ప్రేమీ మాట్లాడలేదు. కాని, బ్రద్దలుకాబోతున్న అగ్నిపర్వతంలా ఉందనిపించింది సువర్చలకు. ఆ అగ్నిపర్వతం సుందరయ్య ముందు ప్రేలుతుందేమో! పాపం, ఆ ముసలాడు ఈ పిల్ల కోపానికి ఎలా తట్టుకొంటాడో? సుందరయ్యను తలుచుకొంటే సువర్చలకి జాలేసింది. ప్రేమీని శాంతపరచాలని ఉంది! కాని, ఆ భగభగలు, ఆ ఆవేశం బయటికి కక్కితేనే ఆ పిల్ల మనసు శాంతిస్తుందని ఊరుకొంది.
ప్రేమీ సుడిగాలిలా ఇల్లు చేరింది. గేటు విసురుగా తోసుకొని పరుగున లోపలికి వచ్చింది.
సుందరయ్య వంటకి పెట్టలేదుగాని, వంటకి కావలసిన కూరగాయలు కడిగి శుభ్రంగా తరిగి ఉంచాడు గిన్నెల్లో. ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర చక్కగా ముక్కలుచేసి ప్లేటులో ఉంచాడు. ఉల్లితొక్కలు, ఏరిపారేసిన కూర ఆకులు శుభ్రంగా ఎత్తి పెరట్లో పాతబకెట్లోవేసి చేతులు కడుక్కుని లోపలికి వస్తున్నాడు.
"తొందరగా వచ్చాశావేం? అమ్మగారు లేరా?" అన్నాడు ప్రేమీని చూస్తూనే.
ప్రేమీ చేతిలో ముడిచి పట్టుకొన్న పేపరు తీసి సుందరయ్య ముందు విసిరికొట్టింది. "నాన్నా! ఆ ప్రకటన పేపరు కిచ్చేముందు నాకెందుకు చెప్పలేదు? నువ్వు నాతో చెప్పకుండా చేసే పనులుంటాయని నే నెప్పుడూ అనుకోలేదు!" అగ్నిపర్వతం భళ్ళుమన్నట్టుగా అడిగింది.
తుఫాను వస్తుందని ముందుగా ఊహిస్తే అందకు సన్నద్దమయ్యే ఉంటాడు మనిషి! తుఫాను వచ్చాక అసలు బెదరడు. సుందరయ్య ఈ పరిస్థితిని ముందే ఊహించాడు కనుక ప్రేమీ అరుపుకు తొణకలేదు! వంగి పేపరు చేతిలోకి తీసుకొన్నాడు. వెళ్ళి మంచంమీద కూర్చొని పేపరు విప్పాడు!
బాక్స్ కట్టి మధ్యలో ప్రచురించిన ఆ ప్రకటన పేపరు తెరిచిన ప్రతిఒక్కరినీ వెంటనే ఆకర్షిస్తుంది!
ఆ ప్రకటన ఇలా ఉంది!
"సరిగా ఇరవై సంవత్సరాల క్రితం ప్రియదర్శిని హాస్టల్ బిల్డింగ్ మీదినుండి అప్పుడే పుట్టిన ఒకపాప క్రింద ముళ్ళతుప్పల్లోకి విసిరివేయబడింది! ఆరోజు ఆపాప తాలూకు మేనమామ అంగీకారంతో ఆ పాపని నేను పెంపకానికి తీసుకొన్నాను! ఆ పాపని అల్లారుముద్దుగా పెంచిన నాభార్య నాలుగు సంవత్సరాల క్రిత్ర్హం స్వర్గస్తురాలైంది. ఇప్పుడు నా ఆరోగ్యమూ బాగుండలేదు! ఆస్తమాతో బాధపడుతున్నాను! ఈ అనారోగ్యపు శరీరం ఎప్పుడు నేలకూలుతుందో తెలియదు. నేనుకూడా పోతే పాప ఈ ప్రపంచంలో ఏకాకి అవుతుంది! ఆ పాపతాలూకు బంధువులుగాని, కన్నతల్లిగాని ఉంటే వచ్చి పాపని తీసికెళ్ళవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను! ఇట్లు, సుందరయ్య. పాతమలక్ పేట, ఇంటినంబరు."
ప్రేమీ శాసిస్తున్నట్టుగా అంది! "నన్ను వంటరిదాన్ని చేసిపోలేకపోతే ఏనూతికో గోతికో అప్పగించి వెళ్ళు కానీ, ఇలాంటి వెర్రి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ చెయ్యకు!"
సుందరయ్య శాంతంగా, "పాపా! నువ్వు వయసుకుమించి చాలా నేర్చుకొన్నావు! క్షమించండి ఒకటి నేర్చుకోవాలమ్మా!" అన్నాడు.
"ఆమెను నేనెలా క్షమిస్తా ననుకొన్నావు?"
"నాకు తెలుసు, ఆమె నీ ఎదుటగనుక పడేట్టయితే ఆమెను హత్య చేసేంత కసి, ద్వేషం నీలో పేరుకుపోయి ఉన్నాయని! ఆమె చేసినపని అలాంటిదే! మానవత్వానికే తీరని కళంకాన్ని తెచ్చేది! మాతృత్వాన్నే అవహేళన చేసేది! కాని, ఆమె అలా చెయ్యడానికి ఏదుష్టశక్తులు ప్రేరేపించాయో ఎవరికి తెలుసు? పెళ్ళికాకుండా బిడ్డనుకన్న ఆడదాన్ని ఈ సమాజం బ్రతకనిస్తుందా? అది ఒక్కసారిగా చంపదు! చీత్కారంతో, అక్కసుతో, ద్వేషంతో కొంచెం కొంచెంగా చంపుతుంది. అభయంతో ఆమె ఆ పని చేసి ఉంటుంది!"
"పెళ్ళికాకుండా బిడ్డను కనడంలోనే తెలుస్తుంది నాన్నా, ఆమె ఎంత నీచురాలో! కాలుజారి కంటేమాత్రం బిడ్డమీద తల్లికి సహజమైన మమకారం ఉండదా? లేదంటే ఆమె మనిషికాదు! ఆమెను క్షమించాల్సిన అవసరమూ నాకు లేదు!"
"ఆమె ఈ ప్రపంచంలో బ్రతికేఉంటే ఆ అవసరం నీకు తప్పకుండా వస్తుంది!"
"రాదు! రాదు! రాదు!" అరిచినట్టుగా అంది.
"అసలు ఆమె వస్తేకదా?" సుందరయ్య ఒక నిట్టూర్పు విడిచాడు. "ఈ ప్రకటన ఆమె చూడాలికదా? పెళ్ళిచేసుకొని ఎక్కడో గుట్టుగా కాపురం చేసుకొంటూ ఉంటుంది! ఈ పేపరు ఆమె చూడటం విధివశాత్తూ జరగాల్సిందే! చూస్తే మాత్రం తప్పకుండా వస్తుందని నా నమ్మకం!"
"రాదు! నన్ను కనిపారేసినరోజు ఉన్న సమాజం ఈ రోజూ ఉంది!"
"ఆ సమాజమే ఇప్పుడూ ఉంది! కాని, ఇరవయ్యేళ్ళలో ఆమె చాలా ఎదిగి ఉంటుంది. జీవితాన్ని చాలా చూసి ఉంటుంది ఈ సమాజం అప్పటిలా ఆమెను భయపెట్టకపోవచ్చు! తెలిసీ తెలియని వయసులో ఆమె చేసిన పనికి ఆమె ఎంతో పశ్చాత్తాపానికి లోనైఉంటుంది. నీకు చేసిన ద్రోహానికి వడ్డీతో పరిహారం చెల్లించుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది! పేపరులో నా ప్రకటన చూస్తేమాత్రం తప్పకుండా వస్తుందని నా నమ్మకం!"
"నీ దొట్టి ఊహాగానం, నాన్నా! ఆమె ఈ పేపరు చూడడం ఎంత అసంభవమో, చూసినా రావడంకూడా అంత అసంభవమే!"
"అయితే నాకూ నీకూ పేచీ ఉండదుగా?" నవ్వబోయాడుగాని సుందరయ్యకు నవ్వురాలేదు. పాపకోసం ఎవరూ రాకపోతే? తను పోయాక ఆ పిల్లకు నా అంటూ ఎవరూ ఉండరే! పాపకి ఊహరాకముందే పెళ్ళిచేయాల్సింది! రాజ్యం అంటూ ఉండేది, పిల్లపెళ్ళి కళ్ళజూసి పోతానూ అని. అంత చిన్నపిల్లకు పెళ్ళేమిటని తను కసిరేవాడు. ఇప్పుడయినా ఒక అయ్యచేతిలో పెడదామంటే పెళ్ళిమాటెత్తితే నిప్పులు తొక్కిన కోతిలా ఎగురుతుంది పాప. తను పోయాక ఆ పిల్లభవిష్యత్తు ఊహించే ఆ ప్రకటన పేపరు కిచ్చాడు.