Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 5

లావణ్య తనని అంత పరీక్షగా చూస్తుండేసరికి అతను ఇబ్బందిగా ఫీలయి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకున్నాడు. మళ్ళీ తీసేశాడు. చేతులు నులుముకున్నాడు. కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు.
ఆ తర్వాత అతని జీపు వైపు చూసింది లావణ్య. కనీసం పదిహేనేళ్ళయి వుంటుంది దాన్ని మొదటిసారి ఎవరో కొని. గచ్చకాయ రంగు చాలావరకూ రాలిపోయి, లోపల ఉన్న రేకు కనబడుతోంది. కాన్వాస్ రెండు మూడు చోట్ల పాచెస్ వేసి ఉంది.
"ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కాస్త పెయింటు వేయిస్తే ఏం పోయిందో?" అనుకుంది.
"వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టి జీపుకి రిపేరు చేయించగలిగిన స్థితిలో ప్రస్తుతం లేను. దొరికిన ప్రతిపైసా బిజినెస్ లో పడుతున్నాను. గోడకేసి విసిరికోట్టిన బంతిలాగా లాభాలు తిరిగివచ్చినప్పుడు , నా వాహనానికి రంగేయిస్తాను. నేనొక సూటు కుట్టించుకుంటాను" అన్నాడు శ్రీహర్ష. లావణ్య ఆలోచనలు చదివేసినట్లు.
ఉలిక్కిపడి చూసింది. అసాధ్యుడే ఆవులిస్తే పేగులు లేక్కపెట్టేస్తాడన్నమాట. ఆశ్చర్యం వేసింది. జీపుకి రంగేయించుకోవడానికి, సూటు కుట్టించుకోవడానికి వెయ్యి రూపాయలు లేనివాళ్ళు కూడా ఉంటారన్నమాట. సూటు కుట్టించుకోవడం ఇతని జీవిత ధ్యేయంలాగా వుంది.
ఇవాళ మీరందరూ ఎక్కుతున్నారంటే నా జీపు చేసుకున్న అదృష్టం. ఇది వచ్చే జన్మలో కారయి పుడుతుందేమో?" అన్నాడు శ్రీహర్ష.
లావణ్య నవ్వేసింది.
జీపు ఎక్కడానికి దగ్గర కొచ్చింది. శ్రీహర్ష మర్యాద ప్రదర్శిస్తూ ఒక్క అంగుళం, ఒక్క అంగుళమే పక్కకి జరిగాడు. అతను జరక్కపోతే ఆమెని తాకేంత దగ్గర్లో వుండేవాడు. జరిగినా అంతే దగ్గర్లో ఉన్నాడు.
అది గమనించింది లావణ్య. హఠాత్తుగా ఇదివరకు ఆమె కెప్పుడు కలగని అదో రకమైన కలవరం, సిగ్గూ కలిగాయి. రక్తం శరీరంలో అతి వేగంగా ప్రవహిస్తున్నట్లయింది.
తను వేసుకున్నది తెల్లటి గేబర్దిన్ బెల్ బాటమ్సు , పాలనురగలాంటి బిగుతైన తెల్లటి స్ట్రెచ్ నైలాన్ బనియను.
హఠాత్తుగా తను నగ్నంగా ఉన్నంత సిగ్గేసింది. భుజాల చుట్టూ కప్పు కోవడానికి పమిట ఉంటే ఎంత బావుండు అనిపించింది. చీరే కట్టుకురానందుకు తనని తాను తిట్టుకుంది. కళ్ళు దించేసుకుని జీపులో ముందు సీట్లో ఎక్కేసింది. ఎంత పొడుగు కాళ్ళో అనుకున్నాడు శ్రీహర్ష.
వెనక సీట్లో కుటుంబరావుగారూ, డ్రైవరూ కూర్చున్నారు. శ్రీహర్ష డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
"వస్తాం యాదగిరి!" అన్నాడు శ్రీహర్ష, జీప్ స్టార్ట్ చేస్తూ.
"మంచిది! మంచిది! జీపు రేపు పంపిస్తాను కుటుంబరావు సాబ్" అన్నాడు కాంట్రాక్టరు యాదగిరి. చేతులెత్తి లావణ్యకు నమస్కారం చేశాడు. తల పంకించి చిరునవ్వు నవ్వింది లావణ్య.
జీపు బయలుదేరింది.
ఎండ చల్లబడుతోంది. జీపు మైళ్ళని మింగేస్తూ పరిగెత్తి పోతోంది. రోడ్డు మీద అక్కడక్కడ వంటిమీద పొట్టినిక్కరు తప్ప ఇంకే అచ్చధనా లేని ఆదివాసులూ, జాకేట్లేసుకొని ఆడవాళ్ళు కనబడుతున్నారు.
"పాపం వీళ్ళు డబ్బు లేక, సిగ్గు తెలియకా బట్టలు సాధ్యమైనంత తక్కువ వేసుకుంటే , ఫాషన్లు ముదిరి మన అమ్మాయిలు సగం బట్టలు కట్టుకుంటున్నారు. రావు గారి కూతురు సీమా లాగా" అన్నాడు కుటుంబరావుగారు.
శ్రీహర్ష ఏం మాట్లాడకుండా లావణ్య వైపు చూసి నవ్వాడు.
లావణ్యకు ఈ సంభాషణ ఇబ్బందిగా అనిపిన్పించింది. అసలే తను ఈ డ్రస్సు వేసుకోచ్చినందుకు సతమతమై పోతుంది. "నాన్నగారికి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు" అని మనసులోనే విసుక్కుని , ఒకసారి వెనక్కి తిరిగి ఆయన్ని చురచుర చూసింది.
తప్పు చేస్సిన పిల్లాళ్ళా అయన గబుక్కున మాట మార్చేసి "ఇవన్ని టేకు చెట్లు కదూ?" అన్నారు ఎవర్ని ఉద్దేశించకుండా.
 శ్రీహర్ష మళ్ళీ లావణ్య వైపు చూశాడు. తండ్రి మీద ఆమెకున్న అధికారం అర్ధమయిందతనికి. నవ్వాడు.
కనబడి కనబడకుండా మూతి విరిచింది లావణ్య. అతని వైపు చూడకుండానే.
ఇంతలో రోడ్డు కడ్డంగా చిన్న వాగు. "ఇది దాటితే హైదరాబాద్ చేరినట్లే మనం" అన్నాడు శ్రీహర్ష.
"అదేమిటి?" అంది లావణ్య ఆశ్చర్యంగా.
"అదంతే! నీళ్ళలో తడిస్తే జలుబు చేస్తుంది నా జీపుకి. అదృష్టవశాత్తు ఇది దాటేయగాలిగామనుకోండి. తర్వాత మనకి ఇంక ఇబ్బందేం ఉండదు."
ఒక పని చేద్దాం! అందరం దిగి జీపుని నెత్తిన పెట్టుకు నడుద్దాం." అంది లావణ్య విసురుగా.
"వాగు దాటే దాకానా?"
"ఎందుకు? హైదరాబాద్ దాకా నడిచేస్తే పోతుంది. మధ్యలో ఇది చెడిపోతుందేమో నాన్న భయం లేకుండా "సిగ్గు కొద్దిగా వెనక్కి జరిగి సరదా చోటుచేసుకుంది లావణ్య గొంతులో.
"అమ్మమ్మ! మరీ అంత తీసేయ్యకండి నా జీపుని" అన్నాడు శ్రీహర్ష బాధపడిపోతూ.
మొత్తానికి అందరూ జీపు దిగాల్సి వచ్చింది.

 Previous Page Next Page