Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 4


    అది చూడలేని శశి కళ్ళు మూసుకుంటే గండిపడిన వాగుల్లా నీళ్ళు ధార కడుతున్నాయి.


    'టప్'మన్న చప్పుడు సమీపంలో.


    మసకవెన్నెల వెలుతురులో కనిపించింది దగ్గరగా పడ్డ పిస్తోలు.


    అమ్మ పెనుగులాటలో విదిలిస్తే అది అంత దూరంగా పడిందని తెలీని శశి ఉద్రేకంగా అందుకున్నాడు.


    అప్పటికే అమ్మ మీదికి లంఘిస్తున్న వ్యక్తుల్ని చూసి ట్రిగ్గర్ నొక్కాడు.


    "అమ్మా" ఓ సన్నని మూలుగు.


    ఉద్వేగంగా ముందుకొచ్చాడు.


    మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు.


    అంతవరకూ రాకాసి కేకలతో నిండిన ఆ ప్రదేశం హఠాత్తుగా చల్లబడింది.


    చుట్టూ చూశాడు.


    పారిపోయారప్పటికే.


    "అమ్మా"


    అమ్మ చెప్పిన కథల్లోని రాకుమారుడిలా తల్లిని చేరుకున్నాడు.


    "బా...బూ" చేతుల్తో శశిని ఆర్తిగా తడిమేస్తుందామె.


    శశి కళ్ళు నీళ్ళని చిమ్మడం మరిచిపోయాయి.


    సప్త సముద్రాలూ దాటిన రాకుమారుడు అక్కడ రాక్షసుల్తో పోరాడి మాంత్రికుడి ప్రాణాలున్న చిలకను పట్టుకొచ్చిన కథ వినేటప్పటి విస్మయం తప్ప శశి జరిగింది నమ్మలేకపోతున్నాడు.


    అమ్మంటే ఎంతో గురి గల శశి గురి తప్పకుండా కాల్చి అమ్మను రక్షించాలనుకున్నాడు.


    అందరూ పరుగెత్తేసరికి అమ్మ అభినందనల్ని అందుకోవాలని చాలా ఉత్సాహపడ్డాడు.


    రక్తపు మడుగులో ఆమె కదలి కదలి వచ్చి బ్రతికానన్నట్టు అచేతనంగా వుండిపోయినపుడు కాని శశికి అర్థంకాలేదు తాను గురి తప్పానని....


    ప్రొలోగ్ ముగించేముందు రచయితగా నేను కొంత స్వేచ్చను తీసుకుంటున్నందుకు క్షమించాలి.


    ఒక్కోసారి వాస్తవం కల్పన కన్నా విచిత్రంగా వుంటుందన్న సత్యాన్ని మీరు అంగీకరిస్తే శశి భాల్యంలో జరిగిన ఆ సంఘటనకి మీరు ఆశ్చర్యపోరు. మామూలు కథలోని సన్నివేశమే కావచ్చది. అయితే ఇక్కడ కాస్త భిన్నంగా జరిగింది. శశాంక మూలంగానే అతడి తల్లి చనిపోవడం.


    ఆ సంఘటనకి ముగింపు అలా జరిగి వుండకపోతే శశాంక తల్లి పెంపకంలో ఒక మంచి పౌరుడయ్యేవాడు తప్పితే నేర ప్రవృత్తిని పెంచుకుని 'ప్రొఫెషనల్ కిల్లరు'గా మారి తన తండ్రిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకునేవాడు కాదు.


    కాని శశాంక ఆలోచనలు మరో మార్గంలో వెళ్ళాయి. అతడి మనసు నిండి తన తల్లి మరణానికి తనే కారణమన్న మానసికమైన వ్యధ, ఎందుకిలా గురి తప్పానూ అన్న క్షోభ... జవాబుకు వెదుక్కుంటూ చేజేతులా తనే తల్లికి చితిని పేర్చానన్న ఆత్మన్యూనతా భావంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.   


    క్రమంగా అతడిలో ఏదో మార్పు ... పాదాల కిందపడితే ప్రాణాలు కోల్పోయి, పచ్చదనం పోతుందేమో అనుకున్న గరికపచ్చ మైదానాలు ఇప్పుడు మరోలా కనిపించసాగాయి. తోకకు దారం చుట్టిన తూనీగలా ఆ నిశిరాత్రి సంఘటన అతడి మెదడుని నుమిమేస్తుంటే కొట్టుకొచ్చే తాటిపళ్ళేరుకున్న కాలవలు, తుమ్మెద రెక్కల్లా సున్నితంగా కనిపెంచే గొబ్బిపూల రేకులు మరో రూపంలో బాధపెట్టాయి.


    ఆలస్యంగానైనా పోలీసులు రంగంలోకి దిగారు. తండ్రిని చంపిన హంతకులెవరో తెలీని శశాంక తనే తల్లిని చంపినా హంతకుడిగా భావించి నిలువునా చుట్టేసే దుఃఖాన్ని నిభాయించుకోలేక నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప బదులు చెప్పలేదు.


    ఫ్యాక్టరీలో పనిచేసే చాలామంది ఊహించగలిగారు రాఘవ మరణానికి కారణాన్ని. కాని చెప్పలేదు. చెబితే మాత్రం పోయిన ప్రాణం తిరిగొస్తుందా అన్న కర్మసిద్ధాంతాన్ని సాకుగా తీసుకుని నిమ్మకు నీరెత్తినట్టు మౌనాన్ని పాటించడానికి కారణం మరో ఇంటికి తగులబెట్టిన ఆ మంట తన ఇంటికి వ్యాపించకూడదన్న స్వార్థం...


    సత్య వాక్పరిపాలనాదక్షుడైన హరిశ్చంద్రుడి కథలు వీళ్ళూ చదివారు. అయితే అలా బ్రతికితే వచ్చే నష్టాన్ని మాత్రం జీర్ణించుకుని ఆ పొరపాటు తాము చేయకుండా జాగ్రత్తపడ్డారు.


    చేయించినవాడూ, నేర నిర్థారణకు వచ్చిన పోలీసులూ చాలా సేఫ్ గా రికార్డు క్లోజ్ చేశారు. ఇదెలా సాధ్యమని అడక్కండి. ఒక మారణాయుధం మనుష్యుల్ని గాయపరుస్తుంది, చంపుతుంది. కాని డబ్బు అంతకుమించిన శక్తి కలది. ముందు మనసుని చంపి మనిషిని అలా ఇన్ ఫినిటీ దాకా ఎదిగేట్టు (?) చేస్తుంది. అంతగా పాతుకుపోయింది ఈ దేశంలో బ్యూరోక్రసీగాని, దానికి నీడనిచ్చే రాజకీయం గాని...


    దీనికి అందమైన ఉదాహరణ అప్పుడెప్పుడో ఎల్.ఐ.సి. చేత కోటి రూపాయల పైచిలుకు ఖర్చు చేయించిన తన కంపెనీ షేర్స్ కొనిపించిన ఇండస్ట్రియలిస్ట్ "ముంద్రా' నిన్నగాక మొన్న నేలనుంచి ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయిన షిప్పింగ్ టైకూస్ ధర్మతేజ, నేటి రిలయన్స్ అంబానీ, బోఫోర్స్ స్కెండల్... వీళ్ళంతా మాత్రమే కాదు, నిశ్శబ్దంగా నలిగిపోయిన నగర్ వాలా కేసులోని మల్హోత్రాలు, కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ లూ కూడా. ప్రజలకు తెలిసిపోయినప్పుడు రాజకీయంగా కొంత అస్థిరత్వం ఏర్పడుతుంది. అదీ తాత్కాలికంగానే. ఆ తర్వాత మరిచిపోతారు. ఇదీ మన సాంఘిక రాజకీయ, ఆర్థిక జీవన విధానం.

 Previous Page Next Page