Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 5


    ఇక శశాంక కథలోకి వస్తే...


    అనాథగా పెరుగుతున్న శశాంక ఒకనాడు ఎగ్జిబిషన్ లోని ఒక షూటింగ్ స్టాల్ కి వెళ్ళాడు.


    అప్పటికి శశి తల్లితండ్రులు మరణించి పదిహేను రోజులైంది. ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టు ఒంటరితనాన్ని ఆశ్రయించి బ్రతుకుతున్న శశాంకపై కొందరు జాలి మాత్రమే చూపిస్తే, మరికొందరు పరిచయస్తులు ఇంటికి అన్నం తెచ్చి పెట్టేవారు. అమ్మ గోరుముద్దలకు బాగా అలవాటుపడడం మూలంగానో లేక తిండిపై ధ్యాస లేకనో తోచినప్పుడు తినేవాడు. అదీ లేనినాడు పస్తులుండేవాడు.


    శశి జీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ రోజు శశి జేబులో అమ్మ ఇచ్చిన డబ్బుల్లో కొన్ని ఖర్చుకాగా అయిదు రూపాయలున్నాయి. ఒక్క రూపాయికి అయిదు బుల్లెట్స్ స్టిక్స్ చొప్పున తీసుకుని ఓ చక్రంలో వున్న అయిదు బెలూన్స్ నీ రివాల్వర్ తో షూట్ చేయగలిగితే షాపు యజమాని అయిదు రూపాయిలిస్తాడు. పెదవి విప్పి కొత్తవార్ని ఏదీ అడిగే ధైర్యం చేయని శశి ఆ రోజు ఎంత సాహసం చేశాడూ అంటే అయిదు రూపాయిలతో పాతిక స్టిక్స్ తీసుకున్నాడు.  


    అంతే...


    రివాల్వర్ చేతిలోకి తీసుకున్న శశి అరక్షణంలో ఓ ధ్యానంలోకి జారిపోయాడు. సరైన తిండికి నోచుకోక నీరసించిన అతడి చేయి ఎక్కుపెట్టిన బాణంలా బిగుసుకుపోగా మస్తిష్కపు అట్టడుగు పొరల్లో ఓ సన్నని మూలుగు.


    మెలితిరిగిపోతున్న ఓ ఆకారం అతడి కళ్ళముందు... పెటేల్మని అగ్నిపర్వతపు లావాలా పగిలిన ఓ నీటిబొట్టు నిస్త్రాణగా అతడి కనుకొలకుల్లో నిలబడింది.


    ఊపిరి బిగపట్టాడు. మరుక్షణం బెలూన్ పగిలింది.


    చప్పట్లు కొట్టారు చుట్టూ వున్న జనం.


    అతడు అభినందనలు అందుకొనే ప్రయత్నంగా అసాధారణమైన ప్రజ్ఞ చూపిస్తున్నాడని అంతా పొరపాటు పడ్డారు కాని శశి లక్ష్యం అది కాదు.


    అతడా క్షణాన గురిచూసి కొడుతున్నది తన జీవనగతిని మార్చిన ఓటమిని. అలా నిర్వచించుకోగలిగే వయసు కాదు శశిది. కాని లక్ష్యమదే.


    ఎంతో వ్యాపార దక్షతతో పసిపిల్లల ఉత్సాహాన్ని తెలివిగా కాష్ చేసుకునే ఆ షాపు వాడిని శశి ఎంత కంగారు పెట్టాడూ అంటే అరగంట వ్యవధిలో అతను ఏభై రూపాయలు సంపాదించాడు.


    చాలా అమాయకంగా కనిపించే ఒక మామూలు పసికందు అలాంటి నేర్పుని ప్రదర్శించడం అతడి అనుభవంలో అదే చూడడం.


    ఒకవేళ శశిని పరిశీలనగా గమనించి వుంటే నీళ్ళు చిప్పిల్లిన అతడి కళ్ళు, కదిలే కనుపాపల్లో రగిలే కసి కొత్త అర్థాన్ని చెప్పి వుండేవి.


    ఆ విషయాన్ని అక్కడ నిలబడ్డ ఏ వ్యక్తీ గుర్తించలేదు ఒకే ఒక్క మనిషి తప్ప. అతడు కల్నల్ రాజమణి.

    
    చుట్టంచూపుగా ఎనిమిదేళ్ళ కూతురుతో ఆ ప్రాంతానికి వచ్చిన రాజమణి కూతురి ఉత్సాహాన్ని కాదనలేక ఆ స్టాల్ ని సందర్శించడం జరిగింది.


    శశాంక ఉనికిని ఇష్టపడని షాపు యజమాని అతడ్ని నెడుతుంటే జోక్యం చేసుకున్నాడు రాజమణి.


    మరో అయిదు నిమిషాలలో శశాంక రాజమణి, అతడి కూతురు కృపతోబాటు ఓ రెస్టారెంట్ లో వున్నాడు.


    బిడియంగా తల వంచుకున్నాడే తప్ప శశి చాలాసేపటిదాకా ఒక్క ప్రశ్నకీ జవాబు చెప్పలేదు.


    తెప్పించిన టిఫెన్ సైతం తినకుండా తల వంచుకుని కూర్చున్న శశాంకని ఆత్మీయంగా కదిలించింది కృపే... "నువ్వు టిఫెన్ తింటూ డాడీ అడిగిన ప్రశ్నలకి బుద్ధిగా జవాబు చెబితే నిజంగా డాడీ నీకు నిజం రివాల్వరిస్తారు".


    ఉద్వేగంగా తల పైకెత్తి చూశాడు శశి. అన్నం తిననని మారాం చేసేటప్పుడు అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది.


    ఆ క్షణం శశిపై కృప సైకలాజికల్ గా గెలిచే అవకాశాన్ని మాత్రమే ఇవ్వలేదు. ఒక అనుభవమున్న సైనికాధికారిగా శశి మానసిక స్థితిని అంచనా వేయడానికే సహకరించింది.


    శశాంక వారి సానుభూతికి కదిలి అప్పుడే పుట్టిన పసికందులా బావురుమనలేదు.


    తల వంచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు.


    సరిగ్గా ఇక్కడే శశి కథ ఓ మలుపు తిరిగింది.


    ఎన్నో వసంతాలనీ, మరెన్నో గ్రీష్మాలనీ దాటుకుంటూ ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల సుదీర్ఘయానంలో అలసటగానైనా ఓ కొలిక్కి చేరిన శశాంక చరిత్ర విధి రాసిందో లేక దుర్విది రాయనిదో కాని అనూహ్యమైన మరెన్నో సంఘటనలకి కారణమై పోయింది.


                                                            *    *    *


    అర్ధరాత్రి...


    పగిలిన పయోధి నాల్కల్లా ప్రకృతిని చుట్టుముట్టిన ప్రళయ ప్రభంజనపు హోరులో...


    ఘనాఘన పరివేష్టితమైన నభం కక్కిన ఘర్మజలం కుంభీరసమై నేలను నిమజ్జనం చేస్తున్న ఒక చీకటి రాత్రి.


    ఉరుములు విచల ద్విహంగాలై, మెరుపులు విప్ర భుజంగాలై నిశీధి గుండెలను తూట్లు చేస్తున్న సమయంలో...


    ఓ కారు వేగంగా సాగిపోతూంది.

 Previous Page Next Page