విమల మాట్లాడలేదు. ఆమె కళ్ళనుండి కన్నీరు కురవసాగింది. శర్మ ఆప్యాయంగా ఆమె కన్నీరు తుడిచాడు. ధైర్యం చెపుతున్నట్లు భుజం తట్టాడు.
"దిగులు పడకు శకుంతలను అతడి కప్పగించను."
'శకుంతలలో రమేష్ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి! అన్నమాటలే విమల మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ చేదునిజాన్ని ఆమె కూడా గుర్తించింది.
వణుకుతున్న గొంతుకతో, "నేనున్నా లేకపోయినా శకుంతలను ఏనాడూ వదలరు కదూ?" అంది.
శర్మ చటుక్కున ఆమె నోరు మూసి, "నీకు మతిపోతోందా కొంపతీసి కోర్టువారిలా నువ్వూ శకుంతల నా కూతురు కాదని అనుమానించడం లేదు కదా?" అన్నాడు.
విమల మనసు సంతృప్తితో నిండిపోయింది. మాట్లాడలేక అతని చేతిని తన తడి కళ్ళకు హత్తుకుంది.
ఏనాటి అనుబంధం ఇది? ఎంత విశాల హృదయం ఇతనిది?
3
హేమా మిల్స్ షోరూం కష్టమర్స్ ని ఆకర్షించటానికి అమర్చిన నిలువుటద్దాలతో, ట్యూబ్ లైట్లతో మెరిసిపోతోంది.
అంతకంటే మెరిసిపోతోంది షాప్ లో ఉన్న సేల్స్ గరల్ మెరిసే చిరునవ్వుతో కష్టమర్స్ ని ఆహ్వానిస్తూ తియ్యటి మాటలతో, వాళ్ళు కొనదలచుకొన్న దానికంటే ఎక్కువ కొనిపిస్తూ, మళ్ళీ బట్టలన్నీ ఎక్కడి వక్కడ పొందికగా అమరుస్తోంది. ఆ షాప్ లోకి అడుగుపెట్టిన శ్రీధర్ శర్మ ఆమెను చూస్తూ తనను తాను మరిచి నిలబడ్డాడు.
"ఏం కావాలండి?" తియ్యగానే ఉన్నా కాస్త పదునుగా కూడాఉంది ఆ కంఠం.
శర్మ తడబడి. "నాకు__నాకు...." అన్నాడు ఏం చెప్పాలో తెలియని వాడిలా.
"షర్ట్ పీసెస్ అటు ఉన్నాయ్." అందామే అవతలివేపు చూపిస్తూ.
"నాకు షర్ట్ పీస్ అక్కర్లేదు."
"మరి చీరలు చూస్తారా?" అంటూనే ఒక బండిల్ బల్ల మీద పెట్టింది బీరువాలోంచి తీసి.
"చూస్తాను" అంటూ ఆ చీరల దగ్గరకు నడిచాడు.
ఆమె ఒక్కొక్క చీరనూ మడత విప్పి చూపుతూ, నాణ్యతగురించి వర్ణించసాగింది.
అతని చూపులు చీరలమీద లేవని గుర్తించటానికి ఆమెకు ఎంతో సేపు పట్టలేదు.
నిటారుగా నిలబడి, "మీకేం కావాలండీ?" అంది కంఠంలో అదే పదును.
"చీర.....చీర__" అన్నాడు కంగారుగా. ఆ పదును అతడు తట్టుకోలేకపోతున్నాడు.
"ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి."
"నాకు తెలియదు. మీరే సెలక్ట్ చేయండి."
"ఎవరికోసం? మీ శ్రీమతికోసమా?"
"ఆ.....అవును."
"ఆవిడ ఎలా ఉంటారు?"
"సన్నగా-పొడుగ్గా__చిక్కని పాలల్లో కొద్దిగా పసుపూ, బోలెడు గులాబీరంగూ కలిసిన ఛాయలో.
ఆ అమ్మాయి నవ్వింది.
"నవ్వినపుడు బుగ్గన సొట్టలు కూడా పడతాయి."
చిత్రంగా చూసింది.
"కళ్ళు మెరుస్తాయి."
అప్పుడే ఎదురుగా ఉన్న అద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కనిపించింది. అతడు తననే వర్ణిస్తున్నాడనే అనుమానం కలిగింది. కంగారు అణచుకుంటూ, తనకు నచ్చిన ఒక చీర తీసి అతడివైపు తోసి, "ఇది తీసుకోండి" అంది.
అతడు మాట్లాడకుండా తీసుకున్నాడు. అతడు వెళ్ళిపోయాక ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. నిలబడలేక కూచుండి పోయింది. రుమాలుతో ముఖం తుడుచుకుని, తనను తాను హెచ్చరించుకుని మళ్ళీ నిలబడింది.
వారం తర్వాత అతడు మళ్ళీ వచ్చాడు. ఈసారి ఏ మాత్రం తడబడకుండా, "చీరలు చూపించండి" అన్నాడు. ఇదికాదు అదనీ, అదికాదు ఇదనీ, అరగంట పైగా అన్ని చీరలూ చూశాడు. అకస్మాత్తుగా "ఇంక చాల్లెండి. చూపించక్కరలేదు." అన్నాడు!
ఆమె ఆశ్చర్యంగా అతనివైపు చూస్తూ, "అదేం?" అంది.
"మీరు చాలా అలిసిపోయారు. నుదుటి నిండా చెమటపట్టింది."
ఆమె గతుక్కు మంది. సిగ్గుపడి రుమాలుతో నుదురు తుడుచుకుని, అంతలోనే గంభీరంగా "ఇది మా వృత్తి నా కలసట ఏం లేదు. ఇంకా ఏం చూపించమంటారో చెప్పండి" అంది.
అతడు తన ముందున్న గుట్టలోంచి తనకు నచ్చిన చీరలు మూడు ఏరి, "వీటిలో మీకు నచ్చినది ఒకటి ఇవ్వండి" అన్నాడు.
ఆమె తనకు బాగున్నదని తోచింది అతని ముందుకు తోసింది.
మళ్ళీవారం అతడు మళ్ళీ వచ్చాడు. అప్పటికి అతడు ప్రతిశనివారం వస్తున్నాడని ఆమె గ్రహించింది. అతడు ఎక్కడైనా పనిచేస్తున్నాడేమో శనివారం హాఫ్ డే కాబోలు' అనుకుంది.
అతడు మళ్ళీ చీరలు కావాలని వచ్చాడు. ఆమె బండిల్ లోంచి చీరలు తీస్తూ, "నేను సెలక్ట్ చేసినవి మీ శ్రేమతిగారికి బాగున్నాయా?" అంది.
"ఏమో! నాకేం తెలుసు?"
"అదేమిటి?"
"ఇంతవరకూ ఆవిడ వాటిని కట్టుకోలేదు."
"అవే కట్టుకోకపోతే, మళ్ళీ వచ్చారెందుకు?"
"ఎప్పుడో ఒకప్పుడు కట్టుకోకపోతుందా అనే ఆశతో__"
ఆమెకు- అతడు కావాలని తనతో మాట్లాడటానికే తమ షాప్ కి వస్తున్నాడేమోననే అనుమానం కలిగింది, కోపం వచ్చింది. కావాలని అతిఖరీదైన చీరతీసి అతని ముందుకు తోసి, "ఇది తీసుకోండి" అంది తీసుకుని బిల్ చెల్లించి వెళ్ళిపోయాడు. పోతూపోతూ ఒక్కసారి తిరిగి చూశాడు. ఆ కళ్ళు నవ్వుతున్నట్లున్నాయి.