Previous Page Next Page 
ఒప్పందం పేజి 2

    "అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా?" తీవ్రంగా చూసింది.
    "నువ్వే పేరైనా పెట్టుకానీ నాకిదే సక్రమం అన్పిస్తోంది. ఎందుకంటె పెళ్ళికాని వాడైతే నాకు బాధ్యత లుంటాయి. నేను ఫ్రీ బర్డ్ లా బతకాలను కుంటున్నాను. భర్త, పిల్లలు వాళ్ళకి వండి వార్చటాలు.....సేవలు చేయడాలు ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడు నిత్య నూతనంగా , రసతవత్తరంగా ఉండాలి. యాంత్రికం కాకూడదు."
    సౌజన్య కోపంగా చూస్తూ అంది, "నిజంగానే నీకు పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు?"
    సౌజన్య కోపాన్ని మురిపెంగా చూస్తూ అంది రమ్య. "ఎల్ ఐసి ఆఫీసు లో పనిచేస్తున్నాడు. సురేష్, సుమారు ఏడాదిన్నర అవుతోంది నేనతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తరవాత తరవాత అప్పుడప్పుడు కలుసుకోవడం, నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్ధం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు , అభిరుచులు కలిశాయి. అయితే ఒకరోజు హటాత్తుగా తెలిసింది నాకు అతనికి అప్పటికే పెళ్లైందని. పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను. మండిపడ్డాను. బాధపడ్డాను. ఆ తరువాత ఆలోచిస్తే అనిపించింది ఇదీ ఒకందుకు మంచిదే అని."
    సౌజన్య ఓ విచిత్ర వ్యక్తీ ని చూస్తున్నట్టు చూస్తూ రమ్య చెప్పేది వింటోంది.
    రమ్య మళ్ళీ చెప్పసాగింది. "భర్త అనే పేరుతొ ఓ వ్యక్టి రోజూ ఇరవై నాలుగ్గంట లూ నాతొ కలిసి బతకడం , ఇద్దరం అనుక్షణం ఒకరిఎదురుగా ఒకరుండడం, నిద్ర లేవడం, పడుకోడం, తినడం, ఆఫీస్ కెళ్ళడం , అలసి పోయి రావడం, కీచులాటలు, అపార్ధాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం ఇవన్నీ నాకిష్టం లేదు. మేమిద్దరం కలిసి బతకాలను కుంటున్నాం. కానీ రొటీన్ భార్య భార్తల్లా కాదు. మంచి స్నేహితుల్లా. మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటి కప్పుడు మా కలయిక కొత్తగా అపూర్వంగా ఉండేలా మలచుకుంటాం." నా జీవితం నాది అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనాలు లేవు. ఉండవు. అమూల్యమైన కాలం అంతా భర్త సేవల్లో గడిపేస్తూ కేవలం గృహిణి లా బతకడం నాకసహ్యం. నేను సాధించాల్సినవెన్నో ఉన్నాయి. నేను పి.హెచ్.డి చేయాలను కుంటున్నాను. నాకోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగుల్చు కోవాలను కుంటే నాకిలాంటి జీవితమే కావాలి."
    సౌజన్య కొంచెం చిరాగ్గా అంది. 'అలాంటప్పుడు అతనితో ఈ బతుకు కూడా ఎందుకు? వంటరిగా బతకచ్చుగా. అన్నీ అయ్యాకే పెళ్ళి చేసుకో.'
    "బతకొచ్చు కానీ కాలం కన్నా అమూల్యమైనది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తరువాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలి ఉంటుంది?"
    'అంటే నీకు ఓ మగవాడు కావాలీ కానీ భర్త వద్దు అంతేనా?"
    "పొరపాటు సౌజన్యా. నాకు ఓ స్నేహితుడు కావాలి. మానసికంగా శారీరకంగా నాతొ కలిసిపోయి నన్ను ఆనందింప జేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ ని నేను ప్రేమిస్తున్నాను. అతని కన్నా గొప్పగా నన్నెవరూ అర్ధం చేసుకోలేరీ ప్రపంచంలో , ప్రేమించాను కదా అని నేనటానికి భార్య నై అతణ్ణి నా గుప్పిట్లో ఉంచుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు."
    "మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు?"
    "ఎందుకు చెప్పాలి? నా బతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికెక్కడిది?"
    "మనం సంఘజీవులం కాబట్టి"
    "కావచ్చు, సంఘజీవిని కాబట్టే మేమానందించడానికి ఓ ఇల్లు, వాకిలీ చూసుకున్నాం. లేకపోతే పచ్చిక బయలే పాన్పుగా నీలాకాశమే దుప్పటి గా హాయిగా స్వేచ్చగా ఉండేవాళ్ళం."
    "పిల్లలు పుడితే?"
    "ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏం? ఏమవుతుంది?"
    "వాళ్ళకి తండ్రిగా సురేష్ ని పరిచయం చేయగలవా?"
    "నీవన్నీ అర్ధం లేని సందేహాలు సౌజన్య! నేను బతికేది సురేష్ తో అయినప్పుడు అతడు నా పిల్లలు తండ్రి అని ఎందుకు చెప్పుకోను?అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. నేనిప్పుడప్పుడే పిల్లల్ని కనాలనుకోవడం లేదు."
    "కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు?ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలిగా! అప్పుడు సురేష్ ని చేసుకుంటే నీ పెళ్ళి చెల్లుతుందా?"
    రమ్య, సౌజన్య వైపు నిదానంగా చూసింది.
    'చూడు! నా దృష్టి లో పెళ్ళి అనివార్యం కాదు. పెళ్ళంటే ఓ తాళి వేసుకోవడం! అంతేగా! ఇందులో చెల్లక పోడానికే ముంది?సురేష్ డబ్బు మీదా, ఆస్తి మీదా నేను అధికారాలు కోరినప్పుడు పెళ్ళి చెల్లడం చెల్లకపోవడం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మామధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హి లవ్స్ మీ . అంతే మా ప్రేమ సాక్షిగా మేము కలిసి బతకాలని నిశ్చయించుకున్నాం."
    "ఏమో రమ్యా!నీదోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురీదుతున్నావేమో అనిపిస్తోంది. ఎంతవరకూ సక్సెస్ అవుతావో!" నిట్టురుస్తూ అంది సౌజన్య.
    రమ్య చిరునవ్వుతో "నా గురించి ఎక్కువగా ఆలోచించకు. హాయిగా నిద్రపో. గుడ్ నైట్' అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది.
    రమ్య కాసేపట్లో నిద్రపోయింది. వివాహం పట్లా, భర్త పట్లా నిర్దుష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్య కి మాత్రం చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు.
    మర్నాడే రమ్య రూమ్ కాళీ చేసింది.
    సురేష్ తో బజారు కెళ్ళి చాప, రెండు తలగడలూ, కొంచెం స్టీలు సామానూ , ఒక స్టవ్ కొంది. ఓ ఫోల్దింగ్ కాట్, కొంత ప్లాస్టిక్ సామాను కూడా కొంది. సురేష్ డబ్బివ్వ బోతే తీసుకోలేదు. రెండు రోజుల్లో ఓ ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి.
    కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీల కూ, గుమ్మాలకీ కర్టెన్లు కట్టింది.
    సురేష్ ఓ పది రోజుల దాకా రెండు రోజులకో సారి వచ్చాడు.
    చప్పటి సాంబారు , పీచు తీయని బీన్స్ కూర తినలేకా, బ్రెడ్ , ఫాస్ట్ పుడ్స్ తో కడుపు నింపుకున్న రమ్యకి తన చేత్తో వండుకుని తినడం హాయిగా అన్పిస్తోంది.
    "నీకు వంట చేయడం బాగానే వచ్చే" అన్నాడు సురేష్ ఆరోజు గుత్తి వంకాయ తింటూ.
    "వంటచేయడం నా హాబీ"నీకు రాదా?' అడిగింది.
    "ఎప్పుడూ చేయలేదు. అవసరం రాలేదు. తను వాళ్ళమ్మ గారింటికి వెళితే మా అమ్మ వండుతుంది" అన్నాడు.
    "ఇక్కడ అవసరం రావచ్చు నేర్చుకో" నవ్వింది.
    "చిత్తం" వాష్ బేసిన్ దగ్గర కెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఇద్దరూ భోజనాలు పూర్తీ చేశాక, వంటగది సర్దేశారు.
    "పనిమనిషి ని మాట్లాడుకోకూడదు" అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో.
    "వద్దు, మనిద్దరి మధ్యా మూడో వ్యక్తీ ఉండడం నాకిష్టం లేదు. పైగా పనివాళ్ళ కి అన్నీ ఆరాలు కావాలి"
    "నిజమే, వద్దులే" ఆమె కదిగినవన్నీ సర్దేశాడు.
    హాల్లోకి రాగానే "రమ్యా ఇప్పుడే వస్తాను, తనకి ఒంట్లో బాగాలేదు. ఎలా ఉందొ! ఓసారి ఫోన్ చేసి వస్తాను" అన్నాడు.
    "ఓ.కే. వెళ్లిరా"
    సురేష్ కిందికి వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోడానికి రెండు బ్లాంకెట్ లు పెట్టింది. అగరవత్తులు వెలిగించింది. సాయంత్రం వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన మల్లె పూలదండ జడలో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది.
    కిటికీ రెక్క తెరిచింది. బైట వాతావరణం హాయిగా ఉంది. చల్లగాలి వీస్తోంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ మిణుకుమంటున్న తారలు ట్రాన్సి స్టర్ అన్ చేసింది. వివిధ భారతి లో పాత హిందీ పాత "ఏ రాహే ఏ మౌనమ్ నదీకా కినారా....ఏ చంచల్ హవా" గుండెనిండా పులకరింతలు.
    సురేష్ కింది కెళ్ళి పదిహేను నిమిషాలైంది. అసహనంగా కిటికీ లోంచి బైటికి చూసింది. రోడ్డు దాటి, హడావుడిగా వస్తున్నాడు సురేష్.

                                                  ***

    రమ్య సంసార రధం రసరమ్యంగా సాగిపోతోంది. హాస్టల్ కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి వరుళ్ళ వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు మూడు.
    అన్నిటికీ కలిపి ఓ సుమూహుర్తంలో జవాబు రాసి పడేసింది.
    నాన్నగార్కి,
    నాకు సంబంధాలు వెతకొద్దు. నా ఫ్రెండ్ సురేష్ తో కలిసి బతకడానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు.
    "కలిసి బ్రతకడం" అంటే అర్ధం కాని రమాకాంత్ , భువనేశ్వరి తిరుగు టపా లో వచ్చారు . రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లి దండ్రుల్ని చూసి ముందు బోల్డంత ఆశ్చర్యపోయినా తరువాత చాలా ఆనందించింది రమ్య.

 Previous Page Next Page