"పిన్నీ! మీ ఇల్లు చాలా బావుంది. నీ వంట కూడా" అంది.
డిప్పకాయలా మాట్లాడుతున్న దాన్ని చూసి నవ్వుతూ "మీ అమ్మ వంటకంటేనా?" అంది.
"మా అమ్మ వంటే చెయ్యదసలు. బామ్మే చేస్తుంది" అంది. మళ్ళీ గొంతు తగ్గించి "మా అమ్మ ఏ పనీ చెయ్యదు. బామ్మని తిట్టడం తప్ప" అని కిసుక్కున నవ్వింది.
"బామ్మకి జ్వరమొచ్చిందా పాపం!" అంది సింధూ మాట మార్చడానికి.
"అంతా అబద్ధం. ఆటోలో సరిపోరు. మీరొద్దు అంది అమ్మ. అంతే బామ్మ చిన్నమొహం చేసుకుని ఉండిపోయింది. నాన్నేదో చెప్పబోతే బాగా తిట్టింది అమ్మ. దాంతో ఆయన నోరు మూసేసుకున్నారు" అని అభినయంతో చెప్పేసింది.
సింధుకి ఒళ్ళుమండింది. అప్పటికప్పుడెళ్ళి కడిగిపారేద్దామనిపించింది. కానీ వుగ్గబట్టుకుని, ఐస్ క్రీం తీసుకుని హాల్లోకి నడిచింది.
అప్పటికే గోపీ, రమ్య బార్బీడాల్ జుట్టంతా పీకిపారేశాడని అది గొంతు చించుకుని ఏడుస్తోంది.
"చిట్టెమ్మా! రమ్యని తీసుకెళ్ళు" అని పురమాయించి అందరికీ ఐస్ క్రీమ్ సర్వ్ చేసింది. నర్మద వాడిని మందలించడం కానీ, వాడు చేస్తున్న అల్లరికి సిగ్గుపడడం కానీ లేదు. తనని కాదన్నట్టు కూర్చుని వీడియో చూస్తోంది. శంకర్, అరుణ్ బాగానే మాట్లాడుకుంటున్నారు. కంపెనీ దొరికితే కబుర్లు చెప్పడం అరుణ్ కి సరదానే.
బెడ్ రూంలోకి రాగానే తులశమ్మగారి కోసం తెప్పించిన నెమలికంఠం రంగు గుంటూరు జరీచీర ప్లేట్లో పెట్టి కనిపించింది. సింధుకి మనసు కలుక్కుమంది. అదితీసి బీరువాలో పెట్టి జాకెట్టు బట్ట ఒకటి తీసి ప్లేట్లో పెట్టింది.
శంకర్ లేచి "ఇక బయల్దేరతాం" అనగానే "ఇవాళ అత్తయ్యని తీసుకురాకుండా నన్ను చాలా డిజప్పాయింట్ చేశావు. కారణాలేమన్నా కానీ, ఈసారి నేనే వచ్చి అత్తయ్యని తెచ్చుకుని నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంచుకుంటాను" అంది.
నర్మద మొహం మాడిపోయింది. "పదండి పదండి" అని పిల్లల్ని తొందరపెట్టింది. సింధు బొట్టుపెట్టి జాకెట్టుగుడ్డ చేతిలో పెట్టింది. వాళ్ళు వెళ్ళిపోయాక 'హమ్మయ్య' అనిపించింది. ఇల్లంతా రణరంగంలా మార్చేశాడు గోపీగాడు. చిట్టెమ్మ విసుక్కుంటూ ఇల్లు సర్దసాగింది.
"ఏం పిల్లాడు బాబూ! అదేం పెంపకం" అంది సింధు అరుణ్ తో.
"పిల్లలలాగే ఉంటారు" అని చెప్పి శాంతమూర్తిగా గదిలో దూరుతున్న అతనిని వెనుక నుంచి మొట్టబుద్దయింది సింధుకి.
* * * *
జయ ఒక్కత్తే డాబామీద కూర్చునుంది.
వచ్చిన ఓ నెలరోజులు అమ్మా, వదినల అపురూపాలతోటీ అన్నగారి హాస్యాలతోటీ సరదాగా గడిచిపోయింది. కానీ ఈ మధ్య శశిధర్ గురించిన ఆలోచనలతో బెంగగా వుంది. పగలంతా చాకిరీ, అత్తగారి సాధింపులతో గడచిపోయినా సాయంత్రం శశిధర్ కోసం ఎదురుచూస్తుంటే సంతోషంగా ఉండేది.
శశిధర్ వస్తూనే "ఇందాక ఏమైందో తెలుసా..." అంటూ బోలెడు కబుర్లు చెప్పేవాడు. అందులో జయకి సంబంధించిన విషయం ఒక్కటి కూడా ఉండదు. సినిమాల గురించో, పాలిటిక్స్ గురించో, క్రికెట్ గురించో చెప్తాడు. చివరికి "నీకేం అర్థంకాదులే మొద్దువి" అని కొట్టిపారేస్తాడు. జయకి నిజంగానే అర్థంకాకపోయినా చాలా ఉత్సాహంగా, కుతూహలం తెచ్చుకుని మరీ వింటుంది. ఎందుకంటే ఇంట్లో అతని తల్లి, అక్కగారూ ప్రతిదానికీ "చిన్నవెధవ్వి నీకేం తెల్సు" అంటూ తీసిపారేసి మాట్లాడ్తారు. అతను పెద్దపెద్ద కళ్ళుచేసి చెప్పే కబుర్లు అతని నొక్కుల, నొక్కుల క్రాఫ్ చూస్తూనో, సొట్టపడే అతని గడ్డం చూస్తూనో వినడం జయకిష్టం. ఒక్కోసారి అన్నంముందు కూర్చుని కబుర్లు మొదలెడ్తే అన్నం తినడం కూడా జయ గుర్తుచేయాల్సొచ్చేది. ఇప్పుడెవరితో కబుర్లు చెప్తున్నాడో ఏంటో! అనుకుంటే చాలా బెంగగా అనిపించింది. అత్తగారికెంతసేపూ ఎవర్నో దెప్పడం, ఎదురింటి పొరుగింటి పెత్తనాలూ, ఆడబడుచు పిల్లలూ, తిండీ, సినిమాలు చూడడం తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం అక్కరలేదు. ఇతనికి స్నేహితులెక్కువ. తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇల్లుచేరి ఉంటే తినీ, లేకపోతే అలాగే పడుకుంటాడు. ఒక్క ఉత్తరమన్నా రాయొచ్చుగదా! ఈ ఆలోచన రాగానే తనూ రాగానే క్షేమంగా చేరినట్టు అత్తగారికో ఉత్తరం రాసి వూర్కున్న సంగతి గుర్తుకొచ్చింది. పోనీ నేనే రాస్తేనో అనుకుంది. వదినని కవరు తెచ్చిపెట్టమని అడగాలి. అన్నయ్యనడగాలంటే సిగ్గు.
ఎనిమిదోనెల కూడా వచ్చిందేమో చాలా భారంగా ఉంది. అందరూ త్వరగా పురుడొచ్చేస్తుందంటున్నారు. కొంతమంది 'మగపిల్లాడే. కడుపు చూస్తే తెలుస్తోంది" అంటున్నారు. మగపిల్లాడైతే శశిధర్ పోలికొస్తే చాలా బావుంటాడు. పెళ్ళిచూపులకు అతను వచ్చినప్పుడు అక్కయ్య లోపలికొచ్చి "హీరోలా ఉన్నాడు" అంది. ఎవరైనా సరే! అని సరిపెట్టుకుంటున్న తను అతనిని చూడగానే ఈ సంబంధమే ఖాయమవ్వాలని దేవుడ్ని వేడుకుంది.
పెళ్ళయ్యాక తొలిరాత్రి "మీరు నన్ను చూసినప్పుడు ఎలా ఫీలయ్యారు?" అనడిగింది.
"అమ్మా, అక్కయ్యా సరేనంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను" అన్నాడు.
తను బుంగమూతి పెట్టి "ఒకవేళ వాళ్ళు నచ్చలేదంటే ఏం చేసేవారూ? అనడిగింది.
"మానేసేవాడ్ని" అని ఠకీమని చెప్పాడు.
"మీకు నచ్చినప్పుడు వాళ్ళదేముంది? నేను చేసుకుంటాను. నా యిష్టం అని చెప్పలేరా?" అంది.
"సరే! వాళ్ళిష్టంతో చేసుకుంటేనే అంతంత మాత్రం, ఇక ఎదిరించి చేసుకుంటే నన్నూ, నిన్నూ బతకనిస్తారా?" అన్నాడు అమాయకంగా.
ఆ అమాయకత్వం వెనుక నిజాన్ని నిర్మొహమాటంగా మాట్లాడే గుణముంది. అతని మనస్తత్వం అర్థంచేసుకుని ఆనాటినుంచీ మసలుకుంటోంది.
ఎన్నోసార్లు ఇతని మనసులో ఉన్నమాట బైటపెట్టడం ఇతనికి చేతకావట్లేదు అనుకుంది తను. ఓసారి ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికొచ్చాడు.