Previous Page Next Page 
తృప్తి పేజి 50


    "నువ్వొస్తేగానీ నాకేం కొనాలో ఎలా కొనాలో ఏం తెలుస్తుందీ?" అన్నాడు చిరాగ్గా.
    "వెళ్ళిరా వదినా. నేనేం చెయ్యనులే" అంది జయ. తప్పదని బయల్దేరింది కావేరి.
    ఈసారి నర్మద కూడా సెలవుపెట్టి పండుగ పనులు చేస్తోంది. పిల్లలు మంచి హుషారుగా ఉన్నారు. తులశమ్మగారు మంచంమీద కూర్చునే కోడలికి కాజాలు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. శంకర్ చాలా సంతోషంగా వున్నాడు. తల్లికీ, పిల్లలకీ బట్టలు తెచ్చాడు.
    "అమ్మాయికేది?" అడిగింది తులశమ్మగారు.
    "తనకి నేను కొంటే నచ్చదమ్మా!" అన్నాడు.
    "చాల్లే సంబడం! వెళ్ళి అమ్మాయికి కూడా తీసుకురా. ఇన్నాళ్ళు కాపురం చేశావు తన ఇష్టాఇష్టాలు నీకు తెలియవూ!" అని మందలించిందావిడ.
    కాసేపయ్యాక శంకరొచ్చి నర్మద వెనకాల నిలబడి "నీకోసం చీర తెచ్చాను. నీకు నచ్చుతుందో లేదో?" అన్నాడు బెరుకుగా.
    "ఏదీ" అంది.
    ప్యాకెట్టులోంచి పాలపిట్టరంగు ప్లెయిన్ చీర తీసి "నీ ఒంటిరంగుకిది బావుంటుందనిపించింది. నీకు నచ్చకపోతే ఎక్స్ చేంజ్ చేస్తాను" అన్నాడు.
    "చాలా బావుందండీ! ఇప్పటినుండి కొన్నిపన్లు నన్నడక్కుండా చేస్తుండండి" అంది నవ్వుతూ.
    రెండు వాటాల పిల్లలూ కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఆటో ఆగింది. అందులోంచి శశిధర్ దిగి లోపలికొస్తుండగా "ఎవరు కావాలి?" అంటూ వల్లి నిలేసింది.
    "జయ కావాలి" అన్నాడు కంగారుపడి వెంటనే.
    "అత్తా! నువ్వు కావాలని ఎవరో వచ్చారు" అంటూ అది రయ్యిన లోపలికెళ్ళింది.
    "ఎవరే" అంటూ గమ్మున లేవబోయిన జయ నడుంలో నెప్పిగా అనిపించి ఒక్కక్షణం అక్కడే కూర్చుంది. ఇంతలో హేమ్ లెట్ వస్తూ "హూమ్ డూయూ వాంట్?" అనడిగింది శశిధర్ ను.
    "సుధాకర్ గారిల్లు"
    "ఇదే ఇదే కూర్చోండి" అని కూర్చోపెట్టి లోపలికెళ్ళి "నెవర్ బిలీవ్ ఏ స్ట్రేంజర్ అన్నారు పెద్దలు. అందుకే సుధాకర్ కోసమెవరో వస్తే బయట కూర్చోపెట్టి వచ్చాను" అంది జయతో.
    "అన్నయ్య కోసమా!" అంటూ మళ్ళీ తన పన్లో మునిగిపోయింది జయ. "వదినగారూ! ఏం చేస్తున్నారు" అంటూ వంటింట్లోకెళ్ళిపోయింది హేమ్ లెట్.
    షాపింగ్ పూర్తిచేసుకుని బట్టల ప్యాకెట్లు, కూరలు, పండ్లు సంచులనిండా మోసుకుంటూ లోపలికొచ్చిన కావేరీ, సుధాకర్లకు ముందుగదిలో కుర్చీలో నిద్రపోతున్న శశిధర్ కనిపించాడు.
    "అయ్యయ్యో! ఇదేమిటిలా పడుకున్నారు" అనుకుని "జయా! జయా!" అంటూ లోపలికెళ్ళింది కావేరి. కూర్చుని తీరుబడిగా ముగ్గులేసుకుంటున్న జయని చూడగానే "అదేమిటే! అలా ముందు గదిలో అతన్ని ఒంటరిగా వదిలేసి..." అనగానే "అత్తయ్య మాట్లాడకూడదంటేనూ..." అని నసిగింది తన ధోరణిలో ముగ్గుని తదేకంగా చూసుకుంటూ.
    'అలా ఎందుకు చెప్పారూ! అదేమన్నా ఆచారమేమో' అనుకుంటూ వంటింట్లోకెళ్ళింది కావేరి. "జయా వాళ్ళాయనతో దాన్ని మాట్లాడవద్దన్నారా?" అంది హేమ్ లెట్ తో.
    "జయ హస్బెండా?" అందావిడ ఆశ్చర్యంగా.
    ఆవిడ ద్వారా జరిగిన పొరపాటు తెలుసుకుని నవ్వాపుకోలేకపోయింది కావేరి.
    సుధాకర్ జయ గదిలోకెళ్ళి "శశిధర్ అలిగి వెళ్ళిపోయాడు" అన్నాడు దిగులుగా మొహం పెట్టి.
    జయ ఉలిక్కిపడి "ఆయనెప్పుడొచ్చారూ?" అంది.
    "చాలాసేపయిందట. నువ్వు పలకరించను కూడా పలకరించలేదని కోపమొచ్చి వెళ్ళిపోయాడు" అన్నాడు.
    జయకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అదేమిటన్నయ్యా! నువ్వైనా చెప్పద్దూ" అంటూ వాకిట్లోకి పరుగెత్తింది. కుర్చీలో నిద్రపోతున్న భర్తని చూడగానే నవ్వూ, జాలీ కలసివచ్చాయి.
    "ఏమండీ!" అంది ప్రేమగా.
    అదాటుగా లేస్తూ "నువ్వెప్పుడొచ్చావు?" అన్నాడు.
    "ఖర్మ! నేను కాదు మీరే వచ్చారు. అయినా జయ భర్తనని చెప్పి లోపలికి రావద్దూ" అంది అలకగా.
    "ఏమో! అలా చెప్పడానికి నాకేమితో సిగ్గేసింది" అన్నాడు బిడియంగా.
    "భార్యని భార్య అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేనా! సరే లోపలికి రండిక. అన్నయ్యకీ సంగతి చాలు నన్ను ఎప్పుడూ ఏడిపించడానికి" అంటూ అతని బ్యాగ్ తీసుకుని లోపలికి దారితీసింది.
    "నేను క్వశ్చన్ వేస్తే నువ్వు ఆన్సర్ చెప్పకుండా రిఫరెన్స్ మొదలుపెట్టావు. అందుకే పాసవడానికి కాస్త గ్రేస్ కావలసి వచ్చింది. ఏమనుకోకు నాయనా!" అంది హేమ్ లెట్.
    సాయంత్రం అయిందింటికి ప్రభ వచ్చి వాళ్ళమ్మాయి బొమ్మలు పెట్టుకుందని పిలిచింది. "పొద్దుటినుంచీ ఒకటే పని. అలసిపోయానే బాబు, ఏమైనా పంపించు, నేనన్నమొకటే వండుకుంటాను" అంది.
    "అదిమాత్రమెందుకు! మాతోబాటే మీరూనూ. పిల్లలెలాగూ ఇక్కడే వున్నారు. వుండిపొండి" అంది కావేరి.
    "అంతమాత్రానికే 'సెవన్ జాస్మిన్స్ హైట్'లా నువ్వలసిపోతే, వాళ్ళు మాత్రం తక్కువపని చేసుకుంటున్నారనుకున్నావా?" అడిగింది హేమ్ లెట్ కాస్త కోపంగా కోడల్ని.
    "ఫరవాలేదులెండి! ఏదో దగ్గరగా వున్నాం కాబట్టి..." అంటూ అందుకుంటున్న వర్ధనమ్మతో "స్టే దేర్. అక్కడే ఆగిపోండి వదినగారూ, ఇలా మీరు అలవాటు చెయ్యడం ఏమీ బాగాలేదు. పగలంతా ఆఫీసులో చాకిరీ చేసుకొచ్చి ఇంట్లో మళ్ళీ క్షణం విశ్రాంతి తీసుకోకుండా చేస్తున్న కావేరీ, తొమ్మిదినెలలొచ్చి కూడా ఒక్కచోట నిముషముండకుండా తిరుగుతూ చేస్తున్న జయలాంటిదేకదా తను కూడా! నీ ఇంట్లో పని నీకు బరువేంటి చేసుకో అని మీరు మందలించుంటే ఇలా తయారయ్యేది కాదు. మీరున్నంతవరకూ అన్నీ చేస్తారు ఫర్వాలేదు కాని రేపు తన పిల్లలు పెద్దవాళ్ళవుతారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎన్నెన్నో చెయ్యాలి. పని రాకపోతే ఎంత కష్టం! నలుగురిలో నవ్వులపాలు కాదూ!" అంటూ నిష్టూరమాడింది.

 Previous Page Next Page