వర్ధనమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. కూర్చుని బియ్యమేరుతున్న జయ చేతిలోంచి పళ్ళెం తీసి ప్రభకిస్తూ "మీ అక్క ఏర్తుందిగానీ నువ్వెళ్ళి మీ ఆయనకేం కావాలో చూడు! అసలే చాలా షైపరుడిలా వున్నాడు" అంది.
ప్రభ మారుమాట్లాడకుండా బియ్యం ఏరసాగింది.
జయ గదిలోకెళ్ళేసరికి సగం అల్లిన స్వెట్టర్ని పట్టుకుని చూస్తున్న శశిధర్ కనిపించాడు. "ఏమిటి చూస్తున్నారు?" అనడిగింది.
"ఇన్నిరోజులూ నాకు దూరంగా ఉండి, దీనికి దగ్గరగా వున్నావు కదా! అందుకని ఆ విశేషాలన్నీ తెలుసుకుంటున్నాను" అన్నాడు చెంపకి చేర్చుకుని.
"చాలా నేర్చుకునొచ్చారే!" అంది నవ్వుతూ.
"నువ్వుంటే నీతో మాట్లాడ్తూ వుండేవాణ్ణి. నువ్వు లేకపోబట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. అసలు పుస్తకాలు చదవడం ఎంతమంచి అలవాటో తెలుసా జయా! మనింట్లో మనం కూర్చుని ప్రపంచాన్ని చూడొచ్చు. నేనెన్నో మంచి మంచి పుస్తకాలు కొని ఉంచాను. నువ్వొచ్చాక చదువుదువుగానీ. ఇంకొక గమ్మత్తయిన విషయం. అమ్మకి కూడా చదవడం అలవాటు చేసేశాను. దాంతో మధ్యాహ్నం పూట పెత్తనాలన్నీ మానేసి పుస్తకం పట్టుకుని కూర్చుంటోంది. అస్సలు ఆవిడ నోరు వినిపించడం లేదు. అయినా అత్తలేని కోడలు ఉత్తమురాలు కదా"
జయ నవ్వింది అతని మాటలకు "వదినగారూ, వాళ్ళూ బావున్నారా?"
"ఆ! వాళ్ళు వేరే ఇల్లు చూసుకున్నారు. ఇవాళ రేపట్లో మారిపోతామన్నారు" అన్నాడు.
"అమ్మో! ఎందుకలా?" అంది బాధగా జయ.
"అమ్మని వంట అవీ సరిగ్గా చెయ్యడంలేదని సాధించారు. "కూర్చుని తినడం కాక సాధింపు కూడానా? అయినా నేనూ నా కోడలూ మీకు జీతం, భత్యంలేని నౌకర్లమా?" అనడిగింది. దాంతో మా అక్క "నీకంత బరువుగా ఉంటే వెళ్ళిపోతాం. వంట చెయ్యాల్సిన అగత్యం నాకేంటి? వేరేగా వుండి వంటమనిషిని పెట్టుకుంటాను" అని రోషంగా వెళ్ళి ఇల్లు కుదుర్చుకుంది. నేను కానీ అమ్మకానీ ఉండమని అడగలేదు. పైపెచ్చు ఇంట్లో న్యూసెన్స్ తగ్గిపోతుందని సంతోషించాము" అన్నాడు నవ్వుతూ.
ఈ రెండు నెలల్లో శశిధర్ ఎంతో మారిపోయినట్లనిపించింది జయకు. "నేను లేకపోతే మీకేమనిపించిందీ?" అనడిగింది.
"చాలా బాగా అనిపించింది" అన్నాడు దగ్గరకు తీసుకుంటూ.
"ఎందుకూ?" బుంగమూతి పెట్టి కోపంగా అడిగింది.
"నువ్వున్నప్పుడు నీ గురించి ఆలోచించనేలేదెప్పుడూ! కానీ నువ్వు లేనప్పుడు రోజూ నీ గురించే ఆలోచించాను. నీలోటు తెలిసొచ్చింది. దూరంగా వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందనిపించింది. అందుకే అప్పుడప్పుడు భార్యాభర్తలు దూరంగా వుంటూ వుండాలి. బహుశా ఈ ఆచారవ్యవహారాలూ అందుకోసమేర్పరచినవే కాబోలు" అన్నాడు.
"నిజంగా నా లోటు తెలిసొచ్చిందా?" అడిగింది తృప్తిగా.
"బాగా తెలిసొచ్చింది. ఈసారి నువ్వొచ్చాక చూస్తావుగా నిన్నెంత బాగా చూసుకుంటానో" అన్నాడు మరింత దగ్గరికి తీసుకుంటూ.
"ఇప్పుడిలాగే చెప్తారు. పాపో, బాబో పుట్టగానే అన్నీ మరచిపోయి వాళ్ళే లోకమనుకుంటారు. వెనకొచ్చిన కొమ్ములు వాడికదా" అంది కవ్విస్తూ.
"అత్తగారి దగ్గర సామెతలు బాగానే నేర్చుకున్నావు కానీ, పిల్లలు పుట్టాకే భర్తకి భార్యంటే ప్రేమ మరింత పెరుగుతుంది. బహుశా తండ్రిని చేసినందుకు కృతజ్ఞత వల్ల కాబోలు" అన్నాడు. జయ రెప్పవాల్చకుండా శశిధర్ నే చూడసాగింది.
"అంతలా చూడకు! దిష్టి తగులుతుంది" అంటూ అరచేత్తో ఆమె కళ్ళు మూసి, పెదవుల మీద ముద్దుపెట్టాడు.
* * * *
సింధు సోఫాలో కూర్చుని రమ్యచేత బొమ్మలు పెట్టిస్తోంది. అరుణ్ చిన్నచిన్న వెదురుబద్దలతో బోను చేసి అందులో చిన్నచిన్న జంతువుల బొమ్మలు పెట్టి 'జూ' తయారుచేస్తున్నాడు. తేజా వంటింట్లో బామ్మతో కలిసి చెగోడీలు చేస్తున్నాడు.
"బామ్మ నాకు రేపు పూలజడ కుడుతుంది తెలుసా?" అంది రమ్య కళ్ళు పెద్దవి చేసి.
తేజ "నాకూ కుడ్తుంది" అన్నాడు వెంటనే.
"నీకెక్కడ కుడ్తుందీ?" అంది ఏడిపిస్తూ రమ్య.
"కుట్టాల్సిందే, కుట్టాల్సిందే" అంటూ చిందులు తొక్కసాగాడు ఏడుస్తూ వాడు.
"ఆడపిల్లలకేరా ఆ జాడలూ, ముచ్చట్లూ. మనకి వేరేవున్నాయి. ఇదిగో అంటూ పతంగీ, చక్రీ చూపించాడు అరుణ్. "నేనెగరేస్తా ఎగరేస్తా" అంటూ సంతోషంగా చప్పట్లు చరుస్తూ తండ్రి వెంట మేడమీదికెళ్ళిపోయాడు వాడు.
"చూడమ్మా డాడీ! మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు" అంటూ ఏడుపు మొఖం పెట్టిన రమ్యతో "నేను చేస్తాలే" అంటూ వచ్చి కూర్చుంది సింధు.
ఇంతలో చిట్టెమ్మ చేతులు నలుపుకుంటూ వచ్చి నిల్చుంది.
"ఏమిటి?" అడిగింది సింధు తలెత్తకుండానే.
"నాకు జీతం గిట్టుబాటవట్లేదమ్మా...!" అంది నెమ్మదిగా.
"ఇంకో యాభై పెంచుతాన్లే"
"అయినా కష్టమే అమ్మా!" అంది.
సింధు తలెత్తి నవ్వుతూ "ఎంత పెంచినా నీకింక గిట్టుబాటవదులే! సరే నీ ఇష్టం" అంది.
అక్కడినుండి వెళ్ళిపోయింది చిట్టెమ్మ. కాసేపటికి అత్తగారొచ్చి "సింధూ! చిట్టెమ్మని వెళ్ళిపొమ్మన్నావా? బ్యాగు సర్దుకుంటోంది" అనడిగింది.
"నేను వెళ్ళిపొమ్మనలేదు. తనే వెళ్ళిపోతుంది" అంది సింధు మామూలుగా.
"నావల్ల కాదుగదా!" అందావిడ కంగారుగా.