసమగుదురు గాక.
   
6.    జాతవేద అగ్నీ! నీవు మా గ్రహపీడలు దూరము చేయవలసిన వాడవు. కోరికలు తీర్చవలసినవాడవు. అనర్ధములు నివారించ వలసినవాడవు. మాకు దూతవై రాక్షసులను నాశనము చేయుము.
   
                                                       రెండవ సూక్తము - 8
   
1.    నది తన ప్రవాహ వేగమున వెదురును అన్య ప్రదేశమునకు చేర్చును. అగ్నియు అట్లే మా హవిస్సులు అందుకొని రాక్షసులను అన్య దేశమునకు చేర్చును గాక. అభిచార హోమము ఫలించని స్త్రీ,పురుషులు ఇచటికి చేరి అగ్నిని స్తుతింతురు గాక.
   
వ్యాఖ్య:-    అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును. రాక్షస బాధ హెచ్చును. అట్టి వారు రాక్షసులు లేని చోట అగ్నిని ఆరాధించిన బాధలు తొలగును.
   
2.    బృహస్పతి మున్నగు దేవతలారా! ఇతడు బాధితుడై మిమ్ము స్తుతించుచు వచ్చుచున్నాడు. అతనిని మీ వానిగా భావించండి. అగ్ని సోములారా! రక్షించండి.
   
మరొక అర్ధము.

   
    అగ్ని సోమ దేవతలారా! ఈ రాక్షసుడు మిమ్ములను చూచినాడు. బెదిరినాడు. మిమ్ము స్తుతించుచు మీ వద్దకు వచ్చుచున్నాడు. వాడు మాకు శత్రువని గ్రహించండి. బృహస్పతీ! నీవు వానిని వశపరచు కొనుము.
   
3.    అగ్నీ! నీవు సోమ పానము చేయువాడవు. రాక్షసులను పుత్ర పౌత్ర సహితముగ వధించుము. మాకు అభీష్ట ఫలములను ప్రసాదించుము. మా శత్రువు నీకు భయపడి నిన్ను స్తుతించుచున్నాడు. వాని కుడి కంటిని పెరికి వేయుము. వాని నికృష్టపు ఎడమ కంటిని పొడిచి వేయుము.

4.    అగ్నిదేవా! నీవు సర్వము తెలిసిన వాడవు. ఈ రాక్షసుల - వారి పుత్ర పౌత్రుల - జన్మ స్థానము నీకు తెలియును.
   
    అగ్నీ! నీవు మంత్రములచే వర్ధిల్లుము. ఆ రాక్షసులను సమూలముగా ధ్వంసము చేయుము.
   
                                       మూడవ సూక్తము - 9
   
వినియోగము:-
   
1.    సర్వ సంపత్కర్మలందు వాసిత యుగ్మ కృష్ణాలమణిని కట్టవలె. తల్లి, దూడ ఒకే రూపము గల ఆవుపాలతో అన్నము వండవలెను. ఆ అన్నమున మనిషి బొమ్మ గీయవలెను. దానిని భక్షించవలెను.
   
2.    త్రయోదశి నుంచి మూడు రోజులు మణిని పెరుగు, తేనె గల పాత్రలో ఉంచవలెను. నాలుగవ రోజు మణిని కట్టుకొని పెరుగు, తేనె తినవలెను.
   
3.    శత్రువుచే రాజ్యము నుండి తరిమి వేయబడిన రాజును అతని రాజ్యమున మరల చేర్చుటకు కోసిన చోట పెరిగిన ధాన్యపు అన్నమును ఈ సూక్తముచే తినిపించవలెను.
   
4.    ఆయుష్యము కోరువాడు రెండు నీలమణులను అన్నముతో ఉడికించవలెను. మణిని కట్టుకొని అన్నము తినవలెను.
   
5.    ఉపనయనమున వటువు అనుమంత్రణమున ఈ సూక్తము వినియోగమగును.
   
6.    ఐరావతి గజక్షయమున పనికి వచ్చును.
   
7.    పుష్పాభిషేకమున వాడబడును.   
   
1.    ఇతడు సంపదలు కోరుచున్నాడు. వసువులు, ఇంద్రుడు, పూష, వరుణుడు, మిత్రుడు అగ్ని అతనికి సంపదలు కలిగింతురు గాక. ఆర్యమ, ఆదిత్యులు, సకల దేవతలు ఇతనికి వర్చస్సు కలిగింతురుగాక.
   
2.    దేవతలారా! సూర్యుడు, అగ్ని, హిరణ్య జ్యోతులు ఇతని అధీనమునందు ఉండునట్లు శాసించండి. శత్రువులు నికృష్టులు అగుదురు గాక. దుఃఖము ఎరుగని స్వర్గమునకు ఇతనిని ఎక్కించండి.
   
3.    జాతవేద అగ్నీ! మంత్రముల వలన నీవు దేవతలకు పాలు మున్నగు హవిస్సులు అందించుచున్నావు. ఇతడు సంపదలు అర్ధించుచున్నాడు. ఆ మంత్రములతోనే ఇతనిని ఈ లోకమున వర్ధిల్లచేయుము. సమానులందు ఇతనిని శ్రేష్టుని చేయుము.
   
4.    అగ్నీ! నేను నీ భక్తుడను. నీ అనుగ్రహమున శత్రువుల యజ్ఞాదులు హరించినాను. శత్రువుల ధనములను, ప్రాణములను హరించినాను. శత్రువులు నా అధీనులు అగుదురు గాక.
   
    దేవతలారా! ఇతనిని ఉత్తమమగు స్వర్గమునకు ఎక్కించండి - "నాకమధిరో హేయమ్"
   
                                        నాలుగవ సూక్తము - 10
   
    జలోదర నివారణకు 21 దర్భలకట్ట, ఇంటి గడ్డితో "అయం దేవానాం" మంత్రములు చదువుచు తలస్నానము చేయించవలెను.
   
1.    దేవతలందరిలో వరుణుడే పాపులను దండించువాడు. అందువలననే అతడు దీప్తుడు. సత్యములు వరుణుని అధీనమున ఉన్నవి. నేను వరుణుని స్తుతించినాను. సంతుష్టుని చేసినాను. శక్తిమంతుడను అయినాను. వరుణుని క్రోధమున జలోదరము కలిగినవానికి నయము చేయుచున్నాను.
   
2.    వరుణదేవా! నీవు సమస్త ద్రోహులను ఎరింగిన వాడవు. నీ క్రోధమునకు నమస్కరించుచున్నాను. నీ వద్దకు వేల మందిని పంపుచున్నాను. వారిని ఆరోగ్య వంతులను చేసి శతశరత్తుల ఆయువు ప్రసాదించుము.
   
3.    జలోదరరోగీ! నీవు అబద్దము ఆడినావు. అసత్యము మహాపాపము. అదే జలోదర కారణము. రాజగు వరుణుడు సత్య భాషి అట్లయినను నిన్ను వరుణుని జలోదర వ్యాధి నుంచి విముక్తి కలిగింతును.
   
4.    జలోదర రోగీ! వైశ్వానరునకు హితుడగు వరుణుని నుండి నిన్ను విముక్తుని చేయుచున్నాను.
   
    వరుణదేవా! నా స్తుతులు వినుము. సంతోష పడుము. నీ కింకరులకు ఇతనిని బాధించవలదని శాసించుము.
   
                                        ఐదవ సూక్తము - 11

వినియోగము:-
    ఈ సూక్తముచే గర్భిణి తల మీద 'సంపాభిహుత' ఉష్ణజలమును పోయవలెను.
    శాలా గ్రంథివిమోచన, యోక్త్రబంధనాది సుఖప్రసవ పుత్ర జనన కర్మలు ఆచరించవలెను.
   
1.    పూషదేవా! ఇది ప్రసవ కర్మ. ఆర్యమ, వేధ హోతలై నీకు వషట్కారమున హవి అందింతురు గాక. ఈ స్త్రీకి సుఖప్రసవము అగును గాక. ప్రసవ సంబంధ ఆటంకములు తొలగి పోవును గాక.
   
2.    దివి యందలి నాలుగు దిశలు, భూమి యందలి నాలుగు దిశలు, దేవతలు ఈ గర్భముతో కూడి ఉన్నారు. ఇప్పుడు ఆ దేవతలే గర్భము నుండి బయట పడుటకు తెర తొలగింతురు గాక.
   
3.    సూషదేవతా! మావిని వేరు చేయుము. మేము సహితము సుఖప్రసవము కొరకు గమన మార్గమును వెల్లడి చేయుచున్నాము.
   
    సుఖప్రసవ దేవీ! నేను చేయునట్టి ఈ సుఖప్రసవ కార్యమునకు ప్రసన్నవగుము. గర్భిణి యొక్క సంధి బంధములను విడువుము.
   
    సూతి మారుత దేవీ! గర్భముఖమును దిగువకు ప్రేరేపించుము.
   
4.    ప్రసవినీ! 'మావి' మాంసము కాదు. దానికి ధాతువులు, స్నాయువులతో సంబంధము లేదు. అది నీటి మీది నాచు వంటిది. అట్టి మావి కుక్కలు తినుటకు క్రింద పడిపోవును గాక.
   
    (అందువలన నీ బలము తగ్గదు అని.)
   
5.    గర్భిణీ! నేను నీ యోనిని శిశు నిర్గమన యోగ్యము చేయుచున్నాను. నిర్గమన ప్రతిబంధక ములగు నాడులకు వ్యాప్తి కలిగించుచున్నాను. తల్లిని బిడ్డను వేరు వేరు చేయుచున్నాను. బిడ్డనుండి మావిని తొలగించుచున్నాను. మావి క్రింద పడును గాక.
   
6.    గర్భమున ఉన్న శిశువా! నీవు గాలివలె, మనసువలె, ఆకాశమున ఎగురు పక్షుల వలె నిరాటంకముగ పది నెలలు తల్లి కడుపున ఉండి మావి సహితముగ గర్భము నుండి వెడలుము.
   
వ్యాఖ్య -    ప్రసవించు తల్లికి వైద్యులు సమస్తము వివరించుచున్నారు. భయము పోగొట్టుచున్నారు. వాస్తవములు చెప్పుచున్నారు.

 Previous Page Next Page