విక్కీతో అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"మరి ఆ టైంలో నువ్వేం చేస్తున్నావ్ విక్కీ?"
ఏడుపు ఆపుకుంటూ అన్నాడు విక్కీ.
"యాపిల్ కోసే కత్తి వుంది అక్కడే! దాన్ని తీసుకుని ఈయన వీపులో గుచ్చేశాను."
"కత్తి ఇతని వీపులో గుచ్చుకుందా?"
"ఆ! రక్తం కూడా కారింది."
"ఈ పిల్లాడు చెబుతున్నది కరెక్టే అయితే కత్తి దిగబడిన గుర్తులు ఇతని కోటుమీదా, వంటిమీదా కూడా వుండాలి" అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటరు, స్వగతంగా, ఎవరినీ వుద్దేశించకుండా.
దినకర్ వెంటనే నిలబడివున్న ఇన్ స్పెక్టర్ చూపులు అప్రయత్నంగా దినకర్ కోటుమీదకి పోయాయి. శాటిన్, బ్రాకేడ్ కలిసిన కల్నేతలాగా వుంది ఆ ఎర్రకోటు.
కళ్ళు చిట్లించి మరింత తీక్షణంగా చూశాడు.
ఆ కోటు వెనక భాగంలో, నాలుగంగుళాలమేర చిరిగిపోతే, దాన్ని డార్నింగ్ చేసినట్లు వుంది. అదే కోటులో నుంచి కొన్ని శాటిన్ దారాలూ, కొన్ని బ్రాకేడ్ దారాలూ తీసి చిరిగిపోయినంత ఆ కాస్త మేరనీ తిరిగి నేతనేసినట్లుగా అతినైపుణ్యంగా డార్నింగ్ చేశారు. పట్టిపట్టి చూస్తేగానీ అక్కడ చిరుగు వున్న సంగతి ఎవరికీ అర్ధం అయేలా లేదు.
దినకర్ ని దాదాపు లాక్కెళుతున్నట్లు బయటికి నడిపించుకొచ్చాడు ఇన్ స్పెక్టర్. కలలో నడుస్తున్నదానిలా డాక్టర్ నిశాంత కూడా వెనకే వచ్చింది.
"మిస్టర్! కోటు ఓసారి విప్పండి!" అన్నాడు ఇన్ స్పెక్టర్ కటువుగా.
"లుక్! నాకిదంతా ఏమీ అర్ధం కావడం లేదు!" అన్నాడు దినకర్.
"అర్ధమయేట్లు చేస్తాను కోటు విప్పండి!" అవసరమైతే, తన మాటలే చెంపదెబ్బలా చెళ్ళున తగిలేలా గొంతు మార్చగలిగిన సామర్ధ్యం వుంది ఇన్ స్పెక్టర్ కి "రిమూవ్ ద కోట్!"
విధిలేక కోటు విప్పాడు దినకర్.
"షర్టు కూడా!"
షర్టుకూడా విప్పాడు దినకర్.
సరిగ్గా ఆ కోటు చిరిగిన స్థానంలోనే, అతని వీపుమీద కత్తి గాయం లాంటి మచ్చ వుంది.
ఆ ఒక్క మచ్చేకాదు.
ఉక్కు ముక్కలాంటి అతని వంటిమీద అనేకమైన గాయాలు తాలూకు మచ్చలు ఉన్నాయి.
అతన్ని ఎవరో క్రూరంగా కొట్టినట్లు, ఎర్రగా కాలిన లోహంతో వాతలు పెట్టినట్లు, సిగరెట్లతో కాల్చినట్లు, చర్మాన్ని చీల్చినట్లు....
రకరకాల గాయాల తాలూకు మచ్చలు!
జీసస్ క్రీస్తుని శిలువ ఎక్కించినప్పుడు, ఆయన శరీరానికి, వైద్యశాస్త్రంలో ఎన్ని రకాల గాయాలు వుంటాయని చెబుతారో, అన్ని రకాల గాయాలూ తగిలాయని అంటారు. తలకు ముళ్ళకిరీటం పెట్టడంవల్ల కలిగిన గాయాలు కడుపులో ఈటెలతో కుమ్మడంవల్ల ఒరుసుకుపోయి కలిగిన గాయాలు, శిలువను మోసుకుంటూ నడిచి వస్తున్నప్పుడు మధ్య మధ్యలో తట్టుకు కిందపడిపోవడంవల్ల డోక్కుపోయిన గాయాలు - సిలువ మీదికి ఎక్కించి కాళ్ళకూ, చేతులకూ మేకులు దిగెయ్యగా కలిగిన గాయాలు.....
అలా అన్ని రకాల గాయాలూ దినకర్ వంటిమీద వున్నాయి. అతన్ని ఎవరో చిత్రవధ చేసి చంపడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది ఆ గాయాలు చూస్తే! నోట మాటరానట్లు అతనివైపు కళ్ళార్పకుండా చూస్తూ వుండిపోయింది నిశాంత.
* * *
కోర్టు లోపల -
జడ్జిగారితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటున్నాడు.
"యువర్ ఆనర్! ఊహాతీతంగా మారిపోయిన సాక్ష్యాధారాలవల్ల కేసుని వాయిదా వేయాలని కోరుతున్నాను. దొరికిన కొత్త సాక్ష్యాధారాలతో కేసుని సమీక్షించడానికి వ్యవధి కావాలి."
"రిక్వెస్ట్ గ్రాంటెడ్!" అన్నాడు జడ్జి క్లుప్తంగా.
* * *
హత్యానేరం మీద అంతకుముందే అరెస్టు అయిన జమ్మన్నని చేతికి సంకెళ్ళు వేసి కాపలా కాస్తున్నారు ఇద్దరు కానిస్టేబుల్స్ అతనొక రౌడీ షీటరు.
ఇన్స్ పెక్టర్ జలీల్ కి వచ్చిన ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్టునిబట్టీ. సర్ కమ్ స్టానిషియల్ ఎవిడెన్సుని బట్టీ జమ్మన్నే హంతకుడని అరెస్టు చేయవలసి వచ్చింది. జమ్మన్న మరో రెండు హత్యకేసుల్లో, ఒక దొమ్మిడీకేసులో కూడా ముద్దాయి. కానీ ఇంతవరకూ ఏ నేరమూ రుజువుకాలేదు.
కానీ తను సేకరించిన సాక్ష్యం తనకే ఎందుకోగానీ అంత సంతృప్తికరంగా తోచడంలేదు ఇన్స్ పెక్టరు జలీల్ కి ఏదో, ఎక్కడో లోపం వుందని తోస్తోంది. తనది బాగా ట్రయినింగ్ అయిన పోలీసుమైండు. తన అంచనాలూ, తన ఊహలూ సాధారణంగా తప్పుకావు.
ఈ వైదేహి అనే స్త్రీ హత్యకేసులో జమ్మన్న పాత్ర గురించి తనకి వున్న అనుమానాలు ఇప్పుడు నిజమయినాయి.
జమ్మన్న చాలా నేరాలు చేసి వుండవచ్చు.
బహుశా హత్యలు కూడా చేసి వుండవచ్చు.
ఈ వైదేహి హత్యా మాత్రం ఇతను చేసి వుండడు.
కానీ సాక్ష్యాలు మాత్రం అతనికి వ్యతిరేకంగా వున్నాయి.
అందుకే అరెస్టు చేసి కేసు పెట్టవలసి వచ్చింది.
ఇప్పుడంతా మంచు తెర విడిపోయినట్లు విడిపోయింది. పిల్లవాడి సాక్ష్యంతో అసలు హంతకుడెవరో బయటపడిపోయింది.
ఇంతకుముంది ఈ పిల్లవాడి సాక్ష్యాన్ని అంతగా లక్ష్యపెట్టలేదు తను.
హంతకుడిని తాను కత్తితో పొడిచానని పిల్లాడు చెప్పినా, అదంతా తల్లిపోయిన దుఃఖంలో వున్న ఆ పిల్లవాడి ఊహాజనితమయిన కల్పన అనీ, అతనికి హాల్యుసినేషన్స్ కలుగుతున్నాయనీ అనుకున్నాడు.
కానీ ఇప్పుడు, హఠాత్తుగా ఈ ఎర్రకోటు మనిషి రావడంతో కుర్రాడు చెప్పిన కథ అతికినట్లు సరిపోతుంది.
"కమాన్! జీపు ఎక్కండి!" అన్నాడు జలీల్, దినకర్ తో.
చటుక్కున ముందుకు వచ్చింది నిశాంత.
"ఇన్ స్పెక్టర్! నాకూ కొద్దిగా లా తెలుసు. వారంట్ లేకుండా ఇతన్ని అరెస్టు చేయలేరు మీరు" అంది గట్టిగా.
ఆమెని ఎగాదిగా చూశాడు ఇన్ స్పెక్టర్.
"మీకు లా కొద్దిగా తెలుసేమోగానీ దాని తాలూకు లాలూచీలు పూర్తిగా తెలిసినట్లు లేవు. వినండి చెబుతాను" అని త్వరత్వరగా చెప్పాడు "ఇది మర్డర్ కేసు. అంటే కగ్నయిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. వారంట్ వస్తుంది - కొద్ది సేపట్లో! ఓకే! వాట్ మోర్ డూ యూ వాంట్?"
"ఆ వారంటు ఏదో వచ్చేదాకా మీరు దినకర్ ని మీతో తీసుకెళ్ళడానికి వీల్లేదు" అంది డాక్టర్ నిశాంత. కానీ అప్పటికే ఆమె గొంతులో ధైర్యం కాస్త తగ్గింది.
ఆమె మాటలని తీసిపారేస్తున్నట్లు అన్నాడు ఇన్స్ పెక్టర్ జలీల్.
"దర్యాప్తులో అవసరం అయితే పోలీసులు ఎవరినైనాసరే పోలీస్ స్టేషన్ కి పిలిపించవచ్చు. చివరికి ప్రైమ్ మినిస్టర్ ని కూడా! అయితే డిటెయిన్ చెయ్యడానికి మాత్రం వారెంట్ వుండాలి. నేను అతన్నిప్పుడు పోలీసు స్టేషనులో నిర్భంధించడానికి తీసుకుపోవడం లేదు. ప్రశ్నించడానికి తీసుకువెళుతున్నాను. ఓ.కే?"
"మేం ముందర మా లాయర్ ని కన్ సల్టు చెయ్యాలి" అంది నిశాంత.
అసహనంగా అన్నాడు జలీల్.
"మిస్! మేము మేమంటూ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. ఇది చాలా దూరం పోతుందని బహుశా మీకు తెలియకపోవచ్చు. మీరు మర్యాదస్తులు. మోర్ ఓవర్ యూ ఆర్ ఏ డాక్టర్! అతని గతి ఏమిటో ఇతని గతేమిటో యితని వంటిమీద వున్న గాయాలే చెబుతున్నాయి. ఇతను స్ట్రీట్ ఫైటర్ అన్నా అయి వుండాలి, చీప్ క్రూక్ అన్నా అయి వుండాలి. మీరు ఇతని బారినపడడం మీ దురదృష్టం. అనుకోకుండా ఇతని అసలు రూపం ఇవాళ బయటపడిపోవడం మీ అదృష్టం! అనవసరంగా ఈ గొడవలో మీరు జోక్యం చేసుకోకండి!
తెచ్చిపెట్టుకున్న బింకం హఠాత్తుగా జారిపోయినట్లయింది నిశాంతకి. ప్రాధేయపడుతున్నట్లు అంది జలీల్ తో.