Previous Page Next Page 
తృప్తి పేజి 23


    కాత్యాయిని మళ్ళీ ఏ కష్టం కలిగినా ఆయనతో చెప్పలేదు. కడుపుతో ఉన్నప్పుడు కూడా నొప్పులొచ్చేదాకా పెదవి తొణకనిచ్చేది కాదు. బుట్టలో ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సిన సామానంతా సర్దుకుని, భర్తకీ మిగతావాళ్ళకీ ఇంకోపూటకి కూడా వండిపెట్టి అప్పుడు చెప్పింది. "నేను ఆస్పత్రికి వెళ్ళాలి. నెప్పులెక్కువయ్యాయని"
    ఈవిధంగా ఇన్నేళ్ళ సంసారం లాక్కొస్తున్న కాత్యాయినికి భర్తలో మార్పు తెలుస్తూనే ఉంది. తనిప్పుడు కాస్త విసుక్కున్నా, ఏదైనా చెప్పినప్పుడు 'అలా కాదు ఇలా' అన్నా ఒప్పుకుంటున్నాడు కానీ ఇదివరకట్లా అరిచి, కోపగించుకోవడం లేదు. "కాస్త ఆ నీళ్ళు నింపెయ్యండి పంపొచ్చినప్పుడే", "ఆ పాల పాకెట్టు ఇంట్లోకి తీసుకెళ్ళండి", "స్టౌమీద పాలు పెట్టాను కాస్త చూస్తుండండి" అని చెప్పినా నోరెత్తకుండా చేస్తున్నాడు. అదే మునుపయితే అమ్మో చెయ్యి చేసుకోవడానికి కూడా వెనుకాడేవాడు కాదు. బహుశా ఇది కాలం తెచ్చిన మార్పేమో! ఇద్దరాడపిల్లలూ ఉద్యోగం చెయ్యడం, బాధ్యతగా ఇల్లు నడపడం కూడా ఆయనలో వచ్చిన మార్పుకు కారణమే. "ఆడదానికెందుకే పొగరు" అనేవాడు ఇదివరలో. కానీ ఇప్పుడలా మాట్లాడటం లేదు. యమున ఆఫీస్ నుండి రాగానే 'అమ్మా! మంచినీళ్ళు కావాలా?' అనడుగుతున్నారు. అప్పుడప్పుడూ 'ఆడపిల్ల చేత ఉద్యోగాలు చేయించాల్సొస్తుంది' అని బాధపడ్తారు. యమునోసారి "అదేమిటి నాన్నా! మగపిల్లల్ని చదివించినట్టే డబ్బు ఖర్చుపెట్టి మమ్ముల్ని చదివించలేదా? వాళ్ళలాగే మాకూ తిండీ, బట్టా ఇవ్వలేదా? అలా బాధపడిపోతారెందుకు? మీరలా అన్నప్పుడల్లా మమ్మల్ని చులకన చేసినట్లుగా ఉంది. ఇంకోసారలా అనొద్దు. మేమేమీ మగపిల్లలకన్నా తీసిపోలేదు" అని గట్టిగా చెప్పింది. దాంతో ఈమధ్య కాస్త తగ్గించారు.
    యమున గుర్తురావడంతోటే "దాని పెళ్ళి చెయ్యాలి. ఏ వయసుకా ముచ్చటన్నారు పెద్దలు" అనుకుందా తల్లిమనసు. కానీ అది పెళ్ళి చేసుకునెళ్ళిపోతే ఇంకా రెండున్నరేళ్ళు వీడి చదువెలా? అనుకుంది. అంతలోనే పోనీ పెళ్ళి సంబంధాలు ప్రారంభిస్తేనో! సంబంధం కుదరడమంటే మాటలు కాదు.
    అందరాడపిల్లల తల్లిదండ్రులూ కాళ్ళరిగేటట్లు తిరుగుతున్నారు. తిరగడమొక ఎత్తు, కుదిరాక వాళ్ళడిగిన కట్నాలు, కానుకలు ఇవ్వడమొక ఎత్తు. కట్నం గుర్తుకు రాగానే గుండెల్లో రాయిపడ్డ భావన కలిగింది. "పాతికవేలు కాక ఆడపడుచు లాంఛనాలిచ్చాము" అని ఒకావిడా "నలభైవేలు, స్కూటరూ అడిగారు" అని యింకోకావిడా చెబుతున్నారీమధ్య. పాతికంటే హీనమన్నమాట. పెద్దగా చదువుకోని, ఏదో బతకడానికో ఉద్యోగం చేసే వరుడు దొరకవచ్చు. అమ్మాయికి చదువుండాలి. ఉద్యోగం చెయ్యాలి అనే కోరికలే కాక ఈమధ్యన ఫలానా బ్యాంకు ఉద్యోగమే కావాలి. సెంట్రల్ గవర్నమెంటులో కూడా ఫలానా ఆఫీస్ లోనే చెయ్యాలి అని హిరణ్యాక్ష వరాలడుగుతున్నారు. ఇక అందం సంగతి సరేసరి. వాడష్టావకృడైనా భార్య అద్భుత సౌందర్యరాశి కావాలి. యమునది కాస్త ఛామనచాయ. కావేరి ఫరవాలేదు కానీ యమునకి మరీ తన రంగొచ్చింది. అత్తగారు బతికున్నప్పుడు "కోడలు నలుపైతే కులమెల్లా నలుపవుతుందని వూరికే అన్నారా? ఇద్దరాడపిల్లలకీ నీ రంగే వచ్చింది. రేపు సంబంధాలు చూసేటప్పుడు తెలుస్తుంది" అని చెప్పేది. అప్పుడు తనకేం అనిపించలేదు కానీ ఇప్పుడిప్పుడే భయమేస్తోంది. కావేరికి దేవుడు చల్లగా చూసి మంచి సంబంధం త్వరగానే కుదిరిపోయింది. "అబ్బాయి మంచి పిల్లాడు. స్ఫురద్రూపి. ఉద్యోగం చేసే పిల్ల కావాలట. పెద్దగా కట్నకానుకలాశలేదు. తల్లి మంచావిడ" అంటూ కావేరి టైపు నేర్చుకున్న ఇనిస్టిట్యూటాయన చెప్తే, ఇప్పట్నించీ చూస్తే ఎప్పుడో కుదురుతుందిలే అన్న ఉద్దేశ్యంతో వెళ్ళారు రామారావుగారు. వాళ్ళు వెంటనే చూడ్డానికి రావడం, మర్నాడే నచ్చినట్టు కబురుచెయ్యడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తను భయపడ్డట్లు కట్నకానుకల దగ్గర కూడా పెద్దగా పేచీ పెట్టకుండా "మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసినదాన్నే! మీ కష్టం నాకు తెలుసు. కట్నం పేరిట మాకేమీ వద్దు. బంగారుబొమ్మలాంటి మీ అమ్మాయినివ్వండి చాలు" అందా మహాఇల్లాలు.
    వింటున్నది నిజమా లేక కలా! అని ఆశ్చర్యపోయి ఆశ్చర్యంలోంచి కోలుకోగానే వెంటనే రిటైర్ మెంట్ డబ్బుతో పెళ్ళి జరిపించేశారు. పెళ్ళికి పదిహేనువేలు ఖర్చయింది. ఇల్లు మరీ పాతగిల్లిపోవడంతో కాస్త బాగుచేయించాల్సొచ్చింది. తనకి పెద్దాపరేషన్ చెయ్యాల్సి రావడంతో దానికి బాగానే ఖర్చయింది. అన్నీ పోగా పదివేలు మిగిలాయి. అవి యమున పెళ్ళికని బ్యాంక్ లో వేశారు. ఆ పదివేలు ఓ పక్కకి రావు. ఇంకో యాభైవేలుంటే కానీ సంబంధాల వేటకి బయల్దేరము అని ఇద్దరికీ తెలుసు. తెలిసిన వాళ్ళందరూ "అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా?" అని ప్రశ్నిస్తున్నారు. నిజమే మరి! ఇరవైనాలుగో ఏడు నడుస్తోంది. కావేరికి ఇరవై రెండొచ్చేదాకా చెయ్యకపోతేనే "ఆడపిల్ల సంపాదనకలవాటుపడి చెయ్యట్లేదని" బంధువర్గంలో పుకార్లొచ్చాయి. ఇక ఇప్పటి తమ పరిస్థితి తెలిసినవాళ్ళు అనుకోకుండా ఉంటారా? యమున నలుపైనా దానికళ్ళు ఎంత పెద్దవి! బారెడు జడ, తలంటు పోసేటప్పుడు తన దృష్టి సోకుతుందేమోనని తను కళ్ళారా చూడదు కూడాను. దాని నవ్వు చాలు నాలుగు లక్షల విలువ. అయినా కన్నతల్లికలాగే ఉంటుందేమో! కాకిపిల్ల కాకికి ముద్దు అని లోకంలో ఏ తల్లికి తన కూతురు అనాకారిగా కనపడుతుంది!
    "వదినా! కాస్త తోడుకి పెరుగు పెడ్దూ" అంటూ వచ్చిందెదురింటావిడ.
    "అలాగే!" అంటూ ఆవిడ తెచ్చిన గిన్నెతో లోపలికెళ్ళి పెరుగు తెచ్చింది కాత్యాయిని.
    "అమ్మాయింకా రాలేదా?" అడిగిందావిడ.
    "రాలేదమ్మా! అదే చూస్తున్నాను" అంది కాత్యాయిని అరుగు చివరకొచ్చి చూస్తూ.
    "ఈ మధ్య తరచూ ఆలశ్యమవుతున్నట్టుందే?" ఆరాగా అడిగింది.
    "దాని ఉద్యోగమంతే, బస్సులు దొరికి వచ్చేటప్పటికి అలాగే అవుతుంది" అని ఘాటుగానే సమాధానం చెప్పింది.
    "అలాగా! నే వస్తా" అంటూ వెళ్ళిపోయిందావిడ.
    కాత్యాయినికి యమునమీద కోపమొచ్చింది. ఈ పిల్ల కాస్త త్వరగా రావచ్చుకదా? ఇలా అందరూ నానామాటలూ అనే ఆస్కారమెందుకివ్వాలి? నాముందు ఇలా మెల్లగా అడిగింది. వెనకాలెలా మాట్లాడ్తోందో? ఎవరికైనా మచ్చుందని అనుమానమొస్తే చాలు 'అదో పులంటే ఇదో తోక' అంటుందీ లోకం. అద్దాలమేడలో వుంటే ఎవరైనా రాయి విసరొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈవేళ ఆలస్యమైందెందుకో పిల్లని అడగాలనుకుంది.
    "అమ్మా! అక్కొచ్చిందా?" అంటూ శరత్ వచ్చాడు.
    "లేదురా!" అంది కాత్యాయిని.

 Previous Page Next Page