"కానీ రిపోర్టు చెయ్యకపోవటం నేరమని మీకు తెలియదా?"
"అతని ఆరోగ్యం కుదుటబడిన తర్వాత రిపోర్టు చేద్దామనుకున్నాను. వైద్యులకు ఆద్యుడు హిప్పోక్రైట్ ఏమని చెప్పాడు? వైద్యుడికి అన్నిటి కంటే రోగి ఆరోగ్యం ముఖ్యమని. వైద్యవృత్తిలోకి వచ్చేముందు హిప్పోక్రైట్ పేర ప్రమాణం చేసిన దానిని నేను. రోగి ఆరోగ్యం కంటే పోలీసు కేసు ముఖ్యమని ఎలా అనుకుంటాను?"
"స్మార్ట్ గా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు మీరు?"
"కాదు పరిస్థితి మీకు అర్ధమయ్యేలా వివరించి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. సరే దినకర్ ని నా నర్సింగ్ హోమ్ లో చేర్చాను. అతని గాయాలు నయమయ్యాయి. కానీ, షాక్ వల్ల అతని జ్ఞాపకశక్తి నశించిపోయింది. తనెవరో తనకే తెలియని పరిస్థితిలో వున్నాడు."
"అతను మీకు మొదటిసారి కనబడినప్పుడు అతని వంటిమీదగానీ బట్టలమీదగానీ అతని తాలూకు గుర్తులేమీ కనబడలేదా? అతని తాలూకు వస్తువులేమన్నా కనబడ్డాయా ఆ ప్రాంతంలో?"
"వంటిమీద పైభాగంలో బట్టలేమీ లేవు. ప్యాంటు వుంది. కాళ్ళ దగ్గర పీలికలయిపోయి వుంది. నడుం దగ్గరమాత్రం మామూలుగా వుంది."
"అతని తాలూకు వస్తువులు ఏమైనా?"
కొంచెం తటపటాయించి అంది నిశాంత.
"కనబడింది"
"ఏమిటవి?"
"ఒక రివాల్వర్!"
సన్నగా విజిలేశాడు జలీల్.
"ఓహో! రివాల్వర్ వుందా? అయితే పాయింటుకి దగ్గరగానే వస్తున్నాం డాక్టర్! మీ దగ్గర రివాల్వర్ వుందా? అంటే మీ సొంతానికి?"
"లేదు నాకేమవసరం?"
"చూశారా? మీ దగ్గర రివాల్వర్ లేదు ఎందుకంటే మీకు అవసరం లేదు కాబట్టి సాధారణంగా ముప్పాతిక మూడొంతుల మంది జనబహా దగ్గర రివాల్వర్లు వుండవు. ఎందుకంటే వాళ్ళకు రివాల్వర్లతో అవసరం ఉండదు కాబట్టి.
ఇతని దగ్గర ఉన్నది నాటు రివాల్వరా?"
"స్మిత్ అండ్ వెస్సన్ అని వుంది దాని మీద" అంది నిశాంత.
"అంటే ఇది ఇంపోర్టెడ్ రివాల్వరు. హీనపక్షం ముఫ్ఫయ్ నలభై వేల రూపాయల ఖరీదు చేస్తుంది. నలభైవేల రూపాయల రివాల్వర్ దగ్గర ఉంచుకోవలసిన మనిషి ఎటువంటివాడై వుంటాడని మీ ఉద్దేశ్యం నిశాంతా?"
ఇక తప్పదన్నట్లు చెప్పింది నిశాంత.
"తనకి ప్రాణాపాయం వుందని ఆత్మరక్షణకోసం ఆయుధం దగ్గర వుంచుకునే మనిషి అయి వుండవచ్చు."
"కావచ్చు" అంది నిశాంత సందిగ్ధంగా.
మౌనంగా వాళ్ళిద్దరి మాటలూ వింటున్నాడు దినకర్. అతని మొహంలో టెన్షన్ కనబడుతోంది.
ఇన్ స్పెక్టర్ జలీల్ దృష్టి హఠాత్తుగా దినకర్ మీదికి మళ్ళింది. పరిశీలనగా అతనివైపు కొద్ది క్షణాలపాటు చూసి తర్వాత నిశాంతతో అన్నాడు.
"మిస్ నిశాంతా! మీరొక డాక్టర్! ఒక మనిషి శారీరక పరిస్థితి ఎలా వుందో బాగా చెప్పగలరు. ఇతని బాడీని చూస్తే మీకేమనిపిస్తుంది?"
"దినకర్ ది చాలా దృఢమయిన శరీరం. మామూలు మనిషైతే ఆ దెబ్బలకు నిశ్చయంగా చనిపోయి వుండేవాడు" అంది నిశాంత.
"ఇంకొంచెం వివరంగా చెప్పండి! ఇంత దృఢమయిన శరీరం అందరికీ జన్మతః వస్తుందా? యితనిలో మరేదైనా స్పెషాలిటీ వుందా?"
కొద్దిగా ఆలోచించి చెప్పింది. "ఇతనిది జన్మతః దృఢమయిన శరీరమే కావచ్చు. కానీ, ఇంతగా కండలు తిరిగి వున్నదంటే దానికి రెండే కారణాలున్నాయంటాను నేను. ఒకటి చిన్నప్పటినుంచి శ్రమజీవి అయి, కాయకష్టం చేసి వుండడం. మోండామార్కెట్ లో బియ్యం బస్తాలు మోసే కూలీలను చూశారా? కడుపునిండా తిండి లేకపోయినా ఎంత కండలు తిరిగి వుంటారో?"
"దటీజ్ పాసిబుల్! ఇంకో పాసిబిలిటీ కూడా వుంది. గూండాలని చూశారా? వాళ్ళు కూడా రఫ్ అండ్ టఫ్ లైఫ్ వల్ల దృఢకాయులై వుంటారు."
"ఐ విల్ టెల్ యూ సమ్ మోర్ పాస్ బిలిటీస్!" అంది నిశాంత చురుగ్గా. "ఇతనొక స్పోర్ట్సు మెన్ అయి వుండవచ్చు. బాక్సర్, రెజ్లర్ అయి వుండవచ్చు" అని ఆగి అంది. 'ఇన్ స్పెక్టర్! మీరుకూడా చాలా మస్కులర్ గా కండలు తిరిగి కనబడతారు. ఎందువల్లనంటారు?" అంది.
"ఉద్యోగ ధర్మం! క్రమం తప్పని ఎక్సర్ సైజువల్ల!"
"దటీజ్ ఇట్! దినకర్ కూడా మీలాగా పోలీసాఫీసరై ఉండవచ్చు లేదా ఆర్మీ మనిషై ఉండవచ్చు. అంతేగానీ, అతను దృఢకాయుడై ఉండడంవల్ల, అతని దగ్గర రివాల్వర్ ఉండడంవల్లా అతని గత చరిత్ర అంతః నేరాలమయం అయి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. పైగా, అతని మాటలూ, అతని చేతలూ చూస్తే అతను సభ్యతా, సంస్కారం వున్న మనిషేననిపిస్తాడు.
అమ్నేసియా వచ్చినవాళ్ళు సభ్యతా, సంస్కారం మాత్రం మర్చిపోకూడదా?
"ఏది మరిచిపోతారో, ఏది మర్చిపోరో చెప్పలేం. అది కేసు కేసుకీ, మనిషి మనిషికీ మారిపోతూ ఉంటుంది.
"కానీ, ఇప్పటికే అతను హత్య కేసులో ముద్దాయి." అన్నాడు జలీల్.
అతని వాక్యం పూర్తికాకముందే ఫోన్ మోగింది.
లైన్ లో ఉన్న మనిషి జలీల్ పై అధికారి.
తేనెతుట్టెలో ఎన్ని తేనెటీగలుంటాయో అతని సర్వీసులో అతనిమీద అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా క్రమం తప్పకుండా ప్రమోషన్ లు సంపాదించేస్తూ, పై పైకి వెళ్ళిపోతున్నాడు.
ఫైనల్ వార్నింగ్ ముచ్చటగా మూడేముక్కలు చెప్పాడు ఆ అధికారి.
"జలీల్ నువ్వు వెయ్యేళ్ళకి ముందో, వెయ్యేళ్ళ తర్వాతో పుట్టాల్సిన వాడివి ఈ రోజుల్లో పుట్టాల్సిన మనిషివి కావు. అది నా ఖర్మ.
ఇవి డబ్బు రోజులు ఇప్పుడందరూ డబ్బు మనుషులు. మర్డర్ కేసు అంటే యాభై వేలకు తక్కువ గుంజడం మాకు అలవాటు లేదు. ఇప్పుడు నీ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరనుంచి యాభైవేలు నువ్వు గుంజాలి. దానిలో నీ షేరు ఎంతో మాకు హెడ్ కానిస్టేబుల్ చెబుతాడు. ఎవరికెంత ఇవ్వాలో కూడా వాడే చెబుతాడు.
రేపటిలోగా ఎవరికీ అందవలసిన పైసలు వాళ్ళకి అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా?"
"ఏం జరుగుతుంది" అన్నాడు జలీల్ కోపాన్ని ఆపుకొంటూ.
"యాభైవేలు తీసుకుని నువ్వు జేబులో వేసుకున్నావని ఇంకెవ్వరికి షేర్ ఇవ్వడం లేదనీ అందరూ అనుకుంటారు. అనుకుంటున్నారూ కూడా. ఇప్పటికే రెండు కేసుల్లో అట్లా అయింది. ఈ సారి నీకు పనిష్ మెంటు తప్పదు. టేక్ కేర్!"
బాస్ కన్నా ముందు తనే ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు. ఇన్ స్పెక్టర్ జలీల్. తర్వాత ఏం జరగనట్లే నిశాంతవైపు తిరిగి, "మీకు ఈ దినకర్ ఎక్కడ కనబడ్డాడో కరెక్టుగా ఆ స్పాట్ నాకు చూపించగలరా" అన్నాడు.
"కానీ ఏం లాభం? ఇది జరిగి ఇప్పటికే నాలుగు నెలలవుతోంది. అక్కడ ఇంకా గుర్తులు మిగిలివుంటాయనుకోను" అంది నిశాంత.
"అయినా సరే! నేనోసారి ఆ స్పాట్ ని చూడాలి. దటీజ్ మై డ్యూటీ."
"ఎప్పుడు వెళ్ళాలి?"
"ఇప్పుడే!"
అతనివైపు చిత్రంగా చూసింది నిశాంత "సరే!"
బజర్ నొక్కాడు ఇన్ స్పెక్టర్ జలీల్. కానిస్టేబుల్ వచ్చాడు.
"ఏమిటి?" అన్నట్లు కాస్త నిర్లక్ష్యంగా చూశాడు జలీల్ వైపు. వీడింకెన్నాళ్ళు ఇక్కడుంటాడులే? అన్న భావం లీలగా కనబడుతోంది అతని మొహంలో.
"జీపు రడీ చెయ్"
"జీపు లేద్సార్!" అన్నాడు కానిస్టేబుల్.
"ఎక్కడికెళ్ళింది?"
"దొరగారి పిల్లల్ని కాన్వెంటులో దింపడానికెళ్ళింది."