Previous Page Next Page 
ఒప్పందం పేజి 4

    రమ్య మనసులో అనేక సందేహాలు ఒక్కసారిగా ముప్పిరి గోన్నాయి. "నేను వంట చేసి, ఆఫీస్ కెళ్ళి వస్తాను. మీరు భోం చేసి రెస్ట్ తీసుకోండి." అంది మంచం మీంచి లేస్తూ.
    "నీచేత్తో వండిన వంట నేను తినను." కోపంగా అన్నది భువనేశ్వరి.
    "పోనీ , నువ్వే వండు నీ చేతి వంట తిని చాలా రోజులైంది" అల్లరిగా అన్నది రమ్య.
    'అవసరం లేదు. నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను."
    రమాకాంత్ రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళల్లో బాధ రెపరెపలాడుతోంది. భువనేశ్వరి కఠినమైన మాటలకి ఆమె మనసు గాయం అయిందని తెలుస్తోంది. అందుకే భార్య నుద్దేశించి అన్నాడు. "భువనా! లే.... లేచి వంట చేయి."
    భువనేశ్వరి అయిష్టంగా లేచి, స్నానానికి బాత్రూం వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గానీ వంట జోలికి వెళ్ళదు. రమ్య ఇల్లు సర్దుకోడం , కూరలు తరగడం వగైరా పనుల్లో పడిపోయింది.
    రమ్య ఆఫీస్ కి వెళ్తూనే ముందు సురేష్ కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది.
    సాయంత్రం ఐదున్నరకి కూతురు తో కలిసి వచ్చిన సురేష్ ని చూసిమొహం చిత్లించుకుంది భువనేశ్వరి.
    రమాకాంత్ పొడిపొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ళ ,మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఓ పరిచయస్తురాలితో మాట్లాడినట్టు ఒకటి, రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు.
    రమ్యకి చిత్రంగా అన్పించింది. అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయి వాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్ధం కాలేదు. బహుశా అమ్మా నాన్నల్ని చూసి మొహమాటపడి ఉంటాడు అనుకుంది.
    "మీ ఇద్దరి మధ్యా ఎంతో అన్యోన్యత ఉందన్నావు. ఇంతేనా!" కొంచెం హేళనగా అడిగాడు రమాకాంత్.
    "మీరు కొత్త పైగా మీరూ అలాగే ప్రవర్తించారుగా" ఉక్రోషంగా అంది.
    "అందంగా ఉన్నాడని నీవైపు తిప్పుకున్నావా?" ఈసడించింది భువనేశ్వరి.
    'అంత అసహ్యంగా మాట్లాడకమ్మా. ఇతని కన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకీ జీవితం నచ్చిందంటే అర్ధం చేసుకోరేం" కోపంగా అంది.
    రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు- "సరే! నీకు నచ్చింది కాబట్టి నువ్విలాగే బతుకు. ఈమధ్య లో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించద్దు. నా సలహా అడగొద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చేడులన్నింటి కీ నువ్వే బాధ్యురాలివి."
    'సరే నాన్నా నాకే సమస్యా రాదు. హక్కులు, అధికారాల కోసం, ఆరాటం ఉంటె దెబ్బ లాటలు వస్తాయి. మామధ్య గిల్లికజ్జాలు తప్ప, దెబ్బలాటలు ప్రసక్తి రాదు. ఇంక సమస్యేం ఉంది."
    నవ్వాడు రమాకాంత్. "ఒకే. గుడ్ లక్" అన్నాడు లేస్తూ. భువనేశ్వరి సూట్ కేస్ తీసుకుంది.
    "వెళ్ళిపోతున్నారా?" అడిగింది రమ్య.
    "ఉండి చేసేదేం ఉంది!" నిర్లిప్తంగా అన్నారిద్దరూ.
    "సరే, మీ ఇష్టం" రమ్యకి బాధగా అనిపించినా గుండె దిటవు చేసుకుని వాళ్ళని రైలెక్కించి వచ్చింది.
    వస్తూ వస్తూ దారిలో పబ్లిక్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది. "నీకసలు బుద్దుందా? ఎవరో పరాయి వాళ్ళు విజిట్ చేసినట్టు వచ్చి వెళ్తావా? అసలే వాళ్ళకి లక్ష అనుమానాలు. నీ ప్రవర్తనతో మనిద్దరి మధ్యా ఉన్న అనుబంధం వాళ్ళు అసలు అర్ధం చేసుకోలేదు. నేను నీదాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచనే లేనట్టుందే"
    "రమ్యా" విసుగ్గా పిలిచాడు సురేష్.
    స్వరం తగ్గించి, "ఈ విషయం మాట్లాడడానికి ఇదేనా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళాం పిల్లలున్న వాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళెం అనుకుంటారు." అన్నాడు. రమ్యకి ఒళ్ళు మండింది. "అవన్నీ నేనాలోచించాలి. నువ్వు కాదు. నేను చెప్పలేదా వాళ్ళకీ విషయం? అయినా....' ఫోన్ పెట్టేసింది.
    అంటే తను మంచివాడని పించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చ లేదామెకి. ఒక నిర్ణయం తీసుకున్న తరువాత మంచైనా, చెడైనా ధైర్యంగా దానికి కట్టుబడాలి. ఎదుర్కోవాలి. కానీ ఇదేమిటి? మనసు చికాగ్గా అయిపొయింది. చాలాసేపు ఒక్కతే టాంక్ బండ్ మీద కూర్చుని తరువాత ప్లాట్ కి వెళ్ళిపోయింది.
    మర్నాడు సురేష్ ఆఫీస్ కెళ్ళి చెడామడా దులిపేసింది. "అర్ధం చేసుకో రమ్యా! మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తిస్తాను?' నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు సురేష్.
    "నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పడటమా? కొంచెం ఫ్రీగా మాట్లాడవచ్చుగా. అలా అంటీ ముట్టనట్టు మాట్లాడితే వాళ్ళెం అనుకుంటారు. పైగా వాళ్ళెవరో కాదు,. మా అమ్మ నాన్నా."
    "రమ్యా, కొన్ని విషయాలు నాకిష్టం ఉండదు. అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టకు...ప్లీజ్"
    విసురుగా వచ్చేసింది.
    సురేష్ కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా?" కానీ తనకలా ఇష్టం లేదు.
    దొంగతనం చేసినట్టు ఎందుకలా? తనేం తప్పు చేస్తోందని! ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు రమ్యకి.
    ఆరోజు, మర్నాడు కూడా చాలా చిరాగ్గా అన్పించింది. ఒక్కదానికి బోర్ అన్పించింది. చలం 'ప్రేమలేఖలు' చదివింది. చాలా ఎక్కువసార్లు చదవడం చేతనేమో బోర్ అనిపించింది. తలుపు తీసుకుని బైటికి వచ్చింది.
    పక్క ప్లాట్ లోని ఇద్దరు యువతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య వాళ్ళని చూసి, పలకరింపుగా నవ్వింది.
    వాళ్ళు నవ్వుతూ పలకరించారు.
    "భోజనమైందా?"
    "అయిందండీ" నవ్వుతూ చెప్పింది రమ్య.
    "మీఇంటికి చుట్టలోచ్చినట్టున్నారు" ఒక యువతి అడిగింది.
    "మా అమ్మ, నాన్నా వచ్చారండీ. వెళ్ళిపోయారు."
    "అప్పుడేనా?"
    కొంచెం ఇబ్బందిగా అంది. "అవును, మా కజిన్ పెళ్ళి, పెళ్ళికి వచ్చారు."
    "మరి మీరు వెళ్ళలేదేం"
    "ఊరికినే"
    "మీవారు లేనట్టున్నారు" అసలు విషయాని కోస్తున్నారు. ఇంక సంభాషణ పెంచడం అనవసరం.
    రమ్య ఆవలిస్తూ అంది, "బాగా అలసి పోయాను.... నిద్రొస్తోంది, గుడ్ నైట్" లోపలికి వెళ్ళి తలుపేసుకుంది.

                                                 ***

    శనివారం సురేష్ అఫీస్ దగ్గరికి వచ్చాడు.
    రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది.
    "ఇవాళ సినిమా కెళ్దామా?"
    "సారీ  రమ్యా! ఇవాళ నిధి పుట్టినరోజు. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కాస్సేపు కూర్చుని వెళ్దామని వచ్చాను."
    నిధి సురేష్ పెద్ద కూతురు.
    రమ్య కొంచెం హుషారుగా అంది. 'అరె! ఆ విషయం ముందు చెప్పవచ్చు గా, మంచి గిప్ట్ కొందాం. నేనూ వస్తాను మీ ఇంటికి"
    "నువ్వా! వద్దొద్దు" ఖంగారుగా అన్నాడు.
    అతనన్న తీరుకి రమ్య మనస్సు చివుక్కుమంది.
    "ఏం సురేష్! నేను రాకూడదా! అందరం కలుసుకుంటూ ఉండవచ్చుగా."
    సురేష్ కేం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యని ఇంటికి తీసుకెళితే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్య నేమన్నా అంటే తను బాధపడుతుంది.
    "ఏం అనుకోకు రమ్య! ఇంకోరోజు నేనే తీసి కేల్తాను మా ఇంటికి."
    స్కూటర్ అపార్ట్ మెంట్ ముందు ఆగింది.
    రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి పాలు, పంచదార , టీ పొడి కలిపి కేటిల్ స్టవ్ మీద పెట్టింది.
    సురేష్ వెనగ్గా వచ్చి ఆమెని చుట్టేసి కాస్సేపు ఊపిరి సలపనివ్వ లేదు.
    రమ్య విసురుగా విడిపించుకుని సీరియస్ గా అంది. "సురేష్! మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు . కానీ నీ కూతురు పుట్టిన రోజు అన్నావు కదా! అని నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం. గంట కోసం వచ్చి ఇలాంటి కక్కుర్తి పనులు చేయద్దు. నాకిష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనుకు నాకు నచ్చవు."
    "సరే, తల్లి! ముట్టుకోను. తప్పై పోయింది" చెంపలేసుకుని కిచెన్ ప్లాట్ ఫామ్ ఎక్కి కూర్చున్నాడు.
    టీ కప్పు అందిస్తూ నిదానంగా అతణ్ణి చూస్తూ అడిగింది.
    "నిజం చెప్పు మన విషయం మీ ఆవిడకు చెప్పలేదు కదూ!"
    "లేదు, చెప్తే ఏడుపులు, గొడవలు ఎలా చెప్పను?"
    "మన సంగతి తెలిసినవాళ్ళు ఎవరన్నా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పచ్చు కదా! అలా చెప్తే మనం అందరం ఒకటిగా కలిసి పోవచ్చుగా."
    సురేష్ రమ్యని వింతగా చూశాడు. 'అదెలా సంభవం రమ్యా! మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా!"
    "ఎందుకవుతుంది? మనం బాహాటంగా తిరుగుతున్నాం"
    "కావచ్చు. తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బతుకుతున్నట్టు ఆధారం ఏం ఉంది?"
    "అంటే?"
    "చూడు రమ్యా! మనిద్దరి అనుబంధం తీయనిది. అపూర్వమైనది. ఇది అందరికీ తెలిసి చులకన అవడం నాకిష్టం లేదు. వివాహేతర సంబంధాలని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మనవాళ్ళ కింకా ఏర్పడలేదు. అక్రమ సంబంధం అనీ, ఉంచుకోవడం అనీ పేర్లు పెడతారు."
    సురేష్ మాటలు నిజమే అన్పించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తోంది రమ్యకి. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పచ్చు కదా! మాములుగా అందరిలా బతకొచ్చు కదా!
    సురేష్ లేచి రమ్య దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకుని లాలనగా అన్నాడు. "పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రేపు వస్తాగా లెటజ్ ఎంజాయ్ మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తుంటుంది."
    రమ్య నవ్వింది. "ఒకే వెళ్ళు. నా విషెస్ అందజేయి."
    "ఒష్యూర్ " సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు.
    కిటికీ లోంచి వెళ్ళిపోతున్న అతణ్ణి చూస్తోంటే ఆమెకి ఎలాగో అన్పించింది. మనసంతా బ్లాంక్ గా తన వస్తువు నెవరో తన నుంచి లాక్కెళ్ళి పోతోన్నట్టు తననెవరో సమాజం నుంచి బహిష్కరించి, రిమోట్ ప్లేస్ కి విసిరేసినట్టు.

 Previous Page Next Page