Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 4

    "విషనాగుతో స్నేహం, మగాడితో స్నేహం ఒక్కటేనని నా ఉద్దేశ్యం!"

    "అలాంటి ఉద్దేశ్యం కలగడానికి నీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగిందా?" నిశితంగా ప్రేమీకళ్ళలోకి చూసింది సువర్చల.

    "పాము నన్ను కాటేస్తేతప్ప దానికి కాటువేసే గుణముంటుందని తెలియదా?"

    "మగాడిపట్ల అకారణంగా ద్వేషం పెంచుకోవడం మంచిదికాదు, పాపా! ఒక్క మొగుడే మగాడుకాదు! తండ్రీ, సోదరులు, మామలు-వీళ్ళు కూడా మగాళ్ళే! వీళ్ళనుకూడా ద్వేషిస్తావా! ఎదుటి మనిషి చెడ్డవాడైతే అతడి చెడ్డనుచూసి దూరం తొలగడం వివేకమనిపించుకోదు. అతడిలోని చెడును నిర్మూలించి అతడికీ నీకూ మధ్య స్నేహలతని నాటు! ఎంత చక్కని పరిమళ ప్రసూనం పూస్తూందో చూడు!"

    "ఈ సమాజంలో ఏ చెడు అయినా ఒక్కసారిగా నిర్మూలింపబడలేదు! ఏ చైతన్యమూ ఒక్కసారిగా రాలేదు! మంచి మార్పు అనేది కంటికి కనిపించకుండా నెమ్మదిగా జరిగేపని! అంతవరకు ఆడది ఇలా మగాడి పశుప్రవృత్తికి బలి అయిపోతూ ఉండాల్సిందే?"

    "నువ్వు ఆవేశంగా ఆలోచిస్తావు! పాలుపొంగడం సహజం! కాని, అవి పొయిపాలుఅయ్యేంతగా పొంగనివ్వకూడదు! యువతకి ఆవేశం మంచిదే కాని, పొయిపాలు అయ్యేంతగా పొంగనివ్వక, పాపా?"

    "పొంగుమీద నీళ్ళు చల్లడమే మీ పెద్దల కర్తవ్యంగా భావిస్తున్నారా?"

    "పొంగుమీద నీళ్ళు చల్లి వేడి తగ్గించి కాసే పాలకి చెప్పలేనంత కమ్మదనం వస్తుంది!" అని నవ్వింది సువర్చల. "నేను ముఖం కడుక్కొని వస్తాను. కొంచెం మాటరులో మార్పులుచెయ్యి! మనది జ్ఞానభూమి, స్త్రీ పూజలందే దేశం మనదని ఒకనాడు గర్వంగా చెప్పుకొన్నాం! ఇవాళ ఆ స్త్రీ మగాడి కామాంధతకు గురి అవుతూ, అలాఅయిన స్త్రీ  సమాజంలో చెల్లని నాణంలా, భ్రష్టురాలిగా పరిగణింపబడడం నిజంగా చాలా శోచనీయం! అలా అన్యాయమైన స్త్రీకి ఆశ్రయం, అండ కావాలి! మామూలు మనిషి కంటే ఎక్కువ సానుభూతి కావాలి! ఈ విషయాలన్నీ వచ్చేలా వ్రాయి!"

    సువర్చల ముఖం కడుక్కోడానికి వెళ్ళింది.

    ప్రేమీకూడా లేచి కిచెన్ లోకి వెళ్ళింది. సువర్చలకి హార్లిక్స్, తనకి కాఫీకలిపి ఇవతలికి వచ్చేసరికి సువర్చల ముఖం కడుక్కు వచ్చింది.

    నౌకరు పేపరు తెచ్చి సువర్చల ముందున్న టీపాయ్ మీదుంచి వెళ్ళాడు. సువర్చల హార్లిక్స్ మెల్లిగా తాగుతూ పేపరు చూడసాగింది. ప్రేమీ కాఫీ గబగబా త్రాగేసి వ్రాయడానికి కూర్చొంది.

    "పాపా!" ఏదో విస్మయ ప్రపంచంలో పడిపోయి పిలుస్తున్నట్టుగా పిలిచింది సువర్చల.

    తలెత్తి ప్రశ్నార్ధకంగా చూసింది ప్రేమీ.

    "ఈ ప్రకటన చదువు!" పేపరు అందించింది.

    ప్రకటన చదివిన ప్రేమీ చావు దెబ్బతిన్న దానిలా స్తభించిపోయింది.

    "మీనాన్న మొన్న ఇక్కడికి వచ్చాడు. తన ఆరోగ్యం బొత్తిగా బాగాలేదని, తను పోయాక నువ్వు వంటరిదానివై పోతావని దిగులుపడ్డాడు. పాపకి మేమంతా లేమా అని ధైర్యం చెప్పాను!"

    సువర్చల మాటలు చెవిని పడడం ఎప్పుడో మానేశాయి! ఏదో హోరుగాలి మధ్య పెను తుఫాను మధ్య చిక్కుపడినట్టుగా, వాటి తాకిడికి స్పృహ తప్పుతున్నట్టుగా ఉండి ప్రేమీకి!

    సువర్చల కంగారుగా ప్రేమీభుజం తట్టింది. "పాపా! ఎగ్జైట్ అవకు! అతడి తాపత్రయం అతడిది! నిన్ను ఈ ప్రపంచంలో ఒంటరిదాన్ని చేసిపోలేక ఇలా చేశాడు! అతడు ఏదో పిచ్చికొద్దీ ఈ ప్రకటన పేపరుకిచ్చాడేగాని అతడాసించినట్టు మాత్రం జరగదని ఖచ్చితంగా చెప్పగలను! ఎందుకంటే ఈ ప్రకటన ఆమె చదువుకొనే అవకాశం ఎంత వరకు ఉంటుంది? కాకతాళీయంగా చదివిందే అనుకో! పుడుతూనే ప్రాణంలేని బొమ్మలా నిన్ను మేడమీదినుండి విసిరివేసిన ఆమె, ఈ రోజు నువ్వు వంటరిదానివి అవుతున్నావని వస్తుందా? నీ విషయంలో అలాంటి ప్రమాదం జరగదని నేను ఖచ్చితంగా చెప్పగలను!"

    కరుడు కట్టిన గుండె! ప్రపంచంలోని క్రౌర్యమంతా ఆ ముఖంలోనే ఉంటుంది! ఎదుటి మనిషిని హత్యచేయడానికి ముందు హంతకుడిముఖం సరిగా అలాగే ఉంటుందనిపిస్తుంది! కసాయి చేతుల్లాంటి చేతులు! ఆచేతుల మధ్య అప్పుడే ఈ ప్రపంచంలో పడిన పాప! ఆ స్త్రీమూర్తి కిటికీ సమీపిస్తూంది! కొంచెంకూడా సంకోచించదు! కిటికీలోంచి క్రిందికి ముళ్ళతుప్పల్లోకి నిర్దాక్షిణ్యంగా విసిరివేస్తుంది!

    ప్రేమీ కళ్ళముందు అప్పుడప్పుడూ కదిలే దృశ్యమిది! ఈ దృశ్యం కదిలినప్పుడల్లా ప్రేమీగుండెల్లో భగభగమని మంటలు లేస్తాయి! కళ్ళు అగ్ని గోళాల్లా ఎర్రబడతాయి! ద్వేషం పొగలా బయటికి వస్తుందా అన్నట్టు ముక్కుపుటాలు అదురుతాయి! పిడికిళ్ళు బిగుస్తాయి!

    ఇప్పుడూ అదే అవస్థ ఆవరించింది ప్రేమీని. ఆ రాక్షసిని అభ్యంర్ధించాడా నాన్న? ఒక్కమాట చెప్పలే దెందుకు?

    ప్రేమీ ఆపేపరు మడచి పట్టుకొని లేచింది. "ఆంటీ! నేనిప్పుడేమీ వ్రాయలేను! నేను ఇంటికి వెడతాను! మనసు బాగుంటే సాయంత్రం వస్తాను!"

    "వెళ్ళి మీ నాన్నను అదరగొట్టకు! నీ భవిష్యత్తు గురించి ఏమాలోచించి అతడిలా చేశాడో అర్ధంచేసుకో!"
   

 Previous Page Next Page