Previous Page Next Page 
తృప్తి పేజి 35


    జయని డాక్టర్ కి చూపించి, అక్కడనుండి పుట్టింటికి తీసుకెళ్ళింది కావేరి. కాత్యాయిని ఆప్యాయంగా ఆహ్వానించింది. రామారావుగారు "కులాసాగా వున్నావా తల్లీ" అని జయని పలకరించారు. సాయంత్రందాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మధ్యలో ఓ గంజ పడుకోమని పోరడంతో తప్పనిసరై గదిలోకి పోయి పడుకుంది. చెల్లెలి ఆరోగ్యం గురించి తల్లి బాధపడ్తుంటే ధైర్యం చెప్పింది కావేరి. కాసేపు యమున పెళ్ళి గురించి ఆర్ధిక ఇబ్బందుల గురించీ మాట్లాడుకున్నారు. యమున త్వరగానే వచ్చేసింది. కావేరికి చెల్లెల్ని చూడగానే కళ్ళనీళ్ళు తిరిగాయి. "ఏమిటే ఇంత చిక్కిపోయావు? అన్నం తింటున్నావా? ఒంట్లో బావుంటోందా?" అని ప్రశ్నలు వేసింది.
    యమున నవ్వింది. ఆ నవ్వులో జీవం లేనట్టుగా ఉంది. "బాగానే వున్నాను. అమ్మ వూరికే కంగారుపడ్తోంది" అంది. జయని చూసి కుశల ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత తలనొప్పిగా ఉందని మంచంమీద వాలిపోయింది.
    "రోజూ తలనెప్పంటున్నావుట. పద ఓసారి డాక్టరుకి చూపిస్తాను" అంటూ ఎంత బలవంతం చేసినా అక్కగారి మాట వినలేదు యమున. "ఏం లేదు. బస్సుల్లో నిలబడి వచ్చేసరికి ఇలాగే ఉండదూ!" అని కొట్టిపారేసింది.
    "మా ఇంటికెప్పుడొస్తావు?" అనడిగింది జయ.
    "నువ్వు ఎంత త్వరగా పాపనో, బాబునో ఇస్తావో అంత త్వరగా" అంటూ నవ్వుతున్న యమునని చూసి దీర్ఘంగా నిట్టూర్చింది కాత్యాయిని.
    అక్కడనుండి సింధూ వాళ్ళింటికెళ్ళారు. సింధు అప్పుడే వచ్చినట్టుంది. బట్టలు మార్చుకుని టీ తాగుతూ మేనత్తతో కబుర్లు చెప్తోంది. కావేరివాళ్ళని చూసి చాలా సంతోషపడింది. తులశమ్మగారు మంచం దిగలేకపోతోందింకా. పట్టీ విప్పడానికి వారంరోజుల టైముందిట. ఆవిడ కోసం ప్రత్యేకంగా ఓ పిల్లని పనికి పెట్టింది సింధు. తులశమ్మగారు వర్ధనమ్మని చూడాలనుందని చెప్పింది. జయని దగ్గరకు పిలుచుకుని చెక్కిళ్ళు నిమిరి ముద్దుపెట్టుకుంది. కావేరితో "నువ్వు నా పాలిటి దేవతవు. చల్లనివేళ దీవిస్తున్నాను. కలకాలం సౌభాగ్యవతిగా ఉండు" అంది.
    ఇంతలో సింధు కోసం ఎవరో వచ్చారు. "మీరు మాట్లాడ్తూ వుండండి" అని చెప్పి వాళ్ళ దగ్గరకెళ్ళింది.
    కొడుకు గురించీ, మనవల గురించీ అడిగి తెలుసుకుంది తులశమ్మ. అంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది జయ.
    "ఏమిటో! నెమ్మదిగా ఉండే నీకు గయ్యాళి అత్తనీ, నాలాంటిదానికి ఇలాంటి కోడల్ని ఇచ్చాడా దేముడు. దీని అంతరార్ధమేమిటో ఎవరికి తెలుసు! అంతా పైవాడాడిస్తున్న నాటకం. ఎప్పటికి తెరదించుతాడో" అంటూ పైకి చూస్తూ దణ్ణం పెట్టిందావిడ.
    అరుణ్ వచ్చి "అరెరే! ఎంతసేపయిందొచ్చి, సింధు కలిసిందా? మాట్లాడిందా?" అనడిగాడు.
    "మాట్లాడి ఇప్పుడే వెళ్ళారు. ఇంక శలవిప్పించండి చాలా ఆలశ్యమవుతోంది" అని చెప్పి, సింధు దగ్గరకెళ్ళి శలవు తీసుకుని ఇంటికి బయల్దేరారు.


                            *    *    *    *


    "బావా హార్లిక్స్!" అంటూ గ్లాసు తీసుకునొచ్చి నిలబడిన శిరీషని గమనించకుండా ఏదో తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు శేఖర్. "బావా నిన్నే" గట్టిగా అరిచింది శిరీష.
    ఆమెవైపు విసుగ్గా చూస్తూ "నాకేం వద్దుగానీ అమ్మకేదైనా సహాయం కావాలేమో చూడు!" అన్నాడు చిరునవ్వుతో.
    "అత్తమ్మకి కాళ్ళు చేతులూ అన్నీ సెంట్ పర్సెంట్ ఆర్డర్ లో ఉన్నాయి. ఆవిడకి నా సహాయం అవసరం లేదు" అని నవ్వింది.    
    "భగవంతుడు నాకు మంచి శిక్షేవేశాడు. లాకప్ లో పెట్టినట్లు బాదిపారేస్తున్నావు. పోయిన జన్మలో పోలీసు పక్షివయ్యుంటావు" అన్నాడు నవ్వుతూ శేఖర్.
    యాక్సిడెంట్ లో చెయ్యి, కాలు బాగా కొట్టుకుపోయి కాలర్ బోన్ విరిగింది.
    "కాలర్ బోన్ విరిగినవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే తేలిగ్గా అతుక్కుంటుంది" అని చెప్పాడు డాక్టర్.
    "పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయింది. అంతా 'మా శిరీష కాలమహిమ' అంటోంది అమ్మ. నిజమే! శిరీష ఈ టైమ్ లో లేకపోతే తను మరీ బోరయిపోయేవాడు. కాలు మరీ పచ్చిపుండులా ఉంది. మానడానికి చాలా టైమ్ పడుతుంది. చేతికి పట్టీవేశారు. చర్మం బాగా కొట్టుకుపోయిందేమో, కుడిచెయ్యి స్వాధీనంలో లేదు. యమునకి ఫోన్ చేసి మాట్లాడాలని ట్రై చేశాడు కానీ చెయ్యి పట్టివ్వట్లేదు.
    "నేను చేస్తాను నెంబర్ చెప్పు బావా! ఎవరా వి.ఐ.పి" అని అడిగింది శిరీష.
    శిరీష డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బాబ్ కట్, మోడ్రన్ డ్రస్సెస్ తోపాటు వంట కూడా బాగా చేస్తుంది. హిందీ సినిమా పాటలు చాలా బాగా పాడుతుంది. విసుగు రాకుండా కబుర్లు చెప్తుంది. పాలల్లో కుంకుమ కలిపిన రంగులో శిల్పంలా వుండే శిరీషకి తేనెరంగు కళ్ళు స్పెషల్.
    శకుంతలమ్మకి మేనకోడలంటే ప్రాణం. ఆమె అందం, చందం, పనీ, పాటా కొడుకు ముందు పొగుడ్తూ ఉంటుంది. సూర్యారావుగారు కూడా "ఆడపిల్లలేని లోటు తీర్తోందే శిరీష వచ్చాక" అంటున్నారు. శేఖర్ ఆమెని దూరంగా ఉంచాలని, రిజర్వుడుగా ఉండాలనీ తెగ ప్రయత్నం చేసి చివరికి విఫలుడయ్యాడు. యమునకి తెలియదుకదా యాక్సిడెంట్ విషయం. నా గురించి ఏమనుకుంటుందో? అని ఆలోచిస్తున్నాడు. అసలామె నా గురించాలోచిస్తోందా? ఇన్నాళ్ళయిపోయింది కనిపించడంలేదెందుకని ఆఫీస్ కి ఫోన్ చేస్తే తెలిసేదే! చేసుండదు. ఇంటి నెంబర్ కూడా తనిచ్చాడు. అయినా చెయ్యలేదంటే మనసు మార్చుకుందేమో! యమున గడగడా మాట్లాడదు కానీ లోతుగా అనుభవజ్ఞురాల్లా మాట్లాడుతుంది. తననో చిన్నపిల్లాడిలా తీసి పారేస్తుంది. "నీకు జీవితం వడ్డించిన విస్తరిలాంటిది. ఇందులో వుండే కష్టనష్టాలు నీకు తెలియవు" అంటుంది.
    "నీతోబాటు అన్నీ పంచుకోవడానికి నేను సిద్ధం" అంటే ఒక నవ్వు నవ్వి మాట మారుస్తుంది.

 Previous Page Next Page