"తమ్ముడి చదువువైపోయేదాకా నా పెళ్ళి గురించి ఎత్తొద్దమ్మా" అని మంచంమీద వాలిపడుకుంది "నిద్రొస్తుందమ్మా ప్లీజ్ లైటార్పెయ్యి" అంది.
యమునకి నిజంగా నిద్ర రావట్లేదు. ఆ మాటకొస్తే నిద్రపట్టి చాలా రోజులయింది. శేఖర్ పార్కులో తనని విడిచి వెళ్ళిపోయినప్పుడే తన నిద్ర కూడా తనకు దూరమయింది. ప్రతిరోజూ శేఖర్ దగ్గర్నుంచి ఫోన్ వస్తుందేమోనని ఆశగా చూడటం, రాకపోయేసరికి నిరాశగా తిరిగి రావడం మామూలయిపోయింది. ఆఫీసు అవగానే వచ్చి గేటు దగ్గర్లో అయిదునిమిషాలు ఎదురుచూడటం మానలేకపోతోంది. ఎన్నోసార్లు ఫోన్ చేద్దామనుకుంది కానీ ఆ రోజు "నాకోసం ఆగలేకపోతే నీ ఇష్టం, మేనరికమే చేసుకుంటావో, పై సంబంధమే చేసుకుంటావో!" అని తనంటే "నిన్ను తప్ప ఎవర్నీ చేసుకోలేను" అని అతను అనలేదు. దాంతో తన అభిమానం గాయపడింది. పైగా చాలా మాటలని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇటువంటి సమయంలో తను ఫోన్ చేస్తే తన ఆత్మాభిమానం ఏమవుతుంది?
ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని తను మనసుని సంసిద్ధం చెయ్యలేదు. అందుకే పిచ్చి మనసు తట్టుకోలేకపోతోంది. యమునకి తెలియకుండానే చెంపలమీద నుండి కన్నీరు జారసాగింది.
* * * *
'చల్లని పిల్లగాలి ఒక్కసారి ఒళ్ళంతా తడిమి వెళ్ళిపోతుంటే...' ఈ స్పర్శ ఎందుకు యమునని గుర్తుచేస్తోంది? అనిపించింది శేఖర్ కి.
ఆ రోజే పట్టీ విప్పారు. "నా జైలు జీవితం ముగిసింది. రేపట్నించి నేను ఫ్రీ బర్డ్ ని" అన్నాడు.
"మోటార్ సైకిల్ మాత్రం ఇచ్చేది లేదు" అంది శిరీష.
"నువ్వెవరు చెప్పడానికి?" అడిగాడు ఉక్రోషంగా.
"ఈ ఊరు చూసే ప్రోగ్రామ్ నీ యాక్సిడెంట్ ధర్మమా అని మూలపడింది. ఇంక వారంరోజుల్లో కాలేజీ తెరుస్తారు. అందుకే చకచకా చూపించేస్తే నిన్నొదిలి బిరబిరా వెళ్ళిపోతాను"
"సరే అయితే పద"
"ఇప్పుడా? రాత్రి పదవుతుంది" అంది ఆశ్చర్యంగా.
"పదమంటుంటే" అని చెయ్యి పట్టుకుని గుంజి డాబామీదికి తీసుకెళ్ళాడు. నక్షత్రాలు పిల్లల్ని పెట్టినట్లు దూరంగా గుంపులు గుంపులుగా లైట్లు మెరుస్తున్నాయి. "ఇదిగో ఊరు నిద్రపోతోంది బాగా చూడు! చూశాక పొద్దుటే లేచి బండెక్కు" అన్నాడు.
శిరీష సీరియస్ గా చూసి "జోక్ బావుంది" అంది.
శేఖర్ పకపకా నవ్వాడు.
"నీలాగే నీ నవ్వు కూడా బావుంది" అంది అదే సీరియస్ నెస్ తో.
"థాంక్స్" అన్నాడు ఎగిరిపోతున్న జుట్టుని అరచేత్తో నొక్కిపెడ్తూ. శిరీష పట్టుకుచ్చులాంటి జుట్టు గాల్లో ఎగురుతోంది. ఆమె సౌందర్యం ఒంపుల్ని బహిర్గతం చేస్తూ పల్చని నైటీ రెపరెపలాడుతోంది. దానిమ్మ మొగ్గలాంటి పెదవులూ, పాలమీగడలాంటి బుగ్గలూ, సన్నజాజి మొగ్గలాంటి నాసికా, ఆపైన మెరుస్తూ చీకట్లో మరింతగా ప్రకాశిస్తున్న తేనెకళ్ళు.
శేఖర్ ఒక్కనిముషం విచలితుడయ్యాడు. తనకేమవుతోంది? "పద కిందకెళ్దాం చలిగా ఉంది" అన్నాడు.
"చలికూడా ఇంత బావుంటుందని నాకిప్పుడే తెలిసింది" ఆమె పెదవులేవో మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్నంత వేగంగా కదిలాయి. ఆమె పెదవులకన్నా వేగంగా ఆమె తనువు కదిలి తనతో పెనవేసుకుంది. మెత్తని స్పర్శ అలవాటులేనివాడు ఫోమ్ బెడ్ మీద పాడుకోగానే ఠక్కున లేచి కూర్చున్నట్లుగా కదిలాడు శేఖర్.
"శిరీషా"
"బావా ప్లీజ్! నీకిష్టం లేకపోయినా సరే నన్ను వదిలి వెళ్ళిపోకు" అంటూ పెదవుల్ని అతని గరుకు బుగ్గకి రాసింది.
అతని చేతులు నెమ్మదిగా కదిలాయి సన్నని ఆమె నడుము మీద నుంచి భుజాలవరకూ, ఆ తర్వాత ఆమెను ఒడిసిపట్టి_
దూరంగా నిలబెట్టి చేతులు జోడించి చెప్పాడు "నన్ను బలహీనుణ్ణి చెయ్యకు. స్త్రీ ముందు పురుషుడు చాలా అల్పుడు. ఎంత అందమైన పురుషుడి సాన్నిహిత్యంలో వున్నా మనసిస్తే తప్ప స్త్రీ చలించదేమో! కానీ పురుషుడలా కాదు. ప్రకృతి పక్షపాతం చూపింది. నీలాంటి సౌందర్య దేవత ముందుకొచ్చి తనంతతాను అల్లుకుపోతే, ఆ వెల్లువలో పడి కొట్టుకుపోవాల్సిందే తప్ప వాడికి తీరం చేరే యోగం పట్టదు. ప్లీజ్! నేను యోగిని కాదు, సిద్ధుడ్ని కాదు. మామూలు మగవాణ్ణి. నన్ను పరీక్షించకు. ఈ క్షణం నిన్ను గెల్చుకుని నా జీవితంలో నేను ఘోరంగా ఓడిపోయేటట్లు చెయ్యకు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను చలింపచెయ్యకు. తద్వారా నువ్వు నన్ను సాధించినా నా మనసుని మాత్రం పొందలేవు. అది ఎప్పుడో మరొకరికిచ్చేశాను."
"బావా!" ఆశ్చర్యంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. దానిమ్మ మొగ్గలు విచ్చి పూవులై ఆ తర్వాత దానిమ్మ గింజలవంటి పలువరుస తళుక్కున మెరిసింది. "నీ ప్రేమ చాలా గొప్పది! ఆమె చాలా అదృష్టవంతురాలు. తను కనుచూపుమేరలో లేకున్నా నిన్ను శాసించింది. బలహీనుడవకుండా ఆత్మబలం ప్రసాదించింది. అంటే నీమీద ఆమెకెంత ఆధిపత్యముందో అర్థమవుతోంది. మనసా వాచా కర్మణా మరో ఆడదాన్ని తాకలేనంతగా నీ మనసులో ఆమె మూర్తిని ప్రతిష్టించుకున్నావంటే ఆమెలో ఎంత గొప్పదనముందో తెలుస్తోంది. నా అందం మీద నాకెంతో నమ్మకం. ఒకరకంగా గర్వం. నా కనుచూపు కోసం ఎన్నోపాట్లు పడ్తుంటారు చాలామంది. నేను మాట్లాడితే పొంగి పోతుంటారు. నవ్వితే తన జన్మ ధన్యమయిపోయిందనుకుంటారు. నా వెనకాల నడవడానికే పోటీ పడ్తుంటారని అందరూ అంటుంటారు. అటువంటి నన్ను ఓడించేసింది బావా నీ మెహబూబా! నువ్వన్నట్లు నువ్వు అల్పుడివి కాదు. అరుదైన మగవాడివి. స్త్రీవాంఛతోటో మరో ఆశతోటో నువ్వు ప్రేమించలేదామెని. మనస్ఫూర్తిగా ప్రేమించావు. శరీరం మీద నీ మనసు పరిపూర్ణమైన పట్టుతో ఉంది. అది ఆమె గొప్పదనం కూడా. నేను నిన్ను చాలా ఆలశ్యంగా కలిశాను" అంటూ కాలిమువ్వలు తెగి కింద జలజలా రాలినట్లు నవ్వింది.
"అలాగే నవ్వాలి శిరీషా! అపరంజి బొమ్మలా నూరేళ్ళు బతకాలి" ఆమె తలని నిమురుతూ చెప్పాడు శేఖర్ కళ్ళనీళ్ళతో.
"ఎవరు బావా ఆమె? ఎలా ఉంటుందీ? ఎక్కడవుందీ? ఏం చేస్తోందీ?" అంటూ అతని చెయ్యిపట్టి ఊపుతూ అడిగింది శిరీష.