A THING IS NOT NECESSARILY TRUTH BECAUSE SOMEBODY DIES FOR IT.
-Oscar Wil de
నానీ
- కొమ్మనాపల్లి గణపతిరావు
అసురసంధ్య వేళ...
ఎదురుగా ప్రవహిస్తున్న శారదానది మెట్టినింటికి వెళ్ళే ముగ్థలా ముందుకు సాగిపోతుంటే వేదంనిండిన గాలి సామగానంలా ఏటిపైనుంచి అల్లనల్లన తరలివస్తూంది.
తాత ఒడిలో కూర్చుని అంతవరకూ మంత్రపుష్పం వల్లెవేసిన నానీ "చీకటి పడిపోతుందిగా తాతయ్యా" అన్నాడు ఇక వెళ్ళిపోదామన్న భావాన్ని పరోక్షంగా ధ్వనింపచేస్తూ.
"దొంగభడవా... ఆకలేస్తోందని చెప్పొచ్చుగా ."
ఎనిమిదేళ్ళ నానీని చూస్తూ నవ్వుతూ అన్నాడు విశ్వేశ్వరశాస్త్రి.
"అవును... నాకు అదేంటోగాని వుట్టుట్టిగా ఆకలేస్తోంది."
"ఆకలేస్తుంది సరే. మరి నాకు నర్సరీరైమ్ నేర్పవూ" అన్నాడు శాస్త్రి.
ప్రతి సాయంకాలమూ మనవడితోపాటు ఏటిఒడ్డుకు వచ్చి వేదాన్ని బోధించడంతోపాటు మనవడి నర్సరీరైమ్స్ వినడమూ ఆయనకు ఆనవాయితీయే.
వేదోపనిషత్తుల్ని ఔపోసన పట్టినవాడైనా ఆధునిక విజ్ఞానమూ మనిషి పురోగతికి అవసరమని భావించే అభ్యుదయ భావాలు గల వ్యక్తి ఆయన.
"ఒడ్డున నడుచుకు వెళుతూ చేపపిల్లల ఈత చూద్దామా తాతయ్యా" తాతయ్యను మభ్యపెట్టాలనుకున్నాడు నిజంగా ఆకలివేస్తుంటే.
"చేపపిల్లకి ఈత, తాతకి దగ్గూ నేర్పాల్సిన అవసరం లేదుకాని ముందు నీ ఇంగ్లీషురైమ్ చెప్పరా గడుగ్గాయీ."
ఇక తప్పదనుకున్నాడు నానీ.
"ఓల్డ్ మదర్ హబ్బర్డ్
వెంట్ టు ది కప్ బోర్డ్
టు గెట్ హెర్ పూర్ డాగ్ ఏ బోన్..." మసక చీకట్లో ఏటి ఒడ్డున గుండ్రని పండులాంటిదేదో కొట్టుకొస్తున్నట్టనిపించి ఏకాగ్రతగా చూశాడు.
"టు గెట్ హెర్ పూర్ డాగ్ ఏ బోన్..." గొణుగుతూనే గుర్తుపట్టేశాడు కొట్టుకొస్తున్నది తాటిపండని.
రైమ్ మధ్యలోనే ఆపి నీటిని చేరుకున్నాడుగాని అప్పటికే అది వేగంగా ముందుకెళ్ళిపోవడంతో బోలెడంత నిరుత్సాహపడిపోయి "బట్ వెన్ షి గాట్ దేర్ ది కప్ బోర్డ్ వజ్ బేర్" అన్నాడు చేతుల్ని త్రిప్పి ఉక్రోషంగా.
"అంటే అర్థమేమిట్రా నానీ?"
తాతలాంటి మేధావి అలా అర్థం అడగటం నానీకి గర్వకారణమేగాని ఈవేళ ఈ తాటిపండు చేజారడం మహాకోపాన్ని తెప్పించింది.
"చెప్పరా భడవా" తెల్లని ఇసుకతిన్నెలపై విశ్వేశ్వరశాస్త్రి నడుస్తుంటే ఆయన పాదాలతాకిడికే తమ జన్మ పునీతమైనట్టు ఇసుకరేణువులు ఒద్దికగా పక్కకి తప్పుకుంటున్నాయి.
"ఓల్డ్ మదర్ హబ్బర్డ్ అంటే తెలుసుగదా తాతయ్యా... ముసలమ్మ అంటే మా నాయనమ్మలాంటిదన్నమాట" తాటిపండు పదేపదే గుర్తుకొస్తుంటే తాటిపండు మీదినుంచి తాతమీదికి ప్రేమని మరల్చేసుకుంటూ చెప్పుకుపోతున్నాడు. నీళ్ళవైపు చూస్తూనే "అప్పుడేమో వాళ్ళ బుల్లికుక్కకి ఆకలేస్తే కప్ బోర్డ్ దగ్గరకెళ్ళిందన్నమాట ఏదన్నా పెడదామని... అంతా ఖాళీ" నొసలు చిట్లించి చేతులుతిప్పుతూ బాధని ప్రకటించేశాడు. "ఇంకేముంది. బుజ్జిముండ, అదే కుక్కపిల్ల ఆకలి తీరలేదన్నమాట."
"అంటే నీలాగా" గంభీరంగా నవ్వేశాడాయన. "మరి ఆ ఆఖరి వాక్యం చెప్పలేదేమిరా?"
"ఏంటో" గుర్తు చేసుకోవడానికన్నట్టు కళ్ళు చిట్లించాడు నానీ.
"ఎండ్ సో ది పూర్ డాగ్ హేడ్ నన్" తాత తను విడిచిపెట్టేసిన ఆఖరి వాక్యం పూర్తిచేసేసరికి మహా అబ్బురపడిపోయేడు. "నీలాగే నేనూ ఏకసంథాగ్రాహినొరే... నువ్వు రోజూ చెప్పే రైమ్స్ నేనూ వల్లించేయగలను."
క్లాసులో చెప్పింది ఒకసారి విని తిరిగి అప్పచెప్పగానే తెలుగుటీచరూ ఇలాగే అంటూంది. పైగా "ఎంతయినా విశ్వేశ్వరశాస్త్రిగారి మనవడాయే" అనికూడా అంటుంది.
అలా అన్నప్పుడు తను తానుగాకాక ఆ తాతకి మనవడిగా గుర్తించబడుతున్నందుకు మహా గర్వపడుతూంటాడు.
"అరే. పోయిందిలే తాతయ్యా" అన్నాడు నానీ చివరిగా. "రేపు చూసుకుందాంలే"
"ఏమిట్రా?"
"తాటిపండు"
"నీకా తాటిపండు యావ పోయినట్టులేదు."
"పోయిందిగా."
"యావే."
కాదు తాటిపండు."
"ఈ ఏరుకి మనమంటే చాలా ఇష్టంలేరా. రేపు తాటిపండును తీసుకొచ్చి ఒడ్డున వదిలిపెట్టి మరీ వెళుతుంది సరేనా ."
"ఏరంటే అమ్మేంటీ దగ్గరకొచ్చి ఇచ్చి వెళ్ళడానికి" ఈ పాటికి ఇందాకటి తాటిపండు ఎంతదూరం వెళ్ళుంటదా అని లెక్క వేసుకుంటూ అన్నాడు.
"అవున్రా ముసలాడా... ఏరంటే అమ్మలాంటిదే... ఎక్కడో పుడుతుంది... మరెక్కడినుంచో ప్రవహిస్తుంది. దాహమేసిన వాళ్ళకి నీరిస్తుంది. తన ఉనికితో నేలను సశ్యశ్యామలం చేస్తుంది" తాత్వికంగా చెప్పుకుపోతున్నాడాయన. "ఇన్ని సేవలు చేస్తూకూడా అణువంత మెప్పుని సైతం ఆశించకుండా అలాగే సాగిసాగి ఆఖరిమజిలీని పూర్తిచేసుకుంటుంది."
అమ్మకి- ఏరుకి చెప్పిన పోలిక నానీకి నచ్చింది కాని ఆ చెప్పిందే అర్థం కాకపోవడంతో గట్టిగా అడగాలనుకున్నాడు కాని "తాతయ్యని నీ యక్ష ప్రశ్నలతో విసిగించకు" అన్న అమ్మమాటలు గుర్తుకొచ్చి ఆగిపోయాడు.