Previous Page Next Page 
తృప్తి పేజి 24


    "ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి. ఎవర్నో లీడర్ని చంపేశారుట! బస్సులవీ తగలబెడ్తున్నారు. ఇదింతవరకూ రాకపోవడమేమిటీ?" అన్నాడు.
    "ఓరిదేవుడో! నెమ్మదిగా చెప్తావేమిటిరా? ఇప్పుడీ పిల్ల ఇంటికి రాకపోతే ఎవర్నని అడగడం? మీ నాన్నగారికసలే పొద్దుట్నించి ఒంట్లో బావుండక మాత్రేసుకుని పడుకున్నారు. అయినా ఆయనమాత్రం ఎక్కడికనెళ్తారు? ఏమని అడుగుతారు?" అంటూ ఘోల్లుమంది.
    "నువ్వూరుకో! నేను ఫోన్ చేసొస్తాను" అంటూ బయటికెళ్తున్న కొడుకుతో "ఒరేయ్! నువ్వు రోడ్డుమీదికెళ్ళకు" అంటూ హెచ్చరించింది.
    "ఏం ఫర్వాలేదు. మా ఫ్రెండ్ ఇంట్లోనే ఫోనుంది" అంటూ క్షణంలో మాయమయ్యాడు.
    "పాడు ఉద్యోగాల పుణ్యమా అని ఈ ఆడపిల్లలు ఓ పట్టాన ఇల్లు చేరడం లేదు. భగవంతుడా! ఈ పిల్లకేమైనా అయితే నాకేది దారి? తిరుపతి వెంకటేశ్వరా! నీ కొండ నడిచెక్కుతాను తండ్రీ, ఆంజనేయా! నీకప్పాలు పోస్తాను. సత్యనారాయణస్వామీ! నీ వ్రతం చేసుకుంటాము" అంటూ గుర్తుకొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కింది. మధ్యమధ్యలో తిట్టుకుంటూ, మళ్ళీ అంతలోనే కళ్ళు తుడుచుకుని ఎవరో వస్తున్నట్టుంటే ఆశగా చూస్తోంది. వాళ్ళు తమ ఇల్లు దాటిపోగానే కొంగు ముక్కు కడ్డుపెట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది.
    శరత్ వస్తోంటే ఆశగా ఎదురెళ్ళి "ఆఫీస్ లో వుందా? పలికిందా?" అని అడిగింది.
    "ఆఫీస్ లో ఎవరూ లేరటమ్మా. అందరూ అయిదింటికే ఆఫీస్ వదలగానే ఇంటికెళ్ళిపోయారుట. డ్యూటీలో వున్న ఆపరేటర్ చెప్పింది" అన్నాడు.
    "అయ్యో! ఖర్మా! ఎక్కడికని వెళ్ళడం? ఏమని అడగడం? నా పిల్లని ఏ దేవుడు కాపాడుతాడురా నాయనా?" అంటూ మళ్ళీ భోరుమంది.
    "నువ్వూరుకో! నాన్న లేస్తే ఆయన కూడా గాభరాపడ్తారు. ఏడిస్తే పని జరుగుతుందా? ఏదో ఒకటి ఆలోచించాలి. బావా వాళ్ళ ఎదురింటికి ఫోన్ చేస్తాను. ఆఫీసు అక్కడికి దగ్గరని అక్కడికేమన్నా వెళ్ళిందేమో!" అన్నాడు.
    ఆ మాటలకి ప్రాణం లేచొచ్చినట్టయింది ఆవిడకి. "గమ్మున వెళ్ళిరా. ఇందాకే చెయ్యాల్సింది. నాకు తట్టనేలేదురా తండ్రి. నిజమే! తల్లీ  జగదాంబ! నా బిడ్డ ఇంటికి రాగానే నీకు కుంకుమార్చన చేయిస్తాను తల్లీ, శుక్రవారాల నోము పట్టిస్తాను" అని నానావిధాలుగా మొక్కింది. వంటింట్లోకి పరుగెత్తుకెళ్ళి, దేవుడి గూట్లో దీపం పెట్టి "తెలియక ఏ అపరాధమన్నా చేస్తే క్షమించు తల్లీ" అంటూ చెంపలేసుకుంది. జపం చేస్తూ కూర్చుందామని జపమాల పట్టుకుని నామం చెయ్యబోతే మనసు నిలువలేదు. కాలుగాలిన పిల్లిలా దొడ్డంతా తిరిగేసింది. ఇందాకొచ్చిన ఎదురింటావిడ కనిపిస్తే "మా పిల్ల రాలేదు. ఊరంతా కల్లోలంగా వుందిట వదినా! మీ ఆయనున్నారా? అంటూ ఏడుస్తూ అడిగింది.
    "అయ్యయ్యో! అలాగా! ఉండండి పిలుస్తాను. ఏవండీ! అని పిలిచి "ఫరవాలేదు, యమున తెలివైంది. ఏ స్నేహితురాలింటికో వెళ్లుంటుంది. వాళ్ళ వాళ్ళనెవళ్ళనన్నా తోడు తీసుకుని వచ్చేస్తుంటుంది. ఖంగారుపడకండి" అంది.
    ఆవిడ కాత్యాయిని కళ్ళకి నిజంగా దేవతలా కనిపించింది.
    ఇంతలో వాళ్ళాయనొచ్చి "మెహిదీపట్నం, కాంచన్ బాగ్, టప్పాచపుత్రా, ఆసిఫ్ నగర్ అవన్నీ కర్ఫ్యూ ఏరియాలు. మీ అమ్మాయి అట్నుంచేగా రావాలి! చాలా కష్టం! బహుశా అక్కడెవరింట్లోనన్నా ఆగిపోయుండాలి. భానుమూర్తి గారింట్లో ఫోనుందికదా! అక్కడికేదైనా కబురు చేస్తుందేమో, ఇంకాసేపు చూద్దాం. అధైర్యపడకండి" అన్నాడు.
    "ఇంతకీ మీ పెద్దమ్మాయి గారింటికెళ్ళిందేమో కబురు చెయ్యకపోయారా?" అంది వాళ్ళావిడ.
    "మా అబ్బాయి అక్కడికి ఫోన్ చెయ్యడానికే వెళ్ళాడు. అదొక్క ఆశ మిగిలింది" అంటుండగానే శరత్ వచ్చాడు.
    "ఏరా అక్క దగ్గరుందా?" అని ఎదురెళ్ళి ఆత్రంగా అడిగింది.
    "నువ్వూరికే కంగారుపడకు. బావ కూడా కనుక్కుంటానన్నాడు" అనగానే "అక్కడికి కూడా వెళ్ళలేదా?" అంటూ కుప్పకూలిపోయింది కాత్యాయిని.
    ఈ గొడవకి రామారావుగారు లేచి బయటికొచ్చారు. భార్య ఏడుపూ, చుట్టుపక్కల వాళ్ళు చుట్టిముట్టి ఉండడం చూసి ఆయన బేజారెత్తిపోయాడు. ఎదురింటాయన ఆయన్ని కూర్చోపెట్టి నిదానంగా జరిగినదంతా చెప్పాడు. పలుపలు విధాల ధైర్యం కూడా చెప్పాడు. "నేవెళ్ళి బస్టాప్ లో నిలబడతాను" అని ఆయన లేవబోయాడు.
    "మీరుండండి. మేమంతా వున్నాంకదా" అని పక్కింటాయన శరత్ ని తీసుకుని బస్ స్టాప్ వైపెళ్ళాడు.
    కాత్యాయని ఎదురింటావిడ్ని తీసుకుని భానుమూర్తిగారింటికి వెళ్ళింది.
    భానుమూర్తిగారి భార్య అంతావిని "అసలు మీ అమ్మాయి అయిదింటి నుంచి ఇంటికిరాక ఏం చేస్తున్నట్టు?" అనడిగింది కనుబొమలు చిట్లించి.
    కాత్యాయినికి తనేం చెప్తోందో తనకే అర్థంకాకుండా "మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి కనుక్కోండి. కబురొస్తే వెంటనే తెలియజెయ్యండి" అంటూ చేతులు జోడించి ఏడుస్తోంది. ఆవిడ "అలాగే అలాగే" అంటూ తలూపేసింది.


                            *    *    *    *


    యమునకి దుఃఖం ఆగట్లేదు. ఇంట్లో పరిస్థితి తనూహించగలదు. తల్లీ తండ్రీ అంతగా ఆరోగ్యవంతులు కారు. పైగా కంగారెక్కువ. తమ్ముడు చిన్నవాడు. ఇలా సడెన్ గా కర్ఫ్యూపెడ్తారని తనకు మాత్రమేం తెల్సు? మధ్యాహ్నం తన పక్కన పనిచేసే నిర్మల కళ్ళు తిరిగి పడిపోయింది. నిర్మలని తీసుకుని తను హాస్పిటల్ కి వెళ్ళింది. వాళ్ళేవో పరీక్షలవీ చేశారు. ఆ తర్వాత తను నిర్మలని తీసుకొచ్చి "వర్కింగ్ విమెన్స్" హాస్టల్లో దింపి బస్టాప్ కొచ్చేసరికి ఆరున్నర అయింది. బస్టాపంతా నిర్జీవంగా వుంది.
    "ఏమైందబ్బా" అనుకుంటుండగా పోలీస్ సైరన్, వెంటవెంటనే షాపులన్నీ మూసెయ్యడం, కొంతమంది గుంపుగా పరిగెత్తడం, వాళ్ళని పోలీసులు తరమడం జరిగిపోయాయి.
    తను ఒక్కతే బస్టాపులో నిలబడుందనే విషయం తట్టగానే తను గబగబా నాలుగడుగులేసి వెళ్ళిపోతున్న ఆటోనొకదాన్ని చప్పట్లు కొట్టి పిలిచింది. ఆటో ఆగలేదు కానీ డ్రైవర్ తల బయటికి పెట్టి "కర్ఫ్యూ పెట్టారమ్మా. ఆటోలవీ నడపకూడదు. నేనింటికి పోతున్నా" అని చెప్పి రయ్యిమని వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page