Previous Page Next Page 
తృప్తి పేజి 30


    సందు మలుపు తిరగగానే శేఖర్ కి కొంచెం, కొంచెం కోపం తగ్గసాగింది. నేనెందుకివాళింత బేలన్స్ లేకుండా ప్రవర్తించాను? తను చాలా సున్నితం. వచ్చేస్తుంటే ఎంత బేలగా చూస్తూ నిలబడింది! ఇంకా అక్కడే కూర్చుని మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడుస్తుందేమో! ఇదే అదనుగా తీసుకుని ఏ రౌడీ వెధవైనా వెకిలివేషాలేస్తే! చీకటి పడ్తోంది ఏదైనా అఘాయిత్యం జరిగితే! ఈ ఆలోచన రావడమే తరువాయి బండి వెనక్కి తిప్పుకుని ఫాస్ట్ గా వెనక్కి వచ్చాడు. వడివడిగా నడుస్తూ తాము కూర్చున్న బెంచీ దగ్గరకొచ్చాడు. ఖాళీ బెంచీ వెక్కిరించింది. నెమ్మదిగా బయటికొచ్చి చూశాడు. ఎక్కడా యమున జాడలేదు "హు! వెళ్ళిపోయుంటుంది. అవును! తనకి తనవాళ్ళే ముఖ్యం. తను మధ్యలో వచ్చినవాడు. అందుకే మధ్యలోనే వదిలేసింది. తనే పిచ్చిగా ఆమెతోడిదే జీవితం అని అందర్నీ దూరం చేసుకుంటున్నాడు. తను స్నేహితులని కలసీ, వాళ్ళతో తిరిగీ ఎంతకాలమయింది? మొదట్లో పిలిచేవాళ్ళు. ఇప్పుడిప్పుడు వాళ్ళకీ విసుగొచ్చి మానేశారు. తనకి యమునని చూడకపోతే పిచ్చెక్కుతుంది. ఆమె గురించి ఆలోచించకపోతే అన్నం సహించదు. ఆమె మాట వినకపోతే నిద్రపట్టదు. మరి తనకీ ఇలాగే వుంటుందా? ఉంటే ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా? నువ్వెంత అన్నట్టుగా ధిక్కరించేసింది. తను ఫోన్ చేస్తే సీట్లో లేదని చెప్పించింది. ఒక్కసారి బయటికి రమ్మంటే వీలవదని నిష్కర్షగా చెప్పేసింది. ఆమె ఏదైనా కోరితే చెయ్యడానికి తను సిద్ధంగానే ఉంటాడు. ఆమె కనుసన్నల్లో మెలిగాడు. ఏం తక్కువ చేశాడని ఇలా వదిలివెళ్ళిపోయింది? తను మొదట్నించీ తన తమ్ముడి గురించీ, తల్లిదండ్రుల గురించీ తప్ప మరేం పట్టనట్టుగానే ఉంది. నాదే తప్పు! పిచ్చిగా ప్రేమించేశాను ఇక జీవితంలో ఆమె తప్ప మరేం లేదన్నంతగా. బాగా బుద్ధిచెప్పింది. కోరి వెంటపడితే చెప్పుతో కొట్టి సత్కరించినట్లు చేసింది" అనుకున్నాడు.
    అన్యమనస్కంగా వచ్చి బండి స్టార్ట్ చేశాడు. మనసంతా వెలితిగా ఉంది. రేపట్నుంచీ ఎలా బతకడం? అన్న ప్రశ్న ఎంత విదిలించినా మనసులోకి చొచ్చుకొస్తోంది. ఏం, ఆమె లేకుండా పాతికేళ్ళు బతకలేదా? ప్రేమ అనేదో పిచ్చి. అంతా ట్రాష్! అనుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ వున్న ప్రపంచం అతని కంటికానట్లేదు. ఎదురుగుండా వస్తున్న కారూ, అది చేస్తున్న హారను చప్పుడూ కూడా అతనికి పట్టలేదు. అంతే! ఒక్కసారిగా శరీరమంతా గాలిలోకి లేచింది. తర్వాత ఎత్తుమీదనుంచి కిందపడ్డాడు.
    "అమ్మా" అన్నాడు బాధతో.
    ఇకంతా చీకటే!
    ఆపైన ఆలోచించడానికి శేఖర్ కి ఏమీ తెలియదు.


                            *    *    *    *


    ఆదివారం సింధు చాలా హడావిడిగా వుంది. చిట్టెమ్మకి చేతినిండా పని. ఆవడలూ, పాయసం చెయ్యమని చెప్పింది. బీన్స్, కొబ్బరేసి కూర, టమేటో పప్పు, సాంబారూ, రసం, అప్పడాలూ, వడియాలు, గోంగూర పచ్చడీ అన్నీ తయారుచేసి టేబుల్ మీద సెట్ చేయించింది. ముందురోజే అరుణ్ కి చెప్పింది.
    "రాకరాక మా మేనత్తొస్తుంది. మంచిచీర పెట్టాలి. పెద్దవాళ్ళ చీరల గురించి నాకంతగా తెలియదు. మీ అమ్మగారు కట్టుకునేలాంటి చీరొకటి కొని తే" అని.
    "మరావిడ కోడలికో" అన్నాడు అరుణ్.
    సింధుకి నర్మద అంతగా నచ్చలేదు. అందుకే ఏం మాట్లాడకుండా పిల్లల కోసం మంచి కార్టూన్ పిక్చర్స్ తీసుకురా. ఐస్ క్రీమ్ మరిచిపోకు. ఇంకోమాట మంచి పాన్ షాపులోంచి మిఠాయికిళ్ళీలు కూడా తీసుకురావాలి రేపు" అంది.
    సింధు చాలారోజులకి హుషారుగా కనిపించింది అరుణ్ కి. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పదవుతుండగా ఆటో ఆగింది. గుమ్మంలోకి ఆత్రంగా వెళ్ళింది సింధు.
    శంకర్, నర్మదా, పిల్లలూ దిగారు.
    "రండి, రండి" అంది చిరునవ్వుతో. ఆటోలోంచి నెమ్మదిగా తులశమ్మగారు దిగుతుందని చూసింది కానీ ఆవిడ జాడలేదు. శంకర్ ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి పంపేశాడు.
    "అత్తయ్య రాలేదా?" అడిగింది నిరాశగా.
    "ఆవిడకీవేళ కాస్త జ్వరం తగిలింది. మీరెళ్ళిరండి. నేనింకోసారొస్తానన్నారు" అంది నర్మద.
    సింధు ఉత్సాహం నీళ్ళు జల్లినట్లు ఉఫ్ మని ఆరిపోయింది. అరుణ్ బయటికొచ్చి శంకర్ తో చెయ్యి కలిపాడు. అందరూ లోపలికొచ్చి హాల్లో కూర్చున్నారు. పిల్లలు అల్లరిచెయ్యడం ప్రారంభించారు. "చేపలు, చేపలు" అంటూ అక్వేరియం చూసి చప్పట్లు చరిచారు. చిట్టెమ్మ అందరికీ జ్యూస్ తెచ్చిచ్చింది. శంకర్, అరుణ్ ఏవో లోకాభి రామాయంలో పడ్డారు.
    "అత్తయ్య వస్తుందని ఆశపడ్డాను" అంది సింధు.
    నర్మద కనుబొమలు ముడిపడ్డాయి. ఏదో పుస్తకం తీసుకుని చూస్తూ కూర్చుంది. గోపి పిచ్చి అల్లరి చేస్తున్నాడు. తేజా బొమ్మలు తీసుకుని వాడు ఏడుస్తుంటే నవ్వుతున్నాడు. వల్లీ, సీతా ఫర్వాలేదు నెమ్మదిగా కనిపించారు.
    అరుణ్ లేచి "భోజనాలకి పదండి" అని ఆహ్వానించాడు.
    సింధు కూడా లేచి "రండి" అని నర్మదని పిలిచి టేబుల్ దగ్గరకెళ్ళింది. శంకర్, పిల్లలూ, నర్మదా, అరుణ్ కూర్చున్నారు. సింధు వడ్డించసాగింది.
    "నువ్వు కూడా కూర్చో" చెప్పాడు శంకర్.
    గోపీ చాలా గారాలు పోయాడు. ఇదొద్దు, అదొద్దు అంటూ అన్నీ వేసుకుని పారేశాడు.
    నర్మద కూడా అంతే. శంకర్, ఆడపిల్లలూ నీట్ గా తిన్నారు. భోజనాలయ్యాక చిట్టెమ్మ పాన్ లందించింది. వంటిల్లు సర్దుతున్న సింధు దగ్గరికి వల్లి వచ్చింది.

 Previous Page Next Page