"ఉత్తరం రాస్తే స్టేషన్ కి వచ్చేదాన్నిగా" అంది. తల్లి చేతిలో సూట్ కేస్ అందుకుంటూ.
ఆవిడ రమ్య మాటకి జవాబు చెప్పకుండా, ఇల్లంతా కలయచూస్తూ అడిగింది.
"మీ ఆయనేడి?"
"మా ఆయనా?" తెల్లబోయింది రమ్య.
వెంటనే అర్ధమైనట్టు నవ్వేసి-
"నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తారు" అంది.
రమాకాంత్ సీరియస్ గా చూశాడు కూతురి ముఖం ;లోకి.
"నిన్న వచ్చి వెళ్ళడం ఏవిటి? శనివారం రావడం ఏమిటి? క్యాంప్ కెళ్ళాడా?" ఈ ఊళ్ళో ఉండడా?"
రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చీ రాగానే వాళ్ళ మనసు పాడు చేయడం ఇష్టం లేకపోయింది. వాళ్ళ కర్ధం కాని అనుభవం లోకి రాని ఆ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్విన్స్ చేయడం కష్టం . అందుకే నవ్వుతూ.
"ముందు మీ ఇద్దరూ బ్రెష్ చేసుకోండి. కాఫీ ఇస్తాను. మంచి ఫిల్టర్ కాఫీ' అంది.
'అది కాదే...." ఏదో అడగబోతున్న భార్య ని వారించి, రమాకాంత్ బ్రెష్ చేసుకోడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కుని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది.
కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి.
"ఈ ఇంటికి అద్దెంత? ఇరుగుపొరుగు అవసరం వస్తే సాయం చేస్తారా?"
రమ్య నవ్వుతూ , "ఇరుగుపొరుగు అవసరం వస్తేసాయం చేయడానికి రారమ్మ, అవసరం లేకపోయినా కామెంట్స్ చేయడానికి వస్తారు" అంది.
"కామెంట్స్ చేసే అవకాశం మనం ఇస్తే ఎందుకు చేయరు?" రమాకాంత్ అన్నాడు.
రమ్య చురుగ్గా చూసి ఊర్కుంది.
"ఇంతకీ ఏడే ఇతను...." మళ్ళీ అడిగింది భువనేశ్వరి.
"అతనిక్కడ ఉండడమ్మ....సురేష్ ఇల్లు వేరే ఉంది. భార్య పిల్లలతో ఉంటాడు."
"మరి నువ్వు ఆతనితో బతుకుతున్నానన్నావెం" ఆవిడ అయోమయంగా చూసింది.
"అవునమ్మా...."
'అంటే?" అతనికి ఉంపుడు కత్తే గా బతుకుతున్నావా?" తీవ్రంగా అన్నాడు రమాకాంత్.
"నాన్నా!" సీరియస్ గా పిల్చింది.
'అలాంటి మోటు పదాలు ఉపయోగించకు నాన్నా. సురేష్ నా ఫ్రెండ్. నేనతనికి ఫ్రెండ్ ని. ఒకరినొకరు నచ్చాం. ప్రేమానురాగాలు పెంచుకున్నాం. కలిసి బతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాం."
'అంటే?" పెళ్ళి కాకుండానా కలిసి బతికేది?"
"కలిసి బతకాలంటే పందిట్లో భాజాభజంత్రీల మధ్య మంత్రాల సాక్షిగా వేలమందికి భోజనాలు పెట్టి, పెళ్ళి చేసుకొని కొంగులు ముడేసుకుని బతకదమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం, భర్తగా అతను నా మీద అధికారాలు చెలాయించడం, భార్య నంటూ అతని సంపాదన మీదా, వ్యక్తిత్వం మీదా హక్కులు ప్రదర్శించడం ...ఇదా జీవితం."
"నోర్ముయ్యవే! అపు నీ వితండవాదం, ఎమ్మే చదివి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పదానివయ్యావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ, గౌరవంగా బతుకుతావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాం. అంతేగానీ, ఇలాంటి నీచమైన పనిచేసి మా పరువు తీస్తావనుకోలేదు. ఛీ నీకేం ఖర్మే, లక్షణంగా పెళ్ళి చేసుకోక ఈ ఉంపుడు కత్తే బతుకేంటి?" మండిపడింది భువనేశ్వరి.
'అమ్మా! పెళ్ళి చేసుకుని కాపురాలు చేస్తున్న వాళ్ళెంత మంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బతుకుతున్నారు? అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకున్న వాళ్ళు విడిపోవడం లేదా? మొక్కుబడికి మొగుడితో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ ఛీ...ఛీ... నాకలాంటి జీవితం ఇష్టం లేదు. రసానుభూతి లేని బతుకు నాకొద్దు..."
"రసానుభూతా! నీ బొందా! ఇదేం కధల్లో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ మొహాన ఉమ్మేస్తారు. అయినా తోటి ఆడదాని మొగుణ్ణి వల్లో వేసుకోడానికి ఆ పిల్ల ఉసురు పోసుకోడానికి నీకు సిగ్గు లేదు" చీదరింపుగా అంది.
"ఎందుకు సిగ్గు! ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన అడిగానా? అతని ఆస్తి పాస్తుల్లో భాగం అడిగానా? అతణ్ణి నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరికి పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికోసారి వస్తాడు. నా దగ్గరికి రెండు రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికే వెడతాడు. ఉన్న ఆ కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాం. మామధ్య దాపరికాలు, అనుమానాలు లేవు. మనసా, వాచా ఒకరికోకరుగా బతుకుతున్నాం."
రమాకాంత్ మెల్లిగా నోరు విప్పాడు.
"నీచుట్టూ ఉన్నవాళ్ళు అతనేవరని అడిగితె ఏం చెప్తావు?"
"అసలెందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవలసిన అవసరం వాళ్ళ కెందుకు?"
'అంటే నీకంటూ ఓ భద్రత గల జీవితం , నీ చుట్టూ గౌరవనీయ మైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటం లా బతుకుతావా?"
"తెగిన గాలిపటం ఎలా అవుతాను నాన్నా? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ స్వంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకా ఏం కావాలి?" రమ్య నచ్చ చెబుతున్నట్టుగా అంది.
రమాకాంత్ నవ్వాడు.
"ఇంకా ఏం కావాలో, నేనిప్పుడు చెప్పినా నీకర్ధం కాదు. కాలం గడిచిన కొద్ది నువ్వు ఏం కోల్పోయావో నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు."
"ఎందుకు నాన్నా! ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు. నాకు నచ్చిన విధంగా బతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వలన నాకేం అపకారం జరుగదు. సాయంత్రం రమ్మంటాను. మీరే చూడండి" అనునయంగా అంది రమ్య.
"సరే రమ్మను. నీకంతగా నచ్చిన ఆ వ్యక్తీ ఎవరో నాకూ చూడాలని ఉంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో అతణ్ణి మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకు రాకు" ఖచ్చితంగా అన్నాడు.
"ఏం?" కొంచెం విస్మయం, బాధ కలగలిపిన స్వరంతో అడిగింది.
"అతనేవరని నా చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలీక నేను తెల్ల మొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటె నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెళ్ళో తాళి బొట్టన్నా ఉండి ఉంటె అతనికి రెండో భార్య వాణి సమాధాన పడేవాణ్ణి."
"తాళి కంట విలువుందా నాన్నా మీ దృష్టి లో , నేను తాళిని ఓ ఆర్నమెంట్ గా భావిస్తాను.అది వేసుకోడం తప్పనిసరి అయితే ఇవాళే తెచ్చుకుని వేసుకుంటాను."
"నోర్మూయ్యవే పాపిష్టి దానా! పవిత్రమైన మాంగల్యం గురించి అట్లా మాట్లాడటానికి నీకు నోరెలా వస్తోంది?" గయ్యి మంది భువనేశ్వరి.
రమ్య అదోలా చూసింది. తల్లి వైపు. రూపాయి నాణెం అంత తాలిబోట్లు ఆవిడ గుండెల మీద వెళ్ళాడుతున్నాయి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు , నల్లపూసలు.
"హు , పవిత్రత! దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకీ, వస్తువులకీ పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనసుకి సంబంధించినది. తాళి బొట్టుని పసుపు కుంకుమలతో పూజిస్తారు కాబట్టి, దానికో పవిత్రత ఆపాదించబడింది. అలాంటివేగా ఈ నగలు. ఈ ఉంగరం , దిద్దులు, కూడా. పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత్తో తోడించుకోనా?"
"తల్లీ! నీకూ, నీ పెద్దలకీ నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదు. మా అమ్మా నాన్నా నాకు ఒకటే నేర్పారు. నీలా బరితెగించడం నేర్పలేదు. నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ఏవండీ! లేవండి వెళ్ళిపోదాం. ఇంక ఒక్క క్షణం కూడా నేనిక్కడ ఉండలేను." విసురుగా లేచింది భువనేశ్వరి.
రమాకాంత్ ఆవిడ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు. "ఆవేశ పడకు భువనా! సాయంత్రం నీ అల్లుడు కాని అల్లుణ్ణి చూసి వెళ్దాం. ఓపిక పట్టు."
"ఛీ" చీదరించుకుందావిడ.
రమ్య మనసు చివుక్కుమంది ఆవిడ చీదరింపు కి.
తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా? తనకేది ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తు నిర్మించుకుంది. అందువలన వీళ్ళు పొందే నష్టం ఏమిటి? ఎందుకు అమ్మ తనని అసహ్యించుకుంటోంది. రోబోట్ ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి వుండాల్సిందేనా! ఎంతవరకు సమంజసం! ఏవిధంగా న్యాయం.