Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 5

 

    కేశవరావు రాకని దూరంనుంచే గమనించి, వేరే టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న దీపక్ కి కన్ను గీటాడు శ్రీరాం. దీపక్ యాంటీ కరప్షన్ బ్యూరోలో చేరినప్పటి నుంచీ యిలాంటి కేసుల్ని పట్టడంలో ఎక్స్ పర్ట్ అని పేరు తెచ్చుకున్నాడు.
    
    కేశవరావు నిస్సంకోచంగా వచ్చి, శ్రీరాంకి ఎదురుగా కూర్చుని పేపర్సు అందించాడు.
    
    హిప్ పాకెట్లో నుంచీ మెత్తటి మెట్రోపాలిటన్ లెదర్ పర్సు తీశాడు శ్రీరాం. అందులో ప్రత్యేకంగా వుంచిన పది వంద రూపాయల నోట్లు తీసి బ్రోకర్ కి అందించాడు. బ్రోకరు రెండు నోట్లు తను వుంచుకుని మిగతావి కేశవరావుకి అందించాడు.
    
    అంతే!
    
    వెంటనే కేశవరావు మెడమీద బలంగా పడింది దీపక్ చెయ్యి.
    
    "ఇన్నాళ్ళూ లంచాలు తిన్నావుగా! యింక జైలుకూడు తిందువుగాని, పద!" అన్నాడు దీపక్.
    
    కేశవరావుది చురుకైన బుర్ర. పాతికేళ్ళుగా ఏ సంఘటన అయితే జరగకుండా ఉండాలని జాగ్రత్తపడ్డాడో, అది ఇవాళ జరిగిపోతూందని అతనికి అర్ధమయింది. ఇంత తెలివి తక్కువగా వీణ్ణి ఎలా నమ్మేశాడు తను? తన సర్వీసంతా ఏమయిపోయింది? ఛీ! ఇంత బతుకూ బతికి ఇంటెనకాల చచ్చిపోయినట్లు...
    
    అతను తుది ప్రయత్నం ఒకటి చేశాడు. చేతిలోని నోట్లని వెంటనే బల్ల కిందికి జారవిడిచేసి, సాధ్యమైనంత బింకంగా, "ఏమిటి మీరు మాట్లాడేది? దబాయించకండి! నాకూ 'లా' తెలుసు. అతను లంచం యివ్వబోయాడు. నేను తాకలేదు" అన్నాడు.
    
    క్షణాల్లో చుట్టూ గుంపు పోగైయింది.
    
    "నోట్లు తాకలేదూ? బుకాయించకు! చేతులేవీ? చూపించు."
    
    తటపటాయిస్తూనే చేతులు ముందుకు చాచాడు కేశవరావు.
    
    ఒక మంచినీళ్ళ గ్లాసు అందుకుని, కేశవరావు చేతులమీద నీళ్ళు పోశాడు దీపక్ వెంటనే ఆ నీళ్ళు ఎర్రగామారి కిందికి కారిపోయాయి.
    
    కేశవరావు మొహంలో ఎరుపు రంగు తగ్గి, తెల్లగా పాలిపోయింది.
    
    దీపక్ బల్లకింద పడ్డ నోట్లు తీసి నీళ్ళలో ముంచాడు. నీళ్ళు ఎర్రబడ్డాయి.
    
    "సీ! ఈ నోట్లకి ఒక కెమికల్ రాసి నేనే శ్రీరాంకి ఇచ్చాను. ఆ నోట్లు తాకబట్టే మీ చేతులు ఎర్రబడ్డాయి. ఇంక మీ నోటికి తాళమెయ్యండి."
    
    తన ఆట కట్టిందని తెలిసిన కేశవరావుకి గజగజ వణుకు మొదలయింది.
    
    "నువ్వు నమ్మకద్రోహివి!" అన్నాడు శ్రీరాంని శపించేలా చూస్తూ.
    
                                                             * * * * *

    సరిగ్గా అదే సమయంలో, శ్రీరాం చేసిన పెళ్ళి ప్రపోజలు గురించే ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వస్తూంది ప్రతిమ.
    
    ఇంటికొచ్చాక గుర్తొచ్చింది, శృతి దగ్గర తీసుకున్న ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కథల పుస్తకం "మెన్ వితవుట్ ఉమెన్" తన బ్యాగ్ లోనే ఉందని.
    
    ఒక్కసారిగా మనసు ఉప్పొంగిపోయింది ప్రతిమకి. తనకి చదవడం కంటే ఇష్టమైన వ్యాపకం మరేదీ లేదు. ఆ పుస్తకంలో నూట అరవై పేజీలు  ఉన్నాయి. నూట అరవై రకాల పిండివంటలతో కూడిన విందు భోజనం కూడా తనలో అంత ఆసక్తి కలిగించదు.    
    
    చీరె మార్చుకుని, కుర్చీలో కూర్చుని, కాళ్ళు ఎదురుగా వున్న పెట్టె మీద పెట్టి, పుస్తకం తెరిచింది ప్రతిమ. వెనక్కి వాలబోతే లావుగా, ఒత్తుగా వున్న జడ వీపుకి గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. చేతులు వెనక్కి పెట్టి, జడను జారుముడిగా వేసుకుని చదువులో లీనమైపోయింది.
    
    పుస్తకం చేతబట్టుకున్న తరవాత ఇంక ఆమెకి శ్రీరామే కాదు, ఈ ప్రపంచమే గుర్తు రాలేదు.
    
    అరగంట గడిచింది.
    
    "ఆ తిండి కాస్తా తినేసి కూర్చో! ఎంతసేపని మాడతావూ? రెండు మెతుకులు కతికి అంట్లు తోమెయ్!" అంది తల్లి సుందరమ్మ, సాధింపుగా ఆమె మామూలుగా మాట్లాడినా కూడా ఏదో ఆక్రోశంగా, ఆరోపణగా శాపనార్ధాలు పెడుతూ మాట్లాడినట్లే ఉంటుంది.
    
    తల్లి నాలుగోసారి పిలిచాక, అనాసక్తిగా లేచి అన్నం వడ్డించుకుంది ప్రతిమ. పుస్తకం చదువుతూనే తింటూంది.
    
    శృతి ఎప్పుడూ ఈ సంగతే చెప్పి నవ్వుతూ ఉంటుంది. "అదేమిటే! అన్నం ముందు కూడా చదువుతూ అసలేం తింటున్నావో ఎలా తెలుస్తుందీ?"
    
    "అలా చదువుకుంటూ తినడం బాగుంటుంది శృతీ!"
    
    శృతి అంతటితో వూరుకోదు. తను చాలా అల్లరి. అటూ ఇటూ చూసి, గొంతు తగ్గించి, "రేపు పెళ్ళయ్యాక నీ మొగుడు నిన్ను గట్టిగా కావిలించుకు పడుకుంటే, అప్పుడు కూడా పుస్తకం వదలకుండా అతని భుజం మీదనుంచీ చదువుతావా ఏమిటే?" అంటుంది.
    
    "అబ్బ! అలా మాట్లాడకు! నాకు చిరాకు!" అని మొహం చిట్లించేది ప్రతిమ.
    
    ప్రతిమకి వాళ్ళ కాలేజీలో 'రాజహంస' అని బిరుదుతోబాటు 'మవుని' అన్న కీర్తికి తోడుగా, 'బుక్ వార్మ్' లేక 'అందమైన పుస్తకాల పురుగు' అన్న నిక్ నేమ్ కూడా ఉంది.
    
    పుస్తకాలే తన గురువులు! పుస్తకాలే తన స్నేహితులు! పుస్తకాలే తన ప్రపంచం ప్రతిమకి.
    
    "కూర్చుని అరగంట అయింది! కోడి కెలికినట్లు ఇంకెంత సేపు కెలుకుతావ్? త్వరగా తిండి ముగించి, కాఫీకి నీళ్ళు తగలేసి, ఉల్లిపాయలు తరిగి పకోడీలో సింగినాదమో చేసెయ్ టిఫినుకి!" అంది సుందరమ్మ.
    
    భోజనం పూర్తికాగానే కాఫీ పెట్టింది ప్రతిమ. టిఫిన్ తయారుచేసి రెడీగా ఉంచింది.
    
    ఆ తరువాత మరో పని....మరో పని...
    
    పని చేస్తున్నంతసేపూ మళ్ళీ అదే ఆలోచన! రేపు శ్రీరాంకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి?
    
    ఒకటి మాత్రం నిజం! పెళ్ళంటే తనేమీ తహతహలాడిపోవడం లేదు.
    
    కానీ పెళ్ళి చేసుకోవడంలో ఒకమంచి కనబడుతూంది తనకి!
    
    ఈ ఇంట్లో అమ్మకీ నాన్నగారికీ, అన్నయ్యకీ మధ్య నిర్విరామంగా, నిరంతరంగా సాగే పోట్లాటల నుంచి తప్పుకుని దూరంగా వెళ్ళిపోవడం.
    
    ఈ ఇంట్లో తిండి లేకుండా రోజు గడుస్తుందేమో కానీ, పోట్లాట లేకుండా పూట కూడా గడవదు.
    
    వాళ్ళు అంత అకారణంగా - అంత దారుణంగా ఎందుకు పోట్లాడుకుంటారో తనకి అర్ధం కాదు.
    
    వాళ్ళ పోట్లాట చూస్తుంటే తనకి దిగులుగా ఉంటుంది.

 Previous Page Next Page