ముఖం వికృతంగా పెట్టి "శకుంతలా? ఇతడు నీకు తండ్రికాడు, పరాయి మొగవాడిని అలా ఆనుకొని నడవకూడదు" అన్నాడు.
శకుంతల బిత్తరపోయి, "డాడీ! ఇతడేం మాట్లాడుతున్నాడు!" అంది.
శ్రీధర్ కి మనసు రగిలిపోతోంది, రమేష్ కి వినిపించేలా "మానవ సమాజంలో ఇంత నాగరికత పెరగటానికి ముందు మనుష్యులు ఆటవికుల్లా జీవించేవారు. ఇతడా ఆటవికుల భాష మాట్లాడుతున్నాడు." అన్నాడు.
"ఓ....కానీ.....ఇతడు నేను జాగ్రఫీ పుస్తకంలో చూసిన ఆటవికుడి బొమ్మలాలేడే?"
"ఈ సమాజంలో పైకి మనలాగే కనపడే ఆటవికులు చాలామంది వున్నారమ్మా!"
"ఓ గాడ్? అయితే కష్టం కదూ!"
చాలా కష్టం! అందుకే మనం జాగ్రత్తగా వుండాలి రామ్మా!"
శకుంతలను నడిపించుకుంటూ తీసుకుపోయి, తన కారులో కూచోపెట్టుకుని కారు స్టార్టు చేసాడు, రమేష్ పళ్ళు నూరుకున్నాడు.
2
విమల మంచంలో పడుకొని ఉంది. అందమైన ఆమె ముఖం వడిలి పోయి ఉంది. కళ్ళు అలసటగా ఉన్నాయి. ఆ మంచం ప్రక్కనే ఒక కుర్చీలో కూచొని వున్నాడు రాజు. రాజు చెయ్యి విమల చేతిలో వుంది.
"రాజూ! నాకు ఒక్క మాటియ్యి. ఏ పరిస్థితుల్లోనూ శకుంతలను వదలనని మాటియ్యి."
ఆరాటంతో అడుగుతోంది విమల. ఆ సమయంలో గదిలోకి వచ్చిన శకుంతల పకపక నవ్వసాగింది.
విమల ముద్ద్గుగా మందలిస్తూ, "ఏయ్, పిచ్చీ! ఎందుకలా నవ్వుతావ్?" అంది.
శకుంతల వచ్చి తల్లి పక్కన కూచొని, "నేనుకాదు-నువ్వె పిచ్చి. లేకపోతే నన్ను వదలొద్దని రాజుని బ్రతిమాలటం ఏమిటీ?" అంది.
"ఏం? రాజు నిన్ను వదలడని అంత విశ్వాసమా?"
"అదేం కాదు. ఈ రాజుగారు ఎప్పటికప్పుడు నన్ను వాదిలి పారిపోవాలనే చూస్తారు కానే, ఈయన్ని బ్రతిమాలుకోనక్కర్లేదు. అత్తయ్యతో ఒక్కమాట చెప్తే చాలు! ఎక్కడున్నా చెవి మెలిపెట్టి నా దగ్గిరకు తీసుకొస్తుంది. రాజూ! ఆ రోజు పిక్ నిక్ కి పారిపోదా మనుకున్న సంగతి గుర్తుందా?"
శకుంతల మళ్ళీ నవ్వసాగింది. రాజు ముఖం ఎర్రబడింది. ఆనాటి సంగతి అతనికి బాగా గుర్తుంది. అతడు తన స్నేహితులతో పిక్ నిక్ కి వెళ్దామనుకొన్నాడు. శకుంతల తనూ వస్తానంది.
"మేమంతా మొగవాళ్ళం నువ్వు రావటం బాగుండదు" అన్నాడతను.
"అయితే నువ్వూ మానెయ్యి" అందిశకుంతల తను ఒప్పుకోలేదు. శకుంతల తన తల్లి దగ్గిర ఫిర్యాదు చేసింది.
తల్లివచ్చి, "రాకరాక శకుంతల మనింటికివస్తే ఇప్పుడు ఎక్కడికో పోతానంటా వేమిటిరా? మానెయ్యి" అంది.
తను ఏది కోరితే అది చేస్తూ, తనకోసం బతుకుతున్న తల్లి మాట కాదనలేడు. శకుంతల చప్పట్లు కొడుతూ నవ్వింది. ఆ నవ్వులో - తనూ ఉండిపోయాడన్న సంతోషంకంటే, మాటనెగ్గిందన్న విజయగర్వమే ఉంది. శకుంతలలో ఈ అహంకారరేఖ తను సహించలేడు. ఆ తరువాత విధిలేక ఇంట్లో ఉండిపోయినా, శకుంతలమీద కోపంతోనేఉన్నాడు. కానీ శకుంతల ఆ కోపం నిలవనీయలేదు. అదే శకుంతలలో గొప్పతనం. కొద్దిగా ప్రేమిస్తుంది. పసిపిల్లలా అల్లరి చేస్తుంది.
విమల అంతా అర్ధం చేసుకుని, "హుష్! ఊరుకో!" అని కసిరింది శకుంతలని.
శకుంతల మూతి ముడుచుకుని, "నీకంత కష్టంగా ఉంటే వెళ్ళి పోతాలే!" అని తపతప అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది.
విమల ఒక్క నిట్టూర్పు విడిచి, "చూడు రాజూ! శకుంతలలో మొండితనం ఎంతఉందో పసితనం అంత ఉంది. కానీ, నిన్నుమాత్రం వెర్రిగా ప్రేమిస్తోంది. దాని భారం నీదే" అంది.
రాజు ప్రశాంతంగా, "నువ్వు దిగులు పడకత్తయ్యా! శకుంతల జీవితం సుఖప్రదమయ్యేలా నేను చూస్తాను" అన్నాడు.
విమల గతుక్కుమంది. 'శకుంతలను నేను పెళ్ళి చేసుకుంటాను' అననందుకు నిరాశగా ఒక్క నిట్టూర్పు విడిచింది.
రాజు అర్ధం చేసుకుని నవ్వుతూ, "శకుంతల నన్ను పెళ్ళిచేసుకోవాలనుకుంటే, అది నా అదృష్టం అనుకుంటాను. అలాకాక మరెవరినైనా చేసుకోవాలనుకొంటే ఈ వాగ్దానాలతో ఆమెను బంధించను. శకుంతల ఇంకా పెళ్ళి గురించి ఆలోచించటం చేతకాని పసిపిల్ల అత్తయ్యా! నాకు చేతనయినంతవరకూ తన సంతోషంకోసమే ప్రయత్నిస్తాను. ఏ ఆపదా రానీయను" అన్నాడు.
విమల ఆప్యాయంగా రాజు చెయ్యి నొక్కింది.
శ్రీధర్ శర్మ లోపలి రావటం చూసి, రాజు అక్కడినుండి వెళ్ళిపోయాడు. విమల శ్రీధర్ వంకచూసి ఆ కళ్ళలో కనపడుతున్న భావానికి కళ్ళు వాల్చుకుంది. ఏదో దుర్భర విషాదాన్ని అణచుకొంటున్నాయి ఆ కళ్ళు అంచేత మనసులో మెదిలే ప్రశ్న - 'కోర్టులో ఏమయిందీ?' అని అడగలేకపోయింది.
శ్రీధర్ శర్మ యధాలాపంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, "నీ వంట్లో ఎలా ఉందీ?" అన్నాడు.
విమల ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మౌనంగా దీనంగా అతని కళ్ళలోకి లోతుగా చూసింది. శర్మకిక తప్పలేదు.
"విమలా! రమేష్ మన ఇంటికి వచ్చేవాడా నేను లేనప్పుడు?"
అనారోగ్యంగా ఉన్న విమల ముఖం పూర్తిగా కళావిహీనమయింది.
"అవును."
"మరి నా కెందుకు చెప్పలేదు?"
"నా జీవితంలో పీడకలలాంటి ఆ మనిషిని గురించి మనమధ్య చర్చ లెందుకని చెప్పలేదు. స్వచ్చంగా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడే మీ ముందు ఆ మనిషి పేరెత్తలేక చెప్పలేదు. అవాంచనీయమయిన ఆ విషయాలతో మీ మనసుని కలవరపరచటం మెందుకని చెప్పలేదు. నేనేమి తప్పు చెయ్యటం లేదన్న ధైర్యంతో, మీకే విధమయిన ద్రోహమూ తల పెట్టలేదన్న ఆత్మవిశ్వాసంతో, ఈ క్షుద్రమైన విషయాన్ని మీ దృష్టిలోకి తేలేదు."
"కానీ ఆ క్షుద్రవిషయమే ఇప్పుడు మన పీకలమీదకి తెచ్చింది. ఇప్పటివరకూ శకుంతలని కోర్టులో హాజరు పరచకుండా చూడగలిగాను. కానీ ఈ రోజు శకుంతల తన తండ్రిని గుర్తించ గలదేమో - విచారించి చూడవలసిందేనన్నారు. పసిపిల్లను బోనులో నిలబెట్టవలసి వచ్చింది. శకుంతల రమేష్ ని గుర్తించింది. అతడు మన ఇంటికి నేను లేనప్పుడు వస్తున్నాడని కూడా చెప్పింది. అతడిని తండ్రిగా ఒప్పుకోలేదనుకో! కానీ.....కానీ.....శకుంతలలో రమేష్పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి."