Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 6

    పాపను పెంపకానికి తీసుకొన్నరోజు ఆమె అడ్రస్ తీసుకోవడం మరిచి చాలా పొరపాటు చేశాడు! ప్రియదర్శిని హాస్టల్ కి వెళ్ళి వాకబ్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆఫీసు రికార్డులో ఆమె అడ్రస్ ఉంటుందేమో! ఇరవైసంవత్సరాల క్రితం రికార్డు ఇవాళ బయటికి తీయించమంటే మాటలా? అప్పుడు పనిచేసిన వాళ్ళెవరూ ఇప్పుడు ఉండరు. అది మరీ కానిపని! తను బాగా ఆలోచించే ఈ పని చేశాడు!

    ప్రేమీ బాగ్ టేబిల్ మీదఉంచి వంటపని చూడసాగింది. ఆ పిల్ల ముఖం ఇంకా ధుమధుమలాడుతూనే ఉంది! మంచంమీద నడుంవాల్చిన సుందరయ్య గతం తల పోస్తున్నాడు.

    ఆ సంఘటన జరిగి అప్పుడే ఇరవైసంవత్సరాలైందా? నిన్నమొన్న జరిగినా సంఘటనలా అనిపిస్తూంది! తెరలు తొలగి నాటకరంగం ప్రత్యక్షమైనట్టుగా ఇరవైఏళ్ళనాటి ఆ సంఘటన కళ్ళముందు నిలిచింది!

   
                                         2

    తెలతెల వారుతూంది.

    ప్రియదర్శిని హాస్టల్ స్వీపర్ రంగమ్మ చీపురు తీసుకొని హాస్టల్ వెనుకనుండి వస్తూంది! ముళ్ళచెట్ల గుబురు దగ్గరికి వచ్చేసరికి ఆమెఅడుగులు అప్రయత్నంగా ఆగిపోయాయి.

    పసిపిల్ల కేర్కేర్ మన్న శబ్దం.

    ఇంత ఉదయాన ఎక్కడినుండి వస్తూంది ఏడుపు? పిల్ల ఏడుపా? పిల్లి అరుపా? ఆగి జాగ్రత్తగా వింది. పిల్ల ఏడుపే!

    అది ఆ ప్రక్కనే సీమతుమ్మ చెట్లనుండి వస్తూంది. ఆ ఏడుపు ఆ ప్రదేశంలో రాత్రివేళ వింటే ఏదెయ్యమో పసిబిడ్డలా ఏడుస్తూందని భయపడి పరుగు లంఖించుకోవాల్సింది! పగలు కాబట్టి అది దెయ్యంకావడానికి వీల్లేదన్ననమ్మకం ధైర్యంగా అక్కడ కాలుఆగేట్టు చేసింది! చీపురుతో కొమ్మల్ని కదిలించి గుబురులోకి తొంగిచూసింది.

    చుట్టూపెరిగిన సీతమ్మచెట్లమధ్య ఇసికదిబ్బ ఒకటి ఉంది. అది హాస్టల్ బిల్డింగ్ కట్టినప్పుడు ఇసుక జల్లడపట్టి పనికిరాని ఇసుకంతా అక్కడ పోశారు. అది ఒకదిబ్బలా తయారైంది. ఆ దిబ్బమీద కాళ్ళు చేతులు కొట్టుకొంటూ కేర్ కేర్ మంటూంది ఒక పసికందు.

    "ఓలమ్మో! ఏ రాక్షసిముండ కని పారేసి పోయిందో ఈ బిడ్డను?" ఒక్క పరుగున హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళింది. "వార్డెనమ్మగారూ! మన హాస్టల్ వెనుక ముళ్ళచెట్లు లేవూ? ఆ చెట్లలో ఎవరో పసిబిడ్డను పారేసి పోయారండీ!" వగరుస్తూ చెప్పింది.

    వార్డెన్ అప్పుడే నిద్రలేస్తున్నదేమో, నిద్రమొహంతో ఉన్న ఆమెకు వెంటనే ఏమీ అర్ధంకాలేదు! "బిడ్డనెవరు పారేసిపోతారే?" రంగమ్మ మరోసారి చెప్పినమీదట అడిగింది.

    "నిజమండీ! నేను చూశానండీ! కాళ్ళు చేతులు కొట్టుకొంటూ ఏడుస్తూంది పిల్ల. పిల్లో పిల్లాడో నేను సరిగా చూడలేదనుకోండి."

    వార్డెన్ ని వెంటబెట్టుకు వెడుతూ కనబడ్డ వాళ్ళందరికీ ఆ విడ్డూరం గురించి చెబుతూ నడిచింది రంగమ్మ. ముళ్ళచెట్లదగ్గర అప్పటికప్పుడు ఒక గుంపు తయారైంది.

    "బయటినుండి ఎవరో తెచ్చివేయడానికి వీల్లేదు. ఎందుకంటే రాత్రిపూట గేటుకు తాళంపెట్టి ఉంటుంది. ఉదయం అయిదున్నరకే మళ్ళీ తాళం తీయడం! కాంపౌండ్ గోడ ఎక్కడానికి దూకడానికి రాదు!. అంది వార్డెన్.

    "నేనువచ్చి పిలిచాకే వాచ్ మెన్ లేచి తాళం తీశారండీ." అంది రంగమ్మ.

    వార్డెన్ ఖచ్చితంగా అంది. "ఆ పిల్ల బయటి నుండి వచ్చింది కాదు"

    "లోపలే మీకు తెలియకుండా ఎలా పుట్టుకువస్తుందమ్మా? ఈ హాస్టల్లో ఉండేవాళ్ళంతా పెళ్ళికాని ఆడపిల్లలు!"

    "మగపిల్లలతో తిరిగితే పెళ్ళికాలేదని కడుపులు రాకుండా ఉంటాయా?" వార్డెన్ బుర్ర చురుగ్గా పని చేసింది. "ఆ దొరికింది దొంగ! ఈ పని గీతాభవానిదే కావాలి! కడుపు ఎత్తుగా ఉందేమిటని అడిగితే కడుపులో గడ్డ అయిందని, గడ్డ బాగా పెరిగాక డాక్టర్లు ఆపరేషన్ చేస్తారని బొంకింది! ఇది తప్పకుండా దానిపనే కావాలి! కాలేజీకి సెలవు లిచ్చినా అది ఎప్పుడూ ఇంటికి వెళ్ళదు!"

    వార్డెన్ ఇలా అంటూండగానే రేఖ అనే అమ్మాయి ఏదో హత్యా చూసిన మనిషిలా వణికిపోతూ అక్కడికి వచ్చింది. "బాత్ రూం నిండా రక్తం కరుళ్ళు, మేడమ్! హఠాత్తుగా చూసేసరికి నా కళ్ళు తిరిగిపోయాయి!"

    వార్డెన్ ముందు నడవగా అందరూ వెళ్ళి బాత్ రూం చూశారు. ఎవరినో దారుణంగా పొడిచినట్టుగా రక్తపు మడుగు! అదో రకం వాసన. అక్కడ కని పిల్లను కిటికీలోంచి పారేసి ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చా రందరూ.

    వాసన పట్టిన జాగిలంలా రివ్వున గీతాభావాన్ని ఉండే గదిముందుకు వచ్చి, మూసి ఉన్న తలుపు బాదసాగింది వార్డెన్. "గీతా భవానీ! తలుపు తీయ్!"

    లోపలినుండి సమాధానం రాలేదు. అసలు ఏ అలికిడి లేదు!

    "ఈ గదిలో రుక్మిణి అనే పిల్ల ఉండాలి కదా?" వార్డెన్ అడిగింది.

    "సెలవుపెట్టి ఊరికి వెళ్ళింది రెండు రోజుల క్రితం!" ప్రక్కరూం పిల్ల జవాబిచ్చింది.
 

 Previous Page Next Page